300. మూడు వందలవ అధ్యాయము

(కుండలాహరణ పర్వము)

సూర్యుడు కర్ణునకు స్వప్నములో సాక్షాత్కరించుట.

జనమేజయ ఉవాచ
యత్ తత్ తదా మహద్ బ్రహ్మన్ లోమశో వాక్యమబ్రవీత్ ।
ఇంద్రస్య వచనాదేవ పాండుపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 1
యచ్చాపి తే భయం తీవ్రం న చ కీర్తయసే క్వచిత్ ।
తచ్చాప్యపహరిష్యామి ధనంజయ ఇతో గతే ॥ 2
కిం ను తజ్జపతాం శ్రేష్ఠ కర్ణం ప్రతి మహద్ భయమ్ ।
ఆసీన్న చ స ధర్మాత్మా కథయామాస కస్యచిత్ ॥ 3
జనమేజయుడిలా అన్నాడు.
బ్రహ్మస్వరూపా! లోమశుడు ఇంద్రుని మాట ననుసరించి పాండుకుమారుడైన యుధిష్ఠిరునికి ఒక గొప్ప విషయమిలా చెప్పాడు - "నీలో తీవ్రమైన భయమొకటుంది. దానిని నీవు ఎవ్వరికీ చెప్పటం లేదు. అయినా అర్జునుడు ఇక్కడ (స్వర్గలోకం) నుండి వెళ్ళిన తరువాత దానిని కూడా తొలగిస్తాను. తాపసశ్రేష్ఠా! ధర్మాత్ముడయిన యుధిష్ఠిరునకు ఎవ్వరికీ చెప్పుకొనలేనంత భయం కర్ణుని వలన ఏం కలిగింది? (1-3)
వైశంపాయన ఉవాచ
అహం తే రాజశార్దూల కథయామి కథామిమామ్ ।
పృచ్ఛతో భరతశ్రేష్ఠ శుశ్రూషస్వ గిరం మమ ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! రాజశార్దూలా! నీవు అడిగావు కాబట్టి ఈ కథనంతా చెపుతాను. నామాటను సావధానంగా విను. (4)
ద్వాదశే సమతిక్రాంతే వర్షే ప్రాప్తే త్రయోదశే ।
పాండూనాం హితకృచ్ఛక్రః కర్ణం భిక్షితుముద్యతః ॥ 5
పండ్రెండవ సంవత్సరం ముగిసి పదమూడవ సంవత్సరం ప్రారంభం కాగానే పాండవులకు మేలుచేస్తూ ఇంద్రుడు కర్ణుని యాచించటానికి సిద్ధమయ్యాడు. (5)
అభిప్రాయమథో జ్ఞాత్వా మహేంద్రస్య విభావసుః ।
కుండలార్థే మహారాజ సూర్యః కర్ణముపాగతః ॥ 6
మహారాజా! కుండలాలను యాచింపదలచిన మహేంద్రుని అభిప్రాయాన్ని గ్రహించి సూర్యభగవానుడు కర్ణుని దగ్గరకు వెళ్ళాడు. (6)
మహర్హే శయనే వీరం స్పర్ ద్ధ్యాస్తరణసంవృతే ।
శయానమతివిశ్వస్తం బ్రహ్మణ్యం సత్యవాదినమ్ ॥ 7
ఆ సమయంలో సత్యవాది, బ్రాహ్మణభక్తుడు, వీరుడు అయిన కర్ణుడు అందమైన పరుపులు పరిచిన విలువయిన శయ్యపై నిశ్చింతగా నిదురిస్తున్నాడు. (7)
స్వప్నాంతే నిశి రాజేంద్ర దర్శయామాస రశ్మివాన్ ।
కృపయా పరయాఽఽవిష్టః పుత్రస్నేహాచ్చ భారత ॥ 8
భారతా! రాజేంద్రా! సూర్యుడు పుత్రస్నేహంతో పరమదయాళువై ఆ రాత్రి కర్ణునకు కలలో కనిపించాడు. (8)
బ్రాహ్మణో వేదవిద్ భూత్వా సూర్యో యోగర్ ద్ధిరూపవాన్ ।
హితార్థమబ్రవీత్ కర్ణం సాంత్వపూర్వమిదం వచః ॥ 9
యోగసమృద్ధి సంపన్నమైన రూపం గల సూర్యుడు వేదవేత్త అయిన బ్రాహ్మణరూపాన్ని ధరించి కర్ణుని మేలుకోరి అనునయపూర్వకంగా ఇలా అన్నాడు. (9)
కర్ణ మద్వచనం తాత శృణు సత్యభృతాం వర ।
బ్రువతోఽద్య మహాబాహో సౌహృదాత్ పరమం హితమ్ ॥ 10
నాయనా! సత్యవాదులలో శ్రేష్ఠుడా! కర్ణా! మహాబాహూ! ప్రేమతో నీకు పరమహితమైన మాట ఈ రోజు చెప్తున్నాను. విను. (10)
ఉపాయాస్యతి శక్రస్త్యాం పాండవానాం హితేప్సయా ।
బ్రాహ్మణచ్ఛద్మనా కర్ణ కుండలాపజిహీర్షయా ॥ 11
కర్ణా! పాండవులకు మేలు చేయదలచి దేవేంద్రుడు నీ కుండలాలను అపహరించగోరి, బ్రాహ్మణవేషంతో రాబోతున్నాడు. (11)
విదితం తేన శీలం తే సర్వస్య జగతస్తథా ।
యథా త్వం భిక్షితః సద్భిః దదాస్యేవ న యాచసే ॥ 12
నీ స్వభావం ఆయనకు తెలుసు. లోకానికంతటికీ తెలుసు. మంచివాళ్ళు నిన్ను యాచిస్తే ఇచ్చేస్తావే కానీ నీవు దేనినీ అడగవు. (12)
త్వం హి తాత దదాస్యేవ బ్రాహ్మణేభ్యః ప్రయాచితమ్ ।
విత్తం యచ్ఛాన్యదప్యాహుః న ప్రత్యాఖ్యాసి కస్యచిత్ ॥ 13
నాయనా! డబ్బు అయినా మరేదయినా సరే బ్రాహ్మణులు యాచించినది నీవు తప్పక ఇస్తావు. ఎవ్వరినీ లేదని నిరాశపరచవు. (13)
త్వాం తు చైవంవిధం జ్ఞాత్వా స్వయం వై పాకశాసనః ।
ఆగంతా కుండలార్థాయ కవచం చైవ భిక్షితుమ్ ॥ 14
నీవు ఇటువంటివాడవని తెలిసి స్వయంగా దేవేంద్రుడే కుండలాలనూ, కవచాన్నీ యాచించటానికి రాబోతున్నాడు. (14)
తస్మై ప్రయాచమానాయ న దేయే కుండలే త్వయా ।
అనునేయః పరం శక్త్యా శ్రేయ ఏతద్ధి తే పరమ్ ॥ 15
యాచించినా సరే ఆయనకు నీవు కుండలాలను ఇవ్వవద్దు. ఏదో రీతిగా ఆయనను అనునయించి పంపాలి. ఇది నీకు చాలా శ్రేయస్కరం. (15)
కుండలార్థే బ్రువంస్తాత కారణైర్బహుభిస్త్వయా ।
అన్యైర్బహువిధైర్విత్తైః సన్నివార్యః పునః పునః ॥ 16
నాయనా! కుండలాలను అడిగినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పి, బహువిధాలయిన ఇతరధనాలను ఆశచూపి ఆయనను కుండలాల నడుగకుండా నివారించాలి. (16)
రత్నైః స్త్రీభిస్తథా గోభిః ధనైర్బహువిధైరపి ।
నిదర్శనైశ్చ బహుభిః కుండలేప్సుః పురందరః ॥ 17
కుండలాలు కోరిన దేవేంద్రుని రత్నాలు, స్త్రీలు, గోవులు, బహువిధ ధనాలు ఇచ్చి, వివిధ దృష్టాంతాలను వినిపించి నివారించాలి. (17)
యది దాస్యసి కర్ణ త్వం సహజే కుండలే శుభే ।
ఆయుషః ప్రక్షయం గత్వా మృత్యోర్వశముపైష్యసి ॥ 18
కర్ణా! శుభప్రదమైన ఈ సహజకుండలాలను నీవు దానం చేస్తే ఆయుస్సు క్షీణించి మృత్యువునకు లొంగిపోగలవు. (18)
కవచేన సమాయుక్తః కుండలాభ్యాం చ మానద ।
అవధ్యస్త్వం రణేఽరీణామితి విద్ధి వచో మమ ॥ 19
మానదా! నీవు కవచకుండలాలను ధరించినంత కాలం యుద్ధంలో శత్రువులు నిన్ను చంపలేరు. నామాటనర్థం చేసికో. (19)
అమృతాదుత్థితం హ్యేతత్ ఉభయం రత్నసంభవమ్ ।
తస్మాద్ రక్ష్యం త్వయా కర్ణ జీవితం చేత్ ప్రియం తవ ॥ 20
రత్నమయాలయిన ఈ కవచకుండలాలు అమృతం నుండి పుట్టినవి. కాబట్టి కర్ణా! నీకు బ్రతకాలనుకొంటే వీటిని కాపాడుకో. (20)
కర్ణ ఉవాచ
కో మామేవం భవాన్ ప్రాహ దర్శయన్ సౌహృదం పరమ్ ।
కామయా భగవన్ బ్రూహి కో భవాన్ ద్విజవేషధృక్ ॥ 21
కర్ణుడిలా అన్నాడు.
స్వామీ! తమరెవరు? నాపై పరమసౌహృదాన్ని ప్రదర్శిస్తూ మాటాడుతున్నారు. ఇష్టమయితే చెప్పండి. ద్విజరూపాన్ని ధరించిన తమ రెవరు? (21)
బ్రాహ్మణ ఉవాచ
అహం తాత సహస్రాంశుః సౌహృదాత్ త్వాం నిదర్శయే ।
కురుష్యైతద్ వచో మే త్వమ్ ఏతచ్ఛ్రేయః పరం హి తే ॥ 22
బ్రాహ్మణుడిలా అన్నాడు.
నాయనా! నేను సూర్యుడను. నీమీది ప్రేమతో నీముందు ప్రత్యక్షమయ్యాను. నామాటను పాటించు. ఇది నీకు గొప్ప మేలు చేస్తుంది. (22)
కర్ణ ఉవాచ
శ్రేయ ఏవ మమాత్యంతం యస్య మే గోపతిః ప్రభుః ।
ప్రవక్తాద్య హితాన్వేషీ శృణు చేదం వచో మమ ॥ 23
కర్ణుడిలా అన్నాడు.
నాహితాన్ని కోరి సూర్యభగవానుడే నేడు బోధచేస్తుంటే ఇదే నాకు పరమశ్రేయస్సు. నామాట కూడా వినండి. (23)
ప్రసాదయే త్వాం వరదం ప్రణయాచ్చ బ్రవీమ్యహమ్ ।
న నివార్యో వ్రతాదస్మాత్ అహం యద్యస్మి తే ప్రియః ॥ 24
వరదాత అయిన మిమ్ములను వేడుకొంటున్నాను. స్నేహభావంతో చెప్తున్నాను. నా మీద తమకు ఇష్టముంటే నావ్రతం నుండి నన్ను నివారించకండి (24)
వ్రతం వై మమ లోకోఽయం వేత్తి కృత్స్నం విభావసో ।
యథాహం ద్విజముఖ్యేభ్యః దద్యాం ప్రాణానపి ధ్రువమ్ ॥ 25
సూర్యదేవా! నావ్రతమేమిటో ఈ లోకానికంతటికీ తెలుసు. బ్రాహ్మణప్రవరులకై నా ప్రాణాలయినా ఇచ్చి తీరుతాను. (25)
యద్యాగచ్ఛతి మాం శక్రః బ్రాహ్మణచ్ఛద్మనా వృతః ।
హితార్థం పాండుపుత్రాణాం ఖేచరోత్తమ భిక్షితుమ్ ॥ 26
దాస్యామి విబుధశ్రేష్ఠ కుండలే వర్మ చోత్తమమ్ ।
న మే కీర్తిః ప్రణశ్యేత త్రిషు లోకేషు విశ్రుతా ॥ 27
గగనచరశ్రేష్ఠా! పాండవుల మేలుకోరి దేవేంద్రుడు బ్రాహ్మణవేషంతో నన్ను యాచించటానికి వస్తే ఉత్తమకవచాన్ని, కుండలాలను ఇస్తాను. దేవతాశ్రేష్ఠా! మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కిన నా కీర్తి నశించకూడదు. (26,27)
మద్విధస్య యశస్యం హి న యుక్తం ప్రాణరక్షణమ్ ।
యుక్తం హి యశసా యుక్తం మరణం లోకసమ్మతమ్ ॥ 28
నావంటివాడు ప్రాణాలనిచ్చి అయినా కీర్తిని కాపాడు కోవాలే కానీ ప్రాణాలను కాదు. కీర్తిమంతుడై మరణించటం తగినదీ, లోకసమ్మతమైనది కూడా. (28)
సోఽహమింద్రాయ దాస్యామి కుండలే సహ వర్మణా ।
యది మాం బలవృత్రఘ్నః భిక్షార్థముపయాస్యతి ॥ 29
అందువలన దేవేంద్రుడు భిక్షకై నా దగ్గరకు వస్తే ఆ ఇంద్రునకు కవచంతో పాటు కుండలాల నిస్తాను. (29)
హితార్థం పాండుపుత్రాణాం కుండలే మే ప్రయాచితమ్ ।
తన్మే కీర్తికరం లోకే తస్యాకీర్తిర్భవిష్యతి ॥ 30
పాండవుల హితానికై నా కుండలాలను యాచించటం లోకంలో నాకు కీర్తిహేతువే. ఆ ఇంద్రునకే అపకీర్తి కలుగుతుంది. (30)
వృణోమి కీర్తిం లోకే హి జీవితేనాపి భానుమన్ ।
కీర్తిమానశ్నుతే స్వర్గం హీనకీర్తిస్తు నశ్యతి ॥ 31
సూర్యా! లోకంలో జీవితానికన్న కీర్తినే నేను కోరుకొంటాను. కీర్తిమంతుడు స్వర్గాన్ని పొందుతాడు. కీర్తిలేనివాడు నశిస్తాడు. (31)
కీర్తిర్హి పురుషం లోకే సంజీవయతి మాతృవత్ ।
అకీర్తిర్జీవితం హంతి జీవతోఽపి శరీరిణః ॥ 32
కీర్తి తల్లివలె మనుజుని లోకంలో బ్రతికిస్తుంది. అపకీర్తి బ్రతికి ఉన్న వాడి జీవితాన్ని కూడా నశింపజేస్తుంది. (32)
అయం పురాణః శ్లోకో హి స్వయం గీతో విభావసో ।
ధాత్రా లోకేశ్వర యథా కీర్తిరాయుర్నరస్య హ ॥ 33
లోకనాథా! సూర్యా! కీర్తియే మనుష్యుని ఆయుస్సని సాక్షాత్తు బ్రహ్మదేవుడే పూర్వకాలంలో ప్రస్తుతించి యున్నాడు. (33)
పురుషస్య పరే లోకే కీర్తిరేవ పరాయణమ్ ।
ఇహ లోకే విశుద్ధా చ కీర్తిరాయుర్వివర్ధనీ ॥ 34
పురుషునకు పరలోకంలో కీర్తియే దిక్కు. ఇహలోకంలో విశుద్ధకీర్తి ఆయుస్సును పెంపొందిస్తుంది. (34)
సోఽహం శరీరజే దత్త్వా కీర్తిం ప్రాప్స్యామి శాశ్వతీమ్ ।
దత్త్వా చ విధివద్ దానం బ్రాహ్మణేభ్యో యథావిధి ॥ 35
హుత్వా శరీరం సంగ్రామే కృత్వా కర్మ సుదుష్కరమ్ ।
విజిత్య చ పరానాజౌ యశః ప్రాప్స్యామి కేవలమ్ ॥ 36
కాబట్టి నేను శరీరంతోపాటు పుట్టిన కవచకుండలాలను దానం చేసి శాశ్వతకీర్తిని పొందుతాను బ్రాహ్మణులకు శాస్త్రోక్తంగా దానం చేసి, దుష్కరపరాక్రమాన్ని ప్రదర్శించి, రణరంగంలో శరీరాన్ని ఆహుతి చేసి, శత్రువులను యుద్ధంలో జయించి కీర్తిని మాత్రమే పొందుతాను. (35,36)
భీతానామభయం దత్త్వా సంగ్రామే జీవితార్థినామ్ ।
వృద్ధాన్ బాలాన్ ద్విజాతీంశ్చ మోక్షయిత్వా మహాభయాత్ ॥ 37
ప్రాప్స్యామి పరమం లోకే యశః స్వర్గమనుత్తమమ్ ।
జీవితేనాపి మే రక్ష్యా కీర్తిస్తద్ విద్ధి మే వ్రతమ్ ॥ 38
రణభూమిలో భయపడి జీవితాన్ని యాచించే వారికి అభయాన్ని ఇచ్చి; వృద్ధులను, బాలురను, బ్రాహ్మణులను మహాభయం నుండి విడిపించి, లోకంలో ఘనకీర్తినీ, అనుత్తమమయిన స్వర్గాన్ని పొందుతాను. ప్రాణాలనిచ్చి అయినా కీర్తినే కాపాడుకోవాలన్నదే నా వ్రతం, గ్రహించండి. (37,38)
సోఽహం దత్త్వా మఘవతే భిక్షా మేతామనుత్తమామ్ ।
బ్రాహ్మణచ్ఛద్మినే దేవ లోకే గంతా పరాం గతిమ్ ॥ 39
కాబట్టి సూర్యదేవా! నేను బ్రాహ్మణవేషంతో వచ్చిన ఇంద్రునకు భిక్షపెట్టి ఇహపరలోకాలలో ఉత్తమగతులు పొందుతాను. (39)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి సూర్యకర్ణ సంవాదే త్రిశతతమోఽధ్యాయః ॥ 300 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున సూర్యకర్ణసంవాదమను మూడువందలవ అధ్యాయము. (300)