257. రెండువందల యేబది ఏడవ అధ్యాయము
అర్జునసంహారమునకై కర్ణప్రతిజ్ఞ - ధర్మజుని చింత.
వైశంపాయన ఉవాచ
ప్రవిశంతం మహారాజ సుతాస్తుష్టువురచ్యుతమ్ ।
జనాశ్చాపి మహేష్వాసం తుష్టువూ రాజసత్తమ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. రాజసత్తమా! మహారాజా! నగరంలో ప్రవేశిస్తున్న మేటివిలుకాడు అయిన ఆ సుయోధనుని అతని కుమారులు, ఇతర జనులు ప్రస్తుతించారు. (1)
లాజైశ్చందనచూర్ణైశ్చ వికీర్య చ జనాస్తతః ।
ఊచుర్దిష్ట్యా నృపావిఘ్నః సమాప్తోఽయం క్రతుస్తవ ॥ 2
అప్పుడు పేలాలను, చందనపుపొడిని చల్లి ప్రజలు "రాజా! అదృష్టం కొద్దీ ఈ నీ క్రతువు నిర్విఘ్నంగా సమాప్తమైనది" అని పలికారు. (2)
అపరే త్వబ్రువంస్తత్ర వాతికాస్తం మహీపతిమ్ ।
యుధిష్ఠిరస్య యజ్ఞేన సమో హ్యేష న తే క్రతుః ॥ 3
అక్కడున్న కొందరు వెర్రివాళ్ళు రాజుతో ఇలా అన్నారు - 'నీ క్రతువు యుధిష్ఠిరుని క్రతువుతో సమానం కాదు.' (3)
నైవ తస్య క్రతోరేష కలామర్హతి షోడశీమ్ ।
ఏవం తత్రాబ్రువన్ కేచిద్ వాతికాస్తం జనేశ్వరమ్ ॥ 4
మరికొందరు వెర్రివాళ్ళు "యుధిష్ఠిరుని యాగంలో పదహారవభాగంతో కూడా నీ యాగం సమానం కాదు" అని దుర్యోధనునితో అన్నారు. (4)
సుహృదస్త్వబ్రువంస్తత్ర అతి సర్వానయం క్రతుః ।
యయాతిర్నహుషశ్చాసి మాంధాతా భరతస్తథా ॥ 5
క్రతుమేనాం సమాహృత్య పూతాః సర్వే దివం గతాః ।
దుర్యోధనుని మిత్రులు "ఇది ఇంతకు ముందు జరిగిన యజ్ఞాలనన్నిటినీ మించినది. యయాతి, నహుషుడు, మాంధాత, భరతుడు ఈ యజ్ఞకర్మను అనుష్ఠించి పవిత్రులై అందరూ స్వర్గానికి వెళ్ళారు." (5 1/2)
ఏతా వాచః శుభాః శృణ్వన్ సుహృదాం భరతర్షభ ॥ 6
ప్రవివేశ పురం హృష్టః స్వవేశ్మ చ నరాధిపః ।
భరతశ్రేష్ఠా! మిత్రుల ఈ మంచిమాటలు వింటూ, ఆనందిస్తూ, సుయోధనుడు తన నగరంలో తన మందిరంలో ప్రవేశించాడు. (6 1/2)
అభివాద్య తతః పాదౌ మాతాపిత్రోర్విశాంపతే ॥ 7
భీష్మద్రోణకృపాదీనాం విదురస్య చ ధీమతః ।
అభివాదితః కనీయోభిః భ్రాతృభిర్ర్భాతృనందనః ॥ 8
రాజా! ఆపై తల్లిదండ్రుల పాదాలకు మ్రొక్కి, భీష్మద్రోణకృపాదులకు, ధీమంతుడైన విదురునకు ప్రణమిల్లాడు. సోదరులకు ఆనందదాయకుడైన దుర్యోధనుడు తన తమ్ముల అభినందనలు స్వీకరించాడు. (7,8)
నిషసాదాసనే ముఖ్యే భ్రాతృభిః పరివారితః ।
తముత్థాయ మహారాజం సూతపుత్రోఽబ్రవీద్ వచః ॥ 9
సోదరులందరు చుట్టూ నిలువగా ప్రముఖాసనంపై కూర్చున్నాడు. అప్పుడు కర్ణుడు లేచి మహారాజుతో ఇలా అన్నాడు. (9)
దిష్ట్యా తే భరతశ్రేష్ఠ సమాప్తోఽయం మహాక్రతుః ।
హతేషు యుధి పార్థేషు రాజసూయే తథా త్వయా ॥ 10
ఆహృతేఽహం నరశ్రేష్ఠ త్వాం సభాజయితా పునః ।
'భరతశ్రేష్ఠా! అదృష్టవశాన నీ ఈ మహాక్రతువు ముగిసింది. నరశ్రేష్ఠా! రణంలో, పాండవులు చనిపోయి, నీవు రాజసూయాన్ని చేస్తే అది సమాప్తమైన రోజు మరలా నిన్ను అభినందిస్తాను.' (10 1/2)
తమబ్రవీన్మహారాజః ధార్తరాష్ట్రో మహాయశాః ॥ 11
సత్యమేతత్ త్వయోక్తం హి పాండవేషు దురాత్మసు ।
నిహతేషు నరశ్రేష్ఠ ప్రాప్తే చాపి మహాక్రతౌ ॥ 12
రాజసూయే పునర్వీర త్వమేవం వర్ధయిష్యసి ।
మహాయశస్వి అయిన దుర్యోధన మహారాజు కర్ణునితో ఇలా అన్నాడు - 'నరశ్రేష్ఠా! నీవు చెప్పినది నిజమే. దురాత్ములైన పాండవులు మరణించి రాజసూయమహాక్రతువును చేసినరోజు నీవు ఇదేరీతిగా అభినందించగలవు.' (11,12 1/2)
ఏవముక్త్వా మహారాజ కర్ణమాశ్లిష్య భారత ॥ 13
రాజసూయం క్రతుశ్రేష్ఠం చింతయామాస కౌరవః ।
భారతా! మహారాజా! ఇలా పలికి దుర్యోధనుడు కర్ణుని కౌగిలించుకొని, యాగశ్రేష్ఠమయిన రాజసూయాన్ని గురించి ఆలోచించాడు. (13 1/2)
సోఽబ్రవీత్ కౌరవాంశ్చాపి పార్శ్వస్థాన్ నృపసత్తమః ॥ 14
కదా తు తం క్రతువరం రాజసూయం మహాధనమ్ ।
నిహత్య పాండవాన్ సర్వాన్ ఆహరిష్యామి కౌరవాః ॥ 15
రాజశ్రేష్ఠుడైన ఆ దుర్యోధనుడు తన ప్రక్కనున్న కౌరవులతో ఇలా అన్నాడు. 'కౌరవులారా! పాండవులను
అందరినీ సంహరించి, ధనబహుళమైన ఆ మహాయాగాన్ని - రాజసూయాన్ని - నేనే ఎప్పుడు నిర్వహించగలనో?' (14,15)
తమబ్రవీత్ తదా కర్ణః శృణు మే రాజకుంజర ।
పాదౌ న ధావయే తావద్ యావన్న నిహతోఽర్జునః ॥ 16
కీలాలజం న ఖాదేయం కరిష్యే చాసురవ్రతమ్ ।
నాస్తీతి నైవ వక్ష్యామి యాచితో యేన కేనచిత్ ॥ 17
అప్పుడు కర్ణుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు - 'రాజోత్తమా! అర్జునుని చంపేదాకా నేను ఎవ్వరిచేతనూ కాళ్ళు కడిగించుకోను. నీటబుట్టినవేవీ తినను. అసురవ్రతాన్ని చేపడతాను. ఎవరయినా యాచిస్తే లేదు అనను.' (16,17)
అథోత్ర్కుష్టం మహేష్వాసైః ధార్తరాష్ట్రైర్మహారథైః ।
ప్రతిజ్ఞాతే ఫాల్గునస్య వధే కర్ణేన సంయుగే ॥ 18
కర్ణుడు యుద్ధంలో అర్జునుని చంపటానికి ప్రతిజ్ఞ చేయగా మహారథులు, మేటివిలుకాండ్రు అయిన ధార్తరాష్ట్రులు పెద్దపెట్టున అరిచారు. (18)
విజితాంశ్చాప్యమన్యంత పాండవాన్ ధృతరాష్ట్రజాః ।
దుర్యోధనోఽపి రాజేంద్ర విసృజ్య నరపుంగవాన్ ॥ 19
ప్రవివేశ గృహం శ్రీమాన్ యథా చైత్రరథం ప్రభుః ।
తేఽపి సర్వే మహేష్వాసాః జగ్ముర్వేశ్మాని భారత ॥ 20
పాండవులు ఓడిపోయినట్లే అని కూడా భావించారు ధార్తరాష్ట్రులు. రాజేంద్రా! దుర్యోధనుడు కూడా సహచరుల నందరినీ వీడి, దేవేంద్రుడు చైత్రరథోద్యానవనంలో ప్రవేశించినట్లు తన ఇంట ప్రవేశించాడు. భారతా! ఆ మేటి విలుకాండ్రు అందరు కూడా తమనివాసాలకు వెళ్ళిపోయారు. (19,20)
పాండవాశ్చ మహేష్వాసాః దూతవాక్యప్రచోదితాః ।
చింతయంతస్తమేవార్థం నాలభంత సుఖం క్వచిత్ ॥ 21
మేటివిలుకాండ్రయిన పాండవులు దూతవాక్యంతో ప్రేరణపొంది, ఆ విషయాన్ని గూర్చియే ఆలోచిస్తూ, ఎక్కడా సుఖాన్ని పొందలేకపోయారు. (21)
భూయశ్చ చారై రాజేంద్ర ప్రవృత్తిరుపపాదితా ।
ప్రతిజ్ఞా సూతపుత్రస్య విజయస్య వధం ప్రతి ॥ 22
రాజేంద్రా! దానికి తోడు అర్జునుని చంపుతానని కర్ణుడు ప్రతిజ్ఞ చేసిన వృత్తాంతం కూడా గూఢచారుల ద్వారా తెలిసింది. (22)
ఏతచ్ఛ్రుత్వా ధర్మసుతః సముద్విగ్నో నరాధిప ।
అభేద్యకవచం మత్వా కర్ణమద్భుతవిక్రమమ్ ॥ 23
అనుస్మరంశ్చ సంక్లేశాన్ న శాంతిముపయాతి సః ।
రాజా! అది విని ధర్మరాజుకు ఉద్వేగానికి లోనయ్యాడు. కర్ణుని పరాక్రమాన్నీ, సహజకవచాన్నీ తలచుకొని, తాము పడుతున్న కష్టాలను తలచుకొని అశాంతికి గురి అయ్యాడు. (23 1/2)
తస్య చింతాపరీతస్య బుద్ధిర్జజ్ఞే మహాత్మనః ॥ 24
బహువ్యాలమృగాకీర్ణం త్యక్తుం ద్వైతవనం వనమ్ ।
ఈ రీతిగా చింతకులోనైన ధర్మరాజుకు మనస్సులో రకరకాల పాములు, జంతువులు నిండి ఉన్న ద్వైతవనారణ్యాన్ని వీడిపోవాలన్న ఆలోచన కలిగింది. (24 1/2)
ధార్తరాష్ట్రోఽపి నృపతిః ప్రశశాస వసుంధరామ్ ॥ 25
భ్రాతృభిః సహీతో వీరైః భీష్మద్రోనకృపైస్తథా ।
సంగమ్య సూతపుత్రేణ కర్ణేనాహవశోభినా ॥ 26
(సతతం ప్రీయమాణో వై దేవినా సౌబలేన చ ।)
దుర్యోధన నరపతి కూడా సోదరులతో, వీరులయిన భీష్మద్రోణ కృపాదులతో, రణభూమిలో ప్రకాశింపగల కర్ణునితో, జూదగాడైన శకునితో కలిసి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలించాడు. (25,26)
దుర్యోధనః ప్రియే నిత్యం వర్తమానో మహీభృతామ్ ।
పూజయామాస విప్రేంద్రాన్ క్రతుభిర్భూరిదక్షిణైః ॥ 27
దుర్యోధనుడు నిత్యమూ రాజులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ, యాగాలలో భూరిదక్షిణలిస్తూ, బ్రాహ్మణోత్తములను పూజించాడు. (27)
భ్రాతౄణాం చ ప్రియం రాజన్ స చకార పరంతపః ।
నిశ్చిత్య మనసా వీరః దత్తభుక్తఫలం ధనమ్ ॥ 28
రాజా! పరంతపుడు, వీరుడూ అయిన దుర్యోధనుడు ధనం దానం చేసినప్పుడు, అనుభవించినప్పుడు మాత్రమే సఫలమవుతుందని భావించి, సోదరులకు కూడా అభీష్టాలను సమకూర్చాడు. (28)
ఇతి శ్రీమహభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి యుధిష్ఠిరచింతాయాం సప్తపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 257 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర చింత అను రెండు వందల యాబది ఏడవ అధ్యాయము. (257)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 28 1/2 శ్లోకాలు.)