6. ఆరవ అధ్యాయము
యుధిష్ఠిరుడు దుర్గాదేవిని స్తుతించుట - ఆమె వరమిచ్చుట.
వైశంపాయన ఉవాచ
విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుదిష్ఠిర।
అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు. రమ్యమయిన విరాటనగరానికి వెడుతీ ధర్మరాజు త్రిభువనాలకూ ఈశ్వరి అయిన దుర్గాదేవిని మనసారా స్తుతించాడు. (1)
యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియామ్।
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్॥ 2
కంసవిద్రావణకరీమ్ అసురాణాం క్షయంకరీమ్।
శిలాతటవినిక్షిప్తామ్ ఆకాశంప్రతి గామినీమ్॥ 3
వాసుదేవస్య భగినీం దివ్యమాల్యవిభూషితామ్।
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్॥ 4
యశోద గర్భంనుండి పుట్టినది. నారాయణునికి ప్రియమైనది. నందగోపుని వంశంలో జనించినది. అందరికీ శుభముల నిచ్చేది. వంశం వృద్ధి పొందించేది. కంసుని పారద్రోలినది, అసురులను నాశనం చేసినది, ఱాతిమీద కొట్టబడినా ఆకాశంలో పయనించినది, వాసుదేవుని సోదరి, దివ్యమైన పూలమాల దివ్యాంబరమూ ధరించినది, ఖడ్గమును, డాలునూ, దాల్చినది ఆ దేవి. (2-4)
భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివామ్।
తాన్ వై తారయసే పాపాత్ పంకే గామివ దుర్బలామ్॥ 5
భారం తగ్గించే పుణ్యమయీ! సదా శుభాల నిచ్చే నీవు నిన్ను స్మరించిన వారిని బురదలోనుండి బలహీనమయిన ఆవును పైకి లాగినట్లు ఉద్ధరిస్తావు. (5)
స్తోతుం ప్రచక్రమే భూయః వివిధైః స్తోత్రసంభవైః।
ఆమంత్ర్య దర్శవాకాంక్షీ రాజా దేవీం సహానుజ॥ 6
నమోఽస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి।
బాలార్కసదృశాకారే పూర్ణచంద్రనిభాననే॥ 7
ధర్మరాజు తమ్ముళ్లతో సహా దుర్గాదర్శనాన్ని కోరుతూ దేవిని సంబోధిస్తూ అనేక స్తోత్రాలతో స్తుతించడం ప్రారంభించాడు. వరాల నొసగే నీకు నమస్కారం. నల్లని రూపుగలదానా! కుమారీ! బ్రహ్మచారిణీ! లేత సూర్యుని వంటి శరీరకాంతి కలదానా! నిండుచంద్రునితో సమానమయిన ముఖం కలదానా! (6,7)
చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే।
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి।
భాసి దేవి యథా పద్మా నారాయణపరిగ్రహః॥ 8
స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం గగనేశ్వరీ।
కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణ సమాననా॥ 9
నాల్గుభుజాలు కల్గి నారాయణునితోనూ, నాల్గు ముఖాలు కలిగి బ్రహ్మతోనూ సమానురాలవు. పుష్టిగల జఘనం, స్తనాలు కల్గినదానా! నెమలిపింఛాలు నీకు గాజులు; కేయూరాలు, అంగదాలూ ధరించిన దానవు. నారాయణుని భార్య లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నావు. నీరూపమూ, బ్రహ్మచర్యమూ స్వచ్ఛమైనవి. నీవు ఆకాశంలో చరింపగల దేవివి. కృష్ణునితో సమానమైన శరీరకాంతి నీకుంది. అందుకే నీకు కృష్ణ అని పేరు. కాని బలరామునితో సమాన మయిన స్వచ్ఛమైన ముఖకాంతి కూడా కలిగిన దానవు నీవు. (8,9)
భిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజసముచ్ఛ్రయౌ।
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీవిశుద్ధా చ యా భువి॥ 1ఒ
పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ।
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా॥ 11
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే।
ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా॥ 12
భుజంగభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా।
విభ్రాజసే చాబద్ధేన భోగేనేవేహ మందరః॥ 13
వర, అభయ ముద్రలు దాల్చి ఎత్తైన నీ విశాల బాహువులు ఇంద్రధ్వజసమానములై యుంటాయి. మూడవ చేతిలో పాత్ర, నాల్గవ చేతిలో పద్మమూ అయిదవ చేతిలో గంట ప్రకాశిస్తున్నాయి. ఆరవచేతిలో పాశమూ, ఏడవచేతిలో ధనుస్సు, ఎనిమిదవ చేతిలో మహాచక్రమూ ఇలా నానాప్రకార ఆయుధాలు కలిగి ఉన్నావు. భూమిమీద స్త్రీ యొక్క విశుద్ధరూపం అంటే నీవే. నీ చెవులు కుండలాలతో నిండుగా అలంకరింపబడ్డాయి. చంద్రునితో పోటీపడే
ముఖంతో విరాజిల్లుతుంటావు. చిత్రరత్నాలు కల కిరీటంతో నీ కేశపాశం శోభిల్లుతోంది. పామువలె ఉన్న కటిసూత్రం (మొలత్రాడు) ధరించి వాసుకితో కూడిన మందరపర్వతంలా ఉంటావు. (10-13)
ధ్వజేన శిఖిపింఛానామ్ ఉచ్ఛ్రితేన విరాజసే।
కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా॥ 14
నెమలిపింఛాలు ఎత్తి కట్టిన ధ్వజంతో విరాజిల్లుతావు. కౌమారం అనే బ్రహ్మచర్యవ్రత పాలనంలో స్వర్గాన్ని పవిత్రం చేశావు. (14)
తేన త్వం స్తూయాసే దేవి త్రిదశైః పూజ్యసేఽపి చ।
త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని।
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ॥ 15
అందుకే దేవీ! నీవు దేవతలచేకూడ స్తుతింప బడుతున్నావు. పూజింబడుతున్నావు. త్రిలోకాలనూ రక్షించటానికి మహిషాసురసంహారం చేశావు. దేవతలలో శ్రేష్ఠురాలవు నీవు. నాకు ప్రసన్నురాలవై నామీద దయ చూపుము. నాకు శుభ మిమ్ము. (15)
జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా।
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్॥ 16
నీవే జయవు, విజయవు. యుద్ధంలో జయమిచ్చే దానవు నీవే. నాకుకూడా విజయం ఇయ్యి. ఇపుడీ వరమియ్యి. (16)
వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతమ్।
కాళి కాళి మహాకాళి ఖడ్గఖట్వాంగధారిణి॥ 17
కాళీ! మహాకాళీ! ఖడ్గమూ, ఖట్వాంగమూ (పైభాగాన కపాలం కల దండం) ధరించి పర్వతశ్రేష్ఠమైన వింధ్యపర్వతం శాశ్వతనివాసంగా చేసుకొన్నావు. (17)
కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ।
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః॥ 18
ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి।
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోఽపి వా॥ 19
నిన్ను అనుసరించేవారి కోరికలు తీరుస్తావు. నీవు కామసంచారిణివి. వరము లీయగలవు. తమ ఆపదల భారం తీరటానికి నిన్ను స్మరించేవారికీ, ఉదయమే నీకు నమస్కరించే వారికీ పుత్రవిషయంలో కాని, ధనవిషయంలో కాని దుర్లభ మేదీ లేదు. (18,19)
దుర్గాత్ తారయసే దుర్గే తత్ త్వం దుర్గా స్మృతా జనైః।
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే॥ 20
దస్యుభిర్వా నిరుద్ధానాం త్వం గతిః పరమా నృణామ్।
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ॥ 21
యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః।
త్వం కీర్తిః శ్రీః దృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః॥ 22
సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా।
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్॥ 23
వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి।
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రపన్నవాన్॥ 24
భరింపరాని కష్టాలనుండి తరింప జేస్తావు నీవు. అందుకే ప్రజలు నిన్ను దుర్గ అంటారు. అడవుల్లో చిక్కుకొన్నవారికీ, సముద్రం దాటేవారికీ, దుర్గమ మార్గాలలో పయనించి వారికీ, క్రూరుల బారిపడినవారికీ నీవే గతి. సముద్రాలు దాటాలన్నా, అడవులతిక్రమించాలన్నా నిన్ను స్మరించినవారు కష్టాలపాలు కారు. నీవే కీర్తివి. శ్రీ, ధృతి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి, సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలు నీవే. నిన్ను పూజించిన వారి బందనం రూపాలు నీవే. నిన్ను పూజించిన వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయమూ తీరుస్తావు. అమ్మా! ఇపుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను. నీ శరణు వేడుతున్నాను. (20-24)
ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి।
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ వః॥ 25
దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు పద్మపత్రాలవలె ప్రసన్న మైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవు సత్యవు. మాకు సత్యవు(సత్పురుషులయందు సాధువు) కమ్ము. (25)
శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే।
ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవమ్।
ఉపాగమ్య తు రాజానమ్ ఇదం వచనమబ్రవీత్॥ 26
దుర్గా! నీవు శరణ్యురాలవు. భక్తులయందు వాత్సల్యం కలదానా! నాకు శరణమగుము'. అని ధర్మరాజు స్తుతించాడు. వెంటనే దేవి దర్శనమిచ్చి ధర్మరాజుతో ఇలా అంది. (26)
దేవ్యువాచ
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో। 27
భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ।
మమ ప్రసాదా న్నిర్జిత్య హత్వా కౌరవవాహినీమ్॥ 28
రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః।
భ్రాతృభిస్సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలామ్॥ 29
దేవి అంటున్నది. మహాభుజడవైన ధర్మరాజా! నామాట విను. త్వరలోనే యుద్ధంలో నీకు విజయం కలుగుతుంది. నా అనుగ్రహంతో కౌరవసేనను జయించి రాజ్యమంతా శత్రురహితం చేసికొని, నీ భూమిని నీవు మరల అనుభవిస్తావు. తమ్ములతో పుష్కలమైన సంతోషం పొందుతావు. (27-29)
మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యమ్ ఆరోగ్యం చ భవిష్యతి।
యే చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః॥ 30
తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుర్వపుః సుతమ్।
ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రుసంకటే॥ 31
అటవ్యాం దుర్గ కాంతారే సాగరే గహనే గిరౌ।
యే స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా॥ 32
న తేషాం దుర్లభం కించిత్ అస్మింల్లోకే భవిష్యతి।
ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్ వా పఠేత వా॥ 33
తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః।
మత్ప్రసాదాచ్చ వః సర్వాన్ విరాటనగరే స్థితాన్॥ 34
న ప్రజ్ఞాస్యంతి కురవః నరా వా తన్నివాసినః।
ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరమరిందమమ్॥
రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయత॥ 35
నా అనుగ్రహం తోనే నీకు సౌఖ్యమూ, ఆరోగ్యమూ కలుగుతాయి. లోకంలో నన్ను కల్మషం లేకుండా కీర్తించే వారికి నేను (సంతోషించి) రాజ్యమూ, ఆయువూ, చక్కనిరూపమూ, సత్పుత్రునీ అన్నీ ఇస్తాను. ఊరు విడిచి ఉన్నా, నగరంలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, శత్రుబాధలో ఉన్నా, చొరరాని అడవిలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, పర్వతం మీదున్నా నీవు స్మరించినట్లు నన్ను స్మరించేవారికి ఈ లోకంలో దుర్లభం ఏదీ ఉండదు. పాండవులారా! ఈ స్తోత్రం భక్తితో పఠించినవారికీ, విన్నవారికీ, సకలకార్యాలూ సిద్ధిస్తాయి. నా అనుగ్రహంవల్ల విరాటనగరంలో మీ అందరినీ (మీలో ఎవరినీ) అక్కడ నివసించేవారుకానీ, కౌరవులుకానీ, ఎవరూ తెలుసుకోలేరు.
ఇలా యుధిష్ఠిరునికి వరమిచ్చి, పాండవులకు రక్షణ కల్పించి దేవి అక్కడే అంతర్ధానమయింది. (30-35)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవ ప్రవేశ పర్వణి దుర్గాస్తవే షష్ఠోఽధ్యాయః॥ 6 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశపర్వమను
ఉపపర్వమున దుర్గాస్తవమను ఆరవ అధ్యాయము. (6)