314. మూడువందల పదునాలుగవ అధ్యాయము
నలుగురిని బ్రతికించి యక్షుడు ధర్మరాజుకు వరమిచ్చుట.
వైశంపాయన ఉవాచ
తతస్తే యక్షవచనాత్ ఉదతిష్ఠంత పాండవాః ।
క్షుత్పిపాసే చ సర్వేషాం క్షణేన వ్యపగచ్ఛతామ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు యక్షుడు పిలవగానే పాండవులంతా లేచారు. అందరి ఆకలిదప్పులూ క్షణంలో తొలగిపోయాయి. (1)
యుధిష్ఠిర ఉవాచ
సరస్యేకేన పాదేన తిష్ఠంతమపరాజితమ్ ।
పృచ్ఛామి కో భవాన్ దేవః న మే యక్షో మతో భవాన్ ॥ 2
యుధిష్ఠిరుడిలా అన్నాడు. ఓటమిలేకుండా ఒంటికాలిపై సరస్సులో నిలిచియున్న తమరెవరు? యక్షులని నాకనిపించటం లేదు. అడుగుతున్నాను. చెప్పండి. (2)
వసూనాం వా భవానేకః రుద్రానామథవా భవాన్ ।
అథవా మరుతాం శ్రేష్ఠః వజ్రీ వా త్రిదదేశ్వరః ॥
వసువులలో నొకరా? రుద్రులలో నొకరా? దేవతలలో నొక్కరా? లేక వజ్రధారులయిన దేవేంద్రులా? (3)
మమ హి భ్రాతర ఇమే సహస్రశతయోధినః ।
తం యోధం న ప్రపశ్యామి యేన సర్వే నిపాతితాః ॥
ఈ నా సోదరులు లక్షలమందితో యుద్ధం చేయగలవారు. వీరిని పడగొట్టగల యోధుని ఇంతవరకు చూడలేదు. (4)
సుఖం ప్రతిప్రబుద్ధానామ్ ఇంద్రియాణ్యుపలక్షయే ।
స భవాన్ సుహృదోఽస్మాకమ్ అథవా నః పితా భవాన్ ॥
వీరి శరీరేంద్రియాలను చూస్తుంటే సుఖంగా నిదురించి లేచినట్లనిపిస్తోంది. మాకు తమరు మిత్రులా? లేక జనకులా? (5)
యక్ష ఉవాచ
అహం తే జనకస్తాత ధర్మోఽమృదుపరాక్రమ ।
త్వాం దిదృక్షురనుప్రాప్తః విద్ధి మాం భరతర్షభ ॥
యక్షుడిలా అన్నాడు.
భరతర్షభా! ప్రచండపరాక్రమా! నాయనా! నేను నీ తండ్రిని. యమధర్మరాజును. నిన్ను చూడాలనుకొని వచ్చాను. తెలిసికో. (6)
యశః సత్యం దమః శౌచమ్ ఆర్జవం హ్రీరచాపలమ్ ।
దానం తపో బ్రహ్మచర్యమ్ ఇత్యేతాస్తనవో మమ ॥ 7
యశస్సు, సత్యం, దమం, శౌచం, ఆర్జవం, సిగ్గు, ఆచంచలత్వం, దానం, తపస్సు, బ్రహ్మచర్యం - ఇవన్నీ నా శరీరాలే. (7)
అహింసా సమతా శాంతిః ఆనృశంస్యమమత్సరః ।
ద్వారాణ్యేతాని మే విద్ధి ప్రియో హ్యసి సదా మమ ॥ 8
అహింస, సమత, ఆనృశంస్యం, అమత్సరం ఇవన్నీ నన్ను చేరటానికి ద్వారాలు. నీవంటే నాకెప్పుడూ ఇష్టం. (8)
దిష్ట్యా పంచసు రక్తోఽసి దిష్ట్యా తే షట్పదీ జితా ।
ద్వే పూర్వే మధ్యమే ద్వే చ ద్వే చాంతే సాంపరాయికే ॥ 9
నీవు శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధానా(అయిదు) లయందు అనురక్తుడవు. ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామృత్యువు (షట్పది) లను జయించావు. ఈ ఆరింటిలో మొదటి రెండు పుట్టుకతో వచ్చేవి. మధ్యవయస్సులో వచ్చేవి నడిమి రెండు. చరమావస్థలో వచ్చేవి చివరి రెండు. (9)
ధర్మోఽహమితి భద్రం తే జిజ్ఞాసుస్త్వామిహాగతః ।
ఆనృశంస్యేన తుష్టోఽస్మి వరం దాస్యామి తేఽనఘ ॥ 10
నేను యమధర్మరాజును. నీ గురించి తెలిసికోవాలని ఇక్కడకు వచ్చాను. నీకు మేలు జరుగుతుంది. నీ సమదృష్టితో తుష్టి పొందాను. అనఘా! నీకు వరమిస్తాను. (10)
వరం వృణీష్వ రాజేంద్ర దాతా హ్యస్మి తవానఘ ।
యే హి మే పురుషా భక్తాః న తేషామస్తి దుర్గతిః ॥ 11
రాజేంద్రా! అనఘా! నీకు వరమిస్తాను. కోరుకో! నా భక్తులకు ఎవ్వరికీ దుర్గతి ఉండదు. (11)
యుధిష్ఠిర ఉవాచ
అరణీసహితం యస్య మృగో హ్యాదాయ గచ్ఛతి ।
తస్యాగ్నయో న లుప్యేరన్ ప్రథమోఽస్తు వరో మమ ॥ 12
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
ఒక బ్రాహ్మణుని అరణిని మంథనకాష్ఠాన్ని మృగం తీసికొనిపోయింది. ఆయనకు అగ్నిహోత్రలోపం లేకుండా చూడు. ఇదే నాకు మొదటివరం. (12)
యక్ష ఉవాచ
అరణీసహితం హ్యస్య బ్రాహ్మణస్య హృతం మయా ।
మృగవేషేణ కౌంతేయ జిజ్ఞాసార్థం తవ ప్రభో ॥ 13
యక్షుడిలా అన్నాడు.
కౌంతేయా! మహారాజా! ఆ బ్రాహ్మణుని అరణిని, మంథనకాష్ఠాన్ని మృగరూపంలో నిన్ను పరీక్షించటానికై నేను తీసికొనిపోయాను. (13)
వైశంపాయన ఉవాచ
దదానీత్యేవ భగవాన్ ఉత్తరం ప్రత్యపద్యత ।
అన్యం వరయ భద్రం తే వరం త్వమమరోపమ ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు.
అప్పుడు ధర్ముడు 'అరణిమంథన కాష్ఠాలను ఇస్తాను. అమరోపమా! నీకు మేలు జరుగుతుంది. మరొకవరం కోరుకో' అని సమాధానమిచ్చాడు. (14)
యుధిష్ఠిర ఉవాచ
వర్షాణి ద్వాదశారణ్యే త్రయోదశముపస్థితమ్ ।
తత్ర నో నాభిజానీయుః వసతో మనుజాః క్వచిత్ ॥ 15
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
అరణ్యంలో పండ్రెండు సంవత్సరాలు గడచిపోయాయి. పదమూడవ సంవత్సరం అజ్ఞాతంగా గడపవలసియుంది. ఆ సమయంలో ఎక్కడా, ఏ మనుజులూ మమ్ము గుర్తించకూడదు. (15)
వైశంపాయన ఉవాచ
దదానీత్యేవ భగవాన్ ఉత్తరం ప్రత్యపద్యత ।
భూయశ్చాశ్వాసయామాస కౌంతేయం సత్యవిక్రమమ్ ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు.
అలాగే వరమిస్తానని ధర్ముడు సమాధాన మిచ్చాడు. సత్యవిక్రముడైన ధర్మరాజును ఇంకా ఇలా అనునయించాడు. (16)
యద్యపి స్వేన రూపేణ చరిష్యథ మహీమిమామ్ ।
న వో విజ్ఞాస్యతే కశ్చిత్ త్రిషు లోకేషు భారత ॥ 17
భారతా! మీరు మీ రూపాలతోనే ఈ భూమిపై తిరుగుతున్నా మూడులోకాలలోని వారెవ్వరూ మిమ్ము గుర్తించలేరు. (17)
వర్షం త్రయోదశమిదం మత్ప్రసాదాత్ కురూద్వహాః &
విరాటనగరే గూఢా అవిజ్ఞాతాశ్చరిష్యథ ॥ 18
కురూద్వహులారా! ఈ పదమూడవ సంవత్సరాన్ని విరాటనగరంలో రహస్యంగా గడపండి. నా అనుగ్రహం వలన మిమ్మెవ్వరూ గుర్తించరు. (18)
యద్ వః సంకల్పితం రూపం మనసా యస్య యాదృశమ్ ।
తాదృశం తాదృశం సర్వే ఛందతో ధారయిష్యథ ॥ 19
మీ మీ మనస్సులలో మీరు ఏ రూపాన్ని సంకల్పించుకొంటే దానికి అనుగుణమైన రూపాన్ని స్వేచ్ఛగా ధరించగలరు. (19)
అరణీసహితం చేదం బ్రాహ్మణాయ ప్రయచ్ఛత ।
జిస్ఞాసార్థం మయా హ్యేతత్ ఆహృతం మృగరూపిణా ॥ 20
ఈ అరణి, మంథనకాష్ఠాలను బ్రాహ్మణున కివ్వండి. నిన్ను పరీక్షించటానికై నేను మృగరూపంలో వీటిని తెచ్చాను. (20)
ప్రవృణీష్వాపరం సౌమ్య వరమిష్టం దదాని తే ।
న తృప్యామి నరశ్రేష్ఠ ప్రయచ్ఛన్ వై వరాంస్తథా ॥ 21
సౌమ్యా! నరశ్రేష్ఠా! నీకిష్టమైనవరం మరొకటి కోరుకో. ఇస్తా. నీకు ఎన్ని వరాలిచ్చినా తృప్తి కలగటం లేదు. (21)
తృతీయం గృహ్యతాం పుత్ర వరమప్రతిమం మహత్ ।
త్వం హి మత్ప్రభవో రాజన్ విదురశ్చ మమాంశజః ॥ 22
కుమారా! మహారాజా! మూడవది సాటిలేని గొప్పవరమేదైనా కోరుకో. నీవు నా కుమారుడవు. విదురుడు నా అంశలో పుట్టినవాడు. (22)
యుధిష్ఠిర ఉవాచ
దేవదేవో మయా దృష్టః భవాన్ సాక్షాత్ సనాతనః ।
యం దదాసి వరం తుష్టః తం గ్రహీష్యామ్యహం పితః ॥ 23
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
తండ్రీ! సనాతనదేవాధిదేవుడవు, సాక్షాత్తుగా దర్శనమిచ్చావు. ఆనందంగా నీవు ఏ వరమిస్తే దానినే స్వీకరిస్తా. (23)
జయేయం లోభమోహౌ చ క్రోధం చాహం సదా విభో ।
దానే తపసి సత్యే చ మనో మే సతతం భవేత్ ॥ 24
ప్రభూ! నేను ఎల్లప్పుడూ లోభమోహాలను క్రోధాన్ని జయించగలిగాలి. నా మనస్సు ఎప్పుడూ దానం మీదా, తపస్సు మీదా, సత్యం మీదా నిలవాలి. (24)
ధర్మ ఉవాచ
ఉపపన్నో గుణైరేతైః స్వభావేనాసి పాండవ ।
భవాన్ ధర్మః పునశ్చైవ యథోక్తం తే భవిష్యతి ॥ 25
యమధర్మరాజు ఇలా అన్నాడు.
పాండుకుమారా! నీకు ఈ లక్షణాలన్నీ స్వభావసిద్ధాలు. నీవు ధర్మస్వరూపుడవు. సరే నీవడిగినట్లే జరుగుతుంది. (25)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వాంతర్దధే ధర్మః భగవాన్ లోకభావనః ।
సమేతాః పాండవాశ్చైవ సుఖసుప్తా మనస్వినః ॥ 26
ఉపేత్య చాశ్రమం వీరాః సర్వ ఏవ గతక్లమాః ।
ఆరణేయం దదుస్తస్మై బ్రాహ్మణాయ తపస్వినే ॥ 27
వైశంపాయనుడిలా అన్నాడు.
రాజా! ఆ రీతిగా చెప్పి లోకరక్షకుడైన భగవంతుడు ధర్ముడు మాయమయ్యాడు. సుఖనిద్రతో అలసటను పోగొట్టుకొన్న మనస్వులు ఆ వీరపాండవులంతా కలిసి ఆశ్రమానికి వచ్చారు. తాపసి అయిన బ్రాహ్మణునకు అరణిని, మంథనకాష్ఠాన్నీ ఇచ్చారు. (26,27)
ఇదం సముత్థానసమాగతం మహత్
పితుశ్చ పుత్రస్య చ కీర్తివర్ఢనమ్ ।
పఠన్ నరః స్యాద్ విజితేంద్రియో వశీ
సపుత్రపౌత్రః శతవర్షభాగ్ భవేత్ ॥ 28
ఇది భీమార్జున నకుల సహదేవుల పునర్జీవనానికి సంబంధించినది. తండ్రికీ, కొడుకుకూ కీర్తిని పెంచినది. దీనిని చదివినవాడు జితేంద్రియుడై,సంయమియై పుత్రపౌత్రాదులతో నూరుసంవత్సరాలు జీవిస్తాడు. (28)
న చాప్యధర్మే న సుహృద్విభేదనే
పరస్వహారే పరదారమర్శనే ।
కదర్యభావే న రమేన్మనః సదా
వృణాం సదాఖ్యానమిదం విజానతామ్ ॥ 29
ఈ చక్కని కథను గ్రహించిన వారికి అధర్మమందు కానీ, మిత్రభేదమందుకానీ, పరులసొమ్మును అపహరించుటయందుకానీ, పరస్త్రీగమనం మీదకానీ, పిసినారితనం మీద కానీ మనస్సు ప్రవర్తించదు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆరణేయపర్వణి నకులాదిజీవనాదివరప్రాప్తౌ చతుర్దశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 314 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆరణేయపర్వమను ఉపపర్వమున నకులాది జీవనాది వరప్రాప్తి అను మూడువందల నాలుగవ అధ్యాయము. (314)