310. మూడువందల పదియవ అధ్యాయము
ఇంద్రుడు శక్తినిచ్చి కర్ణుని కవచకుండలముల గైకొనుట.
వైశంపాయన ఉవాచ
దేవరాజమనుప్రాప్తం బ్రాహ్మణచ్ఛద్మనా వృతమ్ ।
దృష్ట్వా స్వాగతమిత్యాహ న బుబోధాస్య మానసమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
బ్రాహ్మణవేషంతో తనను తాను కప్పిపుచ్చుకొని తనవద్దకు వచ్చిన ఇంద్రుని చూచి కర్ణుడు 'స్వాగత'మన్నాడు. ఇంద్రుని మనస్సుకు గ్రహించలేకపోయాడు. (1)
హిరణ్యకంఠీః ప్రమదాః గ్రామాన్ వా బహుగోకులాన్ ।
కిం దదానీతి తం విప్రమ్ ఉవాచాధిరథిస్తతః ॥ 2
అప్పుడు అధిరథసుతుడు కర్ణుడు 'మెడలో బంగారం ధరించిన వనితలనా? గోగణాలు సమృద్ధిగా ఉన్న గ్రామాలనా? వేటినివ్వమంటావు" అని ఆ బ్రాహ్మణునితో అన్నాడు. (2)
బ్రాహ్మణ ఉవాచ
హిరణ్యకంఠ్యః ప్రమదా యచ్చాన్యత్ ప్రీతివర్ధనమ్ ।
నాహం దత్తమిహేచ్ఛామి తదర్థిభ్యః ప్రదీయతామ్ ॥ 3
బ్రాహ్మణుడిలా అన్నాడు.
బంగారునగలు దాల్చిన స్త్రీలను కానీ, ఆనందాన్ని పెంచే మరేదైనా కానీ నీవు ఇచ్చినా అవసరంలేదు. వాటిని కోరేవారికి వాటినివ్వు. (3)
యదేతత్ సహజం వర్మ కుండలే చ తవానఘ ।
ఏతదుత్కృత్య మే దేహి యది సత్యవ్రతో భవాన్ ॥ 4
అనఘా! నీవు సత్యవ్రతుడ వయితే నీ సహజ కవచాన్నీ, కుండలాలను కోసి నాకిమ్ము. (4)
ఏతదిచ్ఛామ్యహం క్షిప్రం త్వయా దత్తం పరంతప ।
ఏష మే సర్వలాభానాం లాభః పరమకో మతః ॥ 5
పరంతపా! నీవు వాటిని దానం చేస్తే నేను తీసికొని వెంటనే వెళ్తాను. సర్వలాభాలలో అదే నాకు గొప్ప లాభం. (5)
కర్ణ ఉవాచ
అవనిం ప్రమదా గాశ్చ నివాపం బహువార్షికమ్ ।
తత్ తే విప్ర ప్రదాస్యామి న తు వర్మ సకుండలమ్ ॥ 6
కర్ణుడిలా అన్నాడు.
విప్రా! భూమిని, స్త్రీలను, గోవులను, భవనాలను, సంవత్సరాల పర్యంతం సాగే జీవన భృతిని ఇస్తాను. కవచకుండలాలను మాత్ర మివ్వను. (6)
వైశంపాయన ఉవాచ
ఏవం బహువిధైర్వాక్యైః యాచ్యమానః స తు ద్విజః ।
కర్ణేన భరతశ్రేష్ఠ నాన్యం వరమయాచత ॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! ఈ రీతిగా ఎన్నిరకాలుగా చెప్పినా ఆ బ్రాహ్మణుడు కర్ణుని నుండి వేరొకవరాన్ని కోరలేదు. (7)
సాంత్వితశ్చ యథాశక్తి పూజితశ్చ యథావిధి ।
న చాన్యం స ద్విజశ్రేష్ఠః కామయామాస వై వరమ్ ॥ 8
యథాశక్తి అనునయించినా, యథావిధిగా అర్చించినా కూడా ఆ బ్రాహ్మణోత్తముడు వేరొక వరాన్ని ఇష్టపడలేదు. (8)
యదా నాన్యం ప్రవృణుతే వరం వై ద్విజసత్తమః ।
(వినాస్య సహజం వర్మ కుండలే చ విశాంపతే ।)
తదైనమబ్రవీత్ భూయః రాధేయః ప్రహసన్నివ ॥ 9
రాజా! సహజకవచకుండలాలను తప్ప మరొక వరాన్ని ఆ ద్విజసత్తముడు కోరలేదు. అప్పుడు రాధేయుడు నవ్వుతూ మరలా ఇలా అన్నాడు. (9)
సహజం వర్మ మే విప్ర కుండలే చామృతోద్భవే ।
తేనావధ్యోఽస్మి లోకేషు తతో నైతజ్జహామ్యహమ్ ॥ 10
విప్రా! కవచం నా శరీరంతో పుట్టినది. కుండలాలు అమృతం నుండి పుట్టినవి. కాబట్టి లోకంలో నన్నెవ్వరూ చంపలేరు. అందుకని వాటిని వీడను. (10)
విశాలం పృథివీరాజ్యం క్షేమం నిహతకంటకమ్ ।
ప్రతిగృహ్ణీష్వ మత్తస్త్వం సాధు బ్రాహ్మణపుంగవ ॥ 11
బ్రాహ్మణశ్రేష్ఠా! నిష్కంటకమై క్షేమంగా ఉన్న ఈ విశాలసామ్రాజ్యాన్ని నానుండి స్వీకరించు. యుక్తంగా ఉంటుంది. (11)
కుండలాభ్యాం విముక్తోఽహం వర్మణా సహజేన చ ।
గమనీయో భవిష్యామి శత్రూణాం ద్విజసత్తమ ॥ 12
ద్విజసత్తమా! నేను కుండలాలను, సహజకవచాన్ని కోల్పోతే శత్రువులు నామీదికి తేలికగా వస్తారు. (12)
వైశంపాయన ఉవాచ
యదాన్యం న వరం వవ్రే భగవాన్ పాకశాసనః ।
తతః ప్రహస్య కర్ణస్తం పునరిత్యబ్రవీద్ వచః ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు.
పూజ్యుడైన ఇంద్రుడు వేరొకవరాన్ని కోరకపోవటంతో కర్ణుడు నవ్వి, మరల ఇలా అన్నాడు. (13)
విదితో దేవదేవేశ ప్రాగేవాసి మమ ప్రభో ।
న తు న్యాయ్యం మయా దాతుం తవ శక్ర వృథా వరమ్ ॥ 14
దేవదేవేశా! ప్రభూ! నీవెవరో నాకు ముందే తెలుడు. శక్రా! నిష్పలవరాన్ని నేను నీకివ్వటం న్యాయం కాదు. (14)
త్వం హి దేవేశ్వరః సాక్షాత్ త్వయా దేయో వరో మమ ।
అన్యేషాం చైవభూతానామ్ ఈశ్వరో హ్యసి భూతకృత్ ॥ 15
నీవు సాక్షాత్తు దేవేంద్రుడవు. సర్వప్రాణులకు కర్తవు, పాలకుడవు. కాబట్టి నీవే నాకు వరమివ్వటం ధర్మం. (15)
యది దాస్యామి తే దేవ కుండలే కవచం తథా ।
వధ్యతాముపయాస్యామి త్వం చ శక్రావహాస్యతామ్ ॥ 16
తస్మాద్ వినిమయం కృత్వా కుండలే వర్మ చోత్తమమ్ ।
హరస్వ శక్ర కామం మే న దద్యామహమన్యథా ॥ 17
దేవా! నీకు కవచాన్నీ, కుండలాలనూ ఇస్తే నన్ను శత్రువులు సంహరిస్తారు. నీవు నవ్వులపాలవుతావు. కాబట్టి వాటికి బదులు మరేదైనా ఇచ్చి కుండలాలను ఉత్తమ కవచాన్ని యథేచ్ఛగా తీసికొనిపో. లేకపోతే నేను కవచకుండలాలనివ్వను. (16,17)
శక్ర ఉవాచ
విదితోఽహం రవేః పూర్వమ్ ఆయానేవ తవాంతికమ్ ।
తేన తే సర్వమాఖ్యాతమ్ ఏవమేతన్న సంశయః ॥ 18
శక్రుడు ఇలా అన్నాడు.
సూర్యుడు ముందే నీ దగ్గరకు వచ్చాడని నాకు తెలుసు. ఆయనే నీకంతా చెప్ఫాడు. సంశయం లేదు. (18)
కామమస్తు తథా తాత తవ కర్ణ యథేచ్ఛసి ।
వర్జయిత్వా తు మే వజ్రం ప్రవృణీష్వ యథేచ్ఛసి ॥ 19
నాయనా! కర్ణా! అలాగే కానీ. నీవు కోరినట్లుగానే బదులు ఇస్తాను. నా వజ్రం తప్ప మరేది కావాలన్నా కోరుకో. (19)
వైశంపాయన ఉవాచ
తతః కర్ణః ప్రహృష్టస్తు ఉపసంగమ్య వాసవమ్ ।
అమోఘాం శక్తిమభ్యేత్య వవ్రే సంపూర్ణమానసః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు కర్ణుడు ఆనందపడి ఇంద్రుని దగ్గరకు పోయి పరిపూర్ణహృదయంతో అమోఘమయిన శక్తిని కోరుకొన్నాడు. (20)
కర్ణ ఉవాచ
వర్మణా కుండలాభ్యాం చ శక్తిం మే దేహి వాసవ ।
అమోఘాం శత్రుసంఘానాం ఘాతినీం పృతనాముఖే ॥ 21
కర్ణుడిలా అన్నాడు.
ఇంద్రా! కవచకుండలాలకు బదులు సేనాముఖంలో శత్రుసంఘాలను సంహరించగల అమోఘశక్తిని నాకిమ్ము.(21)
తతః సంచింత్య మనసా ముహూర్తమివ వాసవః ।
శక్త్యర్థం పృథివీపాల కర్ణం వాక్యమథాబ్రవీత్ ॥ 22
రాజా! అప్పుడు ఇంద్రుడు శక్తిప్రదానవిషయాన్ని గురించి ముహూర్తకాలం ఆలోచించి కర్ణునితో ఇలా అన్నాడు. (23)
కుండలే మే ప్రయచ్ఛస్వ వర్మ చైవ శరీరజమ్ ।
గృహాణ కర్ణ శక్తిం త్వమ్ అనేన సమయేన చ ॥ 23
కర్ణా! కుండలాలను, సహజకవచాన్ని ఇచ్చి శక్తిని స్వీకరించు. అయితే ఒక్క నియమం. (23)
అమోఘా హంతి శతశః శత్రూన్ మమ కరచ్యుతా ।
పునశ్చ పాణిమభ్యేతి మమ దైత్యాన్ వినిఘ్నతః ॥ 24
నేను దైత్యులను సంహరించేటప్పుడు నా చేతినుండి వెలువడిన ఈ శక్తి అమోఘమై వందలకొలది శత్రువులను చంపి మరల నా చేతికి వస్తుంది. (24)
సేయం తవ కరప్రాప్తా హత్వైకం రిపుమూర్జితమ్ ।
గర్జంతం ప్రతపంతం చ మామేవైష్యతి సూతజ ॥ 25
సూతజా! అయితే ఇది నీ చేతికి వచ్చిన తరువాత బలవంతుడై గర్జిస్తూ, ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్న శత్రువును ఒక్కని మాత్రమే చంపి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. (25)
కర్ణ ఉవాచ
ఏకమేవాహమిచ్ఛామి రిపుం హంతుం మహాహవే ।
గర్జంతం ప్రతపంతం చ యతో మమ భయం భవేత్ ॥ 26
కర్ణుడిలా అన్నాడు. నన్ను ఎప్పుడూ భయపడుతూ మహారణరంగంలో గర్జిస్తూ ప్రతాపాన్ని ప్రదర్శించే ఒకే ఒక్క శత్రువును చంపాలనుకొంటున్నాను. (26)
ఇంద్ర ఉవాచ
ఏకం హనిష్యసి రిపుం గర్జంతం బలినం రణే ।
త్వం తు యం ప్రార్థయస్యేకం రక్ష్యతే స మహాత్మనా ॥ 27
యమాహుర్వేదవిద్వాంసః వరార్హమపరాజితమ్ ।
నారాయణమచింత్యం చ తేన కృష్ణేన రక్ష్యతే ॥ 28
ఇంద్రుడిలా అన్నాడు.
యుద్ధంలో గర్జించే బలవంతుడైన శత్రువును చంపుతుంది. అయితే నీవు చంపదలచుకొన్న వ్యక్తిని పరమాత్మ రక్షిస్తున్నాడు. వేదవేత్తలు పురుషోత్తముడనీ, అపరాజితుడనీ, అచింత్యరూపుడనీ, నారాయణుడనీ చెపుతుంటారో ఆ కృష్ణుడు ఆ వీరుని రక్షిస్తున్నాడు. (27,28)
కర్ణ ఉవాచ
ఏవమప్యస్తు భగవన్ ఏకవీరవధే మమ ।
అమోఘం దేహి మే శక్తిం యథా హన్యాం ప్రతాపినమ్ ॥ 29
కర్ణుడిలా అన్నాడు.
భగవానుడా! అలా అయినా సరే, ఒక్కరినే చంపగల ఆ అమోఘశక్తిని నాకిమ్ము. దానితో ప్రతాపశాలి అయిన శత్రువును చంపుతాను. (29)
ఉత్కృత్య తు ప్రదాస్యామి కుండలే కవచం చ తే ।
నికృత్తేషు తు గాత్రేషు న మే బీభత్సతా భవేత్ ॥ 30
నాకవచాన్ని, కుండలాలను కోసి నీకిస్తాను. అయితే నా శరీరావయవాలను కోసినపుడు నేను బీభత్సంగా కనిపించకూడదు. (30)
ఇంద్ర ఉవాచ
న తే బీభత్సతా కర్ణ భవిష్యతి కథంచన ।
వ్రణశ్చైవ న గాత్రేషు యస్త్వం నానృతమిచ్ఛసి ॥ 31
ఇంద్రుడిలా అన్నాడు.
కర్ణా! నీ శరీరం ఏరీతిగానూ బీభత్సంగా ఉండదు. నీవు అసత్యాన్ని ఇష్టపడవు కాబట్టి నీకు గాయాలు కూడా కావు. (31)
యాదృశస్తే పితుర్వర్ణః తేజశ్చ వదతాం వర ।
తాదృశేనైవ వర్ణేన త్వం కర్ణ భవితా పునః ॥ 32
విద్యమానేషు శస్త్రేషు యద్యమోఘామసంశయే ।
ప్రమత్తో మోక్ష్యసే చాపి త్వయ్యేవైషా పతిష్యతి ॥ 33
వాగ్మిశ్రేష్ఠా! కర్ణా! నీతండ్రి రంగూ, తేజస్సు ఎటువంటివో అటువంటి రంగు, తేజస్సు నీకు మరలా లభిస్తాయి. నీ దగ్గర మరొక ఆయుధమున్నప్పుడూ, ప్రాణసంకటస్థితి లేనపుడు ఏమరుపాటుతో ఈ అమోఘశక్తిని ప్రయోగిస్తే అది నీ మీదనే పడుతుంది. (32,33)
కర్ణ ఉవాచ
సంశయం పరమం ప్రాప్య విమోక్ష్యే వాసవీమిమామ్ ।
యథా మామాత్థ శక్ర త్వం సత్యమేతద్ బ్రవీమి తే ॥ 34
కర్ణుడులా అన్నాడు. దేవేంద్రా! నీవు చెప్పినట్టు తీవ్రప్రాణసంకటస్థితి ఏర్పడినప్పుడే ఈ వాసవీశక్తిని ప్రయోగిస్తాను. ఈ వాస్తవం నీకు చెప్తున్నాను. (34)
వైశంపాయన ఉవాచ
తతః శక్తిం ప్రజ్వలితాం ప్రతిగృహ్య విశాంపతే ।
శస్త్రం గృహీత్వా నిశితం సర్వగాత్రాణ్యకృంతత ॥ 35
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆఫై ప్రజ్వలించే శక్తిని స్వీకరించి కర్ణుడు వాడి అయిన ఆయుధాన్ని పట్టి శరీరాన్ని కోయనారంభించాడు. (35)
తతో దేవా మానవా దానవాశ్చ
నికృంతంతం కర్ణమాత్మానమేవమ్ ।
దృష్ట్వా సర్వే సింహనాదాన్ ప్రణేదుః
న హ్యస్యాసీన్ముఖజో వై వికారః ॥ 36
అప్పుడు దేవతలు మానవులు, దానవులు, ఆ రీతిగా శరీరాన్ని కోసుకొంటున్న కర్ణుని చూసి, అందరూ సింహనాదాలు చేశారు. కర్ణుని ముఖంలో ఏ వికారమూ లేదు. (36)
తతో దివ్యా దుందుభయః ప్రణేదుః
పపాతోచ్చైః పుష్పవర్ణం చ దివ్యమ్ ।
దృష్ట్వా కర్ణం శస్త్రసంకృత్తగాత్రం
ముహుశ్చాపి స్మయమానం నృవీరమ్ ॥ 37
అప్పుడు శరీరాన్ని శస్త్రంతో కోసుకొంటూ కూడా నవ్వుతూనే ఉన్న ఆ నరవీరుని - కర్ణుని - చూసి దివ్యదుందుభులు మ్రోగాయి. దివ్యపుష్పవృష్టి కూడా పెద్దగా కురిసింది. (37)
తతశ్ఛిత్త్వా కవచం దివ్యమంగాత్
తథైవార్ద్రం ప్రపదౌ వాసవాయ ।
తథోత్కృత్య ప్రదదౌ కుండలే చ
కర్ణాత్ తస్మాత్ కర్మణా తేన కర్ణః ॥ 38
ఆఫై శరీరం నుండి దివ్యకవచాన్ని ఛేదించి నెత్తురు తడిసిన దానిని అలాగే ఇంద్రున కిచ్చాడు. అలాగే కుండలాలను కూడా చెవి నుండి కోసి ఇచ్చాడు. అందుకే కర్ణుడయ్యాడు. (38)
తతః శక్రః ప్రహసన్ వంచయిత్వా
కర్ణం లోకే యశసా యోజయిత్వా ।
కృతం కార్యం పాండవానాం హి మేనే
తతః పశ్చాద్ దివమేవోత్పపాత ॥ 39
ఆ తరువాత ఇంద్రుడు కర్ణుని మోసగించి, లోకంలో కర్ణునకు కీర్తిని కల్గించి, పాండవులకు మేలు చేకూరినట్లే భావించాడు. నవ్వుతూ స్వర్గానికి ఎగిరిపోయాడు. (39)
శ్రుత్వా కర్ణం ముషితం ధార్తరాష్ట్రా
దీనాః సర్వే భగ్నదర్పా ఇవాసన్ ।
తాం చావస్థాం గమితం సూతపుత్రం
శ్రుత్వా పార్థా జహృషుః కాననస్థాః ॥ 40
కర్ణుడు మోసగింపబడినట్లు విని ధార్తరాష్ట్రులు దీనులై పొగరణగిపోయారు. ఆ స్థితికి వచ్చిన కర్ణుని గురించి విని అరణ్యంలో ఉన్న పాండవులు ఆనందించారు. (40)
జనమేజయ ఉవాచ
క్వస్థా వీరాః పాండవాస్తే బభూవుః
కుతశ్చైవ శ్రుతవంతః ప్రియం తత్ ।
కిం వాకార్షుర్ద్వాదశేఽబ్దే వ్యతీతే
తన్మే సర్వం భగవాన్ వ్యాకరోతు ॥ 41
జనమేజయుడిలా అడిగాడు. స్వామీ! ఆ రోజుల్లో పాండవులు ఎక్కడున్నారు? వారికి ఆ ప్రియవార్త ఎలా వినిపించింది. పండ్రెండవ సంవత్సరం గడిచిన తర్వాత పాండవులు ఏం చేశారు? అదంతా నాకు వివరించండి. (41)
వైశంపాయన ఉవాచ
లబ్ధ్వా కృష్ణాం సైంధవం ద్రావయిత్వా
విప్రైః సార్ధం కామ్యకాదాశ్రమాత్ తే ।
మార్కండేయాచ్ఛ్రుతవంతః పురాణాం
దేవర్షీణాం చరితం విస్తరేణ ॥ 42
వైశంపాయనుడిలా అన్నాడు. ద్రౌపదిని కాపాడుకొని, సైంధవుని కామ్యకవనం నుండి పారద్రోలి, పాండవులు బ్రాహ్మణులతో కలిసి మార్కండేయమహర్షి ద్వారా పురాణాలను, మహర్షి చరితలను వివరంగా విన్నారు. (42)
(ప్రత్యాజగ్ముః సరథాః సానుయాత్రాః
సర్వైః సార్ధం సూతపౌరోగవైస్తే ।
తతో యయుర్ద్వైతవనే నృవీరా
నిస్తీర్యైవం వనవాసం సమగ్రమ్ ॥)
ఈ రీతిగా వనవాసాన్ని పూర్తిచేసి నరవీరులయిన పాండవులు తమరథాలు, అనుచరులు, సూతులు వంటివారు అందరితో కలిసి మరల ద్వైతవనానికి చేరారు.
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కుండలాహరణపర్వణి కవచకుండలదానే దశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 310 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున కుండలాహరణపర్వమను ఉపపర్వమున కవచకుండలదానమను మూడువందల పదవ అధ్యాయము. (310)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 43 1/2 శ్లోకాలు.)