299. రెండు వందల తొంబది తొమ్మిదవ అధ్యాయము
ద్యుమత్సేన రాజ్యాభిషేకము.
మార్కండేయ ఉవాచ
తస్యాం రాత్య్రాం వ్యతీతాయామ్ ఉదితే సూర్యమండలే ।
కృతపౌర్వాహ్ణికాః సర్వే సమేయుస్తే తపోధనాః ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
ఆ రాత్రి గడచి మరునాడు సూర్యోదయం తర్వాత ప్రాతఃకాలానుష్ఠానాలు ముగించుకొని తపోధనులందరూ గుమిగూడారు. (1)
తదేవ సర్వం సావిత్య్రాః మహాభాగ్యం మహర్షయః ।
ద్యుమత్సేనాయ నాతృప్యన్ కథయంతః పునః పునః ॥ 2
మహర్షులు సావిత్రి మహాబాగ్యమంతా ద్యుమత్సేనునితో మరలా మరలా చెప్పినా కూడా వారికి తృప్తి కలుగలేదు. (2)
తతః ప్రకృతయః సర్వాః శాల్వేభ్యోఽభ్యాగతా నృప ।
ఆచఖ్యుర్నిహతం చైవ స్వేనామాత్యేన తం ద్విషమ్ ॥ 3
రాజా! అంతలో శాల్వ దేశం నుండి ప్రజలు వచ్చి శత్రువు తమ అమాత్యునిచే వధింపబడ్డాడు అని ద్యుమత్సేనునకు చెప్పారు. (3)
తం మంత్రిణా హతం శ్రుత్వా ససహాయం సబాంధవమ్ ।
న్యవేదయన్ యథావృత్తం విద్రుతం చ ద్విషద్బలమ్ ॥ 4
ఐకమత్యం చ సర్వస్య జనస్యాథ నృపం ప్రతి ।
సచక్షుర్వాప్యచక్షుర్వా స నో రాజా భవత్వితి ॥ 5
ద్యుమత్సేనుని శత్రువు అనుచరబంధుగణాలతో సహా మంత్రిచేతులలో మరణించినట్లు మిగిలిన శత్రుసేనలు పారిపోయినట్లు విని ప్రజలు అందరూ ఒక్కటై ద్యుమత్సేనుని వైపు మొగ్గారు. కళ్ళున్నా, లేకపోయినా ద్యుమత్సేనుడే తమ రాజు కావాలని నిర్ణయించుకొన్నారు. (4,5)
అనేన నిశ్చయేనేహ వయం ప్రస్థాపితా నృప ।
ప్రాప్తానీమాని యానాని చతురంగం చ తే బలమ్ ॥ 6
రాజా! ఆ నిర్ణయంతో మమ్ము ఇక్కడకు పంపారు. వాహనాలు, చతురంగబలాలు తమ సేవకై వచ్చి ఉన్నాయి. (6)
ప్రయాహి రాజన్ భద్రం తే ఘుష్టస్తే నగరే జయః ।
అధ్యాస్స్వ చిరరాత్రాయ పితృపైతామహం పదమ్ ॥ 7
రాజా! బయలుదేరు. తమకు మేలు జరుగుతుంది. నగరంలో జయఘోష వినిపిస్తోంది.
చిరకాలం వంశపరంపరగా వచ్చిన స్థానాన్ని అలంకరించండి. (7)
చక్షుష్మంతం చ తం దృష్ట్వా రాజానం వపుషాన్వితమ్ ।
మూర్థ్నా నిపతితాః సర్వే విస్మయోత్ఫుల్లలోచనాః ॥ 8
చూపును పొంది నూత్నతేజస్సుతో నున్న రాజు రూపాన్ని చూసి ఆశ్చర్యంతో విప్పారిన కన్నులు గల ఆ ప్రకృతులు అందరూ రాజుపాదాలపై తలలు వాల్చారు.(8)
తతోఽభివాద్య తాన్ వృద్ధాన్ ద్విజానాశ్రమవాసినః ।
తైశ్చాభిపూజితః సర్వైః ప్రయయౌ నగరం ప్రతి ॥ 9
అప్పుడు ద్యుమత్సేనుడు ఆశ్రమవాసులయిన వృద్ధబ్రాహ్మణులకు నమస్కరించి, వారి సత్కారాలు పొంది నగరం వైపు బయలుదేరాడు. (9)
శైబ్యా చ సహ సావిత్య్రా స్వాస్తీర్ణేన సువర్చసా ।
నరయుక్తేన యానేన ప్రయయౌ సేనయా వృతా ॥ 10
శైబ్య, సావిత్రి సేనలు చుట్టు నడవగా పల్లకిలో బయలుదేరారు. ఆ పల్లకి కాంతిమంతమైనది. మంచి పరుపులు గలది. మనుష్యులు మోస్తున్నది (10)
తతోఽభిషిషిచుః ప్రీత్యా ద్యుమత్సేనం పురోహితాః ।
పుత్రం చాస్య మహాత్మానం యౌవరాజ్యేఽభ్యషేచయన్ ॥ 11
అప్పుడు పురోహితులు ప్రీతితో ద్యుమత్సేనుని అభిషేకించారు. మహాత్ముడైన సత్యవంతుని యువరాజుగా అభిషేకించారు. (11)
తతః కాలేన మహతా సావిత్య్రాః కీర్తివర్ధనమ్ ।
తద్ వై పుత్రశతం జజ్ఞే శూరాణామనివర్తినామ్ ॥ 12
ఆ తరువాత చాలాకాలానికి సావిత్రికి కీర్తివర్ధనులు, శూరులై, యుద్ధంలో వెనుకంజవేయని నూర్గురు కొడుకులు కలిగారు. (12)
భ్రాతౄణాం సోదరాణాం చ తథైవాస్యాభవచ్ఛతమ్ ।
మద్రాధిపస్యాశ్వపతేర్మాలవ్యాం సుమహద్ బలమ్ ॥ 13
మద్రరాజయిన ద్యుమత్సేనునకు మాలవియందు బలశాలురయిన వందమంది కొడుకులు పుట్టారు. దానితో సావిత్రికి సహోదరశతం పుట్టినట్టయింది. (13)
ఏవమాత్మా పితా మాతా శ్వశ్రూః శ్వశుర ఏవ చ ।
భర్తుః కులం చ సావిత్య్రా సర్వం కృచ్ఛ్రాత్ సముద్ధృతమ్ ॥ 14
ఈ రీతిగా సావిత్రి తనను, తండ్రిని, తల్లిని, అత్తను, మామను భర్తృకులాన్ని కూడా ఆపదనుండి గట్టెక్కించింది. (14)
తథైవైషా హి కల్యాణీ ద్రౌపదీ శీలసమ్మతా ।
తారయిష్యతి వః సర్వాన్ సావిత్రీవ కులాంగనా ॥ 15
ఆ సావిత్రి వలె కులకాంత, కళ్యాణి, శీలవతి అయిన ద్రౌపది కూడా మిమ్మందరినీ గట్టెక్కిస్తుంది. (15)
వైశంపాయన ఉవాచ
ఏవం స పాండవస్తేన అనునీతో మహాత్మనా ।
విశోకో విజ్వరో రాజన్ కామ్యకే న్యవసత్ తదా ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! ఈ రీతిగా మహాత్ముడైన మార్కండేయుడు అనునయించగా అప్పుడు ధర్మరాజు శోకాన్నీ చింతనూ వీడి కామ్యకవనంలో నివసించసాగాడు. (16)
యశ్చేదం శృణుయాద్ భక్త్యా సావిత్య్రాఖ్యానముత్తమమ్ ।
స సుఖీ సర్వసిద్ధార్థః న దుఃఖం ప్రాప్నుయాన్నరః ॥ 17
ఉత్తమమైన ఈ సావిత్య్రుపాఖ్యానాన్ని భక్తితో విన్నవాడు సర్వకార్యసిద్ధిని పొంది సుఖంగా ఉంటాడు. దుఃఖాన్ని పొందడు. (17)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి పతివ్రతామాహాత్మ్యపర్వణి
సావిత్య్రుపాఖ్యానే నవనవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 299 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున పతివ్రతా మాహాత్మ్యపర్వమను ఉపపర్వమున సావిత్య్రుపాఖ్యానమను రెండువందల తొంబది తొమ్మిదవ అధ్యాయము. (299)