296. రెండువందల తొంబది ఆరవ అధ్యాయము

అత్తమామల అనుమతితో సావిత్రి సత్యవంతునితో కలిసి వనమున కేగుట.

మార్కండేయ ఉవాచ
తతః కాలే బహుతిథే వ్యతిక్రాంతే కదాచన ।
ప్రాప్తః స కాలో మర్తవ్యం యత్ర సత్యవతా నృప ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! ఇలా చాలారోజులు గడిచిన తర్వాత సత్యవంతుడు మరణించవలసిన రోజు రానే వచ్చింది. (1)
గణయంత్యాశ్చ సావిత్య్రా దివసే దివసే గతే ।
యద్ వాక్యం నారదేనోక్తం వర్తతే హృది నిత్యశః ॥ 2
గడచిన ప్రతిదినాన్ని సావిత్రి లెక్కపెడుతూనే ఉంది. నారదుడు చెప్పిన మాట ఎల్లప్పుడు ఆమె మనస్సులో మెదలుతోంది. (2)
చతుర్థేఽహని మర్తవ్యమ్ ఇతి సంచింత్య భావినీ ।
వ్రతం త్రిరాత్రముద్దిశ్య దివారాత్రం స్థితాభవత్ ॥ 3
సత్యవంతుడు ఇక నాలుగురోజులలో మరణిస్తాడని భావించి, సావిత్రి త్రిరాత్రవ్రతాన్ని స్వీకరించి పగలు రేయి వ్రతదీక్షలోనే నిలిచింది. (3)
తం శ్రుత్వా నియమం తస్యాః భృశం దుఃఖాన్వితో నృపః ।
ఉత్థాయ వాక్యం సావిత్రీమ్ అబ్రవీత్ పరిసాంత్వయన్ ॥ 4
సావిత్రి వ్రతదీక్షను గురించి విని ద్యుమత్సేనుడు ఎంతో బాధపడ్డాడు. ఆమెను ఓదారుస్తూ ఆమెతో ఇలా అన్నాడు. (4)
ద్యుమత్సేన ఉవాచ
అతితీవ్రోఽయమారంభః త్వయాఽఽరబ్ధో నృపాత్మజే ।
తిసృణాం వసతీనాం హి స్థానం పరమదుశ్చరమ్ ॥ 5
ద్యుమత్సేనుడిలా అన్నాడు.
రాజకుమారీ! నీవు చాలా తీవ్రమయిన వ్రతాన్ని ప్రారంభించావు. మూడురోజులు ఉపవాసదీక్ష చాలా కష్టం. (5)
సావిత్య్రువాచ
న కార్యస్తాత సంతాపః పారయిష్యామ్యహం వ్రతమ్ ।
వ్యవసాయకృతం హీదం వ్యవసాయశ్చ కారణమ్ ॥ 6
సావిత్రి ఇలా అన్నది.
నాయనా! బాధపడనవసరం లేదు. వ్రతాన్ని పూర్తి చేస్తాను. దృఢనిర్ణయమే వ్రతానికి అవసరం. ఆ నిర్ణయంతోనే నేను వ్రతాన్ని చేస్తున్నాను. (6)
ద్యుమత్సేన ఉవాచ
వ్రతం భింధీతి వక్తుం త్వాం నాస్మి శక్తః కథంచన ।
పారయస్వేతి వచనం యుక్తమస్మద్విధో వదేత్ ॥ 7
ద్యుమత్సేనుడిలా అన్నాడు. వ్రతాన్ని భంగం చేసుకొమ్మని ఏ రీతిగాను నేను చెప్పలేను. నా వంటివాడు వ్రతాన్ని పూర్తి చేసుకో అని మాత్రమే చెప్పగలడు. (7)
మార్కండేయ ఉవాచ
ఏవముక్త్వా ద్యుమత్సేనః విరరామ మహామనాః ।
తిష్ఠంతీ చైవ సావిత్రీ కాష్ఠభూతేవ లక్ష్యతే ॥ 8
మార్కండేయుడిలా అన్నాడు.
మహామనస్వి అయిన ద్యుమత్సేనుడు ఆ మాట చెప్పి ముగించాడు. సావిత్రి కట్టెలాగా ఒకచోట నిలిచిపోయింది. (8)
శ్వోభూతే భర్తృమరణే సావిత్య్రా భరతర్షభ ।
దుఃఖాన్వితాయాస్తిష్ఠంత్యాః సా రాత్రిర్వ్యత్యవర్తత ॥ 9
భరతర్షభా! మరునాడే భర్తృమరణం సంభవించబోతోందన్న దుఃఖంలో ఉన్న సావిత్రికి ఉన్నపాటుగా ఆ రాత్రి గడచిపోయింది. (9)
అద్య తద్ దివసం చేతి హుత్వా దీప్తం హుతాశనమ్ ।
యుగమాత్రోదితే సూర్యే కృత్వా పౌర్వాహ్ణికీః క్రియాః ॥ 10
మరునాడు నేడే ఆ రోజని తలచి సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే పూర్వాహ్ణంలో చేయవలసిన పనులన్నీ ముగించి అగ్ని ప్రజ్వలింపజేసి ఆహుతుల నిచ్చింది. (10)
తతః సర్వాన్ ద్విజాన్ వృద్ధాన్ శ్వశ్రూం శ్వశురమేవ చ ।
అభివాద్యానుపూర్వ్యేణ ప్రాంజలిర్నియతా స్థితా ॥ 11
ఆ తరువాత సమస్తబ్రాహ్మణులకు, వృద్ధులకు, అత్తకు, మామకు యథాక్రమంగా నమస్కరించి నియమపూర్వకంగా చేతులు జోడించి నిలిచింది. (11)
అవైధవ్యాశిషస్తే తు సావిత్య్రర్థం హితాః శుభాః ।
ఊచుస్తపస్వినః సర్వే తపోవననివాసినః ॥ 12
ఆశ్రమవాసులయిన తాపసులందరూ సుమంగళీత్వాన్ని ఆశిస్తూ, హితాన్నీ, శుభాన్నీ కోరుతూ సావిత్రిని ఆశీర్వదించారు. (12)
ఏవమస్త్వితి సావిత్రీ ధ్యానయోగపరాయణా ।
మనసా తా గిరఃసర్వాః ప్రత్యగృహ్ణాత్ తపస్వినామ్ ॥ 13
ధ్యానయోగంలో నిలిచి ఉన్న సావిత్రి తాపసుల ఆశీర్వచనాలను "అలాగే జరగాలి" అనుకొంటూ మనసా స్వీకరించింది. (13)
తం కాలం తం ముహూర్తం చ ప్రతీక్షంతీ నృపాత్మజా ।
యథోక్తం నారదవచః చింతయంతీ సుదుఃఖితా ॥ 14
రాజకుమారి - సావిత్రి భర్త మరణించబోయే సమయానికీ, ముహుర్తానికీ ఎదురుచూస్తూ నారదుని మాటలను తలచుకొంటూ తీవ్రవేదనకు గురి అయింది. (14)
తతస్తు శ్వశ్రూశ్వశురౌ ఊచతుస్తాం నృపాత్మజామ్ ।
ఏకాంతమాస్థితాం వాక్యం ప్రీత్యా భరతసత్తమ ॥ 15
భరతశ్రేష్ఠా! ఆపై అత్తమామలు ఏకాంతంగా ఉన్న సావిత్రితో ప్రీతితో ఇలా అన్నారు. (15)
శ్వశురావూచతుః
వ్రతం యథోపదిష్టం తు తథా తత్ పారితం త్వయా ।
ఆహారకాలః సంప్రాప్తః క్రియతాం యదనంతరమ్ ॥ 16
అత్తమామలిలా అన్నారు.
శాస్త్రనిర్దేశాన్ని అనుసరించి నీవు తలపెట్టిన వ్రతాన్ని ముగించావు. పారణకు వేళ అయినది. అనంతర కర్తవ్యం కొనసాగించు. (16)
సావిత్య్రువాచ
అస్తం గతే మయాఽఽదిత్యే భోక్తవ్యం కృతకామయా ।
ఏష మే హృది సంకల్పః సమయశ్చ కృతో మయా ॥ 17
సావిత్రి ఇలా అన్నది.
సూర్యుడస్తమిస్తే నా కోరిక తీరుతుంది. అప్పుడే భుజిస్తాను. ఇది నా మనస్సంకల్పం. అలా జరగాలనే ప్రతిజ్ఞ పూనాను. (17)
మార్కండేయ ఉవాచ
ఏవం సంభాషమాణాయాః సావిత్య్రా భోజనం ప్రతి ।
స్కంధే పరశుమాదాయ సత్యవాన్ ప్రస్థితో వనమ్ ॥ 18
మార్కండేయుడిలా అన్నాడు. భోజనాన్ని గురించి సావిత్రి అలా మాటాడుతున్నప్పుడే సత్యవంతుడు భుజాన గొడ్డలి పెట్టుకొని వనానికి బయలుదేరాడు. (18)
సావిత్రీ త్వాహ భర్తారం వైకస్త్వం గంతుమర్హసి ।
సహ త్వయా గమిష్యామి న హి త్వాం హాతుముత్సహే ॥ 19
సావిత్రి భర్తతో ఇలా అన్నది. నీవు ఒంటరిగా పోవద్దు. నేను కూడా నీతో వస్తాను. నిన్ను వదలి ఉండాలనిపించటం లేదు. (19)
సత్యవానువాచ
వనం న గతపూర్వం తే దుఃఖం పంథాశ్చ భావిని ।
వ్రతోపవాసక్షామా చ కథం పద్భ్యాం గమిష్యసి ॥ 20
సత్యవంతుడిలా అన్నాడు.
భావినీ! నీవెప్పుడూ అరణ్యానికి రాలేదు. దారిలో ఇబ్బందులుంటాయి. వ్రతోపవాసాలతో చిక్కి ఉన్నావు. ఎలా నడవగలవు. (20)
సావిత్య్రువాచ
ఉపవాసాన్న మే గ్లానిః నాస్తి చాపి పరిశ్రమః ।
గమనే చ కృతోత్సాహాం ప్రతిషేద్ధుం న మార్హసి ॥ 21
సావిత్రి ఇలా అన్నది.
ఉపవాసంతో నేను బలహీనపడలేదు. అలసిపోలేదు కూడా. రావాలని ఉత్సాహపడుతున్న నన్ను నిషేధించదగదు. (21)
సత్యవానువాచ
యది తే గమనోత్సాహః కరిష్యామి తన ప్రియమ్ ।
మమ త్వామంత్రయ గురూన్ న మాం దోషః స్పృశేదయమ్ ॥ 22
సత్యవంతుడిలా అన్నాడు.
నీకు రావాలని అంతముచ్చటగా ఉంటే నీ కోరిక తీరుస్తా. అమ్మనాన్నలను అడుగు. అప్పుడు నా తప్పు ఉండదు. (22)
మార్కండేయ ఉవాచ
సాభివాద్యాబ్రవీచ్ఛ్వశ్రూం శ్వశురం చ మహావ్రతా ।
అయం గచ్ఛతి మే భర్తా ఫలాహారో మహావనమ్ ॥ 23
ఇచ్ఛేయమభ్యనుజ్ఞాతా ఆర్యయా శ్వశురేణ హ ।
అనేన సహ నిర్గంతుం న మేఽద్య విరహః క్షమః ॥ 24
గుర్వగ్నిహోత్రార్థకృతే ప్రస్థితశ్చ సుతస్తవ ।
న నివార్యో నివార్యః స్యాత్ అన్యథా ప్రస్థితో వనమ్ ॥ 25
సంవత్సరః కించిదూనః న నిష్క్రాంతాహమాశ్రమాత్ ।
వనం కుసుమితం ద్రష్టుం పరం కౌతూహలం హి మే ॥ 26
మార్కండేయుడిలా అన్నాడు.
మహావ్రతశీల అయిన సావిత్రి అత్తమామలకు నమస్కరించి ఇలా అన్నది - నా భర్త పండ్ల కోసం వనానికి వెళ్తున్నాడు.
అత్తమామల అనుమతితో ఆయనవెంట వెళ్ళాలనుకొంటున్నాను. ఈ రోజు నేను ఆయనను వీడి ఉండరాదు.
నీ కుమారుడు గురుజనుల ప్రయోజనం కోసం, అగ్నిహోత్రప్రయోజనం కోసం అడవికి బయలుదేరాడు. కాబట్టి అడ్డగించరాదు. మరే కారణం చేతనైనా బయలుదేరి ఉంటే ఆపవచ్చు. దాదాపు సంవత్సరం గడచిపోతోంది. నేనెప్పుడు ఆశ్రమం వీడి వెళ్ళలేదు. కుసుమించిన అరణ్యాన్ని చూడాలని నాకెంతో కుతూహలంగా ఉంది. (23-26)
ద్యుమత్సేన ఉవాచ
యతః ప్రభృతి సావిత్రీ పిత్రా దత్తా స్నుషా మమ ।
నానయాభ్యర్థనాయుక్తమ్ ఉక్తపూర్వం స్మరామ్యహమ్ । 27
ద్యుమత్సేనుడిలా అన్నాడు.
సావిత్రిని ఆమెతండ్రి నాకు కోడలుగా అప్పగించిననాటి నుండి నన్ను ఏ కోరికా కోరలేదు. నాకు బాగా గుర్తు. (27)
తదేషా లభతాం కామం యథాభిలషితం వధూః ।
అప్రమాదశ్చ కర్తవ్యః పుత్రి సత్యవతః పథి ॥ 28
కాబట్టి నా కోడలు కోరిక ఈరోజు తీరాలి. వెళ్ళు. అప్రమత్తంగా సత్యవంతుని మార్గంలోనే పయనించు. (28)
మార్కండేయ ఉవాచ
ఉభాభ్యామభ్యనుజ్ఞాతా సా జగామ యశస్వినీ ।
సహ భర్త్రాహసంతీవ హృదయేన విదూయతా ॥ 29
మార్కండేయుడిలా అన్నాడు.
అత్తమామలిద్దరి అనుమతి పొంది ఆ యశస్విని మనస్సులో బాధపడుతున్నా పైకి నవ్వుతూ భర్తతో బయలుదేరింది. (29)
సా వనాని విచిత్రాణి రమణీయాని సర్వశః ।
మయూరగణజుష్టాని దదర్శ విపులేక్షణా ॥ 30
ఆ విశాలాక్షి అంతటా నెమళ్ళగుంపులతో నిండి విచిత్రంగా రమణీయంగా కనిపిస్తున్న వనాలను చూసింది. (30)
నదీః పుణ్యవహాశ్చైవ పుష్పితాంశ్చ నగోత్తమాన్ ।
సత్యవానాహ పశ్యేతి సావిత్రీం మధురం వచః ॥ 31
'పుణ్యజలాలు ప్రవహించే నదులను, నిలువెల్లా పూసిన మహాపర్వతాలను చూడు' అని సత్యవంతుడు సావిత్రితో మధురంగా పలికాడు. (31)
నిరీక్షమాణా భర్తారం సర్వావస్థమనిందితా ।
మృతమేవ హి భర్తారం కాలే మునివచః స్మరన్ ॥ 32
పతివ్రత అయిన సావిత్రి సత్యవంతుని చర్య లన్నింటిని పరికిస్తోంది. నారదుని మాటను తలచుకొని భర్తమరణం తప్పదని నిశ్చయించుకొన్నది. (32)
అనువ్రజంతీ భర్తారం జగామ మృదుగామినీ ।
ద్విధేవ హృదయం కృత్వా తం చ కాలమవేక్షతీ ॥ 33
మందగామిని అయిన సావిత్రి మనస్సుని రెండుగా విభజించుకొని ఒకవైపు భర్తను అనుసరిస్తూ, మరొకవైపు రాబోయే క్షణానికై నిరీక్షిస్తోంది. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామహాత్మ్య పర్వణి సావిత్య్రుపాఖ్యానే షణ్ణవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 296 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతా మాహాత్మ్యపర్వమను ఉపపర్వమున సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది ఆరవ అధ్యాయము. (296)