256. రెండువందల యేబది ఆరవ అధ్యాయము

దుర్యోధ వైష్ణవయాగ పరిసమాప్తి

వైశంపాయన ఉవాచ
వైశంపాయన్ ఉవాచ
తతస్తు శిల్పినః సర్వే అమాత్యప్రవరాశ్చ యే ।
విదురశ్చ మహాప్రాజ్ఞః ధార్తరాష్ట్రే న్యవేదయన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ తరువాత శిల్పులందరూ, అమాత్యశ్రేష్ఠులూ, మహాజ్ఞానియైన విదురుడూ దుర్యోధనునకు ఇలా నివేదించారు. (1)
సజ్జం క్రతువరం రాజన్ ప్రాప్తకాలం చ భారత ।
సౌవర్ణం చ కృతం సర్వం లాంగలం చ మహాధనమ్ ॥ 2
రాజా! భారతా! యాగానికి అంతా సిద్ధమయినది. సమయం కూడా సమీపించినది. మహాధనసంపన్నమైన బంగారు నాగలి కూడా తయారయింది. (2)
ఏతచ్ఛ్రుత్వా నృపశ్రేష్ఠః ధార్తరాష్ట్రో విశాంపతే ।
అజ్ఞాపయామాస నృపః క్రతురాజప్రవర్తనమ్ ॥ 3
రాజా! ఇది నృపశ్రేష్ఠుడైన దుర్యోధన నరపాలుడు మహాయాగప్రారంభానికి ఆదేశించాడు. (3)
తతః ప్రవవృతే యజ్ఞః ప్రభూతార్థః సుసంస్కృతః ।
దీక్షితశ్చాపి గాంధారిః యథాశాస్త్రం యథాక్రమమ్ ॥ 4
అప్పుడు సుసంస్కృతమూ బహుధనసంపన్నమూ అయిన యాగం ప్రారంభమైంది. దుర్యోధనుడు యథాక్రమంగా, యథాశాస్త్రంగా దీక్ష పూనాడు. (4)
ప్రహృష్టో ధృతరాష్ట్రశ్చ విదురశ్చ మహాయశాః ।
భీష్మో ద్రోణః కృపః కర్ణః గాంధారీ చ యశస్వినీ ॥ 5
ధృతరాష్ట్రుడు, మహాయశస్వి అయిన విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, యశస్విని అయిన గాంధారి ఆనందించారు. (5)
నిమంత్రణార్థం దూతాంశ్చ ప్రేషయామాస శీఘ్రగాన్ ।
పార్థివానాం చ రాజేంద్ర బ్రాహ్మణానాం తథైవ చ ॥ 6
రాజేంద్రా! రాజులను, బ్రాహ్మణులను నిమంత్రించటానికి శీఘ్రగాములయిన దూతలను పంపారు. (6)
తే ప్రయాతా యథోద్దిష్టాః దూతాస్త్వరితవాహనాః ।
తత్ర కంచిత్ ప్రయాతం తు దూతం దుఃశాసనోఽబ్రవీత్ ॥ 7
వేగంగా నడిచే వాహనాలతో ఆ దూతలు వారి గమ్యాలననుసరించి ప్రయాణమయ్యారు. బయలుదేరుతున్న ఒక దూతతో దుశ్శాసనుడు ఇలా అన్నాడు. (7)
గచ్ఛ ద్వైతవనం శీఘ్రం పాండవాన్ పాపపూరుషాన్ ।
నిమంత్రయ యథాన్యాయం విప్రాంస్తస్మిన్ వనే తదా ॥ 8
వేగంగా ద్వైతవనానికి వెళ్ళు. పాపాత్ములయిన పాండవులు అక్కడుంటారు. వారినీ, ఆ వనంలో ఉన్న బ్రాహ్మణులను యథోచితంగా ఆహ్వానించు. (8)
స గత్వా పాండవాన్ సర్వాన్ ఉవాచాభిప్రణమ్య చ ।
దుర్యోధనో మహారాజ యజతే నృపసత్తమః ॥ 9
స్వవీర్యార్జితమర్థౌఘమ్ అవాప్య కురుసత్తమః ।
తత్ర గచ్ఛంతి రాజానః బ్రాహ్మణాశ్చ తతస్తతః ॥ 10
ఆ దూత పాండవుల దగ్గరకు వెళ్ళి, అందరికీ నమస్కరించి ఇలా అన్నాడు.
'మహారాజా! రాజశ్రేష్ఠుడు, కురుకులశ్రేష్ఠుడు అయిన దుర్యోధనుడు తన పరాక్రమంతో సంపాదించిన ధనరాసులతో యాగం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ నుండో రాజులు, బ్రాహ్మణులు అక్కడకు వస్తున్నారు. (9,10)
అహం తు ప్రేషితో రాజన్ కౌరవేణ మహాత్మనా ।
ఆమంత్రయతి వో రాజా ధార్తరాష్ట్రో జనేశ్వరః ॥ 11
మనోఽభిలషితం రాజ్ఞః తం క్రతుం ద్రుష్టుమర్హథ ।
రాజా! మహాత్ముడైన కౌరవుడు నన్ను పంపించాడు. దుర్యోధన నరపాలుడు మిమ్ములను ఆహ్వానిస్తున్నాడు. దుర్యోధనుని మనోవాంఛారూపమైన ఆ యాగాన్ని మీరు చూడాల్.' (11 1/2)
తతో యుధిష్ఠిరో రాజా తచ్ఛ్రుత్వా దూతభాషితమ్ ॥ 12
అబ్రవీన్నృశార్దూలః దిష్ట్యా రాజా సుయోధనః ।
యజతే క్రతుముఖ్యేన పూర్వేషాం కీర్తివర్ధనః ॥ 13
అప్పుడు ధర్మరాజు ఆ దూతమాటలు విని ఇలా అన్నాడు.
'రాజశ్రేష్ఠుడైన దుర్యోధనరాజు పూర్వీకుల కీర్తిని పెంపొందింపజేస్తూ గొప్పయాగాన్ని చేస్తున్నాడు. ఇది సౌభాగ్యఫలం. (12,13)
వయమప్యుపయాస్యామః న త్విదానీం కథంచన ।
సమయః పరిపాల్యో నః యావద్ వర్షం త్రయోదశమ్ ॥ 14
మేము కూడా వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళలేము. పదమూడు సంవత్సరాల వరకు మేము వనవాసం చేయాలి గదా! (14)
శ్రుత్వైతద్ ధర్మరాజస్య భీమో వచనమబ్రవీత్ ।
తదా తు నృపతిర్గంతా ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 15
అస్త్రశస్త్రప్రదీప్తేఽగ్నౌ యదా తం పాతయిష్యతి ।
వర్షాత్ త్రయోదశాదూర్ధ్వం రణసత్రే నరాధిపః ॥ 16
యదా క్రోధహవిర్మోక్తా ధార్తరాష్ట్రేషు పాండవః ।
ఆగంతాహం తదాస్మీతి వాచ్యస్తే స సుయోధనః ॥ 17
ధర్మరాజు మాట విని దూతతో భీముడిలా అన్నాడు. 'వెళ్ళు. మీ రాజు దుర్యోధనునితో ఇలా చెప్పు. నరాధిపుడైన ధర్మరాజు - యుధిష్ఠిరుడు - పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడకు వస్తాడు. రణయజ్ఞంలో అస్త్రశస్త్రాలతో జ్వలింపజేయబడిన రోషాగ్నిలో మిమ్ము ఆహుతి చేస్తాడు. రోషాగ్నిలో మండిపోయే ధార్తరాష్ట్రులపై ధర్మరాజు తన క్రోధే మనే హవిస్సును ఆహుతి చేస్తున్నప్పుడు నేను అక్కడ కాలు మోపుతాను.' (15-17)
శేషాస్తు పాండవా రాజన్ నైవోచుః కించిదప్రియమ్ ।
దూతశ్చాపి యథావృత్తం ధార్తరాష్ట్రే న్యవేదయత్ ॥ 18
రాజా! మిగిలిన పాండవులెవరూ అప్రియంగా ఏమీ పలుకలేదు. దూతకూడా వెళ్ళి జరిగినదంతా దుర్యోధనునకు చెప్పాడు. (18)
అథాజగ్ముర్నరశ్రేష్ఠాః నానాజనాపదేశ్వరాః ।
బ్రాహ్మణాశ్చ మహాభాగ ధార్తరాష్ట్రపురం ప్రతి ॥ 19
మహాభాగా! అప్పుడు నరోత్తములయిన వివిధదేశాధిపతులు, బ్రాహ్మణులు హస్తినకు వచ్చారు. (19)
తే త్వర్చితా యథాశాస్త్రం యథావిధి యథాక్రమమ్ ।
ముదా పరమయా యుక్తాః ప్రీతాశ్చాపి నరేశ్వరాః ॥ 20
వారు యథావిధిగా, యథాశాస్త్రంగా, యథాక్రమంగా సత్కరింపబడ్డారు - ఆ రాజులంతా పరమానందపడిపోయారు. (20)
ధృతరాష్ట్రోఽపి రాజేంద్ర సంవృతః సర్వకౌరవైః ।
హర్షేణ మహతా యుక్తో విదురం ప్రత్యభాషత ॥ 21
రాజేంద్రా! ధృతరాష్ట్రుడు కూడా కౌరవులందరూ చుట్టూ నిలువగా మహానందంతో విదురునితో ఇలా అన్నాడు. (21)
యథా సుఖీ జనః సర్వం క్షత్తః స్యాదన్నసంయుతః ।
తుష్యేత్ తు యజ్ఞసదనే తథా క్షిప్రం విధీయతామ్ ॥ 22
'విదురా! జనులంతా యజ్ఞసదనంలో అన్నపానాలతో ఆనందించేటట్లు వెంటనే అన్ని ఏర్పాట్లు చేయి.' (22)
విదురస్తు తదాజ్ఞాయ సర్వవర్ణానరిందమ ।
యథా ప్రమాణతో విద్వాన్ పూజయామాస ధర్మవిత్ ॥ 23
అరిందమా! పండితుడు, ధర్మవేత్త అయిన విదురుడు ఆ ఆదేశాన్ని మన్నించి సర్వవర్ణాలను శాస్త్రోక్తరీతిలో సత్కరించాడు. (23)
భక్ష్యపేయాన్నపానేన మాల్యైశ్చాపి సుగంధిభిః ।
వాసోభిర్వివిధైశ్చైవ యోజయామాస హృష్టవత్ ॥ 24
ఆనందంగా భక్ష్యాలనూ, పేయాలనూ, అన్నపానాలనూ, పరిమళభరితమయిన పూలమాలలను, వివిధవస్త్రాలను సమకూర్చాడు. (24)
కృత్వా హ్యావసథాన్ వీరః యథాశాస్త్రం యథాక్రమమ్ ।
సాంత్వయిత్వా చ రాజేంద్రః దత్త్వా చ వివిధం వసు ॥ 25
విసర్జయామాస నృపాన్ బ్రాహ్మణాంశ్చ సహస్రశః ।
వీరుడైన దుర్యోధనుడు అందరికీ యథాశాస్త్రంగా, యథాక్రమంగా వసతి ఏర్పాటు చేయించాడు. వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ, వివిధ ధనాలను, ఇచ్చి వేలకొలదిగ ఉన్న రాజులను, విప్రులను వీడ్కొలిపాడు. (25 1/2)
విసృజ్య చ నృపాన్ సర్వాన్ భ్రాతృభిః పరివారితః ॥ 26
వివేశ హాస్తినపురం సహితః కర్ణసౌబలైః ॥ 27
రాజులనందరినీ వీడుకొలిపి, సోదరులు కలిసి నిలువగా కర్ణశకునులతో కలిసి దుర్యోధనుడు హస్తినాపురంలో ప్రవేశించాడు. (26,27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనయజ్ఞే షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 256 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధన యజ్ఞమను రెండు వందల యేబదియారవ అధ్యాయము. (256)