292. రెండువందల తొంబది రెండవ అధ్యాయము
మార్కండేయుడు యుధిష్ఠిరుని ఓదార్చుట.
మార్కండేయ ఉవాచ
ఏవమేతన్మహాబాహో రామేణామితతేజసా ।
ప్రాప్తం వ్యసనమత్యుగ్రం వనవాసకృతం పురా ॥ 1
మార్కండేయుడు చెపుతున్నాడు - "మహాబాహూ యుధిష్ఠిరా! ఈ రీతిగా పూర్వం అమితతేజస్వి అయిన శ్రీరాముడు వనవాసం చేసి భయంకరమైన ఇటువంటి కష్టాలను పొందాడు. (1)
మా శుచః పురుషవ్యాఘ్ర క్షత్రియోఽసి పరంతప ।
బాహువీర్యాశ్రితే మార్గే వర్తసే దీప్తనిర్ణయే ॥ 2
శత్రుసంతాపకుడవైన పురుషోత్తమా! నీవు క్షత్రియుడవు. శోకించకు బాహుబలంమీద ఆధారపడిన, అభీష్టఫలంతో నిశ్చితమైన మార్గంలోనే నీవు పయనిస్తున్నావు. (2)
న హి తే వృజినం కించిద్ వర్తతే పరమణ్వపి ।
అస్మిన్ మార్గే నిషీదేయుః సేంద్రా అపి సురాసురాః ॥ 3
(శ్రీరామునితో పోలిస్తే) నీకష్టం అణుమాత్రం కూడా కాదు. ఇంద్రాది దేవతలు, అసురులు కూడా క్షత్రియధర్మాన్ని పాటించే ఈ మార్గంలోనే నడుస్తారు. (3)
సంహత్య నిహతో వృత్రః మరుద్భిర్వజ్రపాణినా ।
నముచిశ్చైవ దుర్ధర్షః దీర్ఘజిహ్వా చ రాక్షసీ ॥ 4
వజ్రపాణి అయిన ఇంద్రుడు మరుద్గణాలతో కలిసి వృత్రాసురుని, దుర్ధర్షుడైన సముచిదానవుని, రాక్షసి అయిన దీర్ఘజిహ్వను సంహరించాడు. (4)
సహాయవతి సర్వార్థాః సంతిష్ఠంతీహ సర్వశః ।
కిం ను తస్యాజితం సంఖ్యే యస్య భ్రాతా ధనంజయః ॥ 5
సహాయసంపన్నుడికి ఈ లోకంలో సమస్త ప్రయోజనాలు సమకూరుతాయి. ఇక ధనంజయునివంటి సోదరుడు ఉన్నవానికి యుద్ధంలో పరాజయం ఎక్కడిది? (5)
అయం చ బలినాం శ్రేష్ఠః భీమో భీమపరాక్రమః ।
యువానౌ చ మహేష్వాసౌ వీరౌ మాద్రవతీసుతౌ ॥ 6
ఇదిగో! భీమపరాక్రముడైన ఈ భీముడు బలవంతులలో శ్రేష్ఠుడు, మాద్రీసుతులు నకులసహదేవులు యువకులు, మహా ధనుర్ధరులు, వీరులు. (6)
ఏభిః సహాయైః కస్మాత్ త్వం విషీదసి పరంతప ।
య ఇమే వజ్రిణః సేనాం జయేయుః సమరుద్గణామ్ ॥ 7
పరంతపా! ఇటువంటి సహాయకులను కలిగిన నీవు ఎందుకు విచారిస్తున్నావు? వీరు మరుద్గణాలతో కూడిన ఇంద్రుని సైన్యాన్ని కూడా జయించగలరు. (7)
త్వమప్యేభిర్మహేష్వాసైః సహాయైర్దేవరూపిభిః ।
విజేష్యసే రణే సర్వాన్ అమిత్రాన్ భరతర్షభ ॥ 8
భరతసత్తమా! దేవరూపులయిన మహాధనుర్ధరులయిన ఈ నీ తముళ్ల సహాయంతో సమస్త శత్రువులను నీవు యుద్ధంలో జయించగలవు. (8)
ఇతశ్చ త్వమిమాం పశ్య సైంధవేన దురాత్మనా ।
బలినా వీర్యమత్తేన హృతామేభిర్మహాత్మభిః ॥ 9
ఆనీతాం ద్రౌపదీం కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరమ్ ।
జయద్రథం చ రాజానం విజితం వశమాగతమ్ ॥ 10
ఇదిగో ఇటు చూడు ఈ ద్రౌపదిని, దురాత్ముడైన సైంధవుడు బలగర్వంతో బలవంతంగా ఈమెను అపహరించాడు. అయినా ఈ మహాత్ములు అతిదుష్కరమయిన పనిని చేసి ద్రుపదుని కూతురయిన కృష్ణను తీసుకొనివచ్చారు. జయద్రథుని ఓడించి నీకు అప్పగించారు. (9,10)
అసహాయేన రామేణ వైదేహి పునరాహృతా ।
హత్వా సంఖ్యే దశగ్రీవం రాక్షసం భీమవిక్రమమ్ ॥ 11
ఎటువంటి మానవ సహాయం లేకుండానే రాముడు భయంకరపరాక్రమం కలిగిన రాక్షసుడైన దశగ్రీవుని యుద్ధంలో చంపి వైదేహిని తిరిగి తీసికొని వచ్చాడు. (11)
యస్య శాఖామృగా మిత్రాణ్యక్షాః కాలముఖాస్తథా ।
జాత్యంతరగతా రాజన్ ఏతద్ బుద్ధ్వానుచింతయ ॥ 12
రాజా! ఇతర జాతులకు చెందిన కోతులు, లాంగూలాలు, ఎలుగుబంట్లు అతనికి మిత్రులు, సహాయకులు, (నీకయితే నీ నలుగురు సోదరులున్నారు). ఈ విషయాన్ని బుద్ధిపెట్టి ఆలోచించు. (12)
తస్మాత్ స త్వం కురుశ్రేష్ఠ మా శుచో భరతర్షభ ।
త్వద్విధా హి మహాత్మానః న శోచంతి పరంతప ॥ 13
కాబట్టి కురుశ్రేష్ఠా! భరతసత్తమా! ఇటువంటి నీవు శోకించకు. పరంతపా! నీవంటి మహాత్ములు శోకించరు. (13)
వైశంపాయన ఉవాచ
ఏవమాశ్వాసితో రాజా మార్కండేయేన ధీమతా ।
త్యక్త్వా దుఃఖమదీనాత్మా పునరప్యేనమబ్రవీత్ ॥ 14
వైశంపాయనుడు చెపుతున్నాడు.
"జనమేజయా! ఈ రీతిగా మార్కండేయుడు ఊరడించాడు - బుద్ధిమంతుడయిన యుధిష్ఠిరమహారాజు దుఃఖం దైన్యం విడిచి మళ్లీ అతనితో ఇలా అన్నాడు. (14)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి రామోపాఖ్యానపర్వణి యుధిష్ఠిరాశ్వాసనే ద్వినవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 292 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున రామోపాఖ్యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరుని ఓదార్చుట అను రెండువందల తొంబద్ రెండవ అధ్యాయము. (292)