287. రెండువందల ఎనుబది ఏడవ అధ్యాయము

కుంభకర్ణుడు, వజ్రవేగప్రమాథులు చనిపోవుట.

మార్కండేయ ఉవాచ
తతో నిర్యాయ స్వపురాత్ కుంభకర్ణః సహానుగః ।
అపశ్యత్ కపిసైన్యం తత్ జితకాశ్యగ్రతః స్థితమ్ ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - తదనంతరం అనుచరులతో కలిపి కుంభకర్ణుడు తన నగరం నుండి బయలుదేరి వచ్చి, తన ఎదురుగా విజయోల్లాసంతో నిలిచి ఉన్న కపిసైన్యాన్ని చూశాడు. (1)
స వీక్షమాణస్తత్ సైన్యం రామదర్శనకాంక్షయా ।
అపశ్యచ్చాపి సౌమిత్రిం ధనుష్పాణిం వ్యవస్థితమ్ ॥ 2
రాముని చూడాలనే కోరికతో ఆ సైన్యాన్ని అటు ఇటు కలయ చూస్తున్న అతనికి ధనుస్సును చేతపట్టి నిలుచున్న లక్ష్మణుడు కనిపించాడు. (2)
తమభ్యేత్యాశు హరయః పరివవ్రుః సమంతతః ।
అభ్యఘ్నంశ్చ మహాకాయైః బహుభిర్జగతీరుహైః ॥ 3
ఇంతలో వానరులు అన్నివైపుల నుండి అతనిని సమీపించి వెంటనే చుట్టుముట్టారు. పెద్దవైన అనేక మహావృక్షాలతో అతనిని ప్రహరించారు. (3)
కరజైరతుదంశ్చాన్యైః విహాయ భయముత్తమమ్ ।
బహుధా యుధ్యమానాస్తే యుద్ధమార్గైః ప్లవంగమాః ॥ 4
నానాప్రహరణైర్భీమైః రాక్షసేంద్రమతాడయన్ ।
అందులో కొంతమంది వానరులు (కుంభకర్ణుని వలన కలిగే) గొప్పభయాన్ని విడిచిపెట్టి గోళ్లతో రక్కి అతనిని బాధించసాగారు. రకరకాల యుద్ధమార్గాలలో ఆ వానరులు యుద్ధం చేస్తూ భయంకరమైన అనేక ఆయుధాలతో రాక్షసేంద్రుడయిన కుంభకర్ణుని తాడించసాగారు. (4)
స తాడ్యమానః ప్రహసన్ భక్షయామాస వానరాన్ ॥ 5
బలం చండబలాఖ్యం చ వజ్రబాహుం చ వానరమ్ ।
అలా వారు ప్రహరిస్తున్నా అతడు నవ్వుతూ వానరులను భక్షించసాగాడు. బలుడు, చండబలుడు వజ్రబాహుడు అనే వానరులు అతనికి ఆహారమైపోయారు. (5 1/2)
తద్ దృష్ట్వా వ్యథనం కర్మ కుంభకర్ణస్య రక్షసః ॥ 6
ఉద్రకోశన్ పరిత్రస్తాః తారప్రభృతయస్తదా ।
కుంభకర్ణరాక్షసుడు చేసే దుఃఖదాయకమైన ఆ పనిని చూసి తారుడు మొదలైన వానరులు భయంతో ఆక్రోశించారు. (6 1/2)
తామచ్చైః క్రోశతః సైన్యాన్ శ్రుత్వా స హరియూథపాన్ ॥ 7
అభిదుద్రావ సుగ్రీవః కుంభకర్ణమపేతభీః ।
తనసైనికులు, వానరపుంగవులు బిగ్గరగా చేస్తున్న ఆ ఆర్తనాదాలు విని సుగ్రీవుడు భయపడకుండా కుంభకర్ణునివైపు పరిగెత్తాడు. (7)
తతో నిపత్య వేగేన కుంభకర్ణం మహామనాః ॥ 8
శాలేన జఘ్నివాన్ మూర్ధ్ని బలేన కపికుంజరః ।
మహామనుడు, వానరపుంగవుడు అయిన సుగ్రీవుడు వేగంగా ఎగురుతూ ఒక మద్దిచెట్టుతో బలంగా కుంభకర్ణుని తలపై కొట్టాడు. (8)
స మహాత్మా మహావేగః కుంభకర్ణస్య మూర్ధని ॥ 9
బిబేధ శాలం సుగ్రీవః వ చైవావ్యథయత్ కపిః ।
సుగ్రీవుడు మహావేగం కలవాడు. మహాత్ముడు, అతడు కుంభకర్ణుని తలపై మద్దిచెట్టును రెండు ముక్కలుగా చేశాడు. అయినా అతనికి ఏమాత్రం వ్యథ కలిగించలేకపోయాడు. (9)
తతో వినద్య సహసా శాలస్పర్శవిబోధితాః ॥ 10
దోర్భ్యామాదాయ సుగ్రీవం కుంభకర్ణోఽహరద్ బలాత్ ।
ఆ మద్దిచెట్టు స్పర్శ తెలిసి కుంభకర్ణుడు వెంటనే గర్జిస్తూ సుగ్రీవుని రెండుచేతుల నడుమ నొక్కిపట్టి బలవంతంగా ఎత్తుకుపోయాడు. (10)
హ్రియమాణం తు సుగ్రీవం కుంభకర్ణేన రక్షసా ॥ 11
అవేక్ష్యాభ్యద్రవద్ వీరః సౌమిత్రిర్మిత్రనందనః ।
రాక్షసుడైన కుంభకర్ణుడు సుగ్రీవుని అపహరించడం చూసి, మిత్రులకు ఆనందదాయకుడైన వీరవరుడు లక్ష్మణుడు అతనివైపు పరుగుతీశాడు. (11)
సోఽభిపత్య మహావేగం రుక్మపుంఖం మహాశరమ్ ॥ 12
ప్రాహిణోత్ కుంభకర్ణాయ లక్ష్మణః పరవీరహా ।
శత్రుసంహారకుడైన లక్ష్మణుడు అక్కడికి చేరుకొని బంగారపు అంచు కలిగిన మహావేగవంతమైన ఒక మహాశరాన్ని ఆ కుంబకర్ణుని గురి చూసి కొట్టాడు. (12)
స తస్య దేహావరణం భిత్త్వా దేహం చ సాయకః ॥ 13
జగామ దారయన్ భూమిం రుధిరేణ సముక్షితః ।
ఆ బాణం అతని కవచాన్ని, దేహాన్ని కూడా ఛేదించి రక్తంతో తడిసి భూమిని చీల్చుకుంటూ వెళ్లింది. (13)
తథా స భిన్నహృదయః సముత్సృజ్య కపీశ్వరమ్ ॥ 14
(వేగేన మహతాఽఽవిష్టఃతిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ।)
కుంభకర్ణో మహేష్వాసః ప్రగృహీతశిలాయుధః ।
అభిదుద్రావ సౌమిత్రిమ్ ఉద్యమ్య మహతీం శిలామ్ ॥ 15
ఆ రీతిగా హృదయం భిన్నం కాగా మహాధనుర్దరుడైన కుంభకర్ణుడు సుగ్రీవవానరుని వదిలి మహావేగంతో లక్ష్మణుని వైపు తిరిగి "నిలు, నిలు" అని పలికాడు. అనంతరం శిలాయుధం ధరించిన అతడు పెద్దరాయిని ఎత్తి లక్ష్మణునివైపు పరిగెత్తాడు. (14,15)
తస్యాభిపతతస్తూర్ణం క్షురాభ్యాముచ్ఛ్రితౌ కరౌ ।
చిచ్ఛేద నిశితాగ్రాభ్యాం స బభూవ చతుర్భుజః ॥ 16
లక్ష్మణుడు వెంటనే వాడిములుకులు గల రెండు నారాచారాలతో తనవైపు వస్తున్న కుంభకర్ణుని యొక్క చాచిన రెండు చేతులను ఖండించివేశాడు. కాని అతడు నాలుగు చేతులు కలవాడయ్యాడు. (16)
తానప్యస్య భుజాన్ సర్వాన్ ప్రగృహీతశిలాయుధాన్ ।
క్షురైశ్చిచ్ఛేద లఘ్వస్త్రం సౌమిత్రిః ప్రతిదర్శయన్ ॥ 17
కుంభకర్ణుడు ఆ నాలుగు భుజాలతోనూ రాళ్లను పట్టుకున్నాడు. సౌమిత్రి తన అస్త్రలాఘవాన్ని ప్రదర్శిస్తూ ఆ భుజాలనన్నిటినీ కూడా నారాచాలతో ఖండించివేశాడు. (17)
స బభూవాతికాయశ్చ బహుపాదశిరోభుజః ।
తం బ్రహ్మాస్త్రేణ సౌమిత్రిః దదారాద్రిచయోపమమ్ ॥ 18
కుంభకర్ణుడు అనేకపాదాలు శిరస్సులు, భుజాలు కలిగి మహాకాయుడిగా అవతరించాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కొండల సమూహంలా ఉన్న అతని శరీరాన్ని చీల్చివేశాడు. (18)
స పపాత మహావీర్యః దివ్యాస్త్రాభిహతో రణే ।
మహాశనివినిర్దగ్ధః పాదపోఽంకురవానివ ॥ 19
గొప్ప పిడుగుపాటుకు పూర్తిగా దగ్ధమైన ఊడలు దిగిన చెట్టువలె దివ్యాస్త్రం తగిలి ఆ మహావీరుడు యుద్ధంలో కూలిపోయాడు. (19)
తం దృష్ట్వా వృత్రసంకాశం కుంభకర్ణం తరస్వినమ్ ।
గతాసుం పతితం భూమౌ రాక్షసాః ప్రాద్రవన్ భయాత్ ॥ 20
వృత్రాసురునితో సమానుడు, వేగరి అయిన కుంభకర్ణుడు ప్రాణాలు కోల్పోయి భూమిపై పడి ఉండడం చూసిన రాక్షసులు భయంతో పరుగులు తీశారు. (20)
తథా తాన్ ద్రవతో యోధాన్ దృష్ట్వా తౌ దూషణానుజౌ ।
అవస్థాప్యాథ సౌమిత్రిం సంక్రుద్ధావభ్యధావతామ్ ॥ 21
ఆ రీతిగా పారిపోతున్న ఆ యోధులను చూచి దూషణుని తమ్ములైన వజ్రవేగుడు, ప్రమాధి వారిని ఎలాగో నిలువరించి అతికుపితులై లక్ష్మణునిపై దాడిచేశారు. (21)
తావాద్రవంతౌ సంక్రుద్ధౌ వజ్రవేగప్రమాథినౌ ।
అభిజగ్రాహ సౌమిత్రిః వినద్యోభౌ పతత్త్రిభిః ॥ 22
మిక్కిలి కోపంతో తనవైపు పరుగెత్తి వస్తున్న వజ్రవేగ ప్రమాథులను ఇద్దరినీ కూడా లక్ష్మణుడు సింహనాదం చేసి బాణాలతో అడ్డుకున్నాడు. (22)
తతః సుతుములం యుద్ధమభవల్లోమహర్షణమ్ ।
దూషణానుజయోః పార్థ లక్ష్మణస్య చ ధీమతః ॥ 23
యుధిష్ఠిరా! అప్పుడు దూషణుని తమ్ముళ్లకు, ధీమంతుడైన లక్ష్మణునికి మధ్య గగుర్పాటు కలిగించే తుములయుద్ధం జరిగింది. (23)
మహతా శరవర్షేణ రాక్షసౌ సోఽభ్యవర్షతః ।
తౌ చాపి వీరౌ సంక్రుద్ధౌ ఉభౌ తం సమవర్షతామ్ ॥ 24
లక్ష్మణుడు గొప్ప శరవర్షంతో రాక్షసులను ముంచెత్తాడు. ఆ వీరులు ఇద్దరూ కూడ కోపంతో అతనిపై బాణవర్షం కురిపించారు. (24)
ముహూర్తమేవమభవద్ వజ్రవేగప్రమాథినోః ।
సౌమిత్రేశ్చ మహాబాహోః సంప్రహారః సుదారుణః ॥ 25
వజ్రవేగప్రమాథులకు, మహాబాహువయిన లక్ష్మణునికి నడుమ జరిగిన దారుణమయిన పోరాటం ముహూర్తకాలం కొనసాగింది. (25)
అథాద్రిశృంగమాదాయ హనుమాన్ మారుతాత్మజః ।
అభిద్రుత్యాదదే ప్రాణాన్ వజ్రవేగస్య రక్షసః ॥ 26
ఇంతలో పవనసుతుడు హనుమంతుడు కొండశిఖరాన్ని పట్టుకొని వజ్రవేగునిపై దాడిచేసి ఆ రాక్షసుని ప్రాణాలను తీశాడు. (26)
నీలశ్చ మహతా గ్రావ్ణా దూషణావరజం హరిః ।
ప్రమాథినమభిద్రుత్య ప్రమమాథ మహాబలః ॥ 27
మహాబలుడైన నీలుడనే వానరుడు పెద్దబండతో దూషణుని తమ్ముడైన ప్రమాథిపై దాడిచేసి అతనిని హతమార్చాడు. (27)
తతః ప్రావర్తత పునః సంగ్రామః కటుకోదయః ।
రామరావణసైన్యానామ్ అన్యోన్యమభిధావతామ్ ॥ 28
అనంతరం రామరావణుల యొక్క సైన్యాల మధ్య పరస్పరదాడులతో చేదుఫలితాన్నిచ్చే యుద్ధం తిరిగి కొనసాగింది. (28)
శతశో నైర్ ఋతాన్ వన్యాః జఘ్నుర్వన్యాంశ్చ నైర్ ఋతాః ।
నైర్ ఋతాస్తత్ర వధ్యంతే ప్రాయేణ న తు వానరాః ॥ 29
రాక్షసులను వానరులు, వానరులను రాక్షసులు వందలకొద్దిగా చంపుకొన్నారు. ఆ యుద్ధంలో ఎక్కువగా రాక్షసులే చనిపోయారు కాని వానరులు కాదు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి కుంభకర్ణాదివధే సప్తాశీత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 287 ॥
ఇది శ్రీమహాభారతమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున కుంభకర్ణాదులు చనిపోవుట అను రెండువందల ఎనుబది ఏడవ అధ్యాయము. (287)
(దాక్షణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలిపి మొత్తము 29 1/2 శ్లోకాలు)