305. మూడువందల ఐదవ అధ్యాయము

సేవాసంతుష్టుడైన బ్రహ్మర్షి పృథకు మంత్రము నుపదేశించుట.

వైశంపాయన ఉవాచ
సా తు కన్యా మహారాజ బ్రాహ్మణం సంశితవ్రతమ్ ।
తోషయామాస శుద్ధేన మనసా సంశితవ్రతా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
మహారాజా! నియమంగా వ్రతపాలన చేస్తూ ఆ పృథ పరిశుద్ధ హృదయంతో వ్రతనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని ఆనందింపజేసింది. (1)
ప్రాతరేష్యామ్యథేత్యుక్త్వా కదాచిద్ ద్విజసత్తమః ।
తత ఆయాతి రాజేంద్ర సాయం రాత్రా వథో పునః ॥ 2
రాజేంద్రా! ఒక్కొక్క సమయంలో ఆ ద్విజసత్తముడు మరునాడుదయం వస్తానని వెళ్ళి ఆ సాయంకాలానికో, రాత్రికో తిరిగి వచ్చేవాడు. (2)
తం చ సర్వాసు వేలాసు భక్ష్యభోజ్యప్రతిశ్రయైః ।
పూజయామాస సా కన్యా వర్ధమానైస్తు సర్వదా ॥ 3
ఆ కన్య సర్వవేళలలోనూ అంతకు ముందు కన్న ఎక్కువగా భక్ష్యభోజ్యాది సామగ్రిని, శయ్యాసనాదులనూ సమకూరుస్తూ ప్రతిదినమూ సేవిస్తోంది. (3)
అన్నాది సముదాచారః శయ్యాసనకృతస్తథా ।
దివసే దివసే తస్య వర్ధతే న తు హీయతే ॥ 4
ఆహారాది సత్కారాలతో, శయ్యాసనాది పరిచర్యలతో ఆమె ఆయనకు చేస్తున్న సేవ రోజురోజుకూ పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. (4)
నిర్భర్త్సనాపవాదైశ్చ తథైవాప్రియయా గిరా ।
బ్రాహ్మణస్య పృథా రాజన్ న చకారాప్రియం తదా ॥ 5
రాజా! ఆ బ్రాహ్మణుడు ధిక్కరించినా, దోషారోపణచేసినా, అప్రియంగా మాటాడినా కూడా పృథ ఆయనకు అప్రియమైన పని ఏమీ చేయలేదు. (5)
వ్యస్తే కాలే పునశ్చైతి న చైతి బహుశో ద్విజః ।
సుదుర్లభమపి హ్యన్నం దీయతామితి సోఽబ్రవీత్ ॥ 6
ఆ ద్విజుడు ఒక్కొక్కసారి వెళ్ళినవాడు మరేపనికీ వ్యవధి ఇవ్వకుండానే తిరిగి వచ్చేవాడు. ఒక్కొకసారి కొన్నిరోజుల వరకు కనిపించేవాడు కాదు. అత్యంతదుర్లభమైన ఆహారపదార్థాలను అడిగేవాడు. (6)
కృతమేవ చ తత్ సర్వం యథా తస్మై న్యవేదయత్ ।
శిష్యవత్ పుత్రవచ్చైవ స్వసృవచ్చ సుసంయతా ॥ 7
కానీ పృథ శిష్యునివలె, పుత్రునివలె, సోదరివలె అత్యంత నిగ్రహంతో అదంతా సిద్ధంగానే ఉందని ఆయనతో చెప్తూ సేవిస్తూండేది. (7)
యథీపజోషం రాజేంద్ర ద్విజాతిప్రవరస్య సా ।
ప్రీతిముత్పాదయామాస కన్యారత్నమనిందితా ॥ 8
రాజేంద్రా! దోషం లేని కన్యారత్నమైన ఆ పృథ ఆ బ్రాహ్మణోత్తముని అభిరుచి ననుసరించి ప్రవర్తిస్తూ ఆయనకు ప్రీతిని కలిగించింది. (8)
తస్యాస్తు శీలవృత్తేన తుతోష ద్విజసత్తమః ।
అవధానేన భూయోఽస్యాః పరం యత్నమథాకరోత్ ॥ 9
ఆమె స్వభావంతో, నడవడితో, ఏకాగ్రతతో ఆ ద్విజోత్తముడు ఆనందించాడు. ఆమెకు హితం కలగాలని ఎంతో ప్రయత్నించాడు. (9)
తాం ప్రభాతే చ సాయం చ పితా పప్రచ్ఛ భారత ।
అపి తుష్యతి తే పుత్రి బ్రాహ్మణః పరిచర్యయా ॥ 10
భారతా! ఉదయమూ, సాయంకాలమూ కూడా ఆమె తండ్రి "వత్సా! బ్రాహ్మణుడు నీ సేవతో సంతోషపడుతున్నాడా?" అని అడిగేవాడు. (10)
తం సా పరమమిత్యేవ ప్రత్యువాచ యశస్వినీ ।
తతః ప్రీతిమవాపాగ్య్రాం కుంతిభోజో మహామనాః ॥ 11
"చాలా ఆనందిస్తున్నాడు" అని ఆ యశస్విని తండ్రికి సమాధానమిచ్చేది. దానితో మహామనస్వి అయిన కుంతిభోజుడు పరమానందపడేవాడు. (11)
తతః సంవత్సరే పూర్ణే యదాసౌ జపతాం వరః ।
నాపశ్యద్ దుష్కృతం కించిత్ పృథాయాః సౌహృదే రతః ॥ 12
తతః ప్రీతమనా భూత్వా స ఏనాం బ్రాహ్మణోఽబ్రవీత్ ।
ప్రీతోఽస్మి పరమం భద్రే పరిచారేణ తే శుభే ॥ 13
వరాన్ వృణీష్వ కల్యాణి దురాపాన్ మానుషైరిహ ।
యైస్త్వం సీమంతినీః సర్వా యశసాభిభవిష్యసి ॥ 14
అలా సంవత్సరం గడిచిపోయింది. మునివరుడైన ఆ బ్రాహ్మణునకు పృథపరిచర్యలో ఏలోపమూ కనిపించలేదు. దానితో ఆనందించిన ఆయన ఆమెపై వాత్సల్యంతో ఇలా అన్నాడు.
'భద్రా! నీ పరిచర్యతో ఏంతో ప్రీతిని పొందాను. కళ్యాణీ! మానవులకు పొందసాధ్యం కాని వరాలను కోరుకో! ఇస్తాను. దానితో నీవు కీర్తిలో స్త్రీలనందరినీ మించిపోగలవు. (12-14)
కుంత్యువాచ
కృతాని మమ సర్వాణి యస్యా మే వేదవిత్తమ ।
త్వం ప్రసన్నః పితా చైవ కృతం విప్ర వరైర్మమ ॥ 15
కుంతి ఇలా అన్నది. వేదవిత్తమా! నా సేవలకు తమరు, నాతండ్రి సంతసించారు. నా కోరికలన్నీ తీరినట్లే. బ్రాహ్మణా! నాకు వరాలతో పనిలేదు. (15)
బ్రాహ్మణ ఉవాచ
యది నేచ్ఛసి మత్తస్త్వం వరం భద్రే శుచిస్మితే ।
ఇమం మంత్రం గృహాణ త్వమ్ ఆహ్వానాయ దివౌకసామ్ ॥ 16
బ్రాహ్మణుడిలా అన్నాడు. కళ్యాణీ! శుచిస్మితా! నానుండి నీకు వరం అవసరం లేకపోతే ఈ మంత్రాన్ని స్వీకరించు. దీనితో దేవతలను ఆహ్వానించవచ్చు. (16)
యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యసి ।
తేన తేన వశే భద్రే స్థాతవ్యం తే భవిష్యతి ॥ 17
భద్రా! ఈ మంత్రంతో నీవు ఏ దేవతల నాహ్వానిస్తే ఆ దేవతలు నీ అధీనంలో ఉండవలసి వస్తుంది. (17)
అకామో వా సకామో వా స సమేష్యతి తే వశే ।
విబుధో మంత్రసంశాంతః భవేద్ భృత్య ఇవానతః ॥ 18
ఇష్టమున్నా, లేకపోయినా ఆ దేవుడు మంత్రప్రభావంతో శాంతుడై వినయవంతుడైన సేవకుని వలె నీకు అధీనుడవుతాడు. (18)
వైశంపాయన ఉవాచ
న శశాక ద్వితీయం సా ప్రత్యాఖ్యాతుమనిందితా ।
తం వై ద్విజాతిప్రవరం తదా శాపభయాన్నృప ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. అనిందిత అయిన పృథ అప్పుడు శాపభయం వలన బ్రాహ్మోణోత్తముని మాటను రెండవసారి నిరాకరించలేకపోయింది. (19)
తతస్తామనవద్యాంగీం గ్రాహయామాస స ద్విజః ।
మంతగ్రామం తదా రాజన్ అథర్వశిరసి శ్రుతమ్ ॥ 20
రాజా! అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిర్దుష్టశరీరావయవాలు గల ఆ పృథకు అధర్వోపనిషత్తులోని ఆ మంత్రసముదాయాన్ని ఉపదేశించాడు. (20)
తం ప్రదాయ తు రాజేంద్ర కుంతిభోజమువాచ హ ।
ఉషితోఽస్మి సుఖం రాజన్ కన్యయా పరితోషితః ॥ 21
తవ గేహేషు విహితః సదా సుప్రతిపూజితః ।
సాధయిష్యామహే తావద్ ఇత్యుక్త్వాంతరధీయత ॥ 22
రాజేంద్రా! ఆ మంత్రాన్ని పృథకు ఉపదేశించి ఆ బ్రాహ్మణుడు "రాజా! నీ ఇంట సుఖంగా నివసించాను. నీ కుమార్తె నిరంతరాయంగా చూపిన ఆదరణతో సంతోషించాను. ఇక నేను వెళ్ళివస్తాను" అని కుంతిభోజునితో పలికి అదృశ్యుడయ్యాడు. (21,22)
స తు రాజా ద్విజం దృష్ట్వా తత్రైవాంతర్హితం తదా ।
బభూవ విస్మయావిష్టః పృథాం చ సమపూజయత్ ॥ 23
అప్పుడు కుంతిభోజుడు అప్పుడే అదృశ్యమైపోయిన ఆ ద్విజుని తలచుకొని ఆశ్చర్యానికి లోనయి పృథను అభినందించాడు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి పృథయా మంత్రప్రాప్తౌ పంచాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 305 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున పృథమంత్రప్రాప్తి అను మూడువందల అయిదవ అధ్యాయము. (305)