5. అయిదవ అధ్యాయము
పాండవులు తమ ఆయుధములను శమీవృక్షముపై ఉంచుట.
వైశంపాయన ఉవాచ
తే వీరా బద్ధనిస్త్రింశాః తథా బద్ధకలాపినః।
బద్ధగోధాంగుళిత్రాణాః కాళిందోమభితో యయుః॥ 1
వైశంపాయను డిట్లు చెప్పాడు. వీరులయిన ఆ పాండవులు ఖడ్గాలు, అమ్ముల పొదులూ ధరించి, చేతులకూ, వ్రేళ్లకూ(రక్షణకోసమయిన) తొడుగులు దాల్చి యమునా నది సమీపానికి వెళ్లారు. (1)
తతస్తే దక్షిణం తీరమ్ అన్వగచ్ఛన్ పదాతయః।
నివృత్తవనవాసా హి స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా।
వసాంతో గిరిదుర్గేషు వనదుర్గేషు ధన్విన।
విధ్యంతో మృగజాతాని మహేష్వాసా మహాబలాః॥ 2
వారు యమునా నది కుడి ఒడ్డున నడిచారు. అరణ్యవాసం ముగించి, తమరాజ్యం పొందాలనే కుతూహలంతో
మహాబలులైన పాండవులు ధనుర్బాణాలు ధరించి గిరిదుర్గాల్లోనూ, వనదుర్గాల్లోనూ నిలుస్తూ(బసచేస్తూ) మృగాలను వేటాడుతూ నడచి పోతున్నారు. (2)
ఉత్తరేణ దశార్ణాంస్తే పాంచాలాన్ దక్షిణేన చ॥ 3
అంతరేణ యకృల్లోమాన్ శూరసేనాంశ్చ పాండవాః।
లుబ్ధా బ్రువాణా మత్స్యస్య విషయం ప్రావిశన్ వనాత్॥ 4
ధన్వితో బద్ధనిస్త్రింశాః వివర్ణాః శ్మశ్రుధారిణః।
తతో జనపదం ప్రాప్య కృష్ణా రాజానమబ్రవీత్॥ 5
పాండవులు అలా దశార్ణదేశానికి ఉత్తరంగా, పొంచాల దేశానికి దక్షిణంగా, యకృల్లోమ - శూరసేన దేశాలమధ్యలో పయనిస్తూ తాము వేటకాండ్రమని చెప్పుకొంటూ అడవిలోంచి మత్స్యదేశంలోకి ప్రవేశించారు. ధనుస్సులు, కత్తులు ధరించి గడ్డాలు మీసాలు పెరిగి వివర్ణులయి పాండవులు ఆ విరాటుని
రాజ్యంలో ప్రవేశించారు. అపుడు ద్రౌపది ధర్మరాజుతో ఇలా అంది. (3-5)
ధౌమ్యుడు పాంచాలదేశంలో ద్రుపదుని పట్టణంలో ఉన్నట్లు సంస్కృతంలో చెప్పారు. కాని తిక్కన ధౌమ్యుని ఇంతవరకూ తీసుకువచ్చి ఎక్కడో తెలియని ఆశ్రమంలో వదిలాడు. దుర్యోధనాదులకు పాండవుల జాడ ధౌమ్యునివలన బలవంతంగా కూడా తెలియకూడదని తిక్కన భావం. అత డెక్కడున్నాడో పాఠకులకూ తెలియకుండా ఒక్క పుణ్యాశ్రమంబున వసియించె నన్నాడు.
పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ।
వ్యక్తం దూరే విరాటస్య రాజధానీ భవిష్యతి।
వసామేహాపరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః॥ 6
చూడండి - ఎన్నో రకాల పంటపొలాలు, మధ్యలో ఒంటికాలి త్రోవలూ కనపడుతున్నాయి. ఇక్కడికి దూరంగా విరాటుని రాజధాని ఉండాలి అని తోస్తోంది. నాకు చాలా బడలికడా ఉంది. ఈరాత్రి ఇక్కడ బసచేద్దాం. (6)
యుధిష్ఠిర ఉవాచ
ధనంజయ సముద్యమ్య పాంచాలీం వహ భారత।
రాజధాన్యాం నివత్స్యామః విముక్తాశ్చ వనాదితః॥ 7
అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు. అర్జునా! ఈ రోజు అడవి నుండి బయటపడి విరాటుని రాజధానిలో బసచేద్దాం. ఉత్సహించి ద్రౌపదిని ఎత్తుకొని రా. (7)
వైశంపాయన ఉవాచ
తామాదాయార్జునస్తూర్ణం ద్రౌపదీం గజరాడివ।
సంప్రాప్య నగరాభ్యాశమ్ అవాతారయదర్జునః॥ 8
వైశంపాయను డిలా అన్నాడు. వెంటనే అర్జునుడు భద్రగజంలాగా ఆమె నెత్తుకొని నగర సమీపానికి తీసుకొని వచ్చి దింపాడు. (8)
స రాజధానీం సంప్రాప్య కౌంతేయోఽర్జునమబ్రవీత్।
క్వాయుధాని సమాసజ్య ప్రవేక్ష్యామః పురం వయమ్॥ 9
రాజధానికి వచ్చాక ధర్మరాజు అర్జునునితో ఇలా అన్నాడు. ఈ ఆయుధాలను ఎక్కడ భద్రపరచి మనం పురప్రవేశం చేద్దాం? (9)
సాయుధాశ్చ ప్రవేక్ష్యామః వయం తాత పురం యది।
సముద్వేగం జనస్యాస్య కరిష్యామో న సంశయః॥ 10
ఈ ఆయుధాలతో మనం నగరంలో ప్రవేశిస్తే ప్రజలకు భయం కలిగించిన వారమవుతాం. సందేహం లేదు. (10)
గాండీవం చ మహద్ గాఢం లోకే చ విదితం నృణామ్।
తచ్చేదాయుధమాదాయ గచ్ఛామో నగరం వయమ్।
క్షిప్రమస్మాత్ విజానీయుః మనుష్యా నాత్ర సంశయః॥ 11
ఈ నీ గాండీవం చాలా ఘనమైనది. ప్రజలందరికీ తెలిసినది. దీన్ని తీసుకొని నగరంలోకి వెళితే వెంటనే మనల్ని ప్రజలు కనిపెడతారు/గుర్తిస్తారు. ఇందులో సందేహం లేదు. (11)
తతో ద్వాదశ వర్షాణి ప్రవేష్టవ్యం వనే పునః।
ఏకస్మిన్నపి విజ్ఞాతే ప్రతిజ్ఞాతం హి న స్తథా॥ 12
మనలో ఒకర్ని గుర్తించినా చాలు. తరువాతిమళ్లీ పన్నెండేళ్లు అరణ్యంలో ప్రవేశించుతాం అని ప్రతిజ్ఞ చేశాం గదా! (12)
అర్జున ఉవాచ
ఇయం కూటే మనుష్యేంద్ర గహనా మహతీ శమీ।
భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః॥ 13
అర్జునుడిలా అన్నాడు. రాజా! ఊరి పొలిమేరలో ఉంది చక్కగా ఈ జమ్మిచెట్టు. పెద్దది. గుబురుగా ఉంది. పెద్ద పెద్ద కొమ్మలతో ఎవరూ ఎక్కరానట్లుగా భయంకరంగా ఉంది. పైగా శ్మశానికి సమీపంలో ఉంది. (13)
న చాపి విద్యతే కశ్చిత్ మనుష్య ఇతి మే మతిః।
యోఽస్మాన్ నిదధతో ద్రష్టా భవేచ్ఛస్త్రాణి పాండవాః॥ 14
ఇక్కడ ఒక్క మానవుడుకూడా కనపడటం లేదు. మనం ఇక్కడ ఆయుధాలు పెడితే మనలను ఎవరూ చూడరని నా ఉద్దేశం. (14)
ఉత్పథే హి వనే జాతా మృగవ్యాళనిషేవితే।
సమీపే చ శ్మశానస్య గహనస్య విశేషతః॥ 15
సమాధాయాయుధం శమ్యాం గచ్ఛామో నగరం ప్రతి।
ఏవమత్ర యథాయోగం విహరిష్యామ భారత॥ 16
ఈ చెట్టు ఎత్తైన ప్రదేశంలో మొలిచింది. త్రోవకు దూరంగా అడవిలో ఉంది. క్రూరమృగాలు, సర్పాలూ దీని నిండా ఉన్నాయి. విశేషించి చొరరాని శ్మశానానికి దగ్గరలో ఉంది. అందుచేత ఈ శమీవృక్షం మీద మన ఆయుధాలు భద్రపరచి నగరంలోకి వెళదాం. మహారాజా! ఇలా మనం సుఖంగా ఈనగరంలో సంచరిద్దాం. (15,16)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా స రాజానం ధర్మరాజం యుధిష్ఠిరమ్।
ప్రచక్రమే నిధానాయ శస్త్రాణాం భరతర్షభ॥ 17
వైశంపాయనుడిట్లన్నాడు. అర్జునుడిట్లా ధర్మరాజుతో చెప్పి చెట్టుమీద ఆయుధాలు నిక్షేపించటానికి మొదలుపెట్టాడు. (17)
యేన దేవాన్ మనుష్యాంశ్చ సర్వాంశ్చైకరథోఽజయత్।
స్ఫీతాన్ జనపదాంశ్చాన్యాన్ అజయత్ కురుపుంగవః॥ 18
తదుదారం మహాఘోషం సంపన్నబలసూదనమ్।
అపజ్యమకరోత్ పార్థః గాండీవం సుభయంకరమ్॥ 19
తనకెవరూ తోడులేకున్నా దేవతలనూ, మనుష్యులనందరినీ, దిక్కులనూ జయించేందుకు ఉపకరించినదీ, గొప్ప అల్లెత్రాటిధ్వని కలిగినదీ, బలవంతులను సయితం సంహరించేదీ, భయంకరమైనదీ అయిన గాండీవం యొక్క నారిని అర్జునుడు వదిలించాడు (18,19)
యేన వీరః కురుక్షేత్రమ్ అభ్యరక్షత్ పరంతపః।
అముంచద్ ధనుష స్తస్య జ్యామక్షయ్యాం యుధిష్ఠిరః॥ 20
కురుదేశాన్నంతనూ రక్షించిన వింటి యొక్క అక్షయమైన నారిని ధర్మరాజు కూడా వింటినుండి సడలించాడు. (20)
పాంచాలాన్ యేన సంగ్రామే భీమసేనోఽజయత్ ప్రభుః।
ప్రత్యషేధత్ బహూనేకః సపత్నాం శ్చైవ దిగ్జయే॥ 21
నిశమ్య యస్య విస్పారం వ్యద్రవంత రణాత్ పరే।
పర్వతస్యేవ దీర్ణస్య విస్ఫోటమశనేరివ॥ 22
సైంధవం యేన రాజానం పర్యామృషితవానథ।
జ్యాపాశం ధనుష స్తస్య భీమసేనోఽవతారయత్॥ 23
భీముడు కూడా తనవింటినారిని వింటినుండి వదిలించాడు. ఆ వింటితోనే భీముడు పాంచాలురను యుద్ధంలో జయించాడు. దిగ్విజయంలో కూడా అనేక శత్రువులను ఒక్కడే ఆ వింటితోనే నిలువరించాడు. పిడుగు పడినట్లుగా పర్వతం బ్రద్దలయినట్లుగా ఉండే ఆ వింటిధ్వని వింటే శత్రువులు యుద్ధంనుండి పారి పోయేవారు. ఆ వింటితోనే సైంధవుని (అరణ్యవాసంలో) లొంగదీసుకున్నాడు. (21-23)
అజయత్ పశ్చిమామాశం ధనుషా యేన పాండవ।
మాద్రీపుత్రో మహాబాహుః తామ్రాస్యో మితభాషితా॥ 24
తస్య మౌర్వీమపాకర్షత్ శూరః సంక్రందనో యుధి।
కులే నాస్తి సమో రూపే యస్యేతి నకులః స్మృతి॥ 25
నకులుడు దిగ్విజయంలో పశ్చిమదిక్కును ఏ వింటితో జయించాడో దాని నారిని వదిలించాడు. అతడు దీర్ఘభుజుడు, మాద్రీపుత్రుడు. మితభాషి. బంగరుచాయ ముఖం గల అందగాడు. ఆ వంశంలో అతనితో సమానమయిన రూపం, అందం ఎవరికీ లేదుట. అందుకే అతడు 'నకులుడు' అని సార్థకనామం పొందాడట. ఇంద్రుని వంటి శూరుడు అతడు. (24,25)
దక్షిణాం దక్షిణాచారో దిశం యేనాజయత్ ప్రభుః।
అపజ్యమకరోత్ వీరః సహదేవః తదాయుధమ్॥ 26
శాస్త్రానుసారవ్యవహర్త సహదేవుడు దిగ్విజయంలో దక్షిణదిక్కును జయించిన తన వింటినారిని సడలించాడు. (26)
ఖడ్గాంశ్చ దీప్తాన్ దీర్ఘాంశ్చ కలాపాంశ్చ మహాధనాన్।
విపాఠాన్ క్షురధారాంశ్చ ధనుర్నిదధుః సహ॥ 27
మెరిసే పొడవైన కత్తులనూ, సంపన్నములయిన అమ్ములపొదులనూ, చురకత్తులనుకూడా ధనుస్సులతో కలిపి కట్టారు. (27)
వైశంపాయన ఉవాచ
అథాన్వశాస న్నకులం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ఆరుహ్యేమాం శమీం వీర ధనూంష్యేతాని నిక్షిప॥ 28
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత ధర్మరాజు నకులుని" వీరా! నకులా! ఈ చెట్టు ఎక్కి ధనుస్సులన్నీ దీనిపై నిక్షేపించు" అని ఆజ్ఞాపించాడు. (28)
తాముపారుహ్య నకులం ధనూంషి నిదధే స్వయమ్।
యాని తస్యావకాశాని దివ్యరూపాణ్యమన్యత॥ 29
యత్ర చాపశ్యత స వై తిరోవర్షాణి వర్షతి।
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత॥ 30
శరీరం చ మృతస్యైకం సమబధ్నంత పాండవాః।
వివర్జయిష్యంతి నరాః దూరాదేవ శమీమిమామ్॥ 31
ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికమ్।
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః॥ 32
కులధర్మోఽయ మస్మాకం పూర్వైరాచరితోఽపి వా।
సమాసజ్జ్యాథ వృక్షేఽస్మిన్ ఇతి వై వ్యాహరంతి తే॥ 33
ఆ గోపాలావిపాలేభ్యః ఆచక్షాణాః పరంతపాః।
ఆజ్గము ర్నగరాభ్యాశం పార్థాః శత్రునిబర్హణాః॥ 34
అప్పుడు నకులుడు చెట్టెక్కి దాని తొర్రలో స్వయంగా ధనుస్సులనూ ఇతరమైన ఆయుధాలనూ దాచాడు. అతనికి అవి దివ్యరూపాలు అనిపించాయి. అక్కడ వాన ఏటవాలుగా పడుతుంది. అందువల్ల ఆయుధాలు తడవవు. నకులుడు వాటిని గట్టి త్రాళ్లతో కట్టాడు. ఒక మృతశరీరాన్ని ఆ చెట్టుకి కట్టారు. దూరం నుంచే దాని దుర్వాసన తగిలి ఇక్కడేదో శవం కట్ట బడిందని నరులు అనుకొని ఈ జమ్మీచెట్టుకి దూరంగా తొలగిపోతారు. "ఈమె మాతల్లు నూటెనభై ఏళ్ల ముసలి" అని చెప్పుతీ ఇది మా వంశాచారమనీ, మాపూర్వు లంతా ఇలాగే చేశారనీ తమకు ఎదురుపడిన గోపాలకులకూ, గొఱ్ఱెలకాపరులకూ చెపుతీ శత్రుసంహారకు లయిన పాండవులు నగరం దగ్గరకు చేరారు. (31-34)
జయో జయంతో వియః జయత్సేనో జయద్బలః।
ఇతి గుహ్యాని నామాని చక్రే తేషాం యుధిష్ఠిరః॥ 35
జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు అని పాండవులయిదుగురికీ (క్రమంగా) ధర్మరాజు రహస్యపు పేర్లు పెట్టాడు. (35)
తతో యథాప్రతిజ్ఞాభిః ప్రావిశన్ నగరం మహత్।
అజ్ఞాతచర్యాం వత్స్యంతః రాష్ట్రే వర్షం త్రయోదశమ్॥ 36
ఆ తరువాత వారు తమప్రతిజ్ఞానుసారం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయదలచి ఆ విరాటుని నగరంలో ప్రవేశించారు. (36)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణీ పాండవ ప్రవేశ పర్వణి పురప్రవేశే అస్త్రసంస్థాపనే పంచమోఽధ్యాయః ॥ 5 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశపర్వమను ఉపపర్వమున
పురప్రవేశమిఉ ఆయుధాల నిక్షేపణము అను అయిదవ ఆధ్యాయము. (5)
భాతి సర్వేషు శాస్త్రేషు రతిస్సర్వేషు జంతుషు।
తారణం సర్వలోకేషు తేన భారతముచ్యతే॥