315. మూడువందల పదునైదవ అధ్యాయము

ధౌమ్యోపదేశము : అజ్ఞాతవాస సమాలోచనము.

వైశంపాయన ఉవాచ
ధర్మేణ తేఽభ్యనుజ్ఞాతాః పాండవాః సత్యవిక్రమాః &
అజ్ఞాతవాసం వత్స్యంతః ఛన్నా వర్షం త్రయోదశమ్ ॥ 1
ఉపోపవిష్టా విద్వాంసః సహితాః సంశితవ్రతాః ।
యే తద్భక్తా వసంతి స్మ వనవాసే తపస్వినః ॥ 2
తానబ్రువన్ మహాత్మానః స్థితాః ప్రాంజలయస్తదా ।
అభ్యనుజ్ఞాపయిష్యంతః తం నివాసం ధృతవ్రతాః ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు.
యమధర్మరాజు అనుమతిని పొంది సత్యపరాక్రములయిన పాండవులు పదమూడవసంవత్సరంలో రహస్యంగా అజ్ఞాతవాసాన్ని గడపగోరి ఒకచోట చేరి దగ్గరగా కూర్చొని ఆలోచించసాగారు. వారు విద్వాంసులు, వ్రతశీలురు. వనవాసంలో భక్తిభావంతో తమతోబాటు నివసించిన తాపసుల దగ్గర అజ్ఞాతవాసానికి అనుగుణంగా వీడ్కోలు తీసికొనదలచి ధృతవ్రతులూ, మహాత్ములూ అయిన పాండవులు చేతులు జోడించి నిలిచి ఇలా అన్నారు. (1-3)
విదితం భవతాం సర్వం ధార్తరాష్ట్రైర్యథా వయమ్ ।
ఛద్మనా హృతరాజ్యాశ్చానయాశ్చ బహుశః కృతాః ॥ 4
ఇది మీకందరకూ తెలిసిన విషయమే. ధార్తరాష్ట్రులు వంచనతో మా రాజ్యాన్ని అపహరించటమే కాక మాపై చాలాసార్లు నీతిరహితంగా ప్రవర్తించారు. (4)
ఉషితాశ్చ వనే కృచ్ఛ్రే వయం ద్వాదశ వత్సరాన్ ।
అజ్ఞాతవాససమయం శేషం వర్షం త్రయోదశమ్ ॥ 5
మేము పండ్రెండు సంవత్సరాలు కష్టపడుతూ వనవాసం చేశాము. ఇక మిగిలిన పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం. (5)
తద్ వసామో వయం ఛన్నాః తదనుజ్ఞాతుమర్హథ ।
సుయోధనశ్చ దుష్టాత్మా కర్ణశ్చ సహసౌబలః ॥ 6
జానంతో విషమం కుర్యుః అస్మాస్వత్యంతవైరిణః ।
యుక్తచారాశ్చ యుక్తాశ్చ పౌరస్య స్వజనస్య చ ॥ 7
కాబట్టి మేము అజ్ఞాతంగా నివసించాలి. అనుమతించండి. సుయోధనుడు, కర్ణుడు, శకుని దురాత్ములు. మాపై తీవ్రశత్రుత్వం కలవారు. మా ఉనికిని తెలిసికొనటంలో నిమగ్నులై గూఢచారులను కూడా నియమించారు. పౌరులతో తనవారితో కూడా విషమంగా ప్రవర్తిస్తారు. (6,7)
అపి నస్తద్ భవేద్ భూయః యద్ వయం బ్రాహ్మణైః సహ ।
సమస్తాః స్వేషు రాష్ట్రేషు స్వరాజ్యస్థా భవేమహి ॥ 8
మేమంతా మరల బ్రాహ్మణులతో కలిసి మా దేశంలో, మా రాజ్యంలో సుప్రతిష్ఠుల మయ్యేరోజు మాకు వస్తుందంటారా? (8)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా దుఃఖశోకార్తః శుచిర్ధర్మసుతస్తదా ।
సమ్మూర్ఛితోఽభవద్ రాజా సాశ్రుకంఠో యుధిష్ఠిరః ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు.
అని పలికి పవిత్రుడైన ధర్మసుతుడు యుధిష్ఠిరుడు దుఃఖశోకార్తుడై కంట తడిపెట్టి మూర్ఛిల్లాడు. (9)
తమథాశ్వాసయన్ సర్వే బ్రాహ్మణా భ్రాతృభిః సహ ।
అథ ధౌమ్యోఽబ్రవీద్ వాక్యం మహార్థం నృపతిం తదా ॥ 10
బ్రాహ్మనులందరూ ధర్మజుని సోదరులతో కలిసి ఆయనను ఊరడింపజేశాడు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుతో అర్థవంతమైన వచనాలను ఇలా పలికాడు. (10)
రాజన్ విద్వాన్ భవాన్ దాంతః
సత్యసంధో జితేంద్రియః ।
నైవం విధాః ప్రముహ్యంతే
నరాః కస్యాంచిదాపది ॥ 11
రాజా! నీవు విద్వాంసుడవు. సత్యసంధుడవు. మనస్సును, ఇంద్రియాలనూ అదుపులో నుంచుకొన్నవాడివి. ఇటువంటి మనుజులు ఏదో ఆపద వచ్చిందని మోహవశులు కారు. (11)
దేవైరప్యాపదః ప్రాప్తాః ఛన్నైశ్చ బహుశస్తథా ।
తత్ర తత్ర సపత్నానాం నిగ్రహార్థం మహాత్మభిః ॥ 12
దేవతలకు కూడా ఎన్నో ఆపదలు వస్తాయి. చాలాసార్లు మహాత్ములయిన ఆ దేవతలు శత్రువులను అణచటానికి అజ్ఞాతంగానే ఉన్నారు. (12)
ఇంద్రేణ నిషధాన్ ప్రాప్య గిరిప్రస్థాశ్రమే తదా ।
ఛన్నేనోష్య కృతం కర్మ ద్విషతాం చ వినిగ్రహే ॥ 13
దేవేంద్రుడు శత్రువులను అణచటానికై నిషధదేశానికి వెళ్ళి అక్కడ గిరిప్రస్థాశ్రమంలో అజ్ఞాతంగా ఉండి తన పని ముగించుకొన్నాడు. (13)
విష్ణునాశ్వశిరః ప్రాప్య తథాదిత్యాం నివత్స్యతా ।
గర్భే వధార్థం దైత్యానామ్ అజ్ఞాతేనోషితం చిరమ్ ॥ 14
విష్ణుమూర్తి కూడా దైత్యసంహారార్థం హయగ్రీవుడై అదితిగర్భంలో చాలాకాలం అజ్ఞాతంగా ఉన్నాడు. (14)
ప్రాప్య వామనరూపేణ ప్రచ్ఛన్నం బ్రహ్మరూపిణా ।
బలేర్యథా హృతం రాజ్యం విక్రమైస్తచ్చ తే శ్రుతమ్ ॥ 15
విష్ణువు బ్రాహ్మణవేషంలో వామనరూపాన్ని ధరించి, త్రివిక్రముడై బలిచక్రవర్తి రాజ్యాన్ని అపహరించిన విషయం నీకు తెలుసు. (15)
హుతాశనేన యచ్చాపః ప్రవిశ్చచ్ఛన్నమాసతా ।
విబుధానాం కృతం కర్మ తచ్చ సర్వం శ్రుతం త్వయా ॥ 16
అగ్ని నీటిలో ప్రవేశించి, అక్కడే అజ్ఞాతంగా ఉండి, దేవతలకు కార్యసిద్ధిని కలిగించాడు. అదంతా నీవు విన్నావు గదా! (16)
ప్రచ్ఛన్నం చాపి ధర్మజ్ఞ హరిణారివినిగ్రహే ।
వజ్రం ప్రవిశ్య శక్రస్య యత్ కృతం తచ్చ తే శ్రుతమ్ ॥ 17
ధర్మజ్ఞా! శత్రుదమనానికై విష్ణువు అజ్ఞాతంగా ఇంద్రుని వజ్రంలో ప్రవేశించి కార్యసిద్ధిని కలిగించిన విషయం నీవెరుగుదువు. (17)
ఔర్వేణ వసతా ఛన్నమ్ ఊరౌ బ్రహ్మర్షిణా తదా ।
యత్ కృతం తాత దేవేషు కర్మ తత్తేఽనఘ శ్రుతమ్ ॥ 18
నాయనా అనఘా! బ్రహ్మర్షి అయిన ఔర్వుడు తల్లితొడలో అజ్ఞాతంగా నివసించి దేవకార్యాన్ని సాధించిన విషయం నీవెరుగుదువు. (18)
ఏవం వివస్వతా తాత ఛన్నేనోత్తమతేజసా ।
నిర్దగ్ధాః శాత్రవాః సర్వే వసతా భువి సర్వశః ॥ 19
నాయనా! అదే రీతిగా ఉత్తమతేజస్వి అయిన సూర్యుడు కూడా రహస్యంగా భూమిలో ఉండి శత్రువుల నందరినీ దహించివేశాడు. (19)
విష్ణునా వసతా చాపి గృహే దశరథస్య వై ।
దశగ్రీవో హతశ్ఛన్నం సంయుగే భీమకర్మణా ॥ 20
భీమపరాక్రముడైన విష్ణువు కూడా దశరథుని ఇంట అజ్ఞాతంగా నిలిచి యుద్ధంలో దశకంఠుని చంపాడు. (20)
ఏవమేవ మహాత్మానః ప్రచ్ఛన్నాస్తత్ర తత్ర హ ।
అజయఞ్ఛాత్రవాన్ యుద్ధే తథా త్వమపి జేష్యసి ॥ 21
ఇదేవిధంగా మహాత్ములెందరో అక్కడక్కడ అజ్ఞాతంగా నీవు కూడా గెలవగలవు. (21)
తథా ధౌమ్యేన ధర్మజ్ఞః వాక్యైః సంపరితోషితః ।
శాస్త్రబుద్ధ్యా స్వబుద్ధ్యా చ న చచాల యుధిష్ఠిరః ॥ 22
ఆ రీతిగా ధౌమ్యుడు తగినమాటలతో ధర్మజుని ఆనందింపజేయగా యుధిష్ఠిరుడు శాస్త్రబుద్ధితో, స్వబుద్ధితో ఆలోచించి నిశ్చలంగా నిలిచాడు. (22)
అథాబ్రవీన్మహాబాహుః భీమసేనో మహాబలః ।
రాజానం బలినాం శ్రేష్ఠః గిరా సంపరిహర్షయన్ ॥ 23
అప్పుడు మహాబలుడు, బలవంతులలో శ్రేష్ఠుడు మహాబాహువు అయిన భీమసేనుడు తన మాటలతో యుధిష్ఠిరుని ఆనందాన్ని పెంపొందింపజేస్తూ ఇలా అన్నాడు. (23)
అవేక్షయా మహారాజ తవ గాండీవధన్వనా ।
ధర్మానుగతయా బుద్ధ్యా న కించిత్ సాహసం కృతమ్ ॥ 24
మహారాజా! గాండీవధారి అయిన అర్జునుడు నీ వలనా, తన ధర్మబుద్ధి వలనా ఇప్పటివరకూ ఏ సాహసమూ చేయలేదు. (24)
సహదేవో మయా నిత్యం నకులశ్చ నివారితౌ ।
శక్తౌ విధ్వంసనే తేషాం శత్రూణాం భీమవిక్రమౌ ॥ 25
శత్రువులను నాశనం చేయగల భీమపరాక్రములైన నకులసహదేవులను నేను నిత్యమూ నివారించాను (25)
న వయం తత్ ప్రహాస్యామః యస్మిన్ యోక్ష్యతి నో భవాన్ ।
భవాన్ విధత్తాం తత్ సర్వం క్షిప్రం జేష్యామహే రిపూన్ ॥ 26
మమ్ములను నీవు నియోగిస్తే ఏ పనీ నవ్వులపాలు కాదు. వ్యూహమంతా నీవు చేయి. శత్రువులను గెలుస్తాం. (26)
ఇత్యుక్తే భీమసేనేన బ్రాహ్మణాః పరమాశిషా ।
ఉక్త్వా చాపృచ్ఛ్య భరతాన్ యథాస్వాన్స్వాన్యయుర్గృహాన్ ॥ 27
భీమసేనుడలా అనగానే బ్రాహ్మణులు పాండవులకు పరమాశీస్సుల నిచ్చి, అనుమతి పొంది, భరతవంశీయులైన వారిని వీడ్కొని తమ తమ ఇండ్లకు వెళ్లారు. (27)
సర్వే వేదవిదో ముఖ్యాః యతయో మునయస్తథా ।
ఆసేదుస్తే యథాన్యాయం పునర్దర్శనకాంక్షయా ॥ 28
వేదవేత్తలూ ముఖ్యులు, సన్యాసులు, మహర్షులు మరల పాండవులను చూడగోరుతూ తమ న్యాయసమ్మతమైన స్థానాలకు వెళ్ళి నిలిచారు. (28)
సహ ధౌమ్యేన విద్వాంసః తథా పంచ చ పాండవాః ।
ఉత్థాయ ప్రయయుర్వీరాః క్రృష్ణామాదాయ ధన్వినః ॥ 29
వీరులు, విద్వాంసులయిన ఆ పంచపాండవులు ద్రౌపదితో, ధౌమ్యునితో కలిసి అక్కడ నుండి లేచి ధనుర్ధారులై వెళ్ళిపోయారు. (29)
క్రోశమాత్రముపాగమ్య తస్మాద్ దేశాన్నిమిత్తతః ।
శ్వోభూతే మనుజవ్యాఘ్రాః ఛన్నవాసార్థముద్యతాః ॥ 30
పృథక్ఛాస్త్రవిదః సర్వే సర్వే మంత్రవిశారదాః ।
సంధివిగ్రహకాలజ్ఞాః మంత్రాయ సముపావిశన్ ॥ 31
అక్కడ నుండి క్రోసెడు దూరం నడచి ఏదోకారణం చూపి అక్కడ ఆగిపోయారు. మరునాడుదయం ఆ నరోత్తములు అజ్ఞాతవాసానికి సంసిద్ధులై ఆలోచనకు కూర్చున్నారు. వారంతా శాస్త్రవేత్తలు, మంత్రశాస్త్రవిశారదులు. సంధి, విగ్రహసమయాన్ని ఎరిగినవారు. (30,31)
ఇతి శ్రీమహాభారతే శతసాహస్య్రాం సంహితాయాం వైయాసిక్యాం వనపర్వణి ఆరణేయపర్వణి అజ్ఞాతవాసమంత్రణే పంచదశాధికత్రిశతతమోఽధ్యాయః ॥ 315 ॥
ఇది వ్యాసవిరచిత శతసహస్ర సంహిత అయిన మహాభారతమున వనపర్వమున ఆరణేయ పర్వమను ఉపపర్వమున అజ్ఞాతవాసమంత్రణమను మూడవందల పదునేనవ అధ్యాయము. (315)
ఇది వన పర్వము