260. రెండు వందల అరువదియవ అధ్యాయము
దుర్వాసుడు ముద్గలుని దాననిష్ఠను పరీక్షించుట.
యుధిష్ఠిర ఉవాచ
వ్రీహిద్రోణః పరిత్యక్తః కథం తేన మహాత్మనా ।
కస్మై దత్తశ్చ భగవన్ విధినా కేన చాత్థ మే ॥ 1
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - "భగవాన్! మహాత్ముడైన ముద్గలుడు ద్రోణ పరిమాణం కల వ్రీహిధాన్యాన్ని ఎలా ఏవిధిని అనుసరించి దానం చేశాడు? ఎవరికి దానం చేశాడు? నాకు వివరంగా చెప్పండి. (1)
ప్రత్యక్షధర్మా భగవాన్ యస్య తుష్టో హి కర్మభిః ।
సఫలం తస్య జన్మాహం మన్యే సద్ధర్మచారిణః ॥ 2
ధర్మాన్ని ప్రత్యక్షంగా చూసి, తెలుసుకోగల భగవంతుడు ఎవరు చేసిన పనుల వలన సంతుష్టుడు అవుతాడో ఆ సద్ధర్మచారి యొక్క జన్మ సఫలమని నేను అనుకొంటున్నాను. (2)
వ్యాస ఉవాచ
శిలోంఛవృత్తిర్ధర్మాత్మా ముద్గలః సంయతేంద్రియః ।
ఆసీద్ రాజన్ కురుక్షేత్రే సత్యవాగనసూయకః ॥ 3
వ్యాసుడు చెప్పసాగాడు - "రాజా! జితేంద్రియుడు, సత్యవాక్కు, అసూయలేనివాడు, ధర్మాత్ముడు అయిన ముద్గలుడు అనే మహర్షి కురుక్షేత్రంలో శిలోంఛవృత్తిచేత జీవిస్తూ ఉండేవాడు. (3)
అతిథివ్రతీ క్రియావాంశ్చ కాపోతీం వృత్తిమాస్థితః ।
సత్రమిష్టీకృతం నామ సముపాస్తే మహాతపాః ॥ 4
సపుత్రదారో హి మునిః పక్షాహారో బభూవ హ ।
కపోతవృత్త్యా పక్షేణ వ్రీహిద్రోణముపార్జయత్ ॥ 5
అతడు అతిథిసేవను వ్రతంగా ఆచరిస్తాడు. కర్మనిష్ఠుడు కపోతవృత్తిని ఆశ్రయించినవాడు. ఆ మహాతపస్వి ఇష్టీకృతమనే యజ్ఞం అనుష్ఠిస్తూ ఉండేవాడు. కపోత వృత్తిని అనుసరించి పక్షంలో ద్రోణపరిమాణం కల వ్రీహి ధాన్యాన్ని సంపాదించేవాడు. (పావురం గింజ గింజ చొప్పున ఏరినట్లుగా, ఒక్కొక్క గింజను ఏరి పక్షంలో ద్రోణం నిండుగా ధాన్యాన్ని సంపాదించేవాడు). భార్యాపుత్రులతో కలిసి ముని పక్షంలో ఒక్కసారి మాత్రమే ఆహారం భుజిస్తూ ఉండేవాడు. (4,5)
దర్శం చ పౌర్ణమాసం చ కుర్వన్ విగతమత్సరః ।
దేవతాతిథిశేషేఅ కురుతే దేహయాపనమ్ ॥ 6
మాత్సర్యం లేని అతడు అమావాస్యకు పౌర్ణమికి యజ్ఞాలు చేస్తూ దేవతలకు అతిథులకు సమర్పించి శేషించిన అన్నంతోనే జీవనం గడుపుతూ ఉండేవాడు. (6)
తస్యేంద్రః సహితో దేవైః సాక్షాత్ త్రిభువనేశ్వరః ।
ప్రత్యగృహ్ణాన్మహారాజ భాగం పర్వణి పర్వణి ॥ 7
ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు దేవతలతోపాటు ప్రతిపర్వంలోను అతని యజ్ఞంలో భాగాన్ని స్వయంగా గ్రహిస్తూ ఉండేవాడు. (7)
స పర్వకాలం కృత్వా తు మునివృత్త్వా సమన్వితః ।
అతిథిభ్యో దదావన్నం ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 8
ముద్గల ఋషి మునివృత్తిని అవలంబించి పర్వకాలోచితమైన కర్మలు - దర్శపౌర్ణమాస యజ్ఞాలు చేసి హర్షోల్లాసాలు నిండిన హృదయంతో అతిథులకు అన్నం పెడుతూ ఉండేవాడు. (8)
వ్రీహిద్రోణస్య తద్ధ్యస్య దదతోఽన్నం మహాత్మనః ।
శిష్టం మాత్సర్యహీనస్య వర్ధతేఽతిథిదర్శనాత్ ॥ 9
మాత్సర్యహీనుడైన ఆ మహాత్ముడు ముద్గలుడు ద్రోణ పరిమాణం కల వ్రీహి ధాన్యంతో వండిన అన్నాన్ని ఒక అతిథికి అర్పించేవాడు. రెండవ అతిథిని ముద్గలుడు చూడగానే మిగిలిన అన్నం వృద్ధి పొందుతూ ఉండేది. (9)
తచ్ఛతాన్యపి భుంజంతి బ్రాహ్మణానాం మనీషిణామ్ ।
మునేస్త్యాగవిశుద్ధ్యా తు తదన్నం వృద్ధిమృచ్ఛతి ॥ 10
ఆ విధంగా ఆ అన్నాన్ని మనీషులైన బ్రాహ్మణులు వందమందిదాకా తింటూ ఉండేవారు. ముని యొక్క విశుద్ధమైన త్యాగబుద్ధి వలన ఆ అన్నం వృద్ధి పొందుతూ ఉండేది. (10)
తం తు శుశ్రావ ధర్మిష్ఠం ముద్గలం సంశితవ్రతమ్ ।
దుర్వాసా నృప దిగ్వాసాః తమథాభ్యాజగామ హ ॥ 11
రాజా! దిగంబరంగా తిరిగే దుర్వాసుడనే మహర్షి ధర్మిష్ఠుడైన ముద్గలుని యొక్క ఉత్తమవ్రతనియమం గురించి విన్నాడు. విని అతని దగ్గరకు విచ్చేశాడు. (11)
బిభ్రచ్చానియతం వేషమున్మత్త ఇవ పాండవ ।
వికచః పరుషా వాచో వ్యాహరన్ వివిధా మునిః ॥ 12
పాండవా! పిచ్చివానివలె అస్తవ్యస్త వేషంతో, బోడితలతో, రకరకాలుగా పరుష వాక్కులు పలుకుతూ ఉన్నాడు. ఆ దుర్వాసముని. (12)
అభిగమ్యాథ తం విప్రమ్ ఉవాచ మునిసత్తమః ।
అన్నార్థినమనుప్రాప్తం విద్ధి మాం ద్విజసత్తమ ॥ 13
మునిసత్తముడైన దుర్వాసుడు అతనిని సమీపించి ఆ విప్రునితో ఇలా అన్నాడు - "ద్విజోత్తమా! నేను అన్నార్థినై ఇక్కడకు వచ్చానని తెలుసుకో". (13)
స్వాగతం తేఽస్త్వితి మునిం ముద్గలః ప్రత్యభాషత ।
పాద్యమాచమనీయం చ ప్రతిపాద్యార్ఘ్యముత్తమమ్ ॥ 14
ప్రాదాత్ స తాపసాయాన్నం క్షుధితాయాతిథివ్రతీ ।
ఉన్మత్తాయ పరాం శ్రద్ధామ్ ఆస్థాయ స ధృతవ్రతః ॥ 15
తతస్తదన్నం రసవత్ స ఏవ క్షుధయాన్వితః ।
బుభుజే కృత్స్నమున్మత్తః ప్రాదాత్ తస్మై చ ముద్గలః ॥ 16
"మీకు స్వాగతం" అని ముద్గలుడు మునితో పలికి, పాద్యాన్ని ఉత్తమమైన అర్ఘ్యాన్ని, అచమనీయాన్ని సమర్పించాడు. ధృతవ్రతుడూ అతిథివ్రతీ అయిన అతడు ఆకలితో ఉన్మత్తుడైన ఆ తాపసికి మిక్కిలి శ్రద్ధతో అన్నం పెట్టాడు. ఆ అన్నమేమో రుచిగా ఉంది. అతడేమో క్షుధార్తుడై ఉన్నాడు. ఆ ఉన్మత్తుడు మొత్తం అంతా తినేశాడు. ముద్గలుడు అతనికి ఇంకా పెట్టాడు. (14-16)
భుక్త్వా చాన్నం తతః సర్వమ్ ఉచ్ఛిష్టేనాత్మనస్తతః ।
అథాంగం లిలిపేఽన్నేన యథాగతమగాచ్చ సః ॥ 17
ఆ అన్నం కడుపునిండా తిని, ఎంగిలి అన్నం తన శరీరమంతా పూనుకొన్నాడు. తరువాత ఎలా వచ్చినవాడు అలాగే వెళ్లిపోయాడు. (17)
ఏవం ద్వితీయే సంప్రాప్తే యథాకాలే మనీషిణః ।
ఆగమ్య బుభుజే సర్వమ్ అన్నముంఛోపజీవినః ॥ 18
ఈ రీతిగానే తర్వాతి పర్వదినం రాగానే, ఉంఛవృత్తితో జీవించే ఆ మనీషి ముద్గలుని వద్దకు సరియైన సమయానికి వచ్చి అతని అన్నాన్నంతటినీ తినేశాడు. (18)
నిరాహారస్తు స మునిః ఉంఛమార్జయతే పునః ।
న చైనం విక్రియాం నేతుమ్ ఆశకన్ముద్గలం క్షుధా ॥ 19
నిరాహారుడైన ముని తిరిగి ఉంఛవృత్తిని అనుసరించి గింజలు ఏరి పోగుచేయడం మొదలుపెట్టాడు. ఆకలి ముద్గలునితో వికారం కలుగచేయడానికి సమర్థం కాకపోయింది. (19)
న క్రోధో న చ మాత్సర్యం నావమానో న సంభ్రమః ।
సపుత్రదారముంఛంతమ్ ఆవివేశ ద్విజోత్తమమ్ ॥ 20
భార్యాపుత్రులతో కూడి ఉంఛవృత్తి చేసుకొంటున్న ఆ ద్విజోత్తముని క్రోధంగాని, మాత్సర్యంగాని, అవమానంగాని, సంభ్రమం గాని ఆవేశించలేదు. (20)
తథా తముంఛధర్మాణం దుర్వాసా మునిసత్తమమ్ ।
ఉపతస్థే యథాకాలం షట్ కృత్వః కృతనిశ్చయః ॥ 21
ఆ రీతిగా ఉంఛవృత్తి ధర్మాన్ని పాటించే ముద్గలమునిసత్తముని దగ్గరకు దుర్వాసుడు అతని దీక్షను భంగపరచడానికి కృతనిశ్చయుడై ఆరుసార్లు పర్వసమయాలలో వచ్చాడు. (21)
న చాస్య మనసా కంచిద్ వికారం దదృశే మునిః ।
శుద్ధసత్త్వస్య శుద్ధం స దదృశే నిర్మలం మనః ॥ 22
కాని అతని మనసులో ఏ మాత్రం మార్పూ అతనికి కనపడలేదు. శుద్ధమైన చిత్తవృత్తి కల ఆ ముద్గలముని యొక్క మనస్సు ప్రతిపర్యాయమూ నిర్మలంగానే కనపడింది. (22)
తమువాచ తతః ప్రీతః స మునిర్ముద్గలం తతః ।
త్వత్సమో నాస్తి లోకేఽస్మిన్ దాతా మాత్సర్యవర్జితః ॥ 23
అంతట అతడు ప్రీతుడై ముద్గలమునితో - "మాత్సర్యం విడిచిపెట్టిన నీవంటి దాతతో సమానుడైనవాడు ఈ లోకంలోనే లేడు. (23)
క్షుద్ ధర్మసంజ్ఞాం ప్రణుదత్యాదత్తే ధైర్యమేవ చ ।
రసానుసారిణీ జిహ్వా కర్షత్యేవ రసాన్ ప్రతి ॥ 24
ఆకలి ధర్మజ్ఞానాన్ని నశింపచేస్తుంది. ధైర్యాన్ని హరిస్తుంది. పైగా రుచులు కోరుకొనే నాలుక రుచులకోసం వెంపర్లాడుతుంది. (24)
ఆహారప్రభవాః ప్రాణా మనో దుర్నిగ్రహం చలమ్ ।
మనసశ్చేంద్రియాణాం చాప్యైకాగ్ర్యం నిశ్చితం తపః ॥ 25
ప్రాణాలు ఆహారం వల్ల నిలుస్తాయి. చంచలమైన మనస్సును అరికట్టడం కష్టసాధ్యం. మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రం చేయడమే తపస్సు అని నిశ్చయంగా చెప్పబడింది. (25)
శ్రమేణోపార్జితం త్యక్తుం దుఃఖం శుద్ధేన చేతసా ।
తత్ సర్వం భవతా సాధో యథావదుపపాదితమ్ ॥ 26
శ్రమపడి సంపాదించిన దానిని నిర్మలచిత్తంతో దానం చేయడం అతికష్టం. కాని సాధుపురుషా! అదంతా నీవు యథార్థంగా సాధించగలిగావు. (26)
ప్రీతాః స్మోఽనుగృహీతాశ్చ సమేత్య భవతా సహ ।
ఇంద్రియాభిజయో ధైర్యం సంవిభాగో దమః శమః ॥ 27
దయా సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ।
(విశుద్ధసత్త్వసంపన్నో న త్వదన్యోఽస్తి కశ్చన ।)
జితాస్తే కర్మభిర్లోకాః ప్రాప్తోఽసి పరమాం గతిమ్ ॥ 28
మేము సంతోషించాము. నిన్ను కలుసుకొని నీ అనుగ్రహం పొందినట్లుగా భావిస్తున్నాము. ఇంద్రియనిగ్రహం, ధైర్యం, దేవతలకు అతిథులకు దానం చేయడం, దమము, శమము, దయ, సత్యం, ధర్మం - అన్నీ నీయందు చక్కగా కుదురుకొన్నాయి. (నీవంటి నిర్మలమైన అంతఃకరణం కలవాడు వేరొకడు లేడు). నీవు నీ పుణ్యకర్మలచేత లోకాలన్నీ జయించావు. పరమపదాన్ని పొందావు. (27,28)
అహో దానం విఘుష్టం తే సుమహత్ స్వర్గవాసిభిః ।
సశరీరో భవాన్ గంతా స్వర్గం సుచరితవ్రత ॥ 29
ఆహా! స్వర్గంలో ఉండే దేవతలు కూడా నీదానమహిమను ఎలుగెత్తి చాటుతున్నారు. ఉత్తమవ్రత చరిత కలవాడా! నీవు సశరీరంగా స్వర్గానికి వెళ్తావు" అన్నాడు. (29)
ఇత్యేవం వదతస్తస్య తదా దుర్వాససో మునేః ।
దేవదూతో విమానేన ముద్గలం ప్రత్యుపస్థితః ॥ 30
దుర్వాసముని ఈ రీతిగా అంటూండగానే, దేవదూత విమానం తీసుకొని ముద్గలునివద్దకు వచ్చాడు. (30)
హంససారసయుక్తేన కింకిణీజాలమాలినా ।
కామగేన విచిత్రేణ దివ్యగంధవతా తథా ॥ 31
ఆ విమానానికి హంసలు, బెగ్గురుపక్షులు కట్టబడి ఉన్నాయి. చిరుమువ్వల మాలికలు అలంకరింపబడి ఉన్నాయి. దివ్యమైన సువాసనతో కామగమనం కలిగిన అది విచిత్రంగా భాసిస్తోంది. (31)
ఉవాచ చైనం విప్రర్షిం విమానం కర్మభిర్జితమ్ ।
సముపారోహ సంసిద్ధిం ప్రాప్తోఽసి పరమాం మునే ॥ 32
దేవదూత బ్రాహ్మణోత్తముడైన ముద్గలమునితో - "మునీ! నీపుణ్యకర్మలచేత ఈ విమానాన్ని పొందగలిగావు. దీనిని ఎక్కు. పరమగతిని పొందావు" అన్నాడు. (32)
తమేవంవాదినమృషిః దేవదూతమువాచ హ ।
ఇచ్ఛామి భవతా ప్రోక్తాన్ గుణాన్ స్వర్గనివాసినామ్ ॥ 33
కే గుణాస్తత్ర వసతాం కిం తపః కశ్చ నిశ్చయః ।
స్వర్గే తత్ర సుఖం కిం చ దోషో వా దేవదూతక ॥ 34
అలా అన్న ఆ దేవదూతను ముద్గలఋషి ఇలా ప్రశ్నించాడు - "దేవదూతా! స్వర్గంలో నివసించే వారి గుణాలను నీవు చెప్పగా వినాలనుకొంటున్నాను. అక్కడ నివసించేవారి గుణాలేమిటి? వారు ఎటువంటి తపస్సు చేసినవారు? వారి నిశ్చయాలు ఎలా ఉంటాయి? స్వర్గంలోని సుఖం ఏమిటి? దోషం ఏమిటి? (33,34)
సతాం సాప్తపదం మైత్రమ్ ఆహుః సంతః కులోచితాః ।
మిత్రతాం చ పురస్కృత్య పృచ్ఛామి త్వామహం విభో ॥ 35
ప్రభూ! "సత్పురుషులకు సఖ్యం సాప్తపదీనం" అని కులీనులైన సత్పురుషులు చెపుతూ ఉంటారు. కాబట్టి ఆమైత్రిని పురస్కరించుకొని నేను నిన్ను అడుగుతున్నాను. (35)
యదత్ర తథ్యం పథ్యం చ తద్ బ్రవీహ్యవిచారయన్ ।
శ్రుత్వా తథా కరిష్యామి వ్యవసాయం గిరా తవ ॥ 36
ఈ విషయంలో తథ్యమూ, హితకరమూ అయినదేదో సంకోచించకుండా చెప్పు. నీ మాటలు విన్నాక దానిని బట్టి నా కర్తవ్యం నిశ్చయించుకొంటాను". (36)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి వ్రీహిద్రౌణికపర్వణి ముద్గలోపాఖ్యానే షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 260 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున వ్రీహిద్రౌణికపర్వమను ఉపపర్వమున వ్యాసమహర్షి పాండవులకు దానమహిమను చెప్పుట యను రెండువందల అరువదియవ అధ్యాయము. (260)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 36 1/2 శ్లోకాలు.)