295. రెండువందల తొంబది అయిదవ అధ్యాయము

సావిత్రీ సత్యవంతుల పరిణయము.

మార్కండేయ ఉవాచ
అథ కన్యాప్రదానే సః తమేవార్థం విచింతయన్ ।
సమానిన్యే చ తత్ సర్వం భాండం వైవాహికం నృపః ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు. ఆ తరువాత కన్యాప్రదాన విషయంలో నారదుడు చెప్పినదాన్ని గూర్చి ఆలోచిస్తూ అశ్వపతిరాజు వివాహసామగ్రిని సమకూర్చాడు. (1)
తతో వృద్ధాన్ ద్విజాన్ సర్వాన్ ఋత్విజః సపురోహితాన్ ।
సమాహూయ దినే పుణ్యే ప్రయయౌ సహ కన్యయా ॥ 2
ఆ తరువాత వృద్ధులను, బ్రాహ్మణులను, ఋత్విజులను, పురోహితులను పిలిపించి, శుభదినాన కుమార్తెతో కూడా బయలుదేరాడు. (2)
మేధ్యారణ్యం స గత్వా చ ద్యుమత్సేనాశ్రమం నృపః ।
పద్భ్యామేవ ద్విజైః సార్ధం రాజర్షిం తముపాగమత్ ॥ 3
ఆ అశ్వపతి మేధ్యారణ్యానికి పోయి, కాలినడకతో ద్యుమత్సేనాశ్రమాన్ని సమీపించి, బ్రాహ్మణులతో సహా ద్యుమత్సేనుని కలిశాడు. (3)
తత్రాపశ్యన్మహాభాగం శాలవృక్షముపాశ్రితమ్ ।
కౌశ్యాం బృస్యాం సమాసీనం చక్షుర్హీనం నృపం తదా ॥ 4
అక్కడ శాలవృక్షం క్రింద దర్భాసనంపై కూర్చొనియున్న ఆ మహానుభావుని ద్యుమత్సేనుని చూచాడు. ఆయన అంధుడు. (4)
స రాజా తస్య రాజర్షేః కృత్వా పూజాం యథార్హతః ।
వాచా సునియతో భూత్వా చకారాత్మనివేదనమ్ ॥ 5
తస్యార్ఘ్యమాసనం చైవ గాం చావేద్య స ధర్మవిత్ ।
కిమాగమనమిత్యేవం రాజా రాజానమబ్రవీత్ ॥ 6
అశ్వపతి రాజు రాజర్షి అయిన ద్యుమత్సేనుని తగినరీతిగా అర్చించి, జాగ్రత్తగా మాటాడుతూ తనను తాను పరిచయం చేసికొన్నాడు. ధర్మవేత్త అయిన ద్యుమత్సేనుడు అశ్వపతికి అర్ఘ్యాన్నీ, ఆసనాన్నీ, గోవును నివేదించి "తమరాకకు కారణమేమిటి?" అని అడిగాడు. (5,6)
తస్య సర్వమభిప్రాయమ్ ఇతికర్తవ్యతాం చ తామ్ ।
సత్యవంతం సముద్దిశ్య సర్వమేవ న్యవేదయత్ ॥ 7
అప్పుడు అశ్వపతి సత్యవంతుని గూర్చిన తన అభిప్రాయాన్నీ, ఏది ఎలా చేయాలన్న విషయాన్ని పూర్తిగా నివేదించాడు. (7)
అశ్వపతిరువాచ
సావిత్రీ నామ రాజర్షే కన్యేయం మమ శోభనా ।
తాం స్వధర్మేణ ధర్మజ్ఞ స్నుషార్థే త్వం గృహాణ మే ॥ 8
అశ్వపతి ఇలా అన్నాడు.
రాజర్షీ! అందమైన ఈ అమ్మాయి నా కుమార్తె. పేరు సావిత్రి. ధర్మజ్ఞా! ఈమెను ధర్మబద్ధంగా నీవు కోడలుగా స్వీకరించాలి. (8)
ద్యుమత్సేన ఉవాచ
చ్యుతాః స్మ రాజ్యాద్ వనవాసమాశ్రితాః
చరామ ధర్మం నియతాస్తపస్వినః ।
కథం త్వనర్హా వనవాసమాశ్రమే
నివత్స్యతే క్లేశమిమం సుతా తవ ॥ 9
ద్యుమత్సేనుడిలా అన్నాడు.
రాజ్యాన్ని కోల్పోయి మేము వనవాసం చేస్తున్నాం. యమనియమాలతో తపోధర్మాన్ని పాటిస్తున్నాం. నీ కుమార్తె ఈ కష్టాలు ఎలా సహిస్తుంది? వనవాసానికి ఆమె తగదు. (9)
అశ్వపతిరువాచ
సుఖం చ దుఃఖం చ భవాభవాత్మకం
యదా విజానాతి సుతాహమేవ చ ।
న మద్విధే యుజ్యతి వాక్యమీదృశం
వినిశ్చయేనాభిగతోఽస్మి తే నృప ॥ 10
అశ్వపతి ఇలా అన్నాడు.
రాజా! సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ విషయం నాకూ, నా కుమార్తెకూ తెలుసు. నావంటి వారితో ఇటువంటి మాట లనకూడదు. నేను నిశ్చయం చేసికొనియే వచ్చాను. (10)
ఆశాం నార్హసి మే హంతుం సౌహృదాత్ ప్రణతస్య చ ।
అభితశ్చాగతం ప్రేమ్ణా ప్రత్యాఖ్యాతుం న మార్హసి ॥ 11
సుహృద్భావంతో నీ శరణుకోరి వచ్చాను. నాకు ఆశాభంగం కలిగించవద్దు. ప్రేమపూర్వకంగా నీ దగ్గరకు వచ్చిన నన్ను తిరస్కరించవద్దు. (11)
అనురూపో హి యుక్తశ్చ త్వం మమాహం తవాపి చ ।
స్నుషాం ప్రతీచ్ఛ మే కన్యాం భార్యాం సత్యవతః సతః ॥ 12
నాకు నీవు తగినవాడవు. నేను నీకు తగినవాడను. సజ్జనుడైన సత్యవంతునకు భార్యగా, నీ కోడలుగా నా కూతురును స్వీకరించు. (12)
ద్యుమత్సేన ఉవాచ
పూర్వమేవాభిలషితః సంబంధో మే త్వయా సహ ।
భ్రష్టరాజ్యస్త్వహమితి తత ఏతద్ విచారితమ్ ॥ 13
ద్యుమత్సేనుడిలా అన్నాడు.
నేను మీ సంబంధాన్ని ఇంతకు ముందే కోరుకొన్నాను. కానీ ఇప్పుడు రాజ్యాన్ని కోల్పోయాను కాబట్టి ఈ రీతిగా ఆలోచిస్తున్నాను. (13)
అభిప్రాయస్త్వయం యో మే పూర్వమేవాభికాంక్షితః ।
స నిర్వర్తతు మేఽద్యైవ కాంక్షితో హ్యపి మేఽతిథిః ॥ 14
నేను గతంలోనే ఆకాంక్షించిన నా అభిప్రాయం నేడు జరుగుతోంది. అలాగే కానీ! నీవు నేను కోరుకొన్న అతిథివి. (14)
తతః సర్వాన్ సమానాయ్య ద్విజానాశ్రమవాసినః ।
యథావిధి సముద్వాహం కారయామాసతుర్నృపౌ ॥ 15
ఆ తర్వాత ఆ రాజులిద్దరూ ఆశ్రమవాసులయిన బ్రాహ్మణులను అందరినీ పిలిపించి, యథావిథిగా వివాహాన్ని జరిపించారు. (15)
దత్త్వా సోఽశ్వపతిః కన్యాం యథార్హం సపరిచ్ఛదమ్ ।
యయౌ స్వమేవ భవనం యుక్తః పరమయా ముదా ॥ 16
అశ్వపతి తగినరీతిగా నూత్నవస్త్రాలతో కన్యాదానం చేసి పరమానందంతో తన నివాసానికి వెళ్ళిపోయాడు. (16)
సత్యవానపి తాం భార్యాం లబ్ధ్వా సర్వగుణాన్వితామ్ ।
ముముదే సా చ తం లబ్ధ్వా భర్తారం మనసేప్సితమ్ ॥ 17
సర్వగుణసమన్విత అయిన సావిత్రిని భార్యగా పొంది సత్యవంతుడు సంతోషించాడు. తాను కోరుకొన్న భర్త లభించినందున సావిత్రి కూడా సంతోషించింది. (17)
గతే పితరి సర్వాణి సంన్యస్యాభరణాని సా ।
జగృహే వల్కలాన్యేవ వస్త్రం కాషాయమేవ చ ॥ 18
తండ్రి నిష్క్రమించగానే సావిత్రి నగల నన్నింటినీ విడిచి నారచీరలను, కాషాయవస్త్రాలను ధరించనారంభించింది. (18)
పరిచారైర్గుణైశ్చైవ ప్రశ్రయేణ దమేన చ ।
సర్వకామక్రియాభిశ్చ సర్వేషాం తుష్టిమాదధే ॥ 19
ఆమె తన సేవలతో అందరికీ నచ్చినట్లు పనిచేయటంతో అందరికీ ఆనందాన్ని కల్గించింది. (19)
శ్వశ్రూం శరీరసత్కారైః సర్వైరాచ్ఛాదనాదిభిః ।
శ్వశురం దేవసత్కారైః వాచః సంయమనేన చ ॥ 20
శారీరకసేవలతో, వస్త్రాభరణాలను కట్టబెట్టడంతో అత్తనూ, మాటలను నియత్రించుకొనటంతో, దేవసత్కారాలతో మామను ఆనందింపజేసింది. (20)
తథైవ ప్రియవాదేన నైపుణేన శమేన చ ।
రహశ్చైవోపచారేణ భర్తారం పర్యతోషయత్ ॥ 21
అట్లే ప్రియంగా మాటాడటంతో, నేర్పుతో, ఓర్పుతో ఏకాంతంలో ఉపచర్యలు చేయటంతో భర్తను సంతోషపెట్టింది. (21)
ఏవం తత్రాశ్రమే తేషాం తదా నివసతాం సతామ్ ।
కాలస్తపస్యతాం కశ్చిద్ అపాక్రామత భారత ॥ 22
భారతా! ఆ సజ్జనులు ఆ రీతిగా ఆ ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు కొనసాగిస్తుండగా కొంతకాలం గడిచించి. (22)
సావిత్య్రా గ్లాయమానాయాః తిష్ఠంత్యాస్తు దివానిశమ్ ।
నారదేన యదుక్తం తద్ వాక్యం మనసి వర్తతే ॥ 23
సావిత్రి మాత్రం రోజు రోజుకూ విషాదానికి లోనవుతోంది. పగలు, రేయి కూడా నిలిచినా, నిదురించినా నారదుడు చెప్పిన మాటయే మనస్సులో మెదులుతోంది. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామాహాత్మ్యపర్వణి
సావిత్య్రుపాఖ్యానే పంచనవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 295 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతా మాహాత్మ్యపర్వమను ఉపపర్వమున సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది అయిదవ అధ్యాయము. (295)