270. రెండువందల డెబ్బదియవ అధ్యాయము

ద్రౌపది పాండవుల పరాక్రమమును జయద్రథునికి చెప్పుట.

వైశంపాయన ఉవాచ
తతో ఘోరతరః శబ్దో వనే సమభవత్ తదా ।
భీమసేనార్జునౌ దృష్ట్వా క్షత్రియాణామమర్షిణామ్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
"అప్పుడు భీమసేనుని అర్జునుని చూచి అమర్షపూరితులైన ఆ క్షత్రియులు అరణ్యంలో అతిభయంకరంగా కోలాహలం చేయసాగారు. (1)
తేషాం ధ్వజాగ్రాణ్యభివీక్ష్య రాజా
స్వయం దురాత్మా నరపుంగవానామ్ ।
జయద్రథో యాజ్ఞసేనీమువాచ
రథే స్థితాం భానుమతీం హతౌజాః ॥ 2
ఆ నరశ్రేష్ఠుల ధ్వజాగ్రాలను చూచి ఉత్సాహం అంతరించిపోయిన దురాత్ముడు జయద్రథుడు రథంలో ఉన్న తేజోమూర్తి యాజ్ఞసేనితో ఇలా అన్నాడు. (2)
ఆయాంతీమే పంచ రథా మహాంతః
మన్యే చ కృష్ణే పతయస్తవైతే ।
సా జానతీ ఖ్యాపయ నః సుకేశి
పరం పరం పాండవానాం రథస్థమ్ ॥ 3
"సుకేశీ! ఇదిగో మహారథాలు ఐదు వస్తున్నాయి. ద్రౌపదీ! వారు నీ భర్తలని నేను అనుకొంటున్నాను. వారిని బాగా ఎరిగి ఉన్న నీవు రథస్థులైన ఆ పాండవులను గూర్చి వరుసగా నాకు తెలియచెప్పు". (3)
ద్రౌపద్యువాచ
కిం తే జ్ఞాతైర్మూఢ మహాధనుర్థరైః
అనాయుష్యం కర్మ కృత్వాతిఘోరమ్ ।
ఏతే వీరాః పతయో మే సమేతా
న వః శేషః కశ్చిదిహాస్తి యుద్ధే ॥ 4
ద్రౌపది ఇలా సమాధానం చెప్పింది.
"మూఢుడా! ఆయువును హరించి వేసే అతిఘోరమైన కర్మను చేసి, ఇక ఆ మహాధనుర్ధారులను గురించి తెలుసుకొని ఏం చేస్తావు? ఇదిగో వీరులైన నా భర్తలు ఐదుగురు కూడివచ్చారు. ఇక యుద్ధంలో నీ పక్షంలోని వారెవరూ మిగలరు. (4)
ఆఖ్యాతవ్యం త్వేవ సర్వం ముమూర్షోః
మయా తుభ్యం పృష్టయా ధర్మ ఏషః ।
న మే వ్యథా విద్యతే త్వద్భయం వా
సంపశ్యంత్యాః సానుజం ధర్మరాజమ్ ॥ 5
తమ్ములతో కూడి ఉన్న ధర్మరాజును చూస్తున్న నాకు దుఃఖమూలేదు. నీ వలని భయమూ లేదు. చచ్చిపోబోతున్న నీకు నన్ను అడిగినది అంతా చెప్పడం ధర్మం. (5)
యస్య ధ్వజాగ్రే నదతో మృగంగౌ
నందీపనందౌ మధురౌ యుక్తరూపౌ ।
ఏతం స్వధర్మార్థవినిశ్చయజ్ఞం
సదా జనాః కృత్యవంతోఽనుయాంతి ॥ 6
య ఏష జాంబూనదశుద్ధగౌరః
ప్రచండఘోణస్తనురాయతాక్షః ।
ఏతం కురుశ్రేష్ఠతమం వదంతి
యుధిష్ఠిరం ధర్మసుతం పతిం మే ॥ 7
ధ్వజాగ్రమునందు - చక్కగా కట్టబడి మధురంగా మోగుతున్న నందోపనందకములనే మృదంగాలు కలవాడు; మేలిమిపసిమిచాయతో, సమున్నతమైన నాసిక, బక్కపలుచని శరీరంతో, విశాలమైన కన్నులు కలిగి ఉన్న ఇతడు కురువంశ శ్రేష్ఠుడుగా చెప్పబడుతూ ఉంటాడు. ఇతడే నాభర్త ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు, ధర్మార్థాలను చక్కగా ఎరిగినవాడని తెలుసుకొని లోకులు ఇతనిని ఎప్పుడూ పనికట్టుకొని అనుసరిస్తూ ఉంటారు. (6,7)
అప్యేష శత్రోః శరణాగతస్య
దద్యాత్ ప్రాణాన్ ధర్మచారీ నృవీర ।
పరే హ్యేనం మూఢ జవేన భూతయే
త్వమాత్మనః ప్రాంజలిర్న్యస్తశస్త్రః ॥ 8
ధర్మవర్తనుడైన నరపుంగవుడు తన్ను శరణు కోరివస్తే శత్రువునకయినా ప్రాణాలను ఇస్తాడు. మూర్ఖుడా! నీవు నీ మేలుకోసం ఆయుధాలు పక్కనపెట్టి, చేతులు జోడించి వేగంగా ఇతనిని శరణువేడు. (8)
అథాప్యేనం పశ్యసి యం రథస్థం
మహాభుజం శాలమివ ప్రవృద్ధమ్ ।
సందష్టౌష్ఠం భ్రుకుటీసంహతభ్రువం
వృకోదరో నామ పతిర్మమైషః ॥ 9
ఆజానేయా బలినః సాధు దాంతాః
మహాబలాః శూరముదావహంతి ।
ఏతస్య కర్మాణ్యతిమానుషాణి
భీమేతి శబ్దోఽస్య గతః పృథివ్యామ్ ॥ 10
అదిగో! నీవు చూస్తున్నావే, ఏపుగా ఎదిగిన మద్దిమాకులా మహాబాహువులతో, కనుబొమలు ముడివేస్తూ, పళ్లు కొరుకుతూ రథస్థుడై ఉన్న అతడు వృకోదరుడు, బలిష్ఠములైన, సుశిక్షితములైన, శక్తిమంతములైన ఆజానేయములయిన గుఱ్ఱాలు ఆ శూరుని రథాన్ని లాగుతున్నాయి. ఇతడు చేసే పనులు అతిమానుషములు కాబట్టి భీముడనే పేరు ఇతనికి పుడమిలో ప్రసిద్ధమయింది. (9,10)
నాస్యాపరాద్దాః శేషమవాప్నువంతి
నాయం వైరం విస్మరతే కదాచిత్ ।
వైరస్యాంతం సంవిధాయోపయాతి
పశ్చాచ్ఛాంతిం న చ గచ్ఛత్యతీవ ॥ 11
ఇతనికి అపకారం చేసినవారు మిగలరు. ఇతడు వైరాన్ని ఎన్నడూ మర్చిపోడు. వైరం యొక్క అంతు తేల్చిగాని ఊరుకోడు. ఆ తరువాత కూడా పూర్తిగా శాంతించడు. (11)
ధనుర్ధరాగ్య్రో ధృతిమాన్ యశస్వీ
జితేంద్రియో వృద్ధసేవీ నృవీరః ।
భ్రాతా చ శిష్యశ్చ యుధిష్ఠిరస్య
ధనంజయో నామ పతిర్మమైషః ॥ 12
యో వై న కామాన్న భయాన్న లోభాత్
త్యజేద్ ధర్మం న నృశంసం చ కుర్యాత్ ।
స ఏష వైశ్వానరతుల్యతేజాః
కుంతీసుతః శత్రుసహః ప్రమాథీ ॥ 13
ఆ కనిపించే వీరపురుషుడు ధనంజయుడనే పేరుగల నాభర్త. అతడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు. ధైర్యశాలి. యశస్వి, జితేంద్రియుడు, వృద్ధులను సేవించేవాడు. యుధిష్ఠిరునికి తమ్ముడు, శిష్యుడూ కూడా. అతడు కామలోభాలకులోనైగాని, భయం చేతగాని తన ధర్మాన్ని ఎన్నడూ విడువడు. క్రూరకృత్యాన్ని ఎన్నడూ చేయడు. అగ్నితుల్యమైన తేజస్సు కల ఈ కుంతీసుతుడు శత్రువులను ఎదిరిస్తాడు, సంహరిస్తాడు. (12,13)
యః సర్వధర్మార్థవినిశ్చయజ్ఞో
భయార్తానాం భయహర్తా మనీషీ ।
యస్యోత్తమం రూపమాహుః పృథివ్యాం
యం పాండవాః పరిరక్షంతి సర్వే ॥ 14
ప్రాణైర్గరీయాంసమనువ్రతం వై
స ఏష వీరో నకులః పతిర్మే ।
సమస్త ధర్మార్థాలను నిశ్చింతగా ఎరిగి, భయాతురుల భయాన్ని పోగొట్టే, బుద్ధిమంతుడు, ఈ భూమిపైన ఉత్తమరూపం గలవానిగా పేరెన్నికగన్నవాడు, తన అన్నలను సేవించేవాడు, వారికి ప్రాణాధికుడైనవాడు, పాండవులందరిచేత రక్షింపబడుతూ ఉండేవాడు అదిగో ఆ వీరుడే నకులుడు, నాభర్త. (14 1/2)
యః ఖడ్గయోధీ లఘుచిత్రహస్తో
మహాంశ్చ ధీమాన్ సహదేవోఽద్వితీయః ॥ 15
యస్యాద్య కర్మ ద్రక్ష్యసే మూఢసత్త్వ
శతక్రతోర్వా దైత్యసేనాసు సంఖ్యే ।
శూరః కృతాస్త్రో మతిమాన్ మనస్వీ
ప్రియంకరో ధర్మసుతస్య రాజ్ఞః ॥ 16
ఖడ్గవిద్యలో ఆరితేరినవాడు, చిత్రమైన లాఘవమైన హస్తవిన్యాసాలు చూపేవాడు, మిక్కిలి బుద్ధిమంతుడు, అద్వితీయ వీరుడు అయినవాడు ఆ సహదేవుడు. మూఢప్రాణీ! దైత్యసేనలో ఇంద్రునివలె యుద్ధంలో అతడు పరాక్రమించడం నీవు నేడు చూస్తావు. అతడు శూరుడు, కృతాస్త్రుడు, మతిమంతుడు, మనస్వి, యుధిష్ఠిరమహారాజుకు ప్రియం చేసేవాడు. (15,16)
య ఏష చంద్రార్కసమానతేజాః
జఘన్యజః పాండవానాం ప్రియశ్చ ।
బుద్ధ్యా సమో యస్య నరో న విద్యతే
వక్తా తథా సత్సు వినిశ్చయజ్ఞః ॥ 17
ఇతడు సూర్యచంద్రులతో సమానమైన తేజస్సు కలవాడు. అందరికంటె చిన్నవాడు, పాండవులకు ప్రీతిపాత్రుడు, బుద్ధిలో ఇతనికి సాటిరాగలవారు లేరు. మాటనేర్పరి. సత్పురుషుల మధ్య నిశ్చితజ్ఞానం కలవాడని పేరొందినవాడు. (17)
స ఏష శూరో నిత్యమమర్షణశ్చ
ధీమాన్ ప్రాజ్ఞః సహదేవః పతిర్మే ।
త్యజేత్ ప్రాణాన్ ప్రవిశేద్ధవ్యవాహం
న త్వేవైష వ్యాహరేద్ ధర్మబాహ్యమ్ ॥ 18
సదా మనస్వీ క్షత్రధర్మే రతశ్చ
కుంత్యాః ప్రాణైరిష్టతమో నృవీరః ।
శూరుడు, అమర్షణశీలుడు, ధీమంతుడు, ప్రాజ్ఞుడు అయిన ఈ సహదేవుడు నాభర్త. ప్రాణాలనైనా విడుస్తాడు, అగ్నిలోనైనా దూకుతాడు గాని ధర్మబాహ్యంగా మాత్రం మాటలాడడు. ఎప్పుడూ క్షత్రధర్మరతుడై, మనస్వియై ఉంటాడు. ఈ వీరపురుషుడు కుంతికి ప్రాణాల కంటె మిక్కిలి ఇష్టమైనవాడు. (18 1/2)
విశీర్యంతీం నావమివార్ణవాంతే
రత్నాభిపూర్ణాం మకరస్య పృష్ఠే ॥ 19
సేనాం తవేమాం హతసర్వయోధాం
విక్షోభితాం ద్రక్ష్యసి పాండుపుత్రైః ।
సముద్రమధ్యంలో తిమింగిలపు తోక చేత బ్రద్ధలయిన రత్నాల ఓడవలె యుద్ధంలో పాండుపుత్రుల చేత యోధులందరూ చనిపోయి ఛిన్నాభిన్నమైన నీ ఈ సేనను నీవు చూస్తావు. (19 1/2)
ఇత్యేతే వై కథితాః పాండుపుత్రాః
యాంస్త్వం మోహాదవమన్య ప్రవృత్తః ।
యద్యేతేభ్యో ముచ్యసేఽరిష్టదేహః
పునర్జన్మ ప్రాప్స్యసే జీవ ఏవ ॥ 20
నేను వర్ణించిన ఇటువంటి పాండుపుత్రులను అవమానించి నీవు ఈ నీచకర్మానికి ఒడిగట్టావు. వీరివలన నీ శరీరం తపించకుండా తప్పించుకుంటే బ్రతికిఉండగానే నీవు పునర్జన్మ పొందినట్లు కాగలదు." (20)
వైశంపాయన ఉవాచ
తతః పార్థాః పంచ పంచేంద్రకల్పాః
త్యక్త్వా త్రస్తాన్ ప్రాంజలీంస్తాన్ పదాతీన్ ।
రథానీకం శరవర్షాంధకారం
చక్రుః క్రుద్ధాః సర్వతః సంనిగృహ్య ॥ 21
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఇంతలోనే ఆ పంచపాండవులు పంచేంద్రులవలె పరాక్రమించి భయంతో చేతులు జోడించిన కాల్బలాన్ని వదిలి, కుపితులై, అన్నివైపుల నుండి అడ్డుకొని రథగజతురగసైన్యాన్ని బాణవర్షంతో అంధకారమయంగా చేశారు. (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ద్రౌపదీహరణపర్వణి ద్రౌపదీవాక్యే సప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 270 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ద్రౌపదీహరణపర్వమను ఉపపర్వమున ద్రౌపదీవాక్యమను రెండువందల డెబ్బదియవ అధ్యాయము. (270)