312. మూడువందల పండ్రెండవ అధ్యాయము
నీటిని తెచ్చుటకయి వెళ్ళిన పాండవులు నలుగురు మూర్ఛిల్లుట.
యుధిష్ఠిర ఉవాచ
నాపదామస్తి మర్యాదా న నిమిత్తం న కారణమ్ ।
ధర్మస్తు విభజత్యర్థమ్ ఉభయోః పుణ్యపాపయోః ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు. ఆపదలకు హద్దులుండవు. కారణమూ ఉండదు, ప్రయోజనమూ ఉండదు. పుణ్యపాపాల ఫలరూపమైన సుఖదుఃఖాలను విభజించడంలో ప్రారబ్ధమే ప్రమాణమవుతుంది. (1)
భీమ ఉవాచ
ప్రాతికామ్యనయత్ కృష్ణాం సభాయాం ప్రేష్యవత్ తదా ।
న మయా నిహతస్తత్ర తేన ప్రాప్తాః స్మ సంశయమ్ ॥ 2
భీముడిలా అన్నాడు.
నాడు సభలోనికి ద్రౌపదిని దాసినివలె తెచ్చిన ప్రాతికామిని అక్కడే నేను చంపలేదు. అందుకే మనకు కష్టం కలిగింది. (2)
అర్జున ఉవాచ
వాచస్తీక్ష్ణాస్థిభేదిన్యః సూతపుత్రేణ భాషితాః ।
అతితీవ్రా మయా క్షాంతాః తేన ప్రాప్తాః స్మ సంశయమ్ ॥ 3
అర్జునుడిలా అన్నాడు.
సూతపుత్రుడు ఎముకలను కూడా బ్రద్ధలు చేసే తీక్ష్ణమైన కఠోరవచనాలను పలికినా నేను సహించి ఊరుకొన్నాను. అందువలననే ధర్మసంకటంలో పడ్డాం. (3)
సహదేవ ఉవాచ
శకునిస్త్వాం యదాజైషీత్ అక్షద్యూతేన భారత ।
స మయా న హతస్తత్ర తేన ప్రాప్తాః స్మ సంశయమ్ ॥ 4
సహదేవుడిలా అన్నాడు.
భారతా! పాచికలాటలో శకుని నిన్ను జయించినప్పుడే నేను అతనిని చంపవలసినది. అలా జరగలేదు. కాబట్టి మనమీ ఆపదలో పడ్డాం. (4)
వైశంపాయన ఉవాచ
తతో యుధిష్ఠిరో రాజా నకులం వాక్యమబ్రవీత్ ।
ఆరుహ్య వృక్షం మాద్రేయ నిరీక్షస్వ దిశో దశ ॥ 5
పానీయమంతికే పశ్య వృక్షాంశ్చాప్యుదకాశ్రితాన్ ।
ఏతే హి భ్రాతరః శ్రాంతాస్తవ తాత పిపాసితాః ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు యుధిష్ఠిరరాజు నకులునితో ఇలా అన్నాడు. మాద్రేయా! చెట్టెక్కి అన్ని దిక్కులా కలయచూడు. ఎక్కడైనా నీరు కానీ, నీటిమీద బ్రతికే చెట్లు కానీ ఉంటాయేమో చూడు. నాయనా! ఈ నీ సోదరులందరూ అలసిపోయి దప్పికగొని ఉన్నారు. (5,6)
నకులస్తు తథేత్యుక్త్వా శీఘ్రమారుహ్య పాదపమ్ ।
అబ్రవీద్ భ్రాతరం జ్యేష్ఠమ్ అభివీక్ష్య సమంతతః ॥ 7
'అలాగే' అని నకులుడు వెంటనే చెట్టునెక్కి, అంతటా చూసి అన్నతో ఇలా అన్నాడు. (7)
పశ్యామి బహులాన్ రాజన్ వృక్షా నుదకసంశ్రయాన్ ।
సారసానాం చ నిర్హ్రాదమ్ అత్రోదకమసంశయమ్ ॥ 8
రాజా! జలాధారంగా బ్రతికే చెట్లు ఉన్నాయి. బెగ్గురుపక్షుల కూతలు వినిపిస్తున్నాయి. నిస్సంశయంగా ఇక్కడ నీరుంటుంది . (8)
తతోఽబ్రవీత్ సత్యధృతిః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
గచ్ఛ సౌమ్య తతః శీఘ్రం తూణైః పానీయమానయ ॥ 9
అపుడు సత్యధీరుడు, కౌంతేయుడైన ధర్మరాజు "సౌమ్యా! త్వరగా వెళ్ళు. అంబులపొదులతో నీటిని తీసుకొనిరా" అని నకులునితో అన్నాడు. (9)
నకులస్తు తథేత్యుక్త్వా భ్రాతుర్జ్యేష్ఠస్య శాసనాత్ ।
ప్రాద్రవద్ యత్ర పానీయం శీఘ్రం చైవాన్వపద్యత ॥ 10
'అలాగే' అని నకులుడు అన్న శాసనాన్ని అనుసరించి నీరున్నవైపుకు పరుగెత్తి వెంటనే అక్కడకు చేరాడు. (10)
స దృష్ట్వా విమలం తోయం సారసైః పరివారితమ్ ।
పాతుకామస్తతో వాచమ్ అంతరిక్షాత్ స శుశ్రువే ॥ 11
నకులుడు బెగ్గురు పక్షులు చుట్టిముట్టి ఉన్న ఆ నిర్మలోదకాన్ని చూచి త్రాగాలనుకొనగానే ఆకాశం నుండి ఒకమాట వినిపించింది. (11)
యక్ష ఉవాచ
మా తాత సాహసం కార్షీః మమ పూర్వపరిగ్రహః ।
ప్రశ్నానుక్త్వా తు మాద్రేయ తతః పిబ హరస్వ చ ॥ 12
యక్షుడిలా అన్నాడు.
మాద్రేయా! తొందరపడవద్దు. ఈ సరస్సుపై నాకు ఇప్పటికే అధికారముంది. నా ప్రశ్నలకు బదులిచ్చిన తరువాత నీటిని త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చు. (12)
అనాదృత్య తు తద్ వాక్యం నకులః సుపిపాసితః &
అపిబచ్ఛీతలం తోయం పీత్వా చ నిపపాత హ ॥ 13
బాగా దప్పికతో ఉన్న నకులుడు ఆ మాటను లెక్కచేయకుండా చల్లని నీటిని త్రాగాడు. త్రాగి పడిపోయాడు. (13)
చిరయమాణే నకులే కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అబ్రవీద్ భ్రాతరం వీరం సహదేవమరిందమమ్ ॥ 14
నకులుడు ఎప్పటికీ రాకపోవటంతో కుంతీనందనుడైన ధర్మరాజు అరిందముడూ, వీరుడూ సోదరుడూ అయిన సహదేవునితో ఇలా అన్నాడు. (14)
భ్రాతా హి చిరయాతో నః సహదేవ తవాగ్రజః ।
తథైవానయ సోదర్యం పానీయం చ త్వమానయ ॥ 15
సహదేవా! మా తమ్ముడు, నీ అన్న - నకులుడు - వెళ్ళి చాలా సేపయింది. నీవు వెళ్ళి అన్నను పిలుచుకొని, నీళ్ళు తీసికొని రా!(15)
సహదేవస్తథేత్యుక్త్వా తాం దిశం ప్రత్యపద్యత ।
దదర్శ చ హతం భూమౌ భ్రాతరం నకులం తదా ॥ 16
'అలాగే' అని సహదేవుడు ఆ దిక్కుపట్టిపోయాడు. అక్కడ నేలపై చచ్చిపడి ఉన్న సోదరుని - నకులుని చూశాడు. (16)
భ్రాతృశోకాభిసంతప్తః తృషయా చ ప్రపీడితః ।
అభిదుద్రావ పానీయం తతో వాగభ్యభాషత ॥ 17
భ్రాతృశోకంతో బాధపడుతూ దప్పికతో అలమటిస్తూ సహదేవుడు నీటివైపు పరుగెత్తాడు. అప్పుడు మరల మాట వినిపించింది. (17)
మా తాత సాహసం కార్షీః మమ పూర్వపరిగ్రహః ।
ప్రశ్నానుక్త్వా యథాకామం పిబస్వ చ హరస్వ చ ॥ 18
బిడ్డా! తొందరపడవద్దు. ఈ సరస్సుపై నాకు ఇప్పటికే అధికారముంది. నా ప్రశ్నలకు బదులిచ్చి స్వేచ్ఛగా నీటిని త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చు. (18)
అనాదృత్య తు తద్ వాక్యం సహదేవః పిపాసితః ।
అపిబచ్ఛీతలం తోయం పీత్వా చ నిపపాత హ ॥ 19
దప్పికతో ఉన్న సహదేవుడు ఆ మాటను లెక్కచేయకుండా చల్లని నీటిని త్రాగాడు. త్రాగి పడిపోయాడు. (19)
అథాబ్రవీత్ స విజయం కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
భ్రాతరౌ తే చిరగతౌ బీభత్సో శత్రుకర్శన ॥ 20
అప్పుడు కౌంతేయుడైన యుధిష్ఠిరుడు అర్జునునితో ఇలా అన్నాడు "శత్రుసంహారా! బీభత్సూ నీ సోదరులు వెళ్ళి చాలాసేపయినది. (20)
తౌ చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ ।
త్వం హి నస్తాత సర్వేషాం దుఃఖితానామపాశ్రయః ॥ 21
నాయనా! వారిని తీసికొనిరా! నీటిని కూడా తీసికొనిరా! మా అందరి దుఃఖాలను పొగొట్టేవాడవు నీవే. నీకు మేలు జరుగుతుంది" (21)
ఏవముక్తో గుడాకేశః ప్రగృహ్య సశరం ధనుః ।
ఆముక్తఖడ్గో మేధావీ తత్ సరః ప్రత్యపద్యత ॥ 22
ధర్మజుడు అలా అనగానే మేధావి అయిన అర్జునుడు ధనుర్బాణాలను చేతబట్టి, ఖడ్గాన్ని ధరించి ఆ సరస్సు దగ్గరకు చేరాడు. (22)
తతః పురుషశార్దూలౌ పానీయహరణే గతౌ ।
తౌ దదర్శ హతౌ తత్ర భ్రాతరౌ శ్వేతవాహనః ॥ 23
అప్పుడు అక్కడ పురుషశ్రేష్ఠుడైన అర్జునుడు నీటికోసం వచ్చి చచ్చిపడి ఉన్న సోదరులను చూచాడు.(23)
ప్రసుప్తావివ తౌ దృష్ట్వా నరసింహః సుదుఃఖితః ।
ధనురుద్యమ్య కౌంతేయః వ్యలోకయత తద్ వనమ్ ॥ 24
నిదురిస్తున్నట్లుగా పడి ఉన్న సోదరులను చూసి నరసింహుడైన అర్జునుడు బాధపడి, ధనుస్సునెక్కుపెట్టి, ఆ వనాన్ని పరిశీలించాడు. (24)
నాపశ్యత్ తత్ర కించిత్ స భూతమస్మిన్ మహావనే ।
సవ్యసాచీ తతః శ్రాంతః పానీయం సోఽభ్యధావత ॥ 25
ఆ మహావనంలో ఏ ప్రాణికూడా అర్జునునకు కనిపించలేదు. అప్పుడు అలసిపోయిన అర్జునుడు నీటివైపు పరుగెత్తాడు. (25)
అభిధావంస్తతో వాక్యమ్ అంతరిక్షాత్ స శుశ్రువే ।
కిమాసీదసి పానీయం నైతచ్ఛక్యం బలాత్ త్వయా ॥ 26
కౌంతేయ యది ప్రశ్నాం స్తాన్ మయోక్తాన్ ప్రతిపత్స్యసే ।
తతః పాస్యసి పానీయం హరిష్యసి చ భారత ॥ 27
పరుగెత్తుతూ అర్జునుడు గగనవాణిని ఇలా విన్నాడు. కౌంతేయా! నీటి దగ్గరకు వస్తున్నావా? బలవంతంగా నీటిని త్రాగలేవు.
భారతా! నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తే అప్పుడు నీటిని త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చు కూడా. (26,27)
వారితస్త్వబ్రవీత్ పార్థః దృశ్యమానో నివారయ ।
యావద్ బాణైర్వినిర్భిన్నః పునర్నైవం వదిష్యసి ॥ 28
ఆ గగనవాణి తనను ఆపగానే అర్జునుడు "ఎదురుగా వచ్చి ఆఫు. నా బాణాల తాకిడికి బ్రద్దలవుతావు. మరెప్పుడూ ఇలా మాటాడవు" అన్నాడు. (28)
ఏవముక్త్వా తతః పార్థః శరైరస్త్రానుమంత్రితైః ।
ప్రవవర్ష దిశః కృత్స్నాః శబ్దవేధం చ దర్శయన్ ॥ 29
ఇలా అని అర్జునుడు తన శబ్దవేధవిద్యను ప్రదర్శిస్తూ అస్త్రాలతో అభిమంత్రించిన బాణాలను అన్ని దిక్కులలో కురిపించాడు. (29)
కర్ణినాలీకనారాచాన్ ఉత్సృజన్ భరతర్షభ ।
స త్వమోఘానిఘాన్ ముక్త్వా తృష్ణయాభిప్రపీడితః ॥ 30
అనేకైరిషుసంఘాతైః అంతరిక్షే వవర్ష హ ।
భరతర్షభా! కర్ణి, నాలీక, నారాచాలనే బాణాలను విడిచాడు. దప్పికతో అలమటిస్తూ అమోఘ బాణాలను వదిలాడు. వివిధ బాణసమూహంతో అంతరిక్షంలో వాన కురిపించాడు. (30 1/2)
యక్ష ఉవాచ
కిం విఘాతేన తే పార్థ ప్రశ్నానుక్త్వా తతః పిబ ॥ 31
అనుక్త్వా చ పిబన్ ప్రశ్నాన్ పీత్వైవ న భవిష్యసి ।
యక్షుడిలా అన్నాడు.
అర్జునా! ఈ విఘాతమెందుకు? ప్రశ్నలకు బదులిచ్చి ఆఫై నీటిని త్రాగు. బదులివ్వకుండా త్రాగితే త్రాగినవెంటనే చనిపోతావు. (31 1/2)
ఏవముక్తస్తతః పార్థః సవ్యసాచీ ధనంజయః ॥ 32
అవజ్ఞాయైవ తాం వాచం పీత్వైవ నిపపాత హ ।
గగనవాణి అలా వినిపించినా పార్థుడు, సవ్యసాచి అయిన అర్జునుడు దానిని లెక్కచేయక నీటిని త్రాగి వెంటనే పడిపోయాడు. (32 1/2)
అథాబ్రవీద్ భీమసేనం కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 33
నకులః సహదేవశ్చ బీభత్సుశ్చ పరంతప ।
చిరం గతాస్తోయహేతోః నచాగచ్ఛంతి భారత ॥ 34
తాంశ్చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ ।
అప్పుడు కౌంతేయుడైన యుధిష్ఠిరుడు భీమసేనునితో ఇలా అన్నాడు. పరంతపా! భారతా! నకులుడు, సహదేవుడు, అర్జునుడు నీటికోసం వెళ్ళి చాలాసేపయింది. కానీ మరలి రాలేదు. వారిని తీసికొనిరా! నీటిని కూడా తీసికొనిరా! జాగ్రత్త. (33,34 1/2)
భీమసేనస్తథేత్యుక్త్వా తం దేశం ప్రత్యపద్యత ॥ 35
యత్ర తే పురుషవ్యాఘాః భ్రాతరోఽస్య నిపాతితాః ।
తాన్ దృష్ట్వా దుఃఖితో భీమః తృషయా చ ప్రపీడతః ॥ 36
అలాగే అని భీమసేనుడు పురుషశ్రేష్ఠులైన తన సోదరులు పడి ఉన్న చోటికి వచ్చాడు. వారిని చూసి బాధపడ్డాడు. దప్పిక కూడా బాధిస్తోంది. (35,36)
అమన్యత మహాబాహుః కర్మ తద్ యక్షరక్షసామ్ ।
స చింతయామాస తదా యోద్ధవ్యం ధ్రువమద్య వై ॥ 37
పాస్యామి తావత్ పానీయమ్ ఇతి పార్ధో వృకోదరః ।
తతోఽభ్యధావత్ పానీయం పిపాసుః పురుషర్షభః ॥ 38
మహాబాహువయిన భీముడు "ఇది యక్షులో, రాక్షసులో చేసిన పని" అని భావించాడు. "నేడు వారితో పోరాడక తప్పదు. ముందు నీళ్ళు త్రాగుదాం" అని నిశ్చయించుకొని పార్థుడు, పురుషశ్రేష్ఠుడు అయిన వృకోదరుడు నీటివైపు పరుగెత్తాడు. (37,38)
యక్ష ఉవాచ
మా తాత సాహసం కార్షీః మమ పూర్వపరిగ్రహః ।
ప్రశ్నానుక్త్వా తు కౌంతేయ తతః పిబ హరస్వ చ ॥ 39
యక్షుడిలా అన్నాడు.
నాయనా! కౌంతేయా! తొందరపడవద్దు. ఈ సరస్సుపై ఇప్పటికే నాకధికారముంది. నా ప్రశ్నలకు బదులిచ్చిన తర్వాత నీటిని త్రాగవచ్చు. తీసికొనిపోవచ్చు. (39)
ఏవముక్తస్తదా భీమః యక్షేణామితతేజసా ।
అనుక్త్వైవ తు తాన్ ప్రశ్నాన్ పీత్వైవ నిపపాత హ ॥ 40
అమితతేజస్వి అయిన యక్షుడు అలా చెప్పినా ఆ ప్రశ్నలకు సమాధానమివ్వకుండానే నీటిని త్రాగాడు. వెంటనే పడిపోయాడు. (40)
తతః కుంతీసుతో రాజా ప్రచింత్య పురుషర్షభః ।
సముత్థాయ మహాబాహుః దహ్యమానేన చేతసా ॥ 41
వ్యపేతజననిర్ఘోషం ప్రవివేశ మహావనమ్ ।
రురుభిశ్చ వరాహైశ్చ పక్షిభిశ్చ నిషేవితమ్ ॥ 42
అప్పుడు పురుషశ్రేష్ఠుడు, మహాబాహువూ, కౌంతేయుడూ అయిన ధర్మరాజు ఆలోచించి, లేచి, మనస్సు మండిపడుతుండగా మహావనంలో ప్రవేశించాడు. అక్కడ జనుల చప్పుడు కూడా లేదు. రురుజాతిమృగాలూ, వరాహాలూ, పక్షులూ అరణ్యాన్ని ఆశ్రయించి ఉన్నాయి. (41,42)
నీలభాస్వరవర్ణైశ్చ పాదపైరుపశోభితమ్ ।
భ్రమరైరుపగీతం చ పక్షిభిశ్చ మహాయశాః ॥ 43
నీలవర్ణంతో ప్రకాశిస్తున్న చెట్లతో, తుమ్మెదల ఝంకారాలతో, పక్షుల అరుపులతో శోభిస్తున్న ఆ వనంలో మహాయశస్వి ధర్మజుడు ప్రవేశించాడు. (43)
స గచ్ఛన్ కాననే తస్మిన్ హేమజాలపరిష్కృతమ్ ।
దదర్శ తత్ సరః శ్రీమాన్ విశ్వకర్మకృతం యథా ॥ 44
ఆ అడవిలో నడుస్తూ ధర్మరాజు బంగారువన్నెగల కుసుమకేసరాలతో అలంకరింపబడి ఉన్న ఆ సరస్సును చూశాడు. అది విశ్మకర్మ నిర్మాణమనిపిస్తోంది. (44)
ఉపేతం నలినీజాలైః సింధువారైః సవేతసైః ।
కేతకైః కరవీరైశ్చ పిప్పలైశ్చైవ సంవృతమ్ ।
(తతో ధర్మసుతః శ్రీమాన్ భ్రాతృదర్శనలాలసః ।)
శ్రమార్తస్తదుపాగమ్య సరో దృష్ట్వాథ విస్మితః ॥ 45
ఆ సరస్సు తామరతీగెల సమూహాలతో శోభిస్తోంది. చుట్టూ సింధువార, వేతస, కేతక, కరవీర, పిప్పలవృక్షాలున్నాయి. ధర్మరాజు సోదరులను చూడాలన్న తహతహతో అలసిపోయి, ఆ సరస్సు దగ్గరకు వచ్చి దానిని చూచి ఆశ్చర్యానికి లోనయ్యాడు. (45)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆరణేయపర్వణి నకులాదిపతనే ద్వాదశాధిక త్రిశతతమోఽధ్యాయః ॥ 312 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆరణేయపర్వమను ఉపపర్వమున నకులాదిపతనమను మూడువందల పండ్రెండవ అధ్యాయము. (312)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 45 1/2 శ్లోకాలు.)