259. రెండువందల ఏబది తొమ్మిదవ అధ్యాయము

(వ్రీహిద్రౌణిక పర్వము)

వ్యాసమహర్షి పాండవులకు దానమహిమను చెప్పుట.

వైశంపాయన ఉవాచ
వనే నివసతాం తేషాం పాండవానాం మహాత్మనామ్ ।
వర్షాణ్యేకాదశాతీయుః కృచ్ర్ఛేణ భరతర్షభ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - భరతశ్రేష్ఠా! జనమేజయా! వనవాసం చేస్తున్న మహాత్ములైన ఆ పాండవులకు అతికష్టం మీద పదకొండు ఏళ్లు గడిచాయి. (1)
ఫలమూలాశనాస్తే హి సుఖార్హా దుఃఖముత్తమమ్ ।
ప్రాప్తకాలమనుధ్యాంతః సేహిరే వరపూరుషాః ॥ 2
ఆ పురుషోత్తములు ఫలమూలాలు తింటూ సుఖాలు అనుభవించడానికి అర్హులైనప్పటికీ తమకు కష్టకాలం ప్రాప్తించిందని తలచి ఆ మహాకష్టాన్ని సహించసాగారు. (2)
యుధిష్ఠిరస్తు రాజర్షిః ఆత్మకర్మాపరాధజమ్ ।
చింతయన్ స మహాబాహుః భ్రాతౄణాం దుఃఖముత్తమమ్ ॥ 3
మహాబాహువు, రాజర్షి అయిన ఆ యుధిష్ఠిరుడు తాను చేసిన అపరాధం వల్లనే తన సోదరులకు ఆ మహాకష్టం వచ్చిందని తలపోస్తూ ఉండేవాడు. (3)
న సుష్వాప సుఖం రాజా హృది శల్యైరివార్పితైః ।
దౌరాత్మ్యమనుపశ్యంస్తత్ కాలే ద్యూతోద్భవస్య హి ॥ 4
సంస్మరన్ పరుషా వాచః సూతపుత్రస్య పాండవః ।
నిఃశ్వాసపరమో దీనో బిభ్రత్ కోపవిషం మహత్ ॥ 5
జూదసమయంలో జూదానికి కారకుడయిన శకుని యొక్క దుష్టత్వాన్ని భావిస్తూ, కర్ణుని పరుషవాక్యాలను స్మరిస్తూ యుధిష్ఠిరుడు నిట్టూర్పులు విడుస్తూ ఉండేవాడు. దీనుడై కోపమనే విషాన్ని భరిస్తూ మనసులో ముళ్లు గుచ్చుకొన్నవానిలా సుఖంగా నిద్రించలేకపోయేవాడు. (4,5)
అర్జునో యమజౌ చోభౌ ద్రౌపదీ చ యశస్వినీ ।
స చ భీమో మహాతేజాః సర్వేషాముత్తమో బలీ ॥ 6
యుధిష్ఠిరముదీక్షంతః సేహుర్దుఃఖమనుత్తమమ్ ।
అర్జునుడూ, నకులసహదేవులూ, యశస్విని అయిన ద్రౌపదీ, మహాతేజశ్శాలి, అందరిలో ఉత్తముడు, బలవంతుడు అయిన భీముడూ యుధిష్ఠిరుని చూస్తూ మహాదుఃఖాన్ని ఎలాగో సహించసాగారు. (6 1/2)
అవశిష్టమల్పకాలం మన్వానాః పురుషర్షభాః ॥ 7
వపురన్యదివాకార్షుః ఉత్సాహామర్షచేష్టితైః ।
ఇక మిగిలినది కొద్దికాలమే కదా అని తలపోస్తూ ఆ పురుషశ్రేష్ఠులు ఉత్సాహక్రోధాలు ఉట్టిపడే చేతలతో తమ శరీరాలను వేరొకరీతిగా రూపొందించుకొన్నారు. (7 1/2)
కస్యచిత్ త్వథ కాలస్య వ్యాసః సత్యవతీసుతః ॥ 8
ఆజగామ మహాయోగీ పాండవానవలోకకః ।
తమాగతమభిప్రేక్ష్య కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 9
ప్రత్యుద్గమ్య మహాత్మానం ప్రత్యగృహ్ణాద్ యథావిధి ।
పిమ్మట కొంతకాలానికి సత్యవతీ సుతుడు, మహాయోగి అయిన వ్యాసమహర్షి పాండవులను చూడడానికి వచ్చాడు. అతని రాకను చూసి కుంతీపుత్రుడయిన యుధిష్ఠిరుడు ఎదురేగి ఆ మహాత్ముని యథావిధిగా తోడ్కొనివచ్చాడు. (8, 9 1/2)
తమాసీనముపాసీనః శుశ్రూషుర్నియతేంద్రియః ॥ 10
తోషయన్ ప్రణిపాతేన వ్యాసం పాండవనందనః ।
వ్యాసమహర్షి ఆసీనుడయ్యాక ఆయనను సేవించటానికి పాండవులకు ఆనందకారకుడు, జితేంద్రియుడు అయిన యుధిష్ఠిరుడు ఆయన దగ్గరకు చేరి పాదాలకు నమస్కరించి సంతోషం కలిగించాడు. (10 1/2)
తానవేక్ష్య కృశాన్ పౌత్రాన్ వనే వన్యేన జీవతః ॥ 11
మహర్షిరనుకంపార్థమ్ అబ్రవీద్ బాష్పగద్గదమ్ ।
అడవులలో కందమూలాలతో జీవనం గడుపుతూ కృశించిపోయిన మనుమలను చూసి మహర్షి జాలిపడ్డాడు. వారి మీద దయచూపుతూ కన్నీటితోనూ, రుద్ధమైన కంఠంతోనూ ఇలా అన్నాడు. (11 1/2)
యుధిష్ఠిర మహాబాహో శృణు ధర్మభృతాం వర ॥ 12
నాతప్తతపసో లోకే ప్రాప్నువంతి మహాసుఖమ్ ।
సుఖదుఃఖే హి పురుషః పర్యాయేణోపసేవతే ॥ 13
"ధర్మజ్ఞులలో మేటి అయిన మహాబాహూ యుధిష్ఠిరా! నేను చెప్పేది విను. తపస్సు చేయనివారు ఈ లోకంలో మహాసుఖాలను పొందలేరు. మానవుడు సుఖదుఃఖాలను పర్యాయంగా అనుభవిస్తూ ఉంటాడు. (12,13)
న హ్యనంతం సుఖం కశ్చిత్ ప్రాప్నోతి పురుషర్షభ ।
ప్రజ్ఞావాంస్త్వేవ పురుషః సంయుక్తః పరయా ధియా ॥ 14
ఉదయాస్తమనజ్ఞో హి న హృష్యతి న శోచతి ।
పురుషశ్రేష్ఠా! ఎవడూ కూడా అనంతమైన సుఖాన్ని పొందలేడు. ప్రాజ్ఞుడైన పురుషుడు మాత్రమే చక్కని బుద్ధితో సుఖదుఃఖాల రాకపోకలను తెలిసికొని ఆనందించడు, విచారించడు. (14 1/2)
సుఖమాపతితం సేవేద్ దుఃఖమాపతితం వహేత్ ॥ 15
కాలప్రాప్తముపాసీత సస్యానామివ కర్షకః ।
కాబట్టి వివేకవంతుడు సుఖం వస్తే (త్యాగపూర్వకంగా) అనుభవించాలి. దుఃఖం వచ్చిపడితే (ధైర్యంతో) సహించాలి. కాలానుసారంగా ప్రాప్తించేదానిని రైతు పంటను స్వీకరించినట్లు స్వీకరించాలి. (15 1/2)
వి॥సం॥ మిథ్యాత్మకమయిన జగత్తులో ఇష్టానికి కానీ సుఖానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇష్టవియోగజన్యమయిన శోకం కానీ, సుఖకాంక్ష కానీ బ్రహ్మజ్ఞానికి కలగవు. (నీల)
తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్ ॥ 16
నాసాధ్యం తపసః కించిద్ ఇతి బుద్ధ్యస్వ భారత ।
భారతా! తపస్సును మించినది లేదు. తపస్సు చేత గొప్ప ఫలాలను పొందవచ్చు. తపస్సుకు అసాధ్యమైనదేదీ లేదని తెలుసుకో. (16 1/2)
సత్యమార్జనమక్రోధః సంవిభాగో దమః శమః ॥ 17
అనసూయా విహింసా చ శౌచమింద్రియసంయమః ।
పావనాని మహారాజ వరాణాం పుణ్యకర్మణామ్ ॥ 18
మహారాజా! సత్యం, ఋజువర్తనం, క్రోధం లేకపోవడం, దేవతలకు అతిథులకు నివేదించిన తరువాత భుజించడం, ఇంద్రియనిగ్రహం, శాంతం, అసూయ లేకపోవడం, హింస చేయకపోవడం, శౌచం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం - అనేవి పుణ్యాత్ములు ఆచరిస్తారు. ఈ గుణాలు మనుష్యులను పవిత్రం చేస్తాయి. (17,18)
అధర్మరుచయో మూఢాః తిర్యగ్గతిపరాయణాః ।
కృచ్ర్ఛాం యోనిమమప్రాప్తాః న సుఖం విందతే జనాః ॥ 19
అధర్మమునందు ఆసక్తి గల మూఢాత్ములు పశుపక్ష్యాది తిర్యగ్యోనులను పొందుతారు. అటువంటి కష్టమైన జన్మలను పొందిన జనులు సుఖాన్ని పొందలేరు. (19)
ఇహ యత్ క్రియతే కర్మ తత్ పరత్రోపయుజ్యతే ।
తస్మాచ్ఛరీరం యుంజీత తపసా నియమేన చ ॥ 20
ఇక్కడ చేసిన కర్మలు అక్కడ పరలోకంలో ఫలిస్తాయి. కనుక శరీరాన్ని తపస్సుతోను, నియమంతోను జోడించాలి. (20)
యథాశక్తి ప్రయచ్ఛేత సంపూజ్యాభిప్రణమ్య చ ।
కాలే ప్రాప్తే చ హృష్టాత్మా రాజన్ విగతమత్సరః ॥ 21
రాజా! సమయానికి వచ్చిన అతిథికి నమస్కరించి, పూజలు చేసి, మాత్సర్యం లేకుండా, సంతోషంతో నిండిన మనస్సుతో దానం చేయాలి. (21)
సత్యవాదీ లభేతాయుః అనాయాసమథార్జనమ్ ।
అక్రోధనోఽనసూయశ్చ నిర్వృతిం లభతే పరామ్ ॥ 22
సత్యవాది దీర్ఘాయువును, అక్లేశాన్ని, సరళత్వాన్ని పొందుతాడు. క్రోధం లేనివాడు, అసూయలేనివాడు పరమానందాన్ని పొందుతాడు. (22)
దాంతః శమపరః శశ్వత్ పరిక్లేశం న విందతి ।
న చ తప్యతి దాంతాత్మా దృష్ట్వా పరగతాం శ్రియమ్ ॥ 23
మనోనిగ్రహం కలవాడు శాంత స్వభావం కలవాడు ఎన్నడూ కష్టాలను పొందడు. దాంతాత్ముడు ఇతరులు పొందిన సంపదను చూచి పరితపించడు. (23)
సంవిభక్తా చ దాతా చ భోగవాన్ సుఖవాన్ వరః ।
భవత్యహింసకశ్చైవ పరమారోగ్యమశ్నుతే ॥ 24
దేవతలకు, అతిథులకు వారి వారి భోగాలను వారికి ఇచ్చినవాడు భోగాలను అనుభవిస్తాడు. దానం చేసిన నరుడు సుఖవంతుడవుతాడు. హింసచేయనివాడు చక్కని ఆరోగ్యాన్ని పొందుతాడు. (24)
మాన్యమానయితా జన్మ కులే మహతి విందతి ।
వ్యసనైర్న తు సంయోగం ప్రాప్నోతి విజితేంద్రియః ॥ 25
(విందతే సుఖమత్యంతమ్ ఇహ లోకే పరత్ర చ ।)
మాన్యులను గౌరవించేవాడు సత్కులంలో పుడతాడు. జితేంద్రియుడు వ్యసనాలకు లోబడడు. (ఈలోకంలోను, పరలోకంలోను మిక్కిలి సుఖాలను పొందుతాడు.) (25)
శుభానుశయబుద్ధిర్హి సంయుక్తః కాలధర్మణా ।
ప్రాదుర్భవతి తద్యోగాత్ కల్యాణమతిరేవ సః ॥ 26
శుభాలనే అనుసరించే బుద్ధిగలవాడు చనిపోయినప్పటికీ ఆ గుణసంయోగం వలన శుభబుద్ధిగలవాడుగానే పుడతాడు. (26)
యుధిష్ఠిర ఉవాచ
భగవన్ దానధర్మాణాం తపసో వా మహామునే ।
కింస్విద్ బహుగుణం ప్రేత్య కిం వా దుష్కరముచ్యతే ॥ 27
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - పూజ్యుడా! మహామునీ! దానధర్మాలు, తపస్సు - వీటిలో ఏది అధికఫలమిస్తుంది? కష్టమయినదేది? (27)
వ్యాస ఉవాచ
దానాన్న దుష్కరం తాత పృథివ్యామస్తి కించన ।
అర్థే చ మహతీ తృష్ణా స చ దుఃఖేన లభ్యతే ॥ 28
వ్యాసుడు చెపుతున్నాడు - "దానాన్ని మించిన దుష్కరకార్యం ఈ లోకంలో మరొకటి లేదు. ధనము నందు ఎక్కువ మక్కువ ఉంటుంది. సంపద కష్టం మీద లభిస్తుంది. (28)
పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్ ధనార్థం హి మహామతే ।
ప్రవిశంతి నరా వీరాః సముద్రటవీమ్ తథా ॥ 29
మహామతీ! సాహసవీరులు ధనం కోసం (రత్నాల కోసం) తమకు ప్రియమైన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సముద్రంలో మునకలు వేస్తూంటారు. అరణ్యాలలో తిరుగుతూ ఉంటారు. (29)
కృషిగోరక్ష్యమిత్యేకే ప్రతిపద్యంతి మానవాః ।
పురుషాః ప్రేష్యతామేకే నిర్గచ్ఛంతి ధనార్థినః ॥ 30
కొంతమంది మానవులు వ్యవసాయం, పశుపాలన తమ జీవనధారంగా స్వీకరిస్తారు. కొంతమంది ధనం కోసం దాస్యం చేయడానికి బయలుదేరుతారు. (30)
తస్మాద్ దుఃఖార్జితస్యైవ పరిత్యాగః సుదుష్కరః ।
న దుష్కరతరం దానాత్ తస్మాద్ దానం మతం మమ ॥ 31
కాబట్టి కష్టపడి సంపాదించిన దానిని వదిలిపెట్టడం అతిదుష్కరం. దానం కంటె దుష్కరతరమయినది లేదు. కాబట్టి దానమే గొప్పదని నా అభిప్రాయం (31)
విశేషస్త్వత్ర విజ్ఞేయో న్యాయేనోపార్జితం ధనమ్ ।
పాత్రే కాలే చ దేశే చ సాధుభ్యః ప్రతిపాదయేత్ ॥ 32
ఇక్కడ ఒక విశేషాన్ని తెలుసుకోవాలి. న్యాయంగా అర్జించిన ధనాన్ని దేశకాలపాత్రాలు గమనించి సత్పురుషులకు దానం చేయాలి. (32)
అన్యాయాత్ సముపాత్తేన దానధర్మో ధనేన యః ।
క్రియతే న స కర్తారం త్రాయతే మహతో భయాత్ ॥ 33
అన్యాయంగా ఆర్జించిన విత్తంతో ఎవరైనా దానం చేస్తే అది ఆ చేసినవానిని మహా భయాన్నుండి రక్షించదు. (33)
పాత్రే దానం స్వల్పమపి కాలే దత్తం యుధిష్ఠిర ।
మనసా హి విశుద్ధేన ప్రేత్యానంతఫలం స్మృతమ్ ॥ 34
యుధిష్ఠిరా! పరిశుద్ధమైన మనసుతో సరియైన సమయంలో సత్పాత్రునికి కొద్దిగా ఇచ్చినా సరే అది పరలోకంలో అనంతఫలం ఇస్తుందని భావింపబడుతోంది. (34)
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్ ।
వ్రీహి ద్రోనపరిత్యాగాద్ యత్ ఫలం ప్రాప ముద్గలః ॥ 35
ఈ సందర్భంగా ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని ఉదాహరిస్తూ ఉంటారు. ముద్గలుడు ద్రోనపరిమాణం కల ధాన్యాన్ని దానం చేసి గొప్ప గొప్ప ఫలితాన్ని పొందాడు. (35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి వ్రీహిద్రౌణికపర్వణి దానదుష్కరత్వకథనే ఏకోనషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 259 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున వ్రీహిద్రౌణికపర్వమను ఉపపర్వమున దానదుష్కరత్వకథనమను రెండు వందల ఏబది తొమ్మిదవ అధ్యాయము. (259)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 35 1/2 శ్లోకాలు.)