269. రెండువందల అరువది తొమ్మిదవ అధ్యాయము

పాండవులు మరలివచ్చి ద్రౌపదీహరణమును గూర్చి విని జయద్రథుని వెన్నంటుట.

వైశంపాయన ఉవాచ
తతో దిశః సంప్రవిహృత్య పార్థా
మృగాన్ వరాహాన్ మహిషాంశ్చ హత్వా ।
ధనుర్ధరాః శ్రేష్ఠతమా పృథివ్యాం
పృథక్ చరంతః సహితా బభూవుః ॥ 1
వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు.
అనంతరం భూమండలంలోనే మిక్కిలి శ్రేష్ఠధనుర్థరులైన కుంతీపుత్రులు ఐదుగురు, అన్ని దిక్కులలో విహరిస్తూ క్రూర జంతువులను, వరాహాలను, అడవి దున్నలను చంపి వేర్వేరుగా తిరుగుతున్న వారు ఒకచోటకు చేరారు. (1)
తతో మృగవ్యాలగణానుకీర్ణం
మహావనం తద్ విహగోపఘుష్టమ్ ।
భ్రాతౄంశ్చ తానభ్యవదద్ యుధిష్ఠిరః
శ్రుత్వా గిరో వ్యాహరతాం మృగాణామ్ ॥ 2
ఆ సమయంలో క్రూర జంతువులు, సర్పాలతో నిండి ఉండే ఆ ఘోరారణ్యం ఒక్కసారిగా పక్షుల కలకలలతో మ్రోగిపోయింది. మృగాలు ఆర్తనాదాలు చేయసాగాయి. ఆ ధ్వనులన్నీ విని యుధిష్ఠిరుడు సోదరులతో ఇలా అన్నాడు. (2)
ఆదిత్యదీప్తాం దిశమభ్యుపేత్య
మృగా ద్విజాః క్రూరమిమే వదంతి ।
ఆయాసముగ్రం ప్రతివేదయంతః
మహావనం శత్రుభిర్బాధ్యమానమ్ ॥ 3
"మృగాలు, పక్షులు ఇలా కఠోరంగా అరుస్తూ సూర్యునితో ప్రకాశమానమైన తూర్పుదిక్కునకు పరుగెత్తుతూ భయంకరమైన ఉత్పాతాన్ని సూచిస్తున్నాయి. ఈ మహావనానికి శత్రుబాధ కలిగినట్లుంది. (3)
క్షిప్రం నివర్తధ్వమలం విలంబైః
మనో హి మే దూయతి దహ్యతే చ ।
బుద్ధిం సమాచ్ఛాద్య చ మే సమన్యుః
ఉద్ధూయతే ప్రాణపతిః శరీరే ॥ 4
వెంటనే ఆశ్రమానికి మరలండి. ఆలస్యం చేయకండి. నా మనసు వివేచనాశక్తిని కూడా కప్పివేసి కలత చెందుతోంది. దహించివేస్తోంది. నా శరీరంలోని ప్రాణపతి (జీవుడు) శోకంతో ఎగసిపడుతున్నాడు. (4)
సరః సుపర్ణేన హృతోరగం యథా
రాష్ట్రం యథారాజకమాత్తలక్ష్మి ।
ఏవంవిధం మే ప్రతిభాతి కామ్యకం
శౌండైర్యథా పీతరసశ్చ కుంభః ॥ 5
గరుడుడు నీటిలోని సర్పాన్ని ఒడిసిపట్టుకొంటే కలకబారిన సరస్సులా, రాజులేకపోతే శ్రీవిహీనమైన రాజ్యంలా, ధూర్తులు రసం త్రాగివేసిన ఖాళీకుండలా ఈ కామ్యకం శత్రువుల చేతిలో చిక్కి దురవస్థ పొందిన దానిలా నాకు అనిపిస్తోంది." (5)
తే సైంధవైరత్యనిలోగ్రవేగైః
మహాజవైర్వాజిభిరుహ్యమానాః
యుక్తైర్బృహద్భిః సురథైర్నృవీరాః
తదాఽఽశ్రమాయాభిముఖా బభూవుః ॥ 6
అనంతరం ఆ నరవీరులు గాలిని మించిన వేగంతో, సింధుదేశపు గుఱ్ఱాలు పూన్చిన రథాలతో ఆశ్రమాభిముఖంగా కదిలారు. (6)
తేషాం తు గోమాయురనల్ప ఘోషః
నివర్తతాం వామముపేత్య పార్శ్వమ్ ।
ప్రవ్యాహరత్ తత్ ప్రవిమృశ్య రాజా
ప్రోవాచ భీమం చ ధనంజయం చ ॥ 7
ఆ సమయంలో ఆశ్రమానికి తిరిగివస్తున్న వారికి ఎడమప్రక్కగా ఒక నక్క పెద్దగా అరుస్తూ వెళ్లింది. ఆ శకునం గూర్చి తర్కించుకొని యుధిష్ఠిరుడు భీమార్జునులతో ఇలా అన్నాడు. (7)
యథా వదత్యేష విహీనయోనిః
శాలావృకో వామముపేత్య పార్శ్వమ్ ।
సువ్యక్తమస్మానవమన్య పాపైః
కృతోఽభిమర్దః కురుభిః ప్రసహ్య ॥ 8
ఈ నీచజంతువైన నక్క మనకు ఎడమప్రక్కగా రావడం. ఇలా అరవడం చూస్తే - పాపాత్ములైన కౌరవులు మనలను ధిక్కరించి బలవంతంగా పెద్ద అపచారం చేస్తున్నట్లుగా వ్యక్తమవుతోంది. (8)
ఇత్యేవ తే తద్ వనమావిశంతః
మహత్యరణ్యే మృగయాం చరిత్వా ।
బాలామపశ్యంత తదా రుదంతీం
ధాత్రేయికాం ప్రేష్యవధూం ప్రియాయాః ॥ 9
ఈ రీతిగా వారు మహారణ్యంలో వేటాడి తిరిగి ఆశ్రమసమీపంలోని వనప్రదేశాన్ని సమీపిస్తూండగా తమకు ప్రియమైన భార్య ద్రౌపదియొక్క దాసి, తమ దాసుని యొక్క భార్య అయిన ధాత్రేయిక ఏడుస్తూ ఉండడం చూశారు. (9)
తామింద్రసేనస్త్వరితోఽభిసృత్య
రథాదవప్లుత్య తతోఽభ్యధావత్ ।
ప్రోవాచ చైనాం వచనం నరేంద్ర
ధాత్రేయికామంతితరస్తదానీమ్ ॥ 10
జనమేజయమహారాజా! అప్పుడు సారథి అయిన ఇంద్రసేనుడు రథాన్నుండి వెంటనే దూకి వేగంగా పరిగెత్తి ధాత్రేయిక దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు. (10)
కిం రోదిషి త్వం పతితా ధరణ్యాం
కిం తే ముఖం శుష్యతి దీనవర్ణమ్ ।
కచ్చిన్న పాపైః సునృశంసకృద్భిః
ప్రమాథితా ద్రౌపదీ రాజపుత్రీ ॥ 11
"నీవు నేలమీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? నీ ముఖం దీనంగా వాడి పోయిందెందుకు? అత్యంత క్రూరకర్మలు చేసే పాపాత్ములైన కౌరవులు రాజకుమారి ద్రౌపదికేమీ అపకారం చేయలేదు కదా? (11)
అచింత్యరూపా సువిశాలనేత్రా
శరీరతుల్యా కురుపుంగవానామ్ ।
యద్యేవ దేవీ పృథివీం ప్రవిష్టా
దివం ప్రపన్నాప్యథవా సముద్రమ్ ॥ 12
తస్యా గమిష్యంతి పదే హి పార్థా
యథా హి సంతప్యతి ధర్మపుత్రః ।
ధర్మపుత్రుడయిన యుధిష్ఠిరుడు ద్రౌపదికోసం చాలా బాధపడుతున్నాడు. ద్రౌపది ఊహకందని సౌందర్యవతి. విశాలమైన కన్నులు కలది. కురుశ్రేష్ఠులకు తమ శరీరంతో సమానం. ఒకవేళ ఆమె భూమిలోపల దాగినా, స్వర్గంలో ఉన్నా, లేక సముద్రంలో ప్రవేశించినా కుంతీపుత్రులు ఆమె జాడను తెలుసుకొంటారు. (12 1/2)
కో హీదృశానామరిమర్దనానాం
క్లేశక్షమానామపరాజితానామ్ ॥ 13
ప్రాణైః సమామిష్టతమాం జిహీర్షేద్
అనుత్తమం రత్నమివ ప్రమూఢః ।
శత్రుమర్దనులై, కష్టసహిష్టువులై, జయింపశక్యం కాని వారికి ప్రాణసమానురాలైన , అనర్ఘరత్నం వంటి ద్రౌపదిని ఏ మూఢాత్ముడు అపహరించాలనుకొంటాడు? (13 1/2)
న బుధ్యతే నాథవతీమిహాద్య
బహిశ్చరం హృదయం పాండవానామ్ ॥ 14
కస్యాద్య కాయం ప్రతిభిద్య ఘోరాః
మహీం ప్రవేక్ష్యంతి శితాః శరాగ్య్రాః ।
మగనాలి అయిన ద్రౌపది పాండవులకు ప్రకట రూపంలో ఉన్న హృదయమని (బహిఃప్రాణమని) ఎవరికి తెలియదు? ఈనాడు భయంకరమైన, వాడియై శ్రేష్ఠమైన వారి బాణాలు ఎవరి శరీరాన్ని చీల్చి భూమిలో గుచ్చుకొంటాయో! (14 1/2)
మాం త్వం శుచస్తాం ప్రతి భీరు విద్ధి
యథాద్య కృష్ణా పునరేష్యతీతి ॥ 15
నిహత్య సర్వాన్ ద్విషతః సమగ్రాన్
పార్థాః సమేష్యంత్యథ యాజ్ఞసేన్యా ।
పిరికిదానా! ఆమె గురించి శోకించకు. ఇప్పుడే ఆమె తిరిగిరాగలదని తెలుసుకో. సమస్త శత్రువులను సమూలంగా చంపి, పార్థులు యాజ్ఞసేనిని కలుసుకొంటారు." (15 1/2)
అథాబ్రవీచ్చారు ముఖం ప్రమృజ్య
ధాత్రేయికా సారథిమింద్రసేనమ్ ॥ 16
జయద్రథేనాపహృతా ప్రమథ్య
పంచేంద్రకల్పాన్ పరిభూయ కృష్ణా ।
తిష్ఠంతి వర్త్మాని నవాన్యమూని
వృక్షాశ్చ న మ్లాంతి తథైవ భగ్నాః ॥ 17
ఈ మాటలు విని ధాత్రేయిక అందమైన తన ముఖాన్ని తుడుచుకొని సారథి అయిన ఇంద్రసేనునితో ఇలా అంది - "పంచేంద్రులవంటి పాండవులను తిరస్కరించి జయద్రథుడు బలవంతంగా కృష్ణను అపహరించాడు. (ఆ రథచక్రాలక్రింద నలిగి) క్రొత్తగా ఏర్పడిన ఈ దారి అలాగే ఉంది. విరిగిన చెట్లు కూడా ఇంకా వాడిపోలేదు. (16,17)
ఆవర్తయధ్వం హ్యనుయాత శీఘ్రం
న దూరయాతైన హి రాజపుత్రీ ।
సంనహ్యధ్వం సర్వ ఏవేంద్రకల్పాః
మహాంతి చారూణి చ దంశనాని ॥ 18
ఇంద్రకల్పులైన పాండవులారా! మీరు మీ రథాలను వెనుకకు త్రిప్పండి. శీఘ్రంగా శత్రువులను వెంబడించండి. రాజకుమారి ద్రౌపది ఇప్పటికింకా దూరం వెళ్లి ఉండదు. వెంటనే కవచాలను ధరించండి. (18)
గృహ్ణీత చాపాని మహాధనాని
శరాంశ్చ శీఘ్రం పదవీం చరధ్వమ్ ।
పురా హి నిర్భర్త్సనదండమోహితా
ప్రమోహచిత్తా వదనేన శుష్యతా ॥ 19
దదాతి కస్మైచిదనర్హతే తమం
వరాజ్యపూర్ణామివ భస్మని స్రుచమ్ ।
పురా తుషాగ్నావివ హూయతే హవిః
పురా శ్మశానే స్రగివాపవిద్ధ్యతే ॥ 20
పురా చ సోమోఽధ్వరగోఽవలిహ్యతే
శునా యథా విప్రజనే ప్రమోహితే ।
మహత్యరణ్యే మృగయాం చరిత్వా
పురా శృగాలో నలినీం విగాహతే ॥ 21
అనర్ఘములైన ధనుస్సులను, బాణాలను తీసుకోండి. వెంటనే శత్రువులు వెళ్లిన దారిలో వెళ్లండి. బెదిరింపులకుగాని, దండనలకు గాని భయపడి మూఢచిత్తురాలై వాడిపోయిన ముఖంతో ఏ అయోగ్యునికీ ఆమె తనువును అర్పించక పూర్వమే వెళ్లండి. అదే కనుక జరిగితే స్వచ్ఛమైన నేతితో నిండిన స్రుక్కును బూడిదలో కుమ్మరించినట్లు, హవిస్సును ఊకనిప్పులో హోమం చేసినట్లు, (దేవ పూజకోసం ఉంచిన) పూలమాలను శ్మశానంలోకి విసిరినట్లు. బ్రాహ్మణులు ఆదమరిచి ఉండగా యజ్ఞమండపంలోని సోమరసాన్ని కుక్క నాకి వేసినట్లు. మహారణ్యంలో వేటాడుతూ తిరిగిన నక్క పద్మాకరంలో మునిగినట్లు అవుతుంది. (19-21)
మా వః ప్రియాయాః సునసం సులోచనం
చంద్రప్రభాచ్ఛం వదనం ప్రసన్నమ్ ।
స్పృశ్యాచ్ఛుభం కశ్చిదకృత్యకారీ
శ్వావై పురోడాశ మివాధ్వరస్థమ్ ।
ఏతాని వర్త్మాన్యనుయాత శీఘ్రం
మా వః కాలః క్షిప్రమిహాత్యగాద్ వై ॥ 22
అందమైన నాసిక, చక్కని కన్నులు కలిగి చంద్రకాంతిలా స్వచ్ఛంగా వెలుగొందే ఆ మీ ప్రియురాలి యొక్క పవిత్రమైన ప్రసన్నమైన ముఖాన్ని కుక్క యజ్ఞవేదికయందలి పురోడాశాన్ని నాకినట్లుగా ఏ పాపాత్ముడూ తాకకూడదు. ఈ దారుల వెంటనే శీఘ్రంగా శత్రువుల వెన్నంటి వెళ్లండి. మీ సమయం ఇక్కడే గడిచిపోకూడదు. (22)
యుధిష్ఠిర ఉవాచ
భద్రే ప్రతిక్రామ నియచ్ఛ వాచం
మాస్మత్సకాశే పరుషాణ్యవోచః ।
రాజానో వా యది వా రాజపుత్రా
బలేన మత్తా వంచనాం ప్రాప్నువంతి ॥ 23
యుధిష్ఠిరుడు అన్నాడు. "భద్రే! పక్కకి తొలగు" మాటలు తూలకు - మా ఎదుట అతిపరుషంగా మాట్లాడుతున్నావు. బలగర్వితుడైన అతడు రాజు కానీ, రాజపుత్రుడు కానీ ముప్పుతప్పదు". (23)
వైశంపాయన ఉవాచ
ఏతవదుక్త్వా ప్రయయుర్హి శీఘ్రం
తాన్యేవ వర్త్మాన్యనువర్తమానాః ।
ముహుర్ముహుర్వ్యాలవదుచ్ఛ్వసంతః
జ్యాం విక్షిపంతశ్చ మహాధనుర్భ్యః ॥ 24
వైశంపాయనుడు చెపుతున్నాడు.
"ఇలా అని ఆ పాండవులు అందరూ ధనుష్టంకారాలు చేస్తూ, మాటిమాటికి పాముల వలె బుసలు కొడుతూ ఆ మార్గాన్నే అనుసరిస్తూ వెంటనే బయలుదేరారు. (24)
తతోఽపశ్యంస్తస్య సైన్యస్య రేణుమ్
ఉద్భూతం వై వాజిఖురప్రణున్నమ్ ।
పదాతీనాం మధ్యగతం చ ధౌమ్యం
విక్రోశంతం భీమమభిద్రవేతి ॥ 25
అంతట జయద్రథుని సైన్యంలోని కాలిగిట్టల తాకిడికి ఎగిరిన ధూళి వారికి కనపడింది. కాల్బలం మధ్యలో "భీమసేనా! పరుగెత్తుకురా" అని ఆక్రోశిస్తున్న ధౌమ్యుడు కూడా కనిపించాడు. (25)
తే సాంత్వ్య ధౌమ్యం పరిదీనసత్త్వాః
సుఖం భవానేత్వితి రాజపుత్రాః ।
శ్యేనా యథైవామిషసంప్రయుక్తా
జనేన తత్ సైన్యమథాభ్యధావన్ ॥ 26
అసాధారణ పరాక్రమం కలిగిన రాజపుత్రులైన ఆ పాండవులు "ఇక మీరు నిశ్చింతగా వెళ్లండి" అని ధౌమ్యుని ఓదార్చి గద్ద మాంసం కోసం ఎగిరినంత వేగంగా జయద్రథుని యొక్క సైన్యాన్ని వెన్నంటి వెళ్లారు. (26)
తేషాం మహేంద్రోపమవిక్రమాణాం
సంరబ్ధానాం ధర్షణాద్ యాజ్ఞసేన్యాః ।
క్రోధః ప్రజజ్వాల జయద్రథం చ
దృష్ట్వా ప్రియాం తస్య రథే స్థితాం చ ॥ 27
మహేంద్రసమాన పరాక్రములై విజృంభించిన ఆ పాండవులకు ద్రౌపది యొక్క ధిక్కారపూర్వకమైన మాటలు విన్పించాయి. ఆ వెంటనే జయద్రథుడు, అతని రథంలో ఉన్న ద్రౌపదీ కన్పించారు. వారి క్రోధం ప్రజ్వరిల్లింది. (27)
ప్రచుక్రుశుశ్చాప్యథ సింధురాజం
వృకోదరశ్చైవ ధనంజయశ్చ ।
యమౌ చ రాజా చ మహాధనుర్దరః
తతో దిశః సమ్ముముహుః పరేషామ్ ॥ 28
వెంటనే భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, యుధిష్ఠిరుడు - ఈ మహాధనుర్థారులందరూ సింధురాజైన జయద్రథుని అదిలించారు. అప్పుడు శత్రుసైనికులకు, దిక్కుతోచకుండా పోయింది. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి పార్థాగమనే ఏకోనసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 269 ॥
ఇది శ్రీ మహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున పాండవులేతెంచుట అను రెండువందల అరువది తొమ్మిదవ అధ్యాయము. (269)