286. రెండువందల ఎనుబది ఆరవ అధ్యాయము
రాముడు కుంభకర్ణుని యుద్ధమునకు పంపుట.
మార్కండేయ ఉవాచ
తతః ప్రహస్తః సహసా సమభ్యేత్య విభీషణమ్ ।
గదయా తాడయామాస వినద్య రణకర్కశః ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - అంతలో యుద్ధ కర్కశుడయిన ప్రహస్తుడు అకస్మాత్తుగా విభీషణుని సమీపించి అరుస్తూ అతనిని గదతో మోదాడు. (1)
స తయాభిహతో ధీమాన్ గదయా భీమవేగయా ।
నాకంపత మహాబాహుః హిమవానివ సుస్థిరః ॥ 2
భయంకరమైన వేగంతో వచ్చిపడిన ఆ గదాప్రహారాన్ని తట్టుకొని మహాబాహువు, ధీమంతుడు అయిన ఆ విభీషణుడు హిమవంతునిలా చలించకుండా సుస్థిరుడై నిలిచాడు. (2)
తతః ప్రగృహ్య విపులాం శతఘంటాం విభీషణః ।
అనుమంత్య్ర మహాశక్తిం చిక్షేపాస్య శిరః ప్రతి ॥ 3
తరువాత విభీషణుడు వెడల్పయిన శతఘంటలు కల ఒక మహాశక్తిని చేతిలోకి తీసుకొని అభిమంత్రించి, ఆ ప్రహస్తుని శిరసుపైకి విసిరాడు. (3)
పతంత్యా స తయా వేగాద్ రాక్షసోఽశనివేగయా ।
హృతోత్తమాంగో దదృశే వాతరుగ్ణ ఇవ ద్రుమః ॥ 4
పిడుగుపాటులా అతివేగంగా పడిన ఆ మహాశక్తి యొక్క వేగం చేత తలతెగి ఆ ప్రహస్తుడు ఝంఝామారుతానికి తల తెగిపడిన వృక్షంలా కనిపించాడు. (4)
తం దృష్ట్వా నిహతం సంఖ్యే ప్రహస్తం క్షణదాచరమ్ ।
అభిదుద్రావ ధూమ్రాక్షః వేగేన మహతా కపీన్ ॥ 5
రాక్షసుడయిన ఆ ప్రహస్తుడు యుద్ధంలో చనిపోవడం చూసి ధూమ్రాక్షుడు మహావేగంతో వానరులవైపు పరుగెత్తుకొని వచ్చాడు. (5)
తస్య మేఘోపమం సైన్యమ్ ఆపతద్ భీమదర్శనమ్ ।
దృష్ట్వైవ సహసా దీర్ణా రణే వానరపుంగవాః ॥ 6
కారుమబ్బుల్లా భయంకరంగా వచ్చిపడుతున్న ఆ సైన్యాన్ని చూసి, వానరశ్రేష్ఠులందరూ భయంతో యుద్ధభూమిలో చెల్లాచెదరైపోయారు. (6)
తతస్తాన్ సహసా దీర్ణాన్ దృష్ట్వా వానరపుంగవాన్ ।
నిర్యయౌ కపిశార్దూలో హనూమాన్ మారుతాత్మజః ॥ 7
అప్పుడు చెల్లాచెదరైపోయిన ఆ వానరశ్రేష్ఠులను చూసి కపిపుంగవుడు, మారుతాత్మజుడు అయిన హనుమంతుడు వెంటనే ముందుకు వచ్చాడు. (7)
తం దృష్ట్వావస్థితం సంఖ్యే హరయః పవనాత్మజమ్ ।
మహత్యా త్వరయా రాజన్ సంన్యవర్తంత సర్వశః ॥ 8
రాజా! పవనతనయుడు యుద్ధంలో నిలబడడం చూచిన వానరులందరూ మహోత్సాహంతో అన్నివైపుల నుండి తిరిగి వచ్చారు. (8)
తతః శబ్దో మహానాసీత్ తుములో లోమహర్షణః ।
రామరావణసైన్యానామ్ అన్యోన్యమభిధావతామ్ ॥ 9
రామరావణుల సైన్యం యొక్క దాడులతో అక్కడ ఘోరమైన గగుర్పాటు కలిగించే గొప్ప శబ్దం పుట్టింది. (9)
తస్మిన్ ప్రవృత్తే సంగ్రామే ఘోరే రుధిరకర్దమే ।
ధూమ్రాక్షః కపిసైన్యం తద్ ద్రావయామాస పత్రిభిః ॥ 10
ఆ ఘోరసంగ్రామం జరుగుతూంటే భూమి అంతా రక్తంతో బురదగా మారిపోయింది. ధూమ్రాక్షుడు బాణాలతో వానరసైన్యాన్ని తరిమి కొట్టసాగాడు. (10)
తం స రక్షో మహామాత్రమ్ ఆపతంతం సపత్నజిత్ ।
ప్రతిజగ్రాహ హనుమాన్ తరసా పవనాత్మజః ॥ 11
శత్రువులపై విజయం సాధించే మారుతాత్మజుడు హనుమంతుడు అలా విరుచుకుపడుతున్న మహాకాయుడైన ఆ రాక్షసుని అడ్డుకున్నాడు. (11)
తయోర్యుద్ధమభూద్ ఘోరం హరిరాక్షసవీరయోః ।
జిగీషతోర్యుధాన్యోన్యమ్ ఇంద్రప్రహ్లాదయోరివ ॥ 12
ఆ వానరరాక్షసవీరులు ఇద్దరిమధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో జయాభిలాషులైన వారు ఇంద్ర ప్రహ్లాదులవలె పోరాడసాగారు. (12)
గదాభిః పరిఘైశ్చైవ రాక్షసో జఘ్నివాన్ కపిమ్ ।
కపిశ్చ జఘ్నివాన్ రక్షః సస్కంధవిటపైర్ర్దుమైః ॥ 13
గదలతో పరిఘలతో రాక్షసుడు వానరుని గాయపరిస్తే, వానరుడు కాండాలు, కొమ్మలు గల చెట్లతో అతనిని గాయపరిచాడు. (13)
తతస్తమతికోపేన సాశ్వం సరథసారథిమ్ ।
ధూమ్రాక్షమవధీత్ క్రుద్ధః హనూమాన్ మారుతాత్మజః ॥ 14
ఆ తరువాత పవనసుతుడు హనుమంతుడు కోపించి గుర్రాలతో, సారథితో, రథంతో సహితంగా ధూమ్రాక్షుని సంహరించాడు. (14)
తతస్తం నిహతం దృష్ట్వా ధూమ్రాక్షం రాక్షసోత్తమమ్ ।
హరయో జాతవిస్రంభాః జఘ్నురన్యే చ సైనికాన్ ॥ 15
రాక్షసవీరుడయిన ధూమ్రాక్షుడు చనిపోవడం చూసిన వానరులకు, భల్లూకాలకు ఆత్మవిశ్వాసం కలిగి, వారు కూడా రాక్షససైనికులను హతమార్చారు. (15)
తే వధ్యమానా హరిభిః బలిభిర్జితకాశిభిః ।
రాక్షసా భగ్నసంకల్పాః లంకామభ్యపతన్ భయాత్ ॥ 16
విజయోన్మత్తులు, బలిష్ఠులు అయిన వానరుల చేతిలో చావుదెబ్బ తిన్న రాక్షసులు తమ ఊహలు తారుమారుకాగా భయాతురులై లంకలోనికి పరుగులు తీశారు. (16)
తేఽభిపత్య పురం భగ్నాః హతశేషా నిశాచరాః ।
సర్వం రాజ్ఞే యథావృత్తం రావణాయ న్యవేదయన్ ॥ 17
చావగా మిగిలిన ఆ రాక్షసులు భగ్నమనోరథులై లంకను ప్రవేశించి, మహారాజు రావణునికి అంతా జరిగినది జరిగినట్లుగా విన్నవించారు. (17)
శ్రుత్వా తు రావణస్తేభ్యః ప్రహస్తం నిహతం యుధి ।
ధూమ్రాక్షం చ మహేష్వాసం ససైన్యం వానరర్షభైః ॥ 18
సుదీర్ఘమివ నిఃశ్వస్య సముత్పత్య వరాసనాత్ ।
ఉవాచ కుంభకర్ణస్య కర్మకాలోఽయమాగతః ॥ 19
ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు తమ సైన్యంతో సహితంగా యుద్ధంలో వానరపుంగవుల చేతిలో చనిపోయారని వారివలన విని రావణుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతడు శ్రేష్ఠమైన సింహాసనం మీద నుండి ఒక్క ఉదుటున లేచి "ఇప్పుడు కుంభకర్ణుడు తన పరాక్రమం చుపే సమయం వచ్చింది" అన్నాడు. (18,19)
ఇత్యేవ ముక్త్వా వివిధైర్వాదిత్రైః సుమహాస్వనైః ।
శయానమతినిద్రాలుం కుంభకర్ణమబోధయత్ ॥ 20
ఇలా అని మిక్కిలి గట్టిగా మోగే రకరకాల వాద్యాలతో నిద్రపోతున్న అతినిద్రాళువు అయిన కుంభకర్ణుని మేల్కొలిపాడు. (20)
ప్రబోధ్య మహతా చైనం యత్నేనాగతసాధ్వసః ।
స్వస్థమాసీనమవ్యగ్రం వినిద్రం రాక్షసాధిపః ॥ 21
తతోఽబ్రవీద్ దశగ్రీవః కుంభకర్ణం మహాబలమ్ ।
ధన్యోఽసి యస్య తే నిద్రా కుంభకర్ణేయమీదృశీ ॥ 22
భీతుడైన రావణుడు అతిప్రయత్నం మీద అతనిని మేల్కొలిపాడు. శాంతంగా, నిద్రారహితుడై స్వస్థుడై కూర్చున్న మహాబలుడు కుంభకర్ణునితో రావణుడు - "ఇటువంటి నిద్ర కలిగిన నీవు ధన్యుడివి" అన్నాడు. (21,22)
య ఇదం దారుణాకారం న జానీషే మహాభయమ్ ।
ఏష తీర్త్వార్ణవం రామః సేతునా హరిభిః సహ ॥ 23
అవమన్యేహ నః సర్వాన్ కరోతి కదనం మహత్ ।
మయా త్వపహృతా భార్యా సీతా నామాస్య జానకీ ॥ 24
"మనకు కలిగిన దారుణమైన మహాభయం గురించి నీవు ఎరుగవు. రాముడు సేతువు కట్టి వానరులతో సహితంగా సముద్రాన్ని దాటివచ్చి, మనను లెక్కచేయకుండా ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు. జనకుని కూతురయిన అతని భార్య సీతను నేను అపహరించి తెచ్చాను. (23,24)
తాం నేతుం స ఇహాయాతః బద్ ధ్వా సేతుం మహార్ణవే ।
తేన చైవ ప్రహస్తాదిః మహాన్ నః స్వజనో హతః ॥ 25
ఆమెను తీసుకువెళ్లడానికే మహాసముద్రానికి సేతువు కట్టి అతడు ఇక్కడికి వచ్చాడు. మనవారిని ప్రహస్తాదిప్రముఖులను అతడు చంపివేశాడు. (25)
తస్య నాన్యో నిహంతాస్తి త్వామృతే శత్రుకర్శన ।
స దంశితోఽభినిర్యాయ త్వమద్య బలినాం వర ॥ 26
రామాదీన్ సమరే సర్వాన్ జహి శత్రూనరిందమ ।
పరంతపా! నీవు తప్ప అతనిని చంపగలిగినవారు వేరెవరూ లేరు. బలవంతులలో శ్రేష్ఠుడా! శత్రుమర్దనా! నీవు ఇప్పుడు కవచాన్ని ధరించి బయలుదేరు. యుద్ధంలో రాముడు మొదలైన శత్రువుల నందరినీ వధించు. (26)
దూషణావరజౌ చైవ వజ్రవేగప్రమాథినౌ ॥ 27
తౌ త్వాం బలేన మహతా సహితావనుయాస్యతః ।
దూషణుని తమ్ములైన వజ్రవేగుడు ప్రమాథి మహాసైన్యంతో నిన్ను అనుసరిస్తారు.
ఇత్యుక్త్వా రాక్షసపతిః కుంభకర్ణం తరస్వినమ్ ॥ 28
వేగరి అయిన కుంభకర్ణునికి ఈరీతిగా చెప్పి రాక్షసరాజు రావణుడు వజ్రవేగప్రమాథులకు కర్తవ్యం బోధించి, దానిని పాటించమని ఆజ్ఞాపించాడు. (28)
సందిదేశేతికర్తవ్యం వజ్రవేగప్రమాథినౌ ।
తథేత్యు క్త్వా తు తౌ వీరౌ రావణం దూషణానుజౌ ।
కుంభకర్ణం పురస్కృత్య తూర్ణం నిర్యయతుః పురాత్ ॥ 29
వీరులయిన దూషణుని తమ్ముళ్లు వజ్రవేగప్రమాధులు రావణునితో అలాగే అని చెప్పి కుంభకర్ణుడు ముందు నడువగా వెంటనే పట్టణం నుండి బయలుదేరారు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి కుంభకర్ణనిర్గమనే షడశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 286 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున కుంభకర్ణుడు బయలుదేరుట అను రెండువందల ఎనుబది ఆరవ అధ్యాయము. (286)