309. మూడు వందల తొమ్మిదవ అధ్యాయము

కర్ణుడు రాధేయుడుగా ఎదుగుట; కర్ణుని దగ్గరకు దేవేంద్రుడు వచ్చుట.

వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు ధృతరాష్ట్రస్య వై సఖా ।
సూతోఽధిరథ ఇత్యేవ సదారో జాహ్నవీం యయౌ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. అదే సమయంలో ధృతరాష్ట్రుని మిత్రుడైన సూతుడు - అధిరథుడు - భార్యతో కలిసి గంగకు వెళ్ళాడు. (1)
తస్య భార్యాభవద్ రాజన్ రూపేణాసదృశీ భువి ।
రాధా నామ మహాభాగా న సా పుత్రమవిందత ॥ 2
రాజా! అధిరథుని భార్య పేరు రాధ. ఆమె లోకంలో సాటిలేని సౌందర్యవతి. సౌభాగ్యవతి. కానీ ఆమెకు సంతానం లేదు. (2)
అపత్యార్థే పరం యత్నమ్ అకరోచ్చ విశేషతః ।
సా దదర్శాథ మంజూషామ్ ఉహ్యమానాం యదృచ్ఛయా ॥ 3
సంతానంకోసం విశేషప్రయత్నాలు ఎన్నో చేసింది. అనుకోకుండా ఆలలపై కదులుతున్న పెట్టెను ఆమె చూసింది. (3)
దత్తరక్షాప్రతిసరామ్ అన్వాలంభనశోభమ్ ।
ఊర్మీతరంగైర్జాహ్నవ్యాః సమానీతాముపహ్వరమ్
ఆ పెట్టె చుట్టూ రక్షణకై చుట్టిన లతలున్నాయి సింధూర లేపనంతో అది అందంగా ఉంది. గంగాతరంగాలచే అది ఆ తీరానికి కొనిరాబడింది. (4)
సా తు కౌతూహలాత్ ప్రాప్తాం గ్రాహయామాస భావినీ ।
తతో నివేదయామాస సూతస్యాధిరథస్య వై ॥ 5
భావిని అయిన రాధ దగ్గరకు వచ్చిన పెట్టెను కుతూహలంతో పట్టుకొంది. వెంటనే అధిరథునకు ఆ విషయం చెప్పింది. (5)
స తాముద్ధృత్య మంజూషామ్ ఉత్సార్య జలమంతికాత్ ।
యంత్రైరుద్ఘాటయామాస సోఽపశ్యత్ తత్ర బాలకమ్ ॥ 6
అధిరథుడు నీటినుండిదానిని బయటకు తీయించి యంత్రసహాయంతో పెట్టె తెరిపించాడు. దానిలో బాలకుని చూచాడు. (6)
తరుణాదిత్యసంకాశం హేమవర్మధరం తథా ।
మృష్టకుండలయుక్తేన వదనేన విరాజతా ॥ 7
ఆ బాలకుడు లేతప్రొద్దువలె ఉన్నాడు. సువర్ణకవచాన్ని ధరించాడు. చెవులకు తగిలించిన కుండలాలతో ఆ ముఖం విరాజిల్లుతోంది. (7)
స సూతో భార్యయా సార్ధం విస్మయోత్ఫుల్లలోచనః ।
అంకమారోప్య తం బాలం భార్యాం వచనమబ్రవీత్ ॥ 8
అధిరథునకు రాధకు ఆశ్చర్యంతో కళ్ళు వికసించాయి. అధిరథుడు ఆ బాలకుని తొడ మీద కూర్చుండ బెట్టుకొని భార్యతో ఇలా అన్నాడు. (8)
ఇదమప్యద్భుతం భీరు యతో జాతోఽస్మి భావిని ।
దృష్టవాన్ దేవగర్భోఽయం మన్యేఽస్మాన్ సముపాగతః ॥ 9
భీరూ! భావినీ! నేను పుట్టిననాటినుండి ఈరోజే ఇంత అద్భుతమైన రూపాన్ని చూచాను. ఎవరో దేవతాబాలకుడే మన దగ్గరకు వచ్చాడనుకొంటున్నాను. (9)
అనపత్యస్య పుత్రోఽయం దేవైర్దత్తో ధ్రువం మమ ।
ఇత్యుక్త్వా తం దదౌ పుత్రం రాధాయై స మహీపతే ॥ 10
రాజా! 'సంతానం లేని నాకు తప్పక దేవుడిచ్చిన బిడ్డయే' అంటూ ఆ బాలకుని రాధకు ఇచ్చాడు అధిరథుడు. (10)
ప్రతిజగ్రాహ తం రాధా విధివద్ దివ్యరూపిణమ్ ।
పుత్రం కమలగర్భాభం దేవగర్భం శ్రియా వృతమ్ ॥ 11
(స్తన్యం సమాస్రవచాస్యా దైవాదిత్యథ నిశ్చయః ।)
తామరబొడ్డువలె కాంతిమంతుడై, దివ్యరూపంతో ఒప్పారుతున్న ఆ దేవబాలకుని రాధ విధిపూర్వకంగా పుత్రునిగా స్వీకరించింది. దైవికంగా ఆమె రొమ్ముల నుండి పాలు స్రవించాయి. (11)
పుపోష చైనం విధివద్ వవృధే స చ వీర్యవాన్ ।
తతఃప్రభృతి చాప్యన్యే ప్రాభవన్నౌరసాః సుతాః ॥ 12
రాధ ఆ బాలకుని యథావిధిగా పోషించించి. ఆ బాలకుడు కూడా బలవంతుడై వృద్ధిపొందాడు. అప్పటినుండి ఆమెకు చాలామంది పిల్లలు పుట్టారు. (12)
వసువర్మధరం దృష్ట్వా తం బాలం హేమకుండలమ్ ।
నామాస్య వసుషేణేతి తతశ్చక్రుర్ద్విజాతయః ॥ 13
బంగారు కవచాన్ని, బంగారు కుండలాలను ధరించియున్న ఆ బాలకుని చూసి బ్రాహ్మణులు వసుషేణుడని పేరు పెట్టారు. (13)
ఏవం స సూతపుత్రత్వం జగామామితవిక్రమః ।
వసుషేణ ఇతి ఖ్యాతః వృష ఇత్యేవ చ ప్రభుః ॥ 14
అమితవిక్రముడైన ఆ ప్రభువు ఈ రీతిగా సూతపుత్రుడయ్యాడు. వసుషేణుడని ప్రసిద్ధికెక్కాడు. (14)
సూతస్య వవృధేఽంగేషు శ్రేష్ఠః పుత్రః స వీర్యవాన్ ।
చారేణ విదితశ్చాసీత్ పృథయా దివ్యవర్మభృత్ ॥ 15
శ్రేష్ఠుడు, పరాక్రమశాలి అయిన ఆ సూతపుత్రుడు అంగదేశంలో వృద్ధిపొందాడు. దివ్యకవచధారి అయిన అతనిని గురించి చారులద్వారా పృథకు తెలిసింది. (15)
సూతస్త్వధిరథః పుత్రం వివృద్ధం సమయేన తమ్ ।
దృష్ట్వా ప్రస్థాపయామాస పురం వారణసాహ్వయమ్ ॥ 16
సూతుడైన అధిరథుడు తన కుమారుని ఎదుగుదలను గమనించి తగిన సమయంలో అతనిని హస్తినాపురికి పంపాడు. (16)
తత్రోపసదనం చక్రే ద్రోణస్యేష్వస్త్రకర్మణి ।
సఖ్యం దుర్యోధనేనైవమ్ అగమత్ స చ వీర్యవాన్ ॥ 17
అక్కడ కర్ణుడు అస్త్రవిద్యాశిక్షణకై ద్రోణున్ శిష్యుడయ్యాడు. పరాక్రమశాలి అయిన వసుషేణుడు అక్కడే దుర్యోధనుని మైత్రి పొందాడు. (17)
ద్రోణాత్ కృపాచ్చ రామాచ్చ సోఽస్త్రగ్రామం చతుర్విధమ్ ।
లబ్ధ్వా లోకేఽభవత్ ఖ్యాతః పరమేష్వాసతాం గతః ॥ 18
కర్ణుడు ద్రోణుని నుండి, కృపుని నుండి, పరశురాముని నుండి నాలుగువిధాలయిన అస్త్రవిద్యను పొంది లోకంలో మేటివిలుకాడుగా గణుతికెక్కాడు. (18)
సంధాయ ధార్తరాష్ట్రేణ పార్థానాం విప్రియే రతః ।
యోద్ధుమాశంపతే నిత్యం ఫాల్గునేన మహాత్మనా ॥ 19
దుర్యోధనునితో స్నేహం చేసి పాండవులకు కీడు చేయటంలో ఆసక్తుడై మహాత్ముడైన అర్జునునితో పోరాడాలని ఎప్పుడూ కోరుకొనేవాడు. (19)
సదా హి తస్య స్పర్ధాఽఽసీద్ అర్జునేన విశాంపతే ।
అర్జునస్య చ కర్ణేన యతో దృష్టో బభూవ సః ॥ 20
రాజా! కర్ణార్జునులు ఒకరివెంట ఒకరు పడిన నాటినుండి కర్ణునకు ఎప్పుడూ అర్జునుడితో పోటీ. అర్జునుడికి కూడా కర్ణునితో పోటీ. (20)
ఏతద్ గుహ్యం మహారాజ సూర్యస్యాసీన్న సంశయః ।
యః సూర్యసంభవః కర్ణః కుంత్యాం సూతకులే తథా ॥ 21
మహారాజా! తన వలన కుంతికి పుట్టిన కొడుకు - కర్ణుడు, సూతకులంలో పెరిగాడన్న విషయం సూర్యుని దగ్గర కూడా రహస్యంగానే ఉండిపోయింది. సందేహం లేదు. (21)
తం తు కుండలినం దృష్ట్వా వర్మణా చ సమన్వితమ్ ।
అవధ్యం సమరే మత్వా పర్యతప్యద్ యుధిష్ఠిరః ॥ 22
సహజకవచకుండలాలతో నున్న కర్ణుని చూసి, యుద్ధంలో అతనిని చంపటం కష్టమని భావించి యుధిష్ఠిరుడు ఎప్పుడూ బాధపడేవాడు. (22)
యదా చ కర్ణో రాజేంద్ర భానుమంతం దివాకరమ్ ।
స్తౌతి మధ్యందినే ప్రాప్తే ప్రాంజలిః సలిలే స్థితః ॥ 23
తత్రైనముపతిష్ఠంతి బ్రాహ్మణా ధనహేతునా ।
నాదేయం తస్య తత్కాలే కించిదస్తి ద్విజాతిషు ॥ 24
రాజేంద్రా! కర్ణుడు మధ్యాహ్నకాలంలో నీట నిలిచి, చేతులు జోడించి, కిరణమాలి అయిన సూర్యుని ప్రస్తుతించేటప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణులు ధనాన్ని యాచించటానికి కర్ణుని దగ్గరకు వచ్చేవారు. ఆ సమయంలో బ్రాహ్మణులు ఏది అడిగినా కర్ణుడు ఇచ్చేవాడు. (23,24)
తమింద్రో బ్రాహ్మణో భూత్వా భిక్షాం దేహీత్యుపస్థితః ।
స్వాగతం చేతి రాధేయః తమథ ప్రత్యభాషత ॥ 25
ఇంద్రుడు బ్రాహ్మణవేషం ధరించి "దేహి" అంటూ కర్ణుని కడకు వచ్చాడు. అప్పుడు రాధేయుడు "స్వాగత" మని ఇంద్రునకు బదులిచ్చాడు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి రాధాకర్ణప్రాప్తౌ నవాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 309 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున రాధాకర్ణప్రాప్తి అను మూడువందల తొమ్మిదవ అధ్యాయము. (309)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 25 1/2 శ్లోకాలు.)