311. మూడువందల పదకొండవ అధ్యాయము
(ఆరణేయ పర్వము)
బ్రాహ్మణుని అరణిమంథనకాష్ఠాలకై పాండవులు మృగము వెంటబడుట.
జనమేజయ ఉవాచ
ఏవం హృతాయాం భార్యాయాం ప్రాప్య క్లేశమనుత్తమమ్ ।
ప్రతిపద్య తతః కృష్ణాం కిమకుర్వత పాండవాః ॥ 1
జనమేజయుడిలా అన్నాడు.
ఆ రీతిగా ద్రౌపది అపహరించబడగా ఎంతో కష్టపడి పాండవులు తిరిగి ఆమెను పొందగలిగారు. ఆఫై ఏం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
ఏవం హృతాయాం కృష్ణాయాం ప్రాప్య క్లేశమనుత్తమమ్ ।
విహాయ కామ్యకం రాజా సహ భ్రాతృభిరచ్యుతః ॥ 2
పునర్ద్వైతవనం రమ్యమ్ ఆజగామ యుధిష్ఠిరః ।
స్వాదుమూలఫలం రమ్యం విచిత్రబహుపాదపమ్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ రీతిగా ద్రౌపది అపహరింపబడగా ఎంతో కష్టపడి తిరిగి ఆమెను పొంది నిశ్చలుడైన యుధిష్ఠిరుడు సోదరులతో సహా కామ్యకవనాన్ని వీడి మరల ద్వైతవనానికి వచ్చాడు. ద్వైతవనం రమణీయ మైనది. రుచికరమైన ఫలమూలాలు గలది. విచిత్ర వృక్షగణాలతో ప్రకాశించేది. (2,3)
అనుభుక్తఫలాహారాః సర్వ ఏవ మితాశనాః ।
న్యవసన్ పాండవాస్తత్ర కృష్ణయా సహ భార్యయా ॥ 4
అక్కడ పాండవులు అందరూ మితాశనులై ఫలాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ద్రౌపదితో కలిసి ఉన్నారు. (4)
వసన్ ద్వైతవనే రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
భీమసేనోఽర్జునశ్చైవ మాద్రీపుత్రౌ చ పాండవౌ ॥ 5
బ్రాహ్మణార్థే పరాక్రాంతాః ధర్మాత్మానో యతవ్రతాః ।
క్లేశమార్చ్ఛంత విపులం సుఖోదర్కం పరంతపాః ॥ 6
కౌంతేయుడయిన యుధిష్ఠిరమహారాజు, పాండుకుమారులు, భీమార్జునులు, మాద్రేయులు నకులసహదేవులు - వీరంతా పరంతపులు సంయమపరాయణులు, ధర్మాత్ములై ద్వైతవనంలో నివసిస్తూ ఒక బ్రాహ్మణుని కోసం పరాక్రమించి ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ అది సుఖాంతమైనది. (5,6)
తస్మిన్ ప్రతివసంతస్తే యత్ ప్రాపుః కురుసత్తమాః ।
వనే క్లేశం సుఖోదర్కం తత్ ప్రవక్ష్యామి తే శృణు ॥ 7
ఆ వనంలో నివసిస్తూ కురుసత్తములు సుఖాంతమైన కష్టాన్ని ఎలా పొందారో వివరంగా చెప్తాను. విను. (7)
అరణీసహితం మంథం బ్రాహ్మణస్య తపస్వినః &
మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత ॥ 8
తపస్వి అయిన ఒక బ్రాహ్మణుని అరణి, మంథన కాష్ఠం - వాటిని ఒరుసుకొన్న ఒక జింకకొమ్ములలో ఇరుక్కుపోయాయి. (8)
తదాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగః &
ఆశ్రమాంతరితః శీఘ్రం ప్లవమానో మహాజవః ॥ 9
కొమ్ములతో చిక్కుకొన్న వాటిని అలాగే ఉంచుకొని ఆ పెద్దజింక త్వరపడుతూ, మహావేగంతో గెంతుతూ, ఆశ్రమంలో నుండి వెంటనే వెళ్ళిపోయింది. (9)
హ్రియమాణం తు తం దష్ట్వా స విప్రః కురుసత్తమ ।
కురుసత్తమా! జింక వాటిని కొనిపోవటం చూసి ఆ విప్రుడు అగ్నిహోత్ర పరికరాలను పొందాలని కోరుతూ వెంటనే ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. (10)
అజాతశత్రుమాసీనం భ్రాతృభిః సహితం వనే ।
ఆగమ్య బ్రాహ్మణస్తూర్ణం సంతప్తశ్చేదమబ్రవీత్ ॥ 11
సోదరులతో పాటు కూర్చొనియున్న అజాతశత్రువు దగ్గరకు వేగంగా వచ్చి, ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఇలా అన్నాడు. (11)
అరణీసహితం మంథం సమాసక్తం వనస్పతౌ ।
మృగస్య ఘర్షమాణస్య విషాణే సమసజ్జత ॥ 12
చెట్టుకు ఆనించిపెట్టి ఉన్న అరణి, మంథనకాష్ఠం వాటిని ఒరుసుకొన్న జింక కొమ్ములో చిక్కుపడ్డాయి. (12)
తమాదాయ గతో రాజన్ త్వరమాణో మహామృగః ।
ఆశ్రమాత్ త్వరితః శీఘ్రం ప్లవమానో మహాజవః ॥ 13
వాటిని అలాగే ఉంచుకొని ఆ పెద్దజింక త్వరపడుతూ, మహావేగంతో గెంతుతూ, ఆశ్రమంలో నుండి వెంటనే వెళ్ళిపోయింది. (13)
తస్య గత్వా పదం రాజన్ ఆసాద్య చ మహామృగమ్ ।
అగ్నిహోత్రం న లుప్యేత తదానయత పాండవాః ॥ 14
రాజా! దాని స్థావరానికి వెళ్ళి, ఆ మహామృగాన్ని పట్టుకొని, ఆ అరణిని, మంథనకాష్ఠాన్ని మీరు తెచ్చి ఇవ్వాలి. లేకపోతే అగ్నిహోత్ర లోపం జరుగుతుంది. (14)
బ్రాహ్మణస్య వచః శ్రుత్వా సంతప్తోఽథ యుధిష్ఠిరః ।
ధనురాదాయ కౌంతేయః ప్రాద్రవద్ భ్రాతృభిః సహ ॥ 15
బ్రాహ్మణుని మాట విని, బాధపడుతూ కౌంతేయుడైన యుధిష్ఠిరుడు వింటిని చేతబట్టి సోదరులతో కలిసి పరుగెత్తాడు. (15)
సన్నద్ధా ధన్వినః సర్వే ప్రాద్రవన్ నరపుంగవాః ।
బ్రాహ్మణార్థే యతంతస్తే శీఘ్రమన్వగమన్ మృగమ్ ॥ 16
నరపుంగవులయిన పాండవులందరూ వింటిని సన్నద్ధం చేసికొని బ్రాహ్మణకార్యప్రయత్నం మీద వేగంగా జింకవెంట పడ్డారు. (16)
కర్ణినాలీకనారాచాన్ ఉత్సృజంతో మహారథాః ।
నావిధ్యన్ పాండవాస్తత్ర పశ్యంతో మృగమంతికాత్ ॥ 17
దగ్గరలోనే జింక కనిపించింది. వారు కర్ణి, నాలీక, నారాచాలనే బాణాలను విడువసాగారు. అయినా దానిని కొట్టలేకపోయారు. (17)
తేషాం ప్రయతమానానాం నాదృశ్యత మహామృగః ।
అపశ్యంతో మృగం శ్రాంతాః దుఃఖం ప్రాప్తా మనస్వినః ॥ 18
వారు ప్రయత్నిస్తున్నా ఆ మహామృగం కనిపించటం లేదు. జింక కనిపించకపోవటంతో అలసిపోయి మనస్వినులయిన వారు ఎంతో దుఃఖించారు. (18)
శీతలచ్ఛాయమాగమ్య న్యగ్రోధం గహనే వనే ।
క్షుత్పిపాసాపరీతాంగాః పాండవాః సముపావిశన్ ॥ 19
దట్టమైన ఆ అరణ్యంలో చల్లని నీడగల ఒక మర్రిచెట్టు క్రింద ఆ పాండవులు కూర్చున్నారు. వారు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. (19)
తేషాం సముపవిష్టానాం నకులో దుఃఖితస్తదా ।
అబ్రవీద్ భ్రాతరం శ్రేష్ఠమ్ అనుర్షాత్ కురునందనమ్ ॥ 20
వారంతా కూర్చోగానే నకులుడు బాధపడుతూ అసహనంతో కురునందనుడైన తన సోదరునితో (ధర్మరాజుతో) ఇలా అన్నాడు. (20)
నాస్మిన్ కులే జాతు మమజ్జ ధర్మః
న చాలస్యాదర్థలోపో బభూవ ।
అనుత్తరాః సర్వభూతేషు భూయః
సంప్రాఫ్తాః స్మః సంశయం కింను రాజన్ ॥ 21
రాజా! మన వంశంలో ఎప్పుడూ ధర్మం లోపించలేదు. అలసత్వం కారణంగా అర్థలోపం కూడా జరగలేదు. సర్వప్రాణులకు ఏది కోరినా ఇచ్చే మనం మరల ధర్మసంకటానికి లోనవుతున్నామా? (21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆరణేయపర్వణి మృగాన్వేషణే ఏకాదశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 311 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆరణేయపర్వమను ఉపపర్వమున మృగాన్వేషణమను మూడువందల పదునొకండవ అధ్యాయము. (311)