272. రెండువందల డెబ్బది రెండవ అధ్యాయము
(జయద్రథవిమోక్షణ పర్వము)
యుధిష్ఠిరుడు జయద్రథుని విడిపించుట - అతడు తపముచేసి శివుని వలన వరము పొందుట.
వైశంపాయన ఉవాచ
జయద్రథస్తు సంప్రేక్ష్య భ్రాతరావుద్యతావుభౌ ।
ప్రాధావత్ తూర్ణమవ్యగ్రః జీవితేప్సుః సుదుఃఖితః ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - అన్నదమ్ములిద్దరూ సన్నద్ధులై ఉండడం చూసి జయద్రథుడు మిక్కిలి దుఃఖంతో ప్రాణాలమీది ఆశతో తడబాటు లేకుండా అతివేగంగా పరుగెత్త సాగాడు. (1)
తం భీమసేనో ధావంతమవతీర్య రథాద్ బలీ ।
అభిద్రుత్య నిజగ్రాహ కేశపక్షే హ్యమర్షణః ॥ 2
బలిష్ఠుడైన భీముడు కోపావిష్టుడై రథం నుండి దిగి పరిగెడుతున్న అతనిని వెంబడించి అతని జుట్టుపట్టుకొన్నాడు. (2)
సముద్యమ్య చ తం భీమో నిష్పిపేష మహీతలే ।
శిరోగృహీత్వా రాజానం తాడయామాస చైవ హ ॥ 3
భీముడు అతనిని పైకెత్తి భూమిపై పడవేసి నలిపివేశాడు. తల పట్టుకొని ఎడాపెడా వాయించసాగాడు. (3)
పునః సంజీవమానస్య తస్యోత్పతితుమిచ్ఛతః ।
పదా మూర్ఘ్ని మహాబాహుః ప్రాహరద్ విలపిష్యతః ॥ 4
తస్య జానూ దదౌ భీమో జఘ్నే చైనమరత్నినా ।
స మోహమగమద్ రాజా ప్రహారవరపీడితః ॥ 5
మహాబాహువు అయిన భీముడు ఇంకా ప్రాణాలతో ఉండి పైకి లేవబోతున్న అతనిని తలపై కాలితో తన్నాడు. అరుస్తూ ఏడుస్తున్న అతనిని మోకాళ్లు రెండిటితో నొక్కిపట్టి పిడికిళ్లతో పొడిచాడు. ఆ గాఢమైన దెబ్బలకు ఓర్చుకోలేక బాధతో సింధురాజు మూర్ఛిల్లాడు. (4,5)
సరోషం భీమసేనం తు వారయామాస ఫాల్గునః ।
దుఃశలాయాః కృతే రాజా యత్ తదాహేతి కౌరవ ॥ 6
ఇంకా రోషంతో ఉన్న భీమసేనుని అర్జునుడు - "కురునందనా! దుశ్శలను గూర్చి మహారాజు చెప్పిన మాటను కూడా పాటించు" అని వారించాడు. (6)
భీమసేన ఉవాచ
నాయం పాపసమాచారః మత్తో జీవితుమర్హతి ।
కృష్ణాయాస్తదనర్హాయాః పరిక్లేష్టా నరాధమః ॥ 7
భీమసేనుడు అన్నాడు.
"ఈ నరాధముడు కష్టాలు పొందదగని ద్రౌపదికి కష్టం కలిగించాడు. ఈ మదించిన పాపి జీవించడానికి తగడు. (7)
కిం ను శక్యం మయా కర్తుం యద్ రాజా సతతం ఘృణీ ।
త్వం చ బాలిశయా బుద్ధ్యా సదైవాస్మాన్ ప్రబాధసే ॥ 8
కాని నేను ఏమి చేయగలను? ఆ యుధిష్ఠిరమహారాజు ఎప్పుడూ దయాళువే. నీవు కూడా అజ్ఞానంతో ఎప్పుడూ నన్ను బాధపెడుతూ ఉంటావు". (8)
ఏవముక్త్వా సటాస్తస్య పంచ చక్రే వృకోదరః ।
అర్థచంద్రేణ బాణేన కించిదబ్రువతస్తదా ॥ 9
ఇలా అని వృకోదరుడు అర్థచంద్రబాణంతో అతని జుట్టును పంచశిఖలుగా కత్తిరించివేశాడు. ఆ సమయంలో జయద్రథుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. (9)
వికత్థయిత్వా రాజానం తతః ప్రాపా వృకోదరః ।
జీవితుం చేచ్ఛసే మూఢ హేతుం మే గదతః శృణు ॥ 10
జయద్రథుని గట్టిగా నిందిస్తూ వృకోదరుడు ఇలా అన్నాడు - "మూఢుడా! నీవు జీవించదలచుకొంటే దానికి హేతుభూతమైన నేను చెప్పేది విను. (10)
దాసోఽస్మీతి తథా వాచ్యం సంసత్సు చ సభాసు చ ।
ఏవం తే జీవితం దద్యామ్ ఏష యుద్ధజితో విధిః ॥ 11
రాజసభలలో, పెద్దల సభలలో "నేను (యుధిష్ఠిరునికి) దాసుడను" అని చెప్పాలి. అలా అయితే నీకు ప్రాణదానం చేస్తాను. యుద్ధంలో జయించినవారి పద్ధతి ఇది". (11)
ఏవమస్త్వితి తం రాజా కృష్యమాణో జయద్రథః ।
ప్రోవాచ పురుషవ్యాఘ్రం భీమమాహవశోభినమ్ ॥ 12
నేలమీద ఈడ్చబడుతున్న సింధురాజు జయద్రథుడు యుద్ధరంగంలో శోభించే పురుషసింహుడైన భీమునికి "అలాగే జరుగుతుంది" అని చెప్పాడు. (12)
తత ఏనం విచేష్టంతం బద్ధ్వా పార్థో వృకోదరః ।
రథమారోపయామాస విసంజ్ఞం పాంసుగుంఠితమ్ ॥ 13
పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న అతనిని కుంతీకుమారుడు భీముడు బంధించి రథంపైకి ఎక్కించాడు. అతడు మట్టి కొట్టుకుపోయి చేష్టలు దక్కి ఉన్నాడు. (13)
తతస్తం రథమాస్థాయ భీమః పార్థానుగస్తదా ।
అభ్యేత్యాశ్రమమధ్యస్థమ్ అభ్యగచ్ఛద్ యుధిష్ఠిరమ్ ॥ 14
అనంతరం భీముడు రథం ఎక్కి అర్జునుడు తన్ను అనుసరిస్తూ ఉండగా ఆశ్రమం చేరుకొని, అక్కడ కూర్చున్న యుధిష్ఠిరుని సమీపించాడు. (14)
దర్శయామాస భీమస్తు తదవస్థం జయద్రథమ్ ।
తం రాజా ప్రాహసద్ దృష్ట్వా ముచ్యతామితి చాబ్రవీత్ ॥ 15
ఆ స్థితిలో ఉన్న జయద్రథుని భీముడు రాజుకు చూపించాడు. యుధిష్ఠిరుడు అతనిని చూచి పెద్దగా నవ్వి "విడిచిపెట్టు" అన్నాడు. (15)
రాజానం చాబ్రవీద్ భీమో ద్రౌపద్యాః కథ్యతామితి ।
దాసభావగతో హ్యేష పాండూనాం పాపచేతనః ॥ 16
భీముడు రాజుతో - "ఈ పాపచిత్తుడు పాండవులకు దాసుడయ్యాడని ద్రౌపదికి చెప్పండి" అన్నాడు. (16)
తమువాచ తతో జ్యేష్ఠః భ్రాతా సప్రణయం వచః ।
ముంచైనమధమాచారం ప్రమాణా యది తే వయమ్ ॥ 17
అప్పుడు పెద్దవాడయిన యుధిష్ఠిరుడు ప్రేమపూర్వకంగా అతనితో - "నా మాట మీద గౌరవముంటే ఈ నీచకర్ముని విడిచిపెట్టు" అన్నాడు. (17)
ద్రౌపదీ చాబ్రవీద్ భీమమ్ అభిప్రేక్ష్య యుధిష్ఠిరమ్ ।
దాసోఽయం ముచ్యతాం రాజ్ఞః త్వయా పంచసటః కృతః ॥ 18
ద్రౌపది కూడా యుధిష్ఠిరునికేసి చూస్తూ భీమునితో - నీవు పంచశిఖలు పెట్టిన ఇతడు రాజుగారికి దాసుడు కనుక వదిలివెయ్యి" అన్నది. (18)
స ముక్తోఽభ్యేత్య రాజానమ్ అభివాద్య యుధిష్ఠిరమ్ ।
వవందే విహ్వలో రాజన్ తాంశ్చ దృష్ట్వా మునీంస్తదా ॥ 19
జయద్రథుడు బంధవిముక్తుడై యుధిష్ఠిరమహారాజును సమీపించి అభివాదం చేశాడు. విహ్వలుడై అక్కడ ఉన్న మునులందరినీ చూచి వందనం చేశాడు. (19)
తమువాచ ఘృణీ రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
తథా జయద్రథం దృష్ట్వా గృహీతం సవ్యసాచినా ॥ 20
అర్జునుడు జయద్రథుని పట్టుకోగా దయాళువైన ధర్మపుత్రుడు యుధిష్ఠిరుడు అతనితో ఇలా అన్నాడు. (20)
అదాసో గచ్ఛ ముక్తోఽసి మైవం కార్షీః పునః క్వచిత్ ।
స్త్రీకామం వా ధిగస్తు త్వాం క్షుద్రః క్షుద్రసహాయవాన్ ॥ 21
ఏవంవిధం హి కః కుర్యాత్ త్వదన్యః పురుషాధమః ।
(కర్మ ధర్మవిరుద్ధం వై లోకదుష్టం చ కర్మ తే ।)
"నీవు ఇక్కడ దాసుడవు కావు. విడుదల పొందావు వెళ్లు. ఇంక ఎపుడూ ఇలా చేయకు. స్త్రీ కాముకుడవైన నిన్ను చీదరించుకొంటున్నాను. నీవు నీచుడవు. నీ సహాయకులూ నీచులే. ఇలాంటిపని పురుషాధముడైన నీవు తప్ప వేరెవరు చేస్తారు? (నీవు చేసినది ధర్మవిరుద్ధమైనపని లోకనింద్యమైనది కూడా)" (21 1/2)
గతసత్త్వమివ జ్ఞాత్వా కర్తారమశుభస్య తమ్ ॥ 22
సంప్రేక్ష్య భరతశ్రేష్ఠః కృపాం చక్రే నరాధిపః ।
ధర్మే తే వర్థతాం బుద్ధిః మా చాధర్మే మనః కృథాః ॥ 23
సాశ్వః సరథపాదాతః స్వస్తి గచ్ఛ జయద్రథ ।
అప్రాచ్యపు పనులు చేసే జయద్రథుడు ఇప్పుడు బలహీనుడయ్యాడని గుర్తించి భరతవంశశ్రేష్ఠుడు అయిన యుధిష్ఠిరమహారాజు అతనిని చూచి జాలిపడ్డాడు. "జయద్రథా! నీ బుద్ధి ధర్మమునందే వృద్ధిపొందును గాక, అధర్మము మీద మనసు పెట్టకు. గుఱ్ఱాలతో, రథాలతో, కాల్బలంతో సుఖంగా వెళ్లు" అన్నాడు. (22,23 1/2)
ఏవముక్తస్తు సవ్రీడం తూష్ణీం కించిదవాఙ్ముఖః ॥ 24
జగామ రాజన్ దుఃఖార్తో గంగాద్వారాయ భారత ।
స దేవం శరణం గత్వా విరూపాక్షముమాపతిమ్ ॥ 25
తపశ్చచార విపులం తస్య ప్రీతో వృషధ్వజః ।
బలిం స్వయం ప్రత్యగృహ్ణాత్ ప్రీయమాణస్త్రిలోచనః ॥ 26
రాజా! యుధిష్ఠిరుడు ఇలా అనగానే జయద్రథుడు సిగ్గుతో కొద్దిగా ముఖం దించుకొని మౌనంగా వెళ్లిపోయాడు. అతడు దుఃఖార్తుడై గంగా ద్వారానికి వెళ్లి విరూపాక్షుడు ఉమాపతి అయిన దేవుని శరణు చొచ్చి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రీతుడయ్యాడు. ప్రీతుడయిన త్రిలోచనుడు స్వయంగా పూజను స్వీకరించాడు. (24-26)
వరం చాస్మై దదౌ దేవః స జగ్రాహ చ తచ్ఛృణు ।
సమస్తాన్ సరథాన్ పంచ జయేయం యుధి పాండవాన్ ॥ 27
ఇతి రాజాబ్రవీద్ దేవం నేతి దేవస్తమబ్రవీత్ ।
అజయ్యాంశ్చాప్యవధ్యాంశ్చ వారయిష్యసి తాన్ యుధి ॥ 28
ఋతేఽర్జునం మహాబాహుం నరం నామ సురేశ్వరమ్ ।
బదర్యాం తప్తతపసం నారాయణసహాయకమ్ ॥ 29
మహాదేవుడు అతనికి వరమిచ్చాడు. అతడు దానిని గ్రహించాడు. అదెలాగో విను, జయద్రథుడు మహాదేవుని - "రథసహితులైన పాండవులైదుగురను యుద్ధంలో నేను జయించాలి" అని అడిగాడు. అలా కాదని శివుడు అతనికి బదులిచ్చాడు. "వారు అజేయులు. అవధ్యులు కూడా మహాబాహువయిన అర్జునుని తప్ప మిగిలిన వారిని యుద్ధంలో నీవు అడ్డుకొనగలవు. అతడు నరుడనే పేరుతో ఉన్న ఇంద్రుడు. బదరికాశ్రమంలో తపస్సు చేసిన నారాయణునికి సహాయకుడు. (27-29)
అజితం సర్వలోకానాం దేవైరపి దురాసదమ్ ।
మయా దత్తం పాశుపతం దివ్యమప్రతిమం శరమ్ ।
అవాప లోకపాలేభ్యో వజ్రాదీన్ స మహాశరాన్ ॥ 30
అతడు సమస్తలోకాలకు జయింపశక్యం కానివాడు. దేవతలకు కూడా సాధ్యం కానివాడు. దివ్యమైన సాటిలేని పాశుపతబాణాన్ని అతనికి నేను ప్రసాదించాను. అతడు ఇంకా లోకపాలురనుండి వజ్రాది దివ్య శరాలను పొంది ఉన్నాడు. (30)
దేవదేవో హ్యనంతాత్మా విష్ణుః సురగురుః ప్రభుః ।
ప్రధానపురుషోఽవ్యక్తో విశ్వాత్మా విశ్వమూర్తిమాన్ ॥ 31
(ఇక నరరూపుడైన అర్జునునికి సహాయకుడైన నారాయణుని మహిమను వర్ణిస్తాను విను). నారాయణ భగవానుడు దేవతలకెల్ల దేవుడు. అనంతస్వరూపుడు. సర్వవ్యాపి, దేవగురువు, సర్వసమర్థుడు. ప్రధాన పురుషుడు, అవ్యక్తుడు, విశ్వాత్మ, విశ్వమూర్తి. (31)
యుగాంతకాలే సంప్రాప్తే కాలాగ్నిర్దహతే జగత్ ।
సపర్వతార్ణవద్వీపం సశైలవనకాననమ్ ॥ 32
యుగాంతకాలం వచ్చినపుడు పర్వతాలు, సముద్రాలు, ద్వీపాలతోపాటు, కొండలు, వనాలు, అడవులతో సహితంగా ఈ జగత్తునంతా కాలాగ్ని దహించివేస్తుంది. (32)
నిర్దహన్ నాగలోకాంశ్చ పాతాలతలచారిణః ।
అథాంతరిక్షే సుమహత్ నానావర్ణాః పయోధరాః ॥ 33
పాతాళతలంలో చరించే నాగలోకాలను సైతం ఆ అగ్ని దహించివేస్తుంది. అప్పుడు అంతరిక్షంలో గొప్పవైన అనేకవర్ణాల మేఘాలు వ్యాపిస్తాయి. (33)
ఘోరాస్వరా వినదినః తడిన్మాలావలంబినః ।
సముత్తిష్ఠన్ దిశః సర్వా వివర్షంతః సమంతతః ॥ 34
ఘోరంగా గర్జిస్తూ మెఱుపుల పంక్తులతో కూడిన ఆ మేఘాలు దిక్కులంతటా నిండిపోయి ఎల్లెడలా వర్షిస్తాయి. (34)
తతోఽగ్నిం నాశయామాసుః సంవర్తాగ్నినియామకాః ।
అక్షమాత్రైశ్చ ధారాభిః తిష్ఠంత్యాపూర్య సర్వశః ॥ 35
అప్పుడు ప్రళయకాలాగ్నిని కూడా అవి చల్లార్చివేస్తాయి. సంవర్తాగ్నిని నియంత్రించగలిగే ఆ మేఘాలు పొడవైన పాముల వంటి ధారలతో అన్నివైపుల ముంచెత్తుతాయి.(35)
ఏకార్ణవే తదా తస్మిన్ ఉపశాంతచరాచరే ।
నష్టచంద్రార్కపవనే గ్రహనక్షత్రవర్జితే ॥ 36
చరాచరజగత్తు నశించిపోతుంది. సూర్యచంద్రులు, వాయువు విలీనమయిపోతాయి. గ్రహ నక్షత్రాలు ఉండవు. మొత్తం అంతా మహాసముద్రం అయిపోతుంది.(36)
చతుర్యుగసహస్రాంతే సలిలేనాప్లుతా మహీ ।
తతో నారాయణాఖ్యస్తు సహస్రాక్షః సహస్రపాత్ ॥ 37
సహస్రశీర్షా పురుషః స్వప్తుకామస్త్వతీంద్రియః ।
ఫటాసహస్రవికటం శేషం పర్యంకభాజనమ్ ॥ 38
సహస్రమివ తిగ్మాంశుసంఘాతమమితద్యుతిమ్ ।
కుందేందు హారగోక్షీరమృణాలకుముదప్రభమ్ ॥ 39
తత్రాసౌ భగవాన్ దేవః స్వపంజలనిధౌ తదా ।
నైశేస తమసా వ్యాప్తాం స్వాం రాత్రిం కురుతే విభుః ॥ 40
వేయి మహాయుగాలు పరిసమాప్తమయ్యాక (పైన చెప్పిన) మహార్ణవ జలంలో ఈ భూమి మునిగిపోతుంది. అప్పుడు సహస్రాక్షుడు, సహస్రపాదుడు, సహస్ర శీర్షుడు, అతీంద్రియుడు అయిన నారాయణుడు అనే పేరు గల భగవానుడు నిద్రించగోరి నిశాంధకారం వ్యాపించిన కాళరాత్రిని తనకోసం సృష్టించుకొంటాడు. మొల్లపూలు, చంద్రుడు, ముత్యాలహారం, ఆవుపాలు, తామరతూడు, తెల్లకలువల వంటి తెల్లని కాంతి కలిగిన వేయి సూర్యులు ఒక్కచోట కూడినట్లున్న మహాకాంతితో వెలుగొందుతున్న వేయి పడగలు విచ్చుకొన్న శేషనాగుని పర్యంకంగా చేసుకొని అప్పుడు ఆ జలనిధిలో దేవదేవుడు పవ్వళిస్తాడు. (36-40)
సత్త్వోద్రేకాత్ ప్రబుద్ధస్తు శూన్యం లోకమపశ్యత ।
ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి ॥ 41
అనంతరం సత్త్వగుణప్రవృద్ధి చేత మేల్కొనిన భగవానుడు ఈ లోకమంతా శూన్యంగా ఉండడం చూశాడు. నారాయణుని గూర్చి ఈ సందర్భంగా ఈ శ్లోకాన్ని (మహర్షిగణం) చెపుతూ ఉంటారు. (41)
నారాస్తత్తనవ ఇత్యపాం నామ శుశ్రుమ ।
అయనం తేన చైవాస్తే తేన నారాయణః స్మృతః ॥ 42
"జలం భగవానుని శరీరం. అందుకే జలానికి "నారాః" అనే పేరు వినబడుతోంది. నారములు అయనంగా (గృహంగా) ఉన్నవాడు కనుక లేక నారములతో కలిసి ఉంటాడు కనుక అతడు నారాయణుడు అయినాడు". (42)
ప్రధ్యానసమకాలం తు ప్రజాహేతోః సనాతనః ।
ధ్యాతమాత్రే తు భగవన్నాభ్యాం పద్మః సముత్థితః ॥ 43
ప్రాణులను సృష్టించడానికి నారాయణుడు తీవ్రంగా ధ్యానించాడు. ఆ ధ్యాన మాత్రం చేతనే భగవానుని నాభినుండి సనాతనమైన కమలం పుట్టింది. (43)
తత్తశ్చతుర్ముఖో బ్రహ్మా నాభిపద్మాద్ వినిఃసృతః ।
తత్రోపవిష్టః సహసా పద్మే లోకపితామహః ॥ 44
శూన్యం దృష్ట్వా జగత్ కృత్స్నం మానసానాత్మనః సమాన్ ।
తతో మరీచిప్రముఖాన్ మహర్షీనసృజన్నవ ॥ 45
ఆ నాభికమలం నుండి చతుర్మఖబ్రహ్మ ఉద్భవించాడు. లోకపితామహుడు ఆ పద్మంలో ఆసీనుడై జగత్తంతా శూన్యంగా ఉండడం చూసి వెంటనే తనతో సమానులైన మరీచి ప్రముఖులైన తొమ్మిదిమంది మానసపుత్రులను సృజించాడు. (44,45)
తేఽసృజన్ సర్వభూతాని త్రసాని స్థావరాణి చ ।
యక్షరాక్షసభూతాని పిశాచోరగమానుషాన్ ॥ 46
ఆ మహర్షులు స్థావర జంగమరూపమైన సమస్త ప్రాణులను, యక్షులను, రాక్షసులను, భూతాలను, పిశాచాలను, నాగులను, మనుష్యులను సృష్టించారు. (46)
సృజ్యతే బహ్మమూర్తిస్తు రక్షతే పౌరుషీ తనుః ।
రౌద్రీభావనే శమయేత్ తిస్రోఽవస్థౌః ప్రజాపతేః ॥ 47
భగవానుడు బ్రహ్మరూపంతో సృజిస్తాడు. పురుషోత్తమ శరీరంతో రక్షిస్తాడు. రుద్రస్వరూపంతో సంహరిస్తాడు. ప్రజాపతి అయిన భగవానునికి ఈ మూడు అవస్థలూ ఉన్నాయి. (47)
న శ్రుతం తే సింధుపతే విష్ణోరద్భుతకర్మణః ।
కథ్యమానాని మునిభిః బ్రాహ్మణైర్వేదపారగైః ॥ 48
సింధురాజా! వేద పారంగతులైన, బ్రహ్మజ్ఞానులైన మునులు వర్ణించే విష్ణువు యొక్క అద్భుత కృత్యాలను గూర్చి నీవు వినలేదు. (48)
జలేన సమనుప్రాప్తే సర్వతః పృథివీతలే ।
తదా చైకార్ణవే తస్మిన్ ఏకాకాశే ప్రభుశ్చరన్ ॥ 49
నిశాయామివ ఖద్యోతః ప్రావృట్ కాలే సమంతతః ।
ప్రతిష్ఠానాయ పృథివీం మార్గమాణస్తదాభవత్ ॥ 50
భూమి అంతా నీటిలో మునిగిపోయి మహార్ణవంగా మారిపోయినపుడు ఆకాశం ఒక్కటే కనిపిస్తూంటే భగవానుడు వర్షాకాలపు రాత్రి మిణుగురుపురుగు అన్ని వైపులకు ఎగురుతున్నట్లుగా ఆ నీటిలో అన్నివైపుల సంచరిస్తూ, స్థిరంగా ప్రతిష్ఠించడానికి అన్వేషించసాగాడు. (49,50)
జలే నిమగ్నాం గాం దృష్ట్వా చోద్ధర్తుం మనసేచ్ఛతి ।
కిం ను రూపమహం కృత్వా సలిలాదుద్ధరే మహీమ్ ॥ 51
నీటిలో మునిగిన భూమిని చూచి భగవానుడు దానిని ఉద్ధరించాలని మనసులోనే సంకల్పించుకొన్నాడు. ఏ రూపం ధరించి నీటినుండి భూమిని ఉద్ధరించాలి? అని ఆలోచించాడు. (51)
ఏవం సంచింత్య మనసా దృష్ట్వా దివ్యేన చక్షుషా ।
జలక్రీడాభిరుచితం వారాహం రూపమస్మరత్ ॥ 52
ఈ రీతిగా మనసులోనే ఆలోచించి, దివ్యదృష్టితో చూచి నీటిలో క్రీడించడానికి యోగ్యమైనది వరాహమే అని ఆ రూపాన్ని స్మరించాడు. (52)
కృత్వా వరాహవపుషం వాఙ్మయం వేదసమ్మితమ్ ।
దశయోజనవిస్తీర్ణమ్ ఆయతం శతయోజనమ్ ॥ 53
మహాపర్వతవర్ష్మాభం తీక్ష్ణదంష్ట్రం ప్రదీప్తిమత్ ।
మహామేఘౌఘనిర్ఘోషం నీలజీమూతసంనిభమ్ ॥ 54
భగవానుడు వేదసమ్మితమైన, వైదిక వాఙ్మయ రూపమైన వరాహ శరీరాన్ని ధరించాడు. ఆ దేహం మహాపర్వతంలా వందయోజనాల పొడవు, పదియోజనాల విస్తీర్ణం కలిగి, దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. వాడికోరలతో, నీలజీమూతసన్నిభమై, మహామేఘర్జనలవంటి ధ్వని కలిగి ఉంది. (53,54)
భూత్వా యజ్ఞవరాహో వై అపః సంప్రావిశత్ ప్రభుః ।
దంష్ట్రేణైకేన చోద్ధృత్య స్వే స్థానే న్యవిశన్మహీమ్ ॥ 55
ఆ రీతిగా భగవానుడు యజ్ఞవరాహమూర్తియై నీటిలో ప్రవేశించాడు. ఒక కోరతో పైకెత్తి భూమిని స్వస్థానంలో ఉంచాడు. (55)
పునరేవ మహాబాహుః అపూర్వాం తనుమాశ్రితః ।
నరస్య కృత్యార్థతనుం సింహస్యార్థతనుం ప్రభుః ॥ 56
దైత్యేంద్రస్య సభాం గత్వా పాణిం సంస్పృశ్య పాణినా ।
దైత్యానామాదిపురుషః సురారిర్దితినందనః ॥ 57
దృష్ట్వా చాపూర్వపురుషం క్రోధాత్ సంరక్తలోచనః ।
ఆపై మహాబాహువు అయిన భగవానుడు అర్థశరీరం నరునిగా, అర్థశరీరం సింహంగా అపూర్వమైన శరీరాన్ని ధరించి చేతులు రెండూ ఒకదానితో ఒకటి అప్పళిస్తూ దైత్యరాజు సభకు వెళ్లాడు. దైత్యులందరికీ ఆదిపురుషుడు, దేవతలకు శత్రువు అయిన దితినందనుడు హిరణ్యకశిపునకు ఆ అపూర్వపురుషుని చూచి క్రోధంతో కన్నులు ఎఱ్ఱబడ్డాయి. (56,57 1/2)
శూలోద్యతకరః స్రగ్వీ హిరణ్యకశిపుస్తదా ॥ 58
మేఘస్తనితనిర్ఘోషః నీలాభ్రచయసంనిభః ।
దేవారిర్దితిజో వీరః నృసింహం సముపాద్రవత్ ॥ 59
కారుమబ్బుల వంటి శరీరచ్ఛాయ కలిగిన వీరుడు, దేవతల శత్రువు, దితికుమారుడు అయిన హిరణ్యకశిపుడు శూలం చేతితో ఎత్తిపట్టుకొని, మెడలో పూలమాల ధరించి మేఘగర్జన వంటి హుంకారంతో నృసింహుని మీద దాడి చేశాడు. (58,59)
సముపేత్య తతస్తీక్ష్ణైఃమృగేంద్రేణ బలీయసా ।
నారసింహేన వపుషా దారితః కరజైర్భృశమ్ ॥ 60
బలవంతుడు, మృగేంద్రస్వరూపుడు అయిన భగవానుడు అతనిని సమీపించి నరసింహాకృతితో గోళ్లతో మిక్కిలిగా చీరేశాడు. (60)
ఏవం నిహత్య భగవాన్ దైత్యేంద్రం రిపుఘాతినమ్ ।
భూయోఽన్యః పుండరీకాక్షః ప్రభుర్లోకహితాయ చ ॥ 61
ఈ రీతిగా శత్రుఘాతకుడయిన దైత్యేంద్రుని భగవానుడు సంహరించాడు. ఆ కమలనయనుడు లోకహితం కొఱకు తిరిగి ఇంకొక రూపంలో ప్రకటమయ్యాడు. (61)
కశ్యపస్యాత్మజః శ్రీమాన్ అదిత్యా గర్భధారితః ।
పూర్ణే వర్షసహస్రే తు ప్రసూతా గర్భముత్తమమ్ ॥ 62
శ్రీమంతుడయిన నారాయణుడు కశ్యపునికి పుత్రునిగా జన్మించాడు. అదితి అతనిని వేయి సంవత్సరాలు పూర్తిగాగర్భంలో ధరించి ఉత్తముడైన బాలకునిగా ప్రసవించింది. (62)
దుర్దినాంభోదసదృశో దీప్తాక్షో వామనాకృతిః ।
దండీ కమండలుధరః శ్రీవత్సోరసి భూషితః ॥ 63
ఆ వామనాకారుడు వర్షాకాలపు మేఘంలా నల్లగా, మెరుస్తున్న కన్నులతో దండాన్ని, కమండలువును ధరించి, ఎదపై శ్రీవత్సచిహ్నంతో శోభిస్తున్నాడు. (63)
జటీ యజ్ఞోపవీతీ చ భగవాన్ బాలరూపధృక్ ।
యజ్ఞవాటం గతః శ్రీమాన్ దానవేంద్రస్య వై తదా ॥ 64
శిఖ,యజ్ఞోపవీతం కలిగి బాలరూపధారి శ్రీమంతుడు అయిన భగవానుడు అపుడు దానవేంద్రుని యజ్ఞవాటికకు వెళ్లాడు. (64)
బృహస్పతిసహాయోఽసౌ ప్రవిష్టో బలినో మఖే ।
తం దృష్ట్వా వామనతనుం ప్రహృష్టో బలిరబ్రవీత్ ॥ 65
అతడు బృహస్పతి సహాయంతో బలియొక్క యజ్ఞమండపాన్ని ప్రవేశించాడు. ఆ వామనుని చూచి ముచ్చటపడి బలి ఇలా అడిగాడు. (65)
ప్రీతోఽస్మి దర్శనే విప్ర బ్రూహి త్వం కిం దదాని తే ।
ఏవముక్తస్తు బలినా వామనః ప్రత్యువాచ హ ॥ 66
స్వస్తీత్యుక్త్వా బలిం దేవః స్మయమానోఽభ్యభాషత ।
మేదినీం దానవపతే దేహి మే విక్రమత్రయమ్ ॥ 67
"విప్రుడా! నిన్ను చూడగానే సంతోషం కలిగింది చెప్పు. నీకేమి ఇవ్వమంటావు?" బలి ఇలా అడగగానే వామనుడు బలికి స్వస్తి అని చెప్పి చిరునవ్వుతో "దానవపతీ! నాకు మూడు అడుగుల నేల ఇవ్వు" అని సమాధానమిచ్చాడు.(66,67)
బలిర్దదౌ ప్రసన్నాత్మా విప్రాయామితతేజసే ।
తతో దివ్యాద్భుతతమం రూపం విక్రమతో హరేః ॥ 68
బలి ప్రసన్నచిత్తుడై మహాతేజశ్శాలి అయిన ఆ విప్రునికి అతడు అడిగినది ఇచ్చాడు. భూమిని కొలిచే ఆ సమయంలో విక్రమించిన హరియొక్క రూపం దివ్యంగా, మహాద్భుతంగా ఉంది.(68)
విక్రమైస్త్రిభిరక్షోభ్యః జహారాశు స మేదినీమ్ ।
దదౌ శక్రాయ చ మహీం విష్ణుర్దేవః సనాతనః ॥ 69
అక్షోభ్యుడు, సనాతనుడు, అయిన ఆ విష్ణుదేవుడు వెంటనే మూడు అడుగులతోనే భూమిని అంతా హరించివేసి ఆ భూమిని ఇంద్రునికి ఇచ్చాడు. (69)
ఏష తే వామనో నామ ప్రాదుర్భావః ప్రకీర్తితః ।
తేన దేవాః ప్రాదురాసన్ వైష్ణవం చోచ్యతే జగత్ ॥ 70
వామనావతారం గురించి వర్ణించి చెప్పాను నీకు. అతని వలననే దేవతలు పుట్టారు. ఈ జగత్తు అంతా కూడా అతని వలన పుట్టింది కనుక వైష్ణవమని పిలువబడుతుంది.(70)
అసతాం నిగ్రహార్థాయ ధర్మసంరక్షణాయ చ ।
అవతీర్ణో మనుష్యాణామ్ అజాయత యదుక్షయే ॥ 71
స ఏవం భగవాన్ విష్ణుః కృష్ణేతి పరికీర్త్యతే ।
అనాద్యంతమజం దేవం ప్రభుం లోకనమస్కృతమ్ ॥ 72
దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని సంరక్షించడానికి ఆ విష్ణుభగవానుడే మనుష్యుల మధ్యలో అవతరించి యదువంశంలో పుట్టాడు. కృష్ణునిగా కీర్తింపబడుతున్నాడు. ఆ దేవుడు అనాది, అనంతుడు, అజుడు, లోకవంద్యుడు. (71,72)
యం దేవం విదుషో గాంతి తస్య కర్మాణి సైంధవ ।
యామాహురజితం కృష్ణం శంఖచక్రగదాధరమ్ ॥ 73
శ్రీవత్సధారిణం దేవం పీతకౌశేయవాససమ్ ।
ప్రధానః సోఽస్త్రవిదుషాం తేన కృష్ణేన రక్ష్యతే ॥ 74
సైంధవా! పండితులు అతనిని కొనియాడుతారు. అతడు చేసిన పనులను కీర్తిస్తారు. అజేయుడు, శంఖచక్రగదాధారి, శ్రీవత్సధరుడు, పీతకౌశేయవాసుడు అయిన ఆ దేవుని కృష్ణునిగా పిలుస్తారు. ఆ కృష్ణుడే అస్త్రవిద్యావేత్తలలో శ్రేష్ఠుడైన అర్జునుని రక్షిస్తున్నాడు. (73,74)
సహాయః పుండరీకాక్షః శ్రీమానతులవిక్రమః ।
సమానస్యందనే పార్థమ్ ఆస్థాయ పరవీరహా ॥ 75
శత్రు సంహారకుడు, శ్రీమంతుడు, సాటిలేని పరాక్రమం కలవాడు అయిన పుండరీకాక్షుడు పార్థుని తనతోపాటుగా రథంపై కూర్చోపెట్టుకొని సహాయం చేస్తున్నాడు. (75)
న శక్యతే తేన జేతుం త్రిదశైరపి దుఃసహః ।
కః పునర్మానుషో భావః రణే పార్థం విజేష్యతి ॥ 76
ఈ కారణంగానే అతనిని జయించడానికి సాధ్యం కాదు. దేవతలకు కూడా అతడు తేరిచూడరానివాడే. ఇక యుద్ధంలో పార్థుని జయించగల మానవుడు ఎవడు? (76)
తమేకం వర్జయిత్వా తు సర్వం యౌధిష్ఠిరం బలమ్ ।
చతురః పాండవాన్ రాజన్ దినైకం జేష్యసే రిపూన్ ॥ 77
రాజా! అతనిని ఒక్కనిని విడిచి, మిగిలిన యుధిష్ఠిరుని సైన్యం, అంతటినీ శత్రువలయిన నలుగురు పాండవులను ఒకరోజు జయించగలవు. (77)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా నృపతిం సర్వపాపహరో హరః ।
ఉమాపతిః పశుపతిః యజ్ఞహా త్రిపురార్దనః ॥ 78
వామనైర్వికటైః కుబ్జైః ఉగ్రశ్రవణదర్శనైః ।
వృతః పారిషదైర్ఘోరైః నానాప్రహరణోద్యతైః ॥ 79
త్య్రంబకో రాజశార్దూల భగనేత్రనిపాతనః ।
ఉమాసాహాయో భగవాన్ తత్రైవాంతరధీయత ॥ 80
వైశంపాయనుడు చెపుతున్నాడు - "రాజోత్తమా! సైంధవునికి ఈ రీతిగా చెప్పి సర్వపాపహరుడు, ఉమాపతి, పశుపతి, యజ్ఞధ్వంసి, త్రిపుర సంహారి, త్రినేత్రుడు, భగనేత్రనిపాతకుడు, అయిన శివుడు - వామనులు, వికటులు, కుబ్జులు, ఉగ్ర శ్రవణలోచనులు, నానారకాల ఆయుధాలు ధరించినవారు అయిన తన పార్షదులతో కలిసి ఉమాసహాయుడై అక్కడే అంతర్ధానమయ్యాడు. (78-80)
జయద్రథోఽపి మందాత్మా స్వమేవ భవనం యయౌ ।
పాండవాశ్చ వనే తస్మిన్ న్యవసన్ కామ్యకే తథా ॥ 81
మూఢబుద్ధి అయిన జయద్రథుడు తన ఇంటికి వెళ్లాడు. పాండవులు కూడా ఆ కామ్యకవనంలోనే అలాగే నివసించారు. (81)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి జయద్రథవిమోక్షణపర్వణి ద్విసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 272 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున జయద్రథవిమోక్షణపర్వము అను ఉపపర్వమున రెండువందల డెబ్బది రెండవ అధ్యాయము.(272)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 81 1/2 శ్లోకాలు.)