293. రెండు వందల తొంబది మూడవ అధ్యాయము

(పతివ్రతామాహాత్మ్య పర్వము)

సావిత్రి జననము - వరాన్వేషణము.

యుధిష్ఠిర ఉవాచ
వాత్మానమనుశోచామి నేమాన్ భ్రాతౄన్ మహామునే ।
హరణం చాపి రాజ్యస్య యథేమాం ద్రుపదాత్మజామ్ ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
మహామునీ! నాగురించి బాధపడటం లేదు. నా సోదరుల గురించి కానీ, రాజ్యాపహరణాన్ని గురించి కానీ బాధపడటం లేదు. ద్రౌపదిని గురించియే బాధపడుతున్నాను. (1)
ద్యూతే దురాత్మభిః క్లిష్టాః కృష్ణయా తారితా వయమ్ ।
జయద్రథేన చ పునః వనాచ్చాపి హృతా బలాత్ ॥ 2
జూదంలో ఆ దుర్మార్గులు మమ్ము బాధించారు. ద్రౌపది ద్వారా బయట పడ్డాం. కానీ మరలా ఈ అరణ్యంలో సైంధవుడు బలవంతంగా ద్రౌపదిని అపహరించాడు. (2)
అస్తి సీమంతినీ కాచిత్ దృష్టపూర్వాపి వా శ్రుతా ।
పతివ్రతా మహాభాగా యథేయం ద్రుపదాత్మజా ॥ 3
మహాసౌభాగ్యవతి, పతివ్రత అయిన ద్రౌపది వంటి సీమంతినిని ఎప్పుడైనా చూశావా? కనీసం విన్నావా? (3)
మార్కండేయ ఉవాచ
శృణు రాజన్ కులస్త్రీణాం మహాభాగ్యం యుధిష్ఠిర ।
సర్వమేతద్ యథాప్రాప్తం సావిత్య్రా రాజకన్యయా ॥ 4
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! యుధిష్ఠిరా! కులకాంతల సౌభాగ్యాన్ని గురించి విను. సావిత్రి అనే రాజకుమారి ఆ భాగ్యాన్ని పూర్తిగా పొందగలిగింది. (4)
ఆసీన్మద్రేషు ధర్మాత్మా రాజా పరమధార్మికః ।
బ్రహ్మణ్యశ్చ మహాత్మా చ సత్యసంధో జితేంద్రియః ॥ 5
మద్రదేశంలో పరమధార్మికుడు, ధర్మాత్ముడైన ఒక రాజుండేవాడు. ఆయన బ్రాహ్మణభక్తుడు, మహాత్ముడు, సత్యసంధుడు, జితేంద్రియుడు కూడా. (5)
యజ్వా దానపతిర్దక్షః పౌరజానపదప్రియః ।
పార్ధివోఽశ్వపతిర్నామ సర్వభూతహితే రతః ॥ 6
ఆ రాజు యజమాని. దానపతి. సమర్థుడు. నగరవాసులకు, గ్రామీణులకు నచ్చినవాడు. సర్వప్రాణులహితాన్ని కోరేవాడు. పేరు అశ్వపతి. (6)
క్షమావాననపత్యశ్చ సత్యవాగ్ విజితేంద్రియః ।
అతిక్రాంతేన వయసా సంతాపముపజగ్మివాన్ ॥ 7
ఆ అశ్వపతి సహనశీలుడు, సత్యవాది, జితేంద్రియుడు. కానీ సంతానం లేనివాడు. వయస్సు గడిచిపోతున్నకొద్దీ బాధపడసాగాడు. (7)
అపత్యోత్పాదనార్ధం చ తీవ్రం నియమమాస్థితః ।
కాలే పరిమితాహారః బ్రహ్మచారీ జితేంద్రియః ॥ 8
సంతానాన్ని పొందటానికి తీవ్రనియామాలను స్వీకరించాడు. నియమిత వేళలో స్వల్పంగా ఆహారాన్ని స్వీకరిస్తూ, జితేంద్రియుడై బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. (8)
హుత్వా శతసహస్రం సః సావిత్ర్యా రాజసత్తమః ।
షష్ఠే షష్ఠే తదా కాలే బభూవ మితభోజనః ॥ 9
ఆ రాజశ్రేష్ఠుడు రోజూ లక్ష గాయత్రిహోమం చేస్తూ రోజులోని ఆరవభాగంలో మితంగా భోజనం చేస్తుండేవాడు. (9)
వి॥సం॥ సావిత్య్రా సావిత్రీదేవతాకమయిన ఋక్కుతో - అఋక్కు ఇది -
సామో వధూయురభవదశ్వినాస్తాముభావరా ।
సూర్యాం యత్పత్యౌ శంసంతీం మనసా నవినాఽఽదదాత్ ॥ (నీల)
ఏతేన నియమేనాసీత్ వర్షాణ్యష్టాదశైవ తు ।
పూర్ణే త్వష్టాదశే వర్షే సావిత్రీ తుష్టిమభ్యగాత్ ॥ 10
ఈ నియమంతో పద్దెనిమిది సంవత్సరాలు గడిపాడు. పద్దెనిమిదవ సంవత్సరం పూర్తి అయిన తరువాత సావిత్రి సంతోషించింది. (10)
రూపిణీ తు తదా రాజన్ దర్శయామాస తం నృపమ్ ।
అగ్ని హోత్రాత్ సముత్థాయ హర్షేన మహతాన్వితా ।
ఉవాచ చైనం వరదా వచనం పార్థివం తదా ॥ 11
(సా తమశ్వపతిం రాజన్ సావిత్రీ నియమే స్థితమ్ ॥)
ఆ సావిత్రి దివ్యరూపాన్ని ధరించి, అగ్నిహోత్రం నుండి ఆవిర్భవించి, పరమానందపడుతూ ఆ రాజునకు దర్శనమిచ్చింది. రాజా! వరదాయిని అయిన ఆమె నియమవంతుడైన అశ్వపతితో ఇలా అన్నది. (11)
సావిత్య్రువాచ
బ్రహ్మచర్యేణ శుద్ధేన దమేన నియమేన చ ।
సర్వాత్మణా చ భక్త్యా చ తుష్టాస్మి తవ పార్థివ ॥ 12
సావిత్రి ఇలా అన్నది. రాజా! పవిత్రమైన నీ బ్రహ్మచర్యంతో, యమనియమాలతో, పరిపూర్ణమయిన భక్తితో ఆనందించాను. (12)
వరం వృణీష్వాశ్వపతే మద్రరాజ యదీప్సితమ్ ।
న ప్రమాదశ్చ ధర్మేషు కర్తవ్యస్తే కథంచన ॥ 13
మద్రరాజా! అశ్వపతీ! ఇష్టమయిన వరం కోరుకో. ధర్మనిర్వహణలో ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయగూడదు. (13)
అశ్వపతిరువాచ
అపత్యార్థః సమారంభః కృతో ధర్మేప్సయా మయా ।
పుత్రా మే బహవో దేవి భవేయుః కులభావనాః ॥ 14
అశ్వపతి ఇలా అన్నాడు.
దేవీ! ధర్మాచరణకై సంతానాన్ని, పొందాలని ఈ హోమాన్ని ప్రారంభించాను. వంశవర్ధనులయిన కొడుకులు చాలామంది నాకు కావాలి. (14)
తుష్టాసి యది మే దేవి పరమేతం వృణోమ్యహమ్ ।
సంతానం పరమో ధర్మః ఇత్యాహుర్మాం ద్విజాతయః ॥ 15
దేవీ! నీవు ప్రసన్నురాలవయితే నేనీవరాన్ని కోరుతున్నాను, సంతానాన్ని పొందటమే పరమధర్మమని బ్రాహ్మణులు నాకు చెప్పారు. (15)
సావిత్య్రువాచ
పూర్వమేవ మయా రాజన్ అభిప్రాయమిమం తవ ।
జ్ఞాత్వా పుత్రార్థముక్తో వై భగవాంస్తే పితామహః ॥ 16
సావిత్రీదేవి ఇలా అన్నది.
రాజా! నేను ముందే నీ అభిప్రాయాన్ని గ్రహించి, పుత్రులకొరకై బ్రహ్మకు నివేదించాను. (16)
ప్రసాదాచ్చైవ తస్మాత్ తే స్వయంభువిహితాద్ భువి ।
కన్యా తేజస్వినీ సౌమ్య క్షిప్రమేవ భవిష్యతి ॥ 17
ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వలన నీకు త్వరలోనే ఈ లోకంలో తేజస్విని అయిన కూతురు పుడుతుంది. (17)
ఉత్తరం చ న తే కించిత్ వ్యాహర్తవ్యం కథంచన ।
పితామహనిసర్గేణ తుష్టా హ్యేతద్ బ్రవీమి తే ॥ 18
ఈ విషయాలు నీవు ఇంక ఏమీ మాటాడకూడదు. బ్రహ్మదేవుని నిర్దేశంతో తృప్తిపడి నేనీమాట చెప్తున్నాను. (18)
మార్కండేయ ఉవాచ
స తథేతి ప్రతిజ్ఞాయ సావిత్య్రా వచనం నృపః ।
ప్రసాదయామాస పునః క్షిప్రమేతద్ భవిష్యతి ॥ 19
మార్కండేయుడిలా అన్నాడు.
సావిత్రి మాటను 'అలాగే' అని అంగీకరించాడు అశ్వపతి. 'ఇది త్వరలోనే నెరవేరుతుంది' అని ఆమెను ప్రసన్నురాలిని చేసికొన్నాడు. (19)
అంతర్హితాయాం సావిత్య్రాం జగామ స్వపురం నృపః ।
స్వరాజ్యే చావసద్ వీరః ప్రజా ధర్మేణ పాలయన్ ॥ 20
సావిత్రి అదృశ్యం కాగానే ఆ రాజు తన నగరానికి వెళ్ళిపోయాడు. వీరుడై ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తూ రాజ్యంలో ఉన్నాడు. (20)
కస్మింశ్చిత్ తు గతే కాలే స రాజా నియతవ్రతః ।
జ్యేష్ఠాయాం ధర్మచారిణ్యాం మహిష్యాం గర్భమాదధే ॥ 21
కొంతకాలం గడచిన తర్వాత నియతవ్రతుడైన ఆ రాజు ధర్మచారిణి అయిన తన పెద్దభార్యకు గర్భాధానం చేశాడు. (21)
రాజపుత్య్రాస్తు గర్భః సః మాలవ్యా భరతర్షభ ।
వ్యవర్ధత తదా శుక్లే తారాపతిరివాంబరే ॥ 22
భరతశ్రేష్ఠా! అశ్వపతి భార్య మాలపదేశీయురాలు. ఆమె గర్భం ఆకాశంలో శుక్లపక్షచంద్రునివలె దినదిన ప్రవర్ధమానమయింది. (22)
ప్రాప్తే కాలే తు సుషువే కన్యాం రాజీవలోచనామ్ ।
క్రియాశ్చ తస్యా ముదితః చక్రే చ నృపసత్తమః ॥ 23
నెలలు నిండగానే మాలవి పద్మాల వంటి కన్నులు గల అమ్మాయిని కన్నది. ఆనందించిన ఆ రాజన్యుడు ఆ బిడ్డకు జాతకర్మాది సంస్కారాలు జరిపించాడు. (23)
సావిత్య్రా ప్రీతయా దత్తా సావిత్య్రా హుతయా హ్యపి ।
సావిత్రీత్యేవ నామాస్యాః చక్రుర్విప్రాస్తథా పితా ॥ 24
గాయత్రీ మంత్రహోమం చేసినందువలననే ప్రసన్నురాలయిన సావిత్రి వరప్రసాదం కాబట్టి తండ్రి ఆ బిడ్డకు సావిత్రి అని పేరుపెట్టాడు. (24)
సా విగ్రహవతీవ శ్రీః వ్యవర్ధత నృపాత్మజా ।
కాలేన చాపి సా కన్యా యౌవనస్థా బభూవ హ ॥ 25
ఆ రాజకుమారి రూపుదాల్చిన లక్ష్మివలె వర్ధిల్లింది. కాలం గడిచి ఆమె యుక్తవయస్సు రాలయింది. (25)
తాం సుమధ్యాం పృథుశ్రోణీం ప్రతిమాం కాంచనీమివ ।
ప్రాప్తేయం దేవకన్యేతి దృష్ట్వా సమ్మేనిరే జనాః ॥ 26
చక్కని నడుము, బలిసిన నితంబాలు కలిగి బంగారు బొమ్మవలె కనిపిస్తున్న ఆమెను చూచి జనులు దేవకన్యయే సావిత్రిగా వచ్చినట్టు భావించారు. (26)
తాం తు పద్మపలాశాక్షీం జ్వలంతీమివ తేజసా ।
న కశ్చిద్ వరయామాస తేజసా ప్రతివారితః ॥ 27
తామరరేకుల వలె విశాలమయిన కన్నులు కలిగి, తేజస్సుతో మండుతున్నట్లున్న ఆమెను ఎవ్వరూ వరించలేదు. ఆమె తేజస్సే వారిని నివారించింది. (27)
అథోపోష్య శిరఃస్నాతా దేవతామభిగమ్య సా ।
హుత్వాగ్నిం విధివద్ విప్రాన్ వాచయామాస పర్వణి ॥ 28
ఒక పర్వదినాన ఆమె శిరఃస్నానం చేసి, గాయత్రీ దర్శనానికి వెళ్ళి, శాస్త్రోక్తంగా అగ్నికి ఆహుతులు ఇచ్చి బ్రాహ్మణులచే స్వస్తివచనాలు పలికించింది. (28)
తతః సుమనసః శేషాః ప్రతిగృహ్య మహాత్మనః ।
పితుః సమీపమగమత్ దేవీ శ్రీరివ రూపిణీ ॥ 29
ఆ తరువాత శేషకుసుమాలను ప్రసాదంగా స్వీకరించి, రూపుదాల్చిన లక్ష్మీదేవివలె ఆమె మహాత్ముడయిన తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. (29)
సాభివాద్య పితుః పాదౌ శేషాః పూర్వం నివేద్య చ ।
కృతాంజలిర్వరారోహా నృపతేః పార్శ్వమాస్థితా ॥ 30
ఆ సుందరి ముందుగా శేషకుసుమాలను తండ్రి కిచ్చి, ఆయన పాదాలకు నమస్కరించి, చేతులు జోడించి, ఆ రాజు ప్రక్కన నిలిచింది. (30)
యౌపనస్థాం తు తాం దృష్ట్వా స్వాం సుతాం దేవరూపిణీమ్ ।
అయాచ్యమానాం చ వరైః నృపతిర్దుఃఖితోఽభవత్ ॥ 31
యౌవనంలో ఉండి దేవతా స్త్రీవలె ప్రకాశిస్తున్న కూతురును చూచి, ఆమె నెవ్వరూ వరించటం లేదన్న విషయాన్ని తలచుకొని తండ్రి దుఃఖించాడు. (31)
రాజోవాచ
పుత్రి ప్రదానకాలస్తే న చ కశ్చిద్ వృణోతి మామ్ ।
స్వయమన్విచ్ఛ భర్తారం గుణైః సదృశమాత్మనః ॥ 32
రాజు ఇలా అన్నాడు. వత్సా! నీకిది వివాహకాలం. కానీ నన్నెవ్వరూ అడగటం లేదు. నీ గుణాలకు సరిపోయే భర్తను నీవు స్వయంగా వెతుక్కో. (32)
ప్రార్థితః పురుషో యశ్చ స నివేద్యస్త్వయా మమ ।
విమృశ్యాహం ప్రదాస్యామి వరయ త్వం యథేప్సితమ్ ॥ 33
నీకు నచ్చిన వానిని గురించి నాకు చెప్పు. నేను పరిశీలించి కన్యాదానం చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వానిని వరించు. (33)
శ్రుతం హి ధర్మశాస్త్రేషు పఠ్యమానం ద్విజాతిభిః ।
తథా త్వమపి కల్యాణి గదతో మే వచః శృణు ॥ 34
బ్రాహ్మణులు ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలు చెప్పగా నేను విన్నాను. కళ్యాణి! నీకు కూడా చెప్తాను విను. (34)
అప్రదాతా పితా వాచ్యః వాచ్యశ్చామపయన్ పతిః ।
మృతే భర్తరి పుత్రశ్చ వాచ్యః మాతురరక్షితా ॥ 35
కూతురుకు పెండ్లి చేయని తండ్రి నిందింపదగినవాడు. సంగమకాలంలో భార్యను సమీపించని భర్త నిందింపదగినవాడు. భర్త మరణించిన తల్లిని రక్షించని కొడుకు నిందింపదగినవాడు. (35)
ఇదం మే వచనం శ్రుత్వా భర్తురన్వేషణే త్వర ।
దేవతానాం యథా వాచ్యః న భవేయం తతా కురు ॥ 36
ఈ నామాట విని త్వరగా వెతుక్కో. దేవతల దృష్టిలో నేను దోషిని కాకుండేటట్లు ప్రవర్తించు. (36)
మార్కండేయ ఉవాచ
ఏవముక్త్వా దుహితరం తథా వృద్ధాంశ్చ మంత్రిణః ।
వ్యాదిదేశానుయాత్రం చ గమ్యతాం చేత్యచోదయత్ ॥ 37
మార్కండేయుడిలా అన్నాడు. కూతురుతో ఆ రీతిగా పలికి "యాత్రకు తగిన ఏర్పాటు చేసి మీరు కూడా ఆమెతో వెళ్ళండి" అని వృద్ధమంత్రులను ఆదేశించాడు. (37)
సాభివాద్య పితుః పాదౌ వ్రీడితేవ మనస్వినీ ।
పితుర్వచనమాజ్ఞాయ నిర్జగామావిచారితమ్ ॥ 38
అభిమానవతి అయిన ఆమె కొంత సిగ్గుపడి, తండ్రి పాదాలకు నమస్కరించి , తండ్రి మాటను పాటిస్తూ నిశ్చింతగా బయలుదేరింది. (38)
సా హైమం రథమాస్థాయ స్థవిరైః సచివైర్వృతా ।
తపోవనాని రమ్యాణి రాజర్షీణాం జగామ హ ॥ 39
వృద్ధమంత్రులు చుట్టు నిలువగా ఆమె బంగారు రథాన్ని ఎక్కి, రాజర్షులు నివసించే రమణీయ తపోవనాల వైపు ప్రయాణించింది. (39)
మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభివాదనమ్ ।
వనాని క్రమశస్తాత సర్వాణ్యేవాభ్యగచ్ఛత ॥ 40
నాయనా! మాన్యులయిన అక్కడి పెద్దలకు పాదాభివందనాలు చేస్తూ క్రమంగా తపోవనాలన్నింటికి వెళ్ళింది. (40)
ఏవం తీర్థేషు సర్వేషు ధనోత్సర్గం నృపాత్మజా ।
కుర్వతీ ద్విజముఖ్యానాం తం తం దేశం జగామ హ ॥ 41
ఈరీతిగా ఆ రాజకుమారి సర్వతీర్థాలలోనూ బ్రాహ్మణశ్రేష్ఠులకు ధనదానం చేస్తూ ఆయా ప్రదేశాలు అన్నీ తిరిగింది. (41)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామాహాత్మ్యపర్వణి సావిత్య్రుపాఖ్యానే త్రినవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 293 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతామాహాత్మ్యపర్వమను ఉపపర్వమున పతివ్రతోపాక్యానమను రెండువందల తొంబది మూడవ అధ్యాయము. (293)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 41 1/2 శ్లోకాలు.)