266. రెండువందల అరువది ఆరవ అధ్యాయము

ద్రౌపది కోటికాస్యునకు సమాధానమిచ్చుట.

వైశంపాయన ఉవాచ
అథాబ్రవీద్ ద్రౌపదీ రాజపుత్రీ
పృష్టా శిబీనాం ప్రవరేణ తేన ।
అవేక్ష్య మందం ప్రవిముచ్య శాఖాం
సంగృహ్ణతీ కౌశికముత్తరీయమ్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. శిబిప్రవరుడయిన అతడు ఇలా అడుగగా రాజపుత్రి అయిన ద్రౌపది కడిమి చెట్టుకొమ్మను వదిలి తన పట్టు ఉత్తరీయాన్ని సవరించుకొంటూ అతనిని సంకోచంతో చూస్తూ ఇలా అన్నది. (1)
బుద్ధ్యాభిజానామి నరేంద్రపుత్ర
న మాదృశీ త్వామభిభాష్టుమర్హతి ।
న త్వేహ వక్తాస్తి తవేహ వాక్య
మన్యే నరో వాప్యథవాపి నారీ ॥ 2
"రాజకుమారా! నావంటి స్త్రీ నీతో సంభాషించడం తగదని బుద్ధిపూర్వకంగా ఎరుగుదును అయినా అడిగినదానికి సమాధానం చెప్పడానికి ఇక్కడ వేరే పురుషుడు గాని స్త్రీగాని లేరు. (2)
ఏకా హ్యహం సంప్రతి తేన వాచం
దదామి వై భద్ర నిబోధ చేదమ్ ।
అహం హ్యరణ్యే కథమేకమేకా
త్వామాలపేయం నిరతా స్వధర్మే ॥ 3
ఇప్పుడు నేను ఒక్కతినే ఉన్నాను. కనుక సమాధానం ఇవ్వవలసివస్తోంది. భద్రపురుషా! దీనిని కూడా నీవు గమనించు. స్వధర్మనిరతురాలనైన నేను అరణ్యంలో ఒంటరిగా ఒంటరి పురుషుడవైన నీతో ఎలా మాట్లాడగలను? (3)
జానామి చ త్వాం సురథస్య పుత్రం
యం కోటికాస్యేతి విదుర్మనుష్యాః ।
తస్మాదహం శైబ్య తథైవ తుభ్యమ్
ఆఖ్యామి బంధూన్ ప్రథితం కులం చ ॥ 4
నీవు సురథుని పుత్రుడవని, ప్రజలు నిన్ను కోటికాస్యుడంటారని ఎరుగుదును. శైబ్యా! కాబట్టి నేను కూడా అలాగే నీకు నా బంధువులను ప్రసిద్ధమైన నావంశాన్ని గురించి చెపుతున్నాను. (4)
అపత్యమస్మి ద్రుపదస్య రాజ్ఞః
కృష్ణేతి మాం శైబ్య విదుర్మనుష్యాః ।
సాహం వృణే పంచ జనాన్ పతిత్వే
యే ఖాండవప్రస్థగతాః శ్రుతాస్తే ॥ 5
నేను ద్రుపదమహారాజు కూతుర్ని, శైబ్యా! నన్ను ప్రజలు 'కృష్ణ' అంటారు. నేను ఐదుగురిని పతులుగా వరించాను. ఖాండవ ప్రస్థంలో ఉండేవారు. వారిని గూర్చి నీవు వినే ఉంటావు. (5)
యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ
మాద్య్రాశ్చ పుత్రౌ పురుషప్రవీరౌ ।
తే మాం నివేశ్యేహ దిశశ్చతస్రో
విభజ్య పార్థా మృగయాం ప్రయాతాః ॥ 6
యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, పురుషోత్తములైన మాద్రికొడుకులు ఇద్దరు. ఆ కుంతీపుత్రులు నన్ను ఇక్కడ ఉంచి నలుదిక్కులకు వేటకోసం విడివిడిగా వెళ్లారు. (6)
ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో
జయః ప్రతీచీం యమజావుదీచీమ్ ।
మన్యే తు తేషాం రథసత్తమానాం
కాలోఽభితః ప్రాప్త ఇహోపయాతుమ్ ॥ 7
యుధిష్ఠిరమహారాజు తూర్పుకు, భీమసేనుడు దక్షిణానికి, అర్జునుడు పడమరకు, కవలు ఉత్తరానికి వెళ్లారు. ఆ రథసత్తములు అన్నివైపుల నుండి ఇక్కడకు వచ్చేసమయం అయింది. (7)
సమ్మానితా యాస్యథ తైర్యథేష్టం
విముచ్య వాహానవరోహయధ్వమ్ ।
ప్రియాతిథిర్దర్మసుతో మహాత్మా
ప్రీతో భవిష్యత్యభివీక్ష్య యుష్మాన్ ॥ 8
వారిచేత ఆదరసత్కారాలు పొంది యథేచ్ఛగా వెళ్దురుగాని గుఱ్ఱాలను విడిపించి రథాల నుండి దిగండి. మహాత్ముడైన ధర్మసుతునికి అతిథులంటే ప్రీతి. మిమ్మల్ని చూచి అతడు సంతోషిస్తాడు. (8)
ఏతావదుక్త్వా ద్రుపదాత్మజా సా
శైబ్యాత్మజం చంద్రముఖీ ప్రతీతా ।
వివేశ తాం పర్ణశాలాం ప్రశస్తాం
సంచింత్య తేషామతిథిత్వమర్థే ॥ 9
శైబ్యసుతునికి ఇంతమాత్రం చెప్పి చంద్రముఖి అయిన ద్రౌపది ముందుకు కదిలింది. వారు తమకు అతిథులు అని ఆలోచించి వారికి ఆతిథ్యపుటేర్పాట్లు కోసం ఆమె తమ ప్రశస్తమైన పర్ణశాలలోనికి ప్రవేశించింది. (9)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి ద్రౌపదీవాక్యే షట్ షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 266 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున ద్రౌపది సమాధానమను రెండువందల అరువది ఆరవ అధ్యాయము. (266)