273. రెండువందల డెబ్బది మూడవ అధ్యాయము.
(రామోపాఖ్యాన పర్వము)
యుధిష్ఠిరుడు తన దురవస్థకు దురపిల్లుచు మార్కండేయుని ప్రశ్నించుట.
జనమేజయ ఉవాచ
ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమమ్ ।
అత ఊర్ధ్వం నరవ్యాఘ్రాః కిమకుర్వత పాండవాః । 1
జనమేజయుడు అడుగుతున్నాడు - ద్రౌపది యొక్క అపహరణ వలన ఎన్నో కష్టాలకు గురైన, సింహసమాన పరాక్రములయిన ఆ పాండవులు తరువాత ఏం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
ఏవం కృష్ణాం మోక్షయిత్వా వినిర్జిత్వా జయద్రథమ్ ।
ఆసాంచక్రే మునిగణైః ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు - "జనమేజయా! జయద్రథుని జయించి కృష్ణను విడిపించి తీసికొని వచ్చాక ధర్మరాజు మునులతో పాటుగా ఆసీనుడయ్యాడు. (2)
తేషాం మధ్యే మహర్షీణాం శృణ్వతామనుశోచతామ్ ।
మార్కండేయమిదం వాక్యమ్ అబ్రవీత్ పాండునందనః ॥ 3
మహర్షులందరూ కూడా పాండవులకు వచ్చిన కష్టాలను విని సంతాపం ప్రకటిస్తూండగా, పాండునందనుడైన యుధిష్ఠిరుడు మార్కండేయ మహామునిని ఉద్ధేశించి ఇలా అన్నాడు. (3)
యుధిష్ఠిర ఉవాచ
భగవన్ దేవర్షీణాం త్వం ఖ్యాతో భూతభవిష్యవిత్ ।
సంశయం పరిపృచ్ఛామి ఛింధి మే హృది సంస్థితమ్ ॥ 4
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - "భగవాన్! మీరు భూత భవిష్యత్తులు తెలిసినవారు. దేవర్షులలో చాలా ప్రసిద్ధులు. నా మనసులోని సందేహాన్ని అడుగుతున్నాను తీర్చండి. (4)
ద్రుపదస్య సుతా హ్యేషా వేదిమధ్యాత్ సముత్థితా ।
అయోనిజా మహాభాగా స్నుషా పాండోర్మహాత్మనః ॥ 5
ద్రుపదుని కూతురయిన ఈమె అగ్నికుండం నుండి అయోనిజయై జన్మించింది. సౌభాగ్యశాలిని. మహాత్ముడయిన పాండునికి కోడలు. (5)
మన్యే కాలశ్చ భగవన్ దైవం చ విధినిర్మితమ్ ।
భవితవ్యం చ భూతానాం యస్య నాస్తి వ్యతిక్రమః ॥ 6
భగవంతుడయిన కాలానికి, విధి నిర్మితమయిన దైవానికి ప్రాణుల యొక్క భవితవ్యానికి (జరుగబోయే ఘటనలకు) తిరుగులేదని అనుకుంటున్నాను. (6)
ఇమాం హి పత్నీమస్మాకం ధర్మజ్ఞాం ధర్మచారిణీమ్ ।
సంస్పృశేదీదృశో భావః శుచిం స్తైన్యమివానృతమ్ ॥ 7
కాకుంటే ధర్మజ్ఞురాలు, ధర్మపరాయణురాలు అయిన మా ఈ భార్య పట్ల అటువంటి భావం (అపహరించాలనే భావం) ఎలా కలుగుతుంది? ఇది ఎలా ఉందంటే సత్ప్రవర్తన కలవానిపై అబద్ధపు దొంగతనం ఆరోపించినట్లు ఉంది. (7)
న హి పాపం కృతం కించిత్ కర్మ వా నిందితం క్వచిత్ ।
ద్రౌపద్యా బ్రాహ్మణేష్వేవ ధర్మః సుచరితో మహాన్ ॥ 8
ఈమె ఎప్పుడూ కించిత్తు పాపమయినా చేయలేదు. నింద్యమైన పనులు కూడా చేయలేదు. బ్రాహ్మణుల పట్ల సేవా సత్కారాది మహా ధర్మాలనే ఈ ద్రౌపది ఆచరిస్తూ ఉంటుంది. (8)
తాం జహార బలాద్ రాజా మూఢబుద్ధిర్జయద్రథః ।
తస్యాః సంహరణాత్ పాపః శిరసః కేశపాతనమ్ ॥ 9
పరాజయం చ సంగ్రామే ససహాయః సమాప్తవాన్ ।
ప్రత్యాహృతా తథాస్మాభిః హత్వా తత్ సైంధవం బలమ్ ॥ 10
అటువంటి ఆమెను మూఢుడైన జయద్రథుడు బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఆ కారణంగానే ఆ పాపికి శిరోముండనం చేయబడింది. మేము అతనిని అనుచరులతో సహితంగా యుద్ధంలో ఓడించి, సింధు దేశపు సైన్యాన్ని సంహరించి ఈమెను తిరిగి తీసుకొనివచ్చాము. (9,10)
తద్ దారహరణం ప్రాప్తమ్ అస్మాభిరవితర్కితమ్ ।
జ్ఞాతిభిర్విప్రవాసశ్చ మిథ్యావ్యవసితైరియమ్ ॥ 11
ఊహించని రీతిగా భార్యాపహరణం అనే కష్టం మాకు కలిగింది. కపట వర్తనులైన జ్ఞాతుల చేత ఈ వనవాసం కలిగింది.(11)
అస్తి నూనం మయా కశ్చిదల్పభాగ్యతరో నరః ।
భవతా దృష్టపూర్వో వా శ్రుతపూర్వోఽపి వా భవేత్ ॥ 12
నావంటి నిర్భాగ్యుడైన పురుషుడు ఎవరైనా ఉన్నట్లు మీరు ఇంతకుముందు చూచిగాని వినిగాని ఉన్నారా? (12)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి యుధిష్ఠిర ప్రశ్నే త్రిసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 273 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర ప్రశ్నమను రెండువందల డెబ్బదిమూడవ అధ్యాయము. (273)