304. మూడువందల నాల్గవ అధ్యాయము

కుంతి బ్రాహ్మణునకు పరిచర్యలు చేయుట.

కుంత్యువాచ
బ్రాహ్మణం యంత్రితా రాజన్ ఉపస్థాస్యామి పూజయా ।
యథాప్రతిజ్ఞం రాజేంద్ర న చ మిథ్యా బ్రవీమ్యహమ్ ॥ 1
రాజేంద్రా! నియంత్రణతో నీ ప్రతిజ్ణానుసారం ఈ బ్రాహ్మణుని సేవకై సన్నిధిలోనే నిలుస్తాను. నేను పొల్లుమాటలు పలకటం లేదు. (1)
ఏష చైవ స్వభావో మే పూజయేయం ద్విజానితి ।
తవ చైవ ప్రియం కార్యం శ్రేయశ్చ పరమం మమ ॥ 2
బ్రాహ్మణులను పూజించాలి అన్నది నా స్వభావం కూడా. ఇది నీకు ఇష్టమయిన పని. నాకు పరమ శ్రేయోదాయకమైన పని. (2)
యద్యేవైష్యతి సాయాహ్నే యది ప్రాతరథో నిశి ।
యద్యర్ధరాత్రే భగవాన్ న మే కోపం కరిష్యతి ॥ 3
ఈ పూజ్యవిప్రుడు సాయంకాలం వచ్చినా, ప్రాతఃకాలమందే వచ్చినా, అర్ధరాత్రియందు వచ్చినా నాపై కోపపడకుండునట్లు సేవిస్తాను. (3)
లాభో మమైష రాజేంద్ర యద్ వై పూజయతీ ద్విజాన్ ।
ఆదేశే తవ తిష్ఠంతీ హితం కుర్యాం నరోత్తమ ॥ 4
నరోత్తమా! రాజేంద్రా! ఇది నాకు కూడా లాభదాయకమే. ద్విజుల నర్చిస్తూ, నీ ఆజ్ఞను పరిపాలిస్తూ హితాన్ని కలిగిస్తాను. (4)
విస్రబ్ధో భవ రాజేంద్ర న వ్యలీకం ద్విజోత్తమః ।
వసన్ ప్రాప్స్యతి తే గేహే సత్యమేతద్ బ్రవీమి తే ॥ 5
రాజేంద్రా! నమ్మకంతో నిలు. ఈ బ్రాహ్మణుడు నీ ఇంట నివసిస్తూ ఎప్పుడూ అప్రియాన్ని చవిచూడడు. ఈ సత్యాన్ని నీకు చెప్తున్నాను. (5)
యత్ ప్రియం చ ద్విజస్యాస్య హితం చైవ తవానఘ ।
యతిష్యామి తథా రాజన్ వ్యేతు తే మానసో జ్వరః ॥ 6
అనఘా! రాజా! ఈ ద్విజునకు ఏది ప్రియకరమో, నీకు ఏది హితకరమో దానికై ప్రయత్నిస్తాను. నీ మనస్సులోని చింత తొలగిపోవుగాక! (6)
బ్రాహ్మణా హి మహాభాగాః పూజితాః పృథివీపతే ।
తారణాయ సమర్థాః స్యుః విపరీతే వధాయ చ ॥ 7
రాజా! మహాభాగులైన బ్రాహ్మణులను పూజిస్తే వారు తరింపజేయ సమర్థులు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే వారు చంపటానికి కూడా సమర్థులే. (7)
సాహమేతద్ విజానంతీ తోషయిష్యే ద్విజోత్తమమ్ ।
న మత్కృతే వ్యథాం రాజన్ ప్రాప్స్యసి ద్విజసత్తమాత్ ॥ 8
నాకు అది తెలుసు. కాబట్టి ఈ ద్విజోత్తముని సంతోషపెడతాను. రాజా! నా కారణంగా ఈ బ్రాహ్మణోత్తముని వలన నీకు వ్యథ కలుగదు. (8)
అపరాధేఽపి రాజేంద్ర రాజ్ఞామశ్రేయసే ద్విజాః ।
భవంతి చ్యవనో యద్వత్ సుకన్యాయాః కృతే పురా ॥ 9
రాజేంద్రా! అపరాధం చేసినా కూడా రాజులకు బ్రాహ్మణులు కీడు చేస్తారు. పూర్వం సుకన్య తప్పు చేస్తే చ్యవనుడు శర్యాతికి కీడు చేయతలపెట్టాడు గదా! (9)
నియమేన పరేణాహమ్ ఉపస్థాస్యే ద్విజోత్తమమ్ ।
యథా త్వయా నరేంద్రేదం భాషితం బ్రాహ్మణం ప్రతి ॥ 10
నరోత్తమా! నీవు చెప్పినట్లుగా బ్రాహ్మణునితో ప్రవర్తించవలసిన పద్ధతిని పరమనియమంతో పాటిస్తూ నేను ఈ ద్విజోత్తముని సేవిస్తాను. (10)
ఏవం బ్రువంతీం బహుశః పరిష్వజ్య సమర్థ్య చ ।
ఇతి చేతి చ కర్తవ్యం రాజా సర్వమథాదిశత్ ॥ 11
ఈ రీతిగా మాటాడుతున్న పృథను మాటిమాటికి దగ్గరకు తీసికొని, ఆమె మాటను సమర్థించి రాజు ఎలా ఎలా చేయాలో ఆమెను పూర్తిగా ఆదేశించాడు. (11)
రాజోవాచ
ఏవమేతత్ త్వయా భద్రే కర్తవ్యమవిశంకయా ।
మద్ధితార్థం తథాఽత్మార్థం కులార్థం చాప్యనిందితే ॥ 12
రాజు ఇలా అన్నాడు. కళ్యాణీ! నాకూ, నీకూ, మనవంశానికీ మేలు జరగటానికై నీవు ఇదంతా ఈ పద్ధతిలో నిస్సందేహంగా చేయాలి. (12)
ఏవముక్త్వా తు తాం కన్యాం కుంతిభోజో మహాయశాః ।
పృథాం పరిదదౌ తస్మై ద్విజాయ ద్విజవత్సలః ॥ 13
మహాయశస్వి, ద్విజవత్సలుడు అయిన కుంతిభోజుడు కుమార్తెకు ఆ రీతిగా చెప్పి పృథను సేవకై బ్రాహ్మణున కర్పించాడు. (13)
ఇయం బ్రహ్మన్ మమ సుతా బాలా సుఖవివర్ధితా ।
అపరాధ్యేత యత్ కించిద్ కార్యం హృది తత్ త్వయా ॥ 14
బ్రహ్మస్వరూపా! ఈమె నా కుమార్తె. చిన్నపిల్ల. సుఖంగా పెరిగింది. ఏదైనా తప్పుచేస్తే దానిని మనస్సులో పెట్టుకొనవలదు. (14)
ద్విజాతయో మహాభాగాః వృద్ధబాలతపస్విషు ।
భవంత్యక్రోధనాః ప్రాయః హ్యపరాద్ధేషు నిత్యదా ॥ 15
మహాభాగులయిన బ్రాహ్మణులు వృద్ధులు, బాలురు, తాపసులు తప్పు చేసినా వారిపై ఎప్పుడూ కోపపడరు. (15)
సుమహత్యరాధేఽపి క్షాంతిః కార్యా ద్విజాతిభిః ।
యథాశక్తి యథోత్సాహం పూజా గ్రాహ్యా ద్విజోత్తమ ॥ 16
ద్విజోత్తమా! ఎంతపెద్ద తప్పు జరిగినా బ్రాహ్మణులు సహనాన్నే ప్రదర్శించాలి. యథాశక్తిగా, యథోత్సాహంగా జరిగే పూజను స్వీకరించాలి. (16)
తథేతి బ్రాహ్మణేనోక్తం స రాజా ప్రీతమానసః ।
హంసచంద్రాంశుసంకాశం గృహమస్మై న్యవేదయత్ ॥ 17
ఆ బ్రాహ్మణుడు 'అలాగే' అన్నాడు. ఆ రాజు ఆనందించాడు. హంసవలె, చంద్రకిరణాలవలె ప్రకాశిస్తున్న గృహాన్ని ఆ బ్రాహ్మణునకు నిర్దేశించాడు. (17)
తత్రాగ్నిశరణే క్లప్తమ్ ఆసనం తస్య భానుమత్ ।
ఆహారాది చ సర్వం తత్ తథైవ ప్రత్యవేదయత్ ॥ 18
ఆ ఇంట అగ్నిహోత్రగృహంలో కాంతిమంతమైన ఆసనం ఆ ద్విజునకై ఏర్పాటు చేయబడింది. ఆహారసామగ్రి అంతా కూడా అక్కడే సమకూర్చబడింది. (18)
నిక్షిప్య రాజపుత్రీ తు తంద్రీం మానం తథైవ చ ।
ఆతస్థే పరమం యత్నం బ్రాహ్మణస్యాభిరాధనే ॥ 19
రాజకుమారి పృథ అలసట, అభిమానం లేకుండా పరమప్రయత్నంతో బ్రాహ్మణసేవలో లగ్నమయింది. (19)
తత్ర సా బ్రాహ్మణం గత్వా పృథా శౌచపరా సతీ ।
విధివత్ పరిచారార్హం దేవవత్ పర్యతోషయత్ ॥ 20
బాహ్యాంభంతరాల్లో పరిశుద్ధమయిన పృథ బ్రాహ్మణుని దగ్గర దేవతలను వలె ఆయనను యథావిధిగా సేవిస్తూ సంతోషపెట్టింది. (20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి పృథాద్విజపరిచర్యాయాం చతురధికత్రిశతతమోఽధ్యాయః ॥ 304 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున పృథాద్విజపరిచర్యయను మూడువందల నాలుగవ అధ్యాయము. (304)