267. రెండు వందల అరువది ఏడవ అధ్యాయము
ద్రౌపదీ జయద్రథుల సంవాదము.
వైశంపాయన ఉవాచ
తథాఽఽసీనేషు సర్వేషు తేషు రాజాసు భారత ।
యదుక్తం కృష్ణయా సార్థం తత్ సర్వం ప్రత్యవేదయత్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
"భారతా! రథాల మీద కూర్చున్న ఆ రాజుల దగ్గరకు వెళ్లి కోటికాస్యుడు ద్రౌపదితో జరిగిన సంభాషణ అంతా వారికి తెలియచేశాడు. (1)
కోటికాస్యవచః శ్రుత్వా శైబ్యం సౌవీరకోఽబ్రవీత్ ।
యదా వాచం వ్యాహరంత్యామ్ అస్యాం మే రమతే మనః ॥ 2
సీమంతినీనాం ముఖ్యాయాం వినివృత్తః కథం భవాన్ ।
ఏతాం దృష్ట్వా స్త్రియో మేఽన్యాః యథా శాఖామృగస్త్రియః ॥ 3
ప్రతిభాంతి మహాబాహో సత్యమేతద్ బ్రవీమి తే ।
దర్శనాదేవ హి మనః తయా మేఽపహృతం భృశమ్ ॥ 4
తాం సమాచక్ష్వ కల్యాణీం యది స్యాచ్ఛైబ్య మానుషీ ।
కోటికాస్యుని మాటలు విని సౌవీరనరేశుడు జయద్రథుడు ఆ శైబ్యునితో ఇలా అన్నాడు - "స్త్రీలలో శ్రేష్ఠురాలయిన ఆమె నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యందు నామనసు తగుల్కొంది. నీవు ఎలా తిరిగి రాగలిగావు? ఈమెను చూచిన నాకు ఇతర స్త్రీలు ఆడుకోతులవలె అనిపిస్తున్నారు. మహాబాహూ! నేను నిజం చెపుతున్నాను. చూడగానే నా మనసును ఆమె పూర్తిగా అపహరించింది. శైబ్యా! ఆమె మానవకాంతయే అయితే ఆ కల్యాణిని గూర్చి చెప్పు. (2-4 1/2)
కోటిక ఉవాచ
ఏషా వై ద్రౌపదీ కృష్ణా రాజపుత్రీ యశస్వినీ ॥ 5
పంచానాం పాండుపుత్రాణాం మహిషీ సమ్మతా భృశమ్ ।
సర్వేషాం చైవ పార్థానాం ప్రియా బహుమతా సతీ ॥ 6
తయా సమేత్య సౌవీర సౌవీరాభిముఖో వ్రజ ।
కోటికాస్యుడు చెపుతున్నాడు - " ఈ యశస్విని ద్రుపదుని కూతురు రాజకుమారి కృష్ణ, ఐదుగురు పాండవులకు మిక్కిలి ఆదరణీయురాలయిన పట్టమహిషి, ఆ కుంతీసుతులందరికీ కూడా చాలా మెచ్చుకోదగిన ఇష్టురాలయిన భార్య. సౌవీరా! ఆమెతో కలిసి సౌవీర దేశాభిముఖంగా వెళ్లు". (5,6 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రత్యువాచ పశ్యామి ద్రౌపదీమితి ॥ 7
పతిః సౌవీరసింధూనాం దుష్టభావో జయద్రథః ।
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇలా చెప్పగానే సింధు సౌవీరవీరులకు అధిపతి, దుష్టభావం కల ఆ జయద్రథుడు "ద్రౌపదిని చూస్తాను" అన్నాడు. (7 1/2)
స ప్రవిశ్యాశ్రమం పుణ్యం సింహగోష్ఠం వృకో యథా ॥ 8
ఆత్మనా సప్తమః కృష్ణామిదం వచనమబ్రవీత్ ।
కుశలం తే వహారోహే భర్తారస్తేఽప్యనామయాః ॥ 9
యేషాం కుశలకామాసి తేఽపి కంచిదనామయాః ।
తన ఆరుగురు సోదరులు కలిసి అతడు సింహం గుహలోకి ప్రవేశించే తోడేలులా పవిత్రమైన ఆశ్రమంలోకి వెళ్లి ద్రౌపదితో ఇలా అన్నాడు - "వరారోహా! నీకు క్షేమమేనా? నీ భర్తలు అందరూ కుశలంగా ఉన్నారా? నీవు కోరుకొంటున్న వారందరూ కూడా కుశలమేనా?" (8,9 1/2)
ద్రౌపద్యువాచ
అపి తే కుశలం రాజన్ రాష్ట్రే కోశే బలే తథా ॥ 10
కచ్చిదేకః శిబీనాఢ్యాన్ సౌవీరాన్ సహ సింధుభిః ।
అనుతిష్ఠసి ధర్మేణ యే చాన్యే విజితాస్త్వయా ॥ 11
ద్రౌపది అడుగుతోంది - "రాజా! మీకు కుశలమేనా? మీ రాజ్యం, కోశం, బలం అన్నీ బాగున్నాయా? సింధుదేశంతోపాటు సమృద్ధమంతమైన శిబి, సౌవీరదేశాలు ఇంకా మీరు జయించిన ఇతర దేశాలు అన్నిటినీ మీరు ధర్మాన్ని అనుసరించి పాలిస్తున్నారా? (10,11)
కౌరవ్యః కుశలీ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అహం చ భ్రాతరశ్చాస్య యాంశ్చాన్యాన్ పరిపృచ్ఛసి ॥ 12
పాద్యం ప్రతిగృహాణేదమ్ ఆసనం చ నృపాత్మజ ।
కుంతీపుత్రుడు కౌరవకులాలంకారుడు అయిన యుధిష్ఠిరమహారాజు క్షేమమే. నేను, వారి సోదరులు, ఇంకా మీరు అడిగినవారందరూ కూడా క్షేమమే. రాకుమారా! పాద్యం, ఆసనం ఇదిగో గ్రహించండి". (12 1/2)
జయద్రథ ఉవాచ
ఏహి మే రథమారోహ సుఖమాప్నుహి కేవలమ్ ॥ 13
గతశ్రీకాంశ్చ్యుతాన్ రాజ్యాత్ కృపణాన్ గతచేతసః ।
అరణ్యవాసినః పార్థాన్ నానురోద్ధుం త్వమర్హసి ॥ 14
నైవ ప్రాజ్ఞా గతశ్రీకం భర్తారముపయుంజతే ।
యుంజానమనుయుంజీత న శ్రియః సంక్షయే వసేత్ ॥ 15
జయద్రథుడు అంటున్నాడు - "రా. నా రథం ఎక్కు. అమితమైన సుఖాలు పొందు. పాండవులు సంపదలు కోల్పోయారు. రాజ్యభ్రష్టులయ్యారు. దీనులై, అధీరులై ఉన్నారు. అరణ్యవాసులైన ఆ కుంతీకుమారులను అనుసరించడం నీకు తగదు. వివేకం కలిగిన స్త్రీలు ధనం కోల్పోయిన భర్తను అనుసరించరు. ధనం ఉన్ననాడే వారిని అనుసరిస్తారు. ఆ ధనం కోల్పోతే వారివద్ద ఉండరు. (13-15)
శ్రియా విహీనా రాష్ట్రాచ్చ వినష్టాః శాశ్వతీః సమాః ।
అలం తే పాండుపుత్రాణాం భక్త్యా క్లేశముపాసితుమ్ ॥ 16
పాండవులు శాశ్వతంగా సంపద పోగొట్టుకొన్నారు. రాజ్యభ్రష్టులయ్యారు. వారిని భక్తిగా సేవించడం కోసం పడే కష్టం చాలు. (16)
భార్యా మే భవ సుశ్రోణి త్యజైనాన్ సుఖమాప్నుహి ।
అఖిలాన్ సింధుసౌవీరాన్ ఆప్నుహి త్వం మయా సహ ॥ 17
సుశ్రోణీ! నాకు భార్యవు కమ్ము. వీరిని విడిచిపెట్టు, సుఖాలు పొందు. నీవు నాతో కూడి సమస్త సింధు సౌవీర దేశాలను (మహారాణిగా) పొందు". (17)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తా సింధురాజేన వాక్యం హృదయకంపనమ్ ।
కృష్ణా తస్మాదపాక్రామద్ దేశాత్ సభ్రుకుటీముఖీ ॥ 18
వైశంపాయనుడు చెపుతున్నాడు - హృదయాన్ని కంపింపచేసే సింధురాజు యొక్క ఈ మాటలను విని కృష్ణకు కనుబొమలు ముడిపడ్డాయి. ఆ ప్రదేశం నుండి దూరంగా తొలగిపోయింది. (18)
అవమత్యాస్య తద్ వాక్యమ్ ఆక్షిప్య చ సుమధ్యమా ।
మైవమిత్యబ్రవీత్ కృష్ణా లజ్జస్వేతి చ సైంధవ ॥ 19
అతడు అన్న మాటలను తిరస్కరించి ఆ సుందరి ద్రౌపది అతనిని తీవ్రంగా అధిక్షేపిస్తూ - "అలా ఎన్నటికీ జరగదు. సైంధవా! (ఇలా అనటానికి) నీవు సిగ్గుపడాలి" అన్నది. (19)
సా కాంక్షమాణా భర్తౄణామ్ ఉపయాతమనిందితా ।
విలోభయామాస పరం వాక్యైర్వాక్యాని యుంజతీ ॥ 20
అనింద్యురాలయిన ద్రౌపది భర్తల రాకను కోరుకొంటూ వాదోపవాదాలతో అతనిని మభ్యపెట్టసాగింది. (20)
ద్రౌపద్యువాచ
నైవం వద మహాబాహో న్యాయ్యం త్వం న చ బుధ్యసే ।
పాండూనాం ధార్తరాష్ట్రాణాం స్వసా చైవ కనీయసీ ॥
దుఃశలా నామ తస్యాస్త్వం భర్తా రాజకులోద్వహ ।
మమ భ్రాతా చ న్యాయ్యేన త్వయా రక్ష్యా మహారథ ॥
ధర్మిష్ఠానాం కులే జాతః న ధర్మం త్వమవేక్షసే ।
ద్రౌపది ఇలా అంది.
"మహాబాహూ! అలా అనకు. నీవు న్యాయం గురించి ఆలోచించడం లేదు. పాండవులకు, ధార్తరాష్ట్రులకు కూడా చిన్న చెల్లెలు అయిన దుశ్శలయొక్క భర్తవు నీవు. రాజవంశీకుడా! నీవు నాకు సోదరుడవు. న్యాయంగా అయితే నీవు నన్ను రక్షించాలి. మహారథీ! ధార్మికుల వంశంలో పుట్టావు. కాని నీవు ధర్మాన్ని గమనించడం లేదు.
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తః సింధురాజోఽథ వాక్యముత్తరమబ్రవీత్ ॥
వైశంపాయనుడు చెపుతున్నాడు. "అలా అన్న ఆమెకు సింధురాజు ఇలా బదులిచ్చాడు.
జయద్రథ ఉవాచ
రాజ్ఞాం ధర్మం న జానీషే స్త్రియో రత్నాని చైవ హి ।
సాధారణాని లోకేఽస్మిన్ ప్రవదంతి మనీషిణః ॥)
జయద్రథుడు అంటున్నాడు - "ద్రౌపదీ! నీవు రాజధర్మం ఎరుగవు. స్త్రీలు, రత్నాలు ఈ లోకంలో సర్వులకు సాధారణ వస్తువులని పండితులు చెప్తారు".)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి జయద్రథ ద్రౌపదీసంవాదే సప్తషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 267 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున జయద్రథ ద్రౌపదీసంవాదమను రెండువందల అరువది ఏడవ అధ్యాయము. (267)
(దాక్షిణాత్య అధికపాఠం 4 శ్లోకములు కలిపి మొత్తం 24 శ్లోకాలు.)