7. ఏడవ అధ్యాయము
యుధిష్ఠిరుడు రాజసభలో ప్రవేశించుట.
వైశంపాయన ఉవాచ
(తతస్తు తే పుణ్యమాం శీవాం శుభాం
మహర్షిగంధర్వ నిషేవితోదకామ్।
త్రిలోకకాంతామవతీర్య జాహ్నవీమ్
ఋషీంశ్చ దేవాంశ్చ పితౄనతర్పయన్॥
వైశంపాయనుడు అన్నాడు. పిమ్మట మిక్కిలి పుణ్యమై; మంగళస్వరూపిణియై; మహర్షులు, గంధర్వులు సేవించే నీరుకలదై; ముల్లోకాలకూ అభిలషణీయమైన గంగానదిలో పాండవులు యథావిధిగా స్నానం చేసి ఋషులకూ, దేవతలకూ, పితృదేవతలకూ తర్పణాలిచ్చారు.
వరప్రదానం హ్యనుచింత్య పార్థివః
హుతాగ్నిహోత్రః కృతజప్యమంగళః।
దిశం తథైంద్రీమభితః ప్రపేదివాన్
కృతాంజలిర్ధర్మముపాహ్వయచ్ఛనైః॥
ధర్మరాజు అగ్నిహోత్రం, జపం, మంగళకృత్యం నిర్వహించి ధర్మదేవత ఇచ్చిన వరాన్ని స్మరించి, తూర్పుదిక్కుకు తిరిగి, చేతులుజోడించి మెల్లగా యమధర్మరాజును ధ్యానించాడు.
యుధిష్ఠిర ఉవాచ
వరప్రదానం మమ దత్తవాన్ పితా
ప్రసన్నచేతా వరదః ప్రజాపతిః।
జలార్థినో మే తృషితస్య సోదరాః
మయా ప్రయుక్తా వివిశుర్జలాశయమ్॥
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. ప్రసన్నమైన చిత్తంతో ప్రజాపతియైన నాతండ్రి నాకు వరమిచ్చాడు. దప్పిగొన్న నేను నీటిని కోరి పంపితే నాసోదరులు ఆ చెరువులోకి ప్రవేశించారు.
నిపాతితా యక్షవరేణ తే వనే
మహాహవే వజ్రభృతేవ దానవాః।
మయా చ గత్వా వరదోఽభితోషితః
వివక్షతా ప్రశ్నసముచ్చయం గురుః॥
మహాసంగ్రామంలో ఇంద్రునిచే రాక్షసులు చంపబడినట్లు వనంలో(నాసోదరులు) వారు ఆ యక్షవరునిచే పడగొట్టబడ్డారు. అపుడు నేను వెళ్లి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పితే నాతండ్రి మిక్కిలి తృప్తిపొందాడు.
స మే ప్రసన్నో భగవాన్ వరం దదౌ
పరిష్వజంశ్చాహ తథైవ సౌహృదాత్।
వృణీష్వ యద్ వాంఛసి పాండునందన
స్థితోఽంతరిక్షే వరదోఽస్మి పశ్యతామ్॥
పూజ్యుడైన అతడు ప్రసన్నడై నాకు వరమిచ్చాడు. 'పాండునందనా! నీవు వరమడుగు. వరదుడనై ఆకాశంలో ఉన్నాను. చూడు' అని పలికాడు.
స వై మయోక్తః వరదః పితా ప్రభుః
సదైవ మే ధర్మరతా మతిర్భవేత్।
ఇమే చ జీవంతు మమానుజాః ప్రభో
వపుశ్చ రూపం చ బలం తథాప్నుయుః॥
అంత వరదుడు, ప్రభువు అయిన నాతండ్రితో ఇలా అన్నాను. ప్రభూ! నాబుద్ధి ఎల్లపుడు ధర్మప్రీతి కలదగు గాక! ఈసోదరులు మునుపటివలె శరీరమూ, రూపమూ, బలమూ పొందుదురుగాక!
క్షమా చ కీర్తిశ్చ యథేష్టతో భవేత్
వ్రతం చ సత్యం చ సమాప్తిరేవ చ।
వరో మమైషోఽస్తు యథానుకీర్తితః
న తన్మృషా దేవవరో యదబ్రవీత్॥
'ఓర్పు, కీర్తి కోరినట్లు సిద్ధించుగాక! మా సత్యవ్రతం సమాప్తినొందుగాక! ఇదియే నాకు వరమగుగాక!' అని అనగానే ఆ దేవశ్రేష్ఠుడు 'అది అసత్యం కాదు' అని పలికాడు.
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మమేవానుచింతయన్।
తదైవ తత్ప్రసాదేన రూపమేవాభజత్ స్వకమ్॥
ఇలా చెప్పి ధర్మాత్ముడయిన ధర్మరాజు యమ ధర్మరాజును స్మరిస్తీ అతని అనుగ్రహంచేత తాను కోరిన రూపం వెంటనే పొందాడు.
స వై ద్విజాతి స్తరుణస్త్రిదండధృక్
కమండలూష్ణీషధరోఽన్వజాయత।
సురక్తమాంజిష్ఠవరాంబరః శిఖీ
పవిత్రపాణిర్దదృణే తదద్భుతమ్॥
అతడు యువకుడై త్రిదండమూ, కమండలువూ, తల పాగ, మంచి కాషాయవస్త్రం, తలమీద పిలక, చేతిలో దర్భ కలిగి బ్రాహ్మణరూపం పొంది అందరికీ ఆశ్చర్యం కలిగించాడు.
తథైవ తేషామపి ధర్మచారిణాం
యథేప్సితా హ్యాభరణాంబరస్రజః।
క్షణేన రాజన్నభవన్మహాత్మనాం
ప్రశస్త ధర్మాగ్ర్యఫలాభికాంక్షిణామ్॥)
అలాగే ధార్మికులూ, శ్రేష్ఠమైన ఫలాన్ని కోరిన మహాత్ములూ అయిన పాండవులకు వారు కోరినట్లు ఆభరణాలు, వస్త్రాలు, దండలూ క్షణంలో లభించాయి.
తతో విరాటం ప్రథమం యుధిష్ఠిరః
రాజా సభాయాముపవిష్టమావ్రజత్।
వైడూర్యరూపాన్ ప్రతిముచ్య కాంచనాన్
అక్షాన్ స కక్షే పరిగృహ్య వాససా॥ 1
మొదటగా యుధిష్ఠిరుడు వైడూర్యమువలె ఎఱ్ఱవైన బంగారు పాచికలు గుడ్డలో చుట్టి చంకన బెట్టుకొని సభలో నున్న విరాటుని సమీపించాడు. (1)
నరాధిపో రాష్ట్రపతిం యశస్వినం
మహాయశాః కౌరవవంశవర్ధనః।
మహానుభావో నరరాజసత్కృతః
దురాసదస్తీక్ష్ణవిషో యథోరగః॥ 2
బలేన రూపేణ నరర్షభో మహాన్
అపూర్వరూపేణ యథామరస్తథా।
మహాభ్రజాలైరివ సంవృతో రవిః
యథానలో భస్మవృతశ్చ వీర్యవాన్॥ 3
కీర్తితో కౌరవవంశాన్ని వర్ధిల్లజేసే మహానుభావుడూ, రాజులచే సత్కరింపబడినవాడు ధర్మరాజు. అతడు ఇతరులకు చేరశక్యం కాని భయంకర విషసర్పంవలె ఉన్నాడు. బలరూపాలతో నరపుంగవుడయిన ధర్మరాజు అపూర్వరూపంతో దివ్యపురుషునివలె ఉన్నాడు. వీరుడైన ధర్మరాజు దట్టమైన మేఘాలతో కప్పబడిన సూర్యుని లాగా, నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాడు. అతడు యశస్వి అయిన విరాటుని చేరాడు. (2,3)
తమాపతంతం ప్రసమీక్ష్య పాండవం
విరాటరాండిందుమివాభ్రసంవృతమ్।
సమాగతం పూర్ణశశిప్రభాననం
మహానుభావం న చిరేణ దృష్టవాన్॥ 4
మొదట్లో మేఘావృతమయిన చంద్రునివలె రానురాను పూర్ణమాచంద్రునివలె అనిపించిన ఆతనిని విరాటరాజు చూశాడు. (4)
మంత్రిద్విజాన్ సూతముఖాన్ విశస్తథా
యే చాపి కేచిత్ పరితః సమాపతే।
పప్రచ్ఛ కోఽయం ప్రథమం సమేయివాన్
నృపోపమోఽయం సమవేక్షతే సభామ్॥ 5
అపుడు విరాటుడు తనచుట్టూ ఉన్న మంత్రులగు బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను ఇతరులను ఇలా అడిగాడు. "నన్ను చేరిన ఇతడు ఎవడు? ఇతడీసభలో రాజువలె కనబడుతున్నాడే. (5)
న తు ద్విజోఽయం భవితా నరోత్తమః
పతిః పృథివ్యా ఇతి మే మనోగతమ్।
న చాస్య దాసో న రథో న కుంజరః
సమీపతో భ్రాజతి చాయమింద్రవత్॥ 6
నరోత్టముడైన ఇతడు బ్రాహ్మణుడు కాడు. ఇతడు భూపతి(రాజు) అని నా అభిప్రాయం. ఇతని దగ్గర సేవకుడు లేడు. రథం లేదు. ఏనుగు లేదు. కాని ఇంద్రునివలె ప్రకాశిస్తున్నాడు. (6)
శరీరలింగైరుపసూచితో హ్యయం
మూర్ధాభిషిక్త ఇతి మే మనోగతమ్।
సమీపమాయాతి చ మే గతవ్యథః
యథా గజస్తామరసీం మదోత్కటః॥ 7
శరీరలక్షణాలనుబట్టి ఇతడు మూర్ధాభిషిక్తుడైన రాజు అని నా అభిప్రాయం. మదించిన ఏనుగు తామరతూడును చేరుతున్నట్లు ఇతడు నిశ్చింతగా నాదగ్గరకు వస్తున్నాడు." (7)
వితర్కయంతం తు నరర్షభస్తథా
యుధిష్ఠిరోఽభ్యేత్య విరాటమబ్రవీత్।
సమ్రాడ్ విజానాత్విహ జీవనార్థినం
వినష్టసర్వస్వముపాగతం ద్విజమ్॥ 8
అలా తర్కించుకొంటున్న విరాటుని దగ్గరకు ధర్మరాజు వచ్చి ఇలా అన్నాడు. 'మహారాజా! సర్వస్వమూ కోల్పోయి జీవనంకోసం ఇక్కడకు వచ్చిన నన్ను ద్విజుడని గ్రహించు. (8)
ఇహాహమిచ్ఛామి తవానఘాంతికే
వస్తుం యథా కామచరస్తథా విభో।
తమబ్రవీత్ స్వాగతమిత్యనంతరం
రాజా ప్రహ్నష్టః ప్రతిసంగృహాణ చ॥ 9
తం రాజసింహం ప్రతిగృహ్య రాజా
ప్రీత్యాఽఽత్మనా చైవ మిదం బభాషే।
కామేన తాతాభివదామ్యహం త్వాం
కస్యాసి రాజ్ఞో విషయాదిహాగతః॥ 10
పుణ్యాత్ముడా! నీయిష్టానుసారం నీవద్ద నివసింప గోరుతున్నాను." అనగా రాజు సంతసించి స్వాగతంచెప్పి అతనిని స్వీకరించాడు.
రాజసింహుడైన ధర్మరాజును ఆదరించి విరాటరాజు ప్రసన్నచిత్తంతో ఇలా అన్నాడు. 'నాయనా! నేను ప్రేమతో అడుగుతున్నాను. నీవు ఏ రాజు రాజ్యం నుండి ఇక్కడకు వచ్చావు. (9,10)
గోత్రం చ నామాపి చ శంస తత్త్వతః।
కిం చాపి శిల్పం తవ విద్యతే కృతమ్॥ 11
నీగోత్రం, (వంశమును) పేరు యథార్థంగా చెప్పు. నీకు ఏ విద్యలో నైపుణ్యముందో తెలుపు. (11)
యుధిష్ఠిర ఉవాచ
యుధిష్ఠిరస్యాసమహం పురా సఖా
వైయాఘ్రపద్యః పునరస్మి విప్రః।
అక్షాన్ ప్రయోక్తుం కుశలోఽస్మి దేవినాం
కంకేతి నామ్నాస్మి విరాట్ విశ్రుతః॥ 12
ధర్మరాజు చెపుతున్నాడు. విరాటరాజా! మునుపు నేను ధర్మరాజుకు స్నేహితుణ్ణి. వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టాను. విప్రుణ్ణి అక్షక్రీడాకారులలో పాచికలను ప్రయోగించటంలో నేర్పరిని. కంకుడనే పేర ప్రసిద్ధుణ్ణి. (12)
విరాట ఉవాచ
దదామి తే హంత వరం యదిచ్ఛసి
ప్రశాధి మత్స్యాన్ వశగో హ్యహం తవ।
ప్రియాశ్చ ధూర్తా మమ దేవినః సదా
భవాంశ్చ దేవోపమ రాజ్యమర్హతి॥ 13
విరాటుడు చెప్తున్నాడు. నీవు కోరిన వరం ఇస్తున్నాను. నేను నీ అధీనుణ్ణి. ఈమత్స్యదేశాన్ని పాలించు ద్యూతవిద్య తెలిసిన జూదరులెప్పుడూ నాకిష్టులే. దైవసమానుడవైన నీవు రాజ్యానికే తగుదువు. (13)
యుధిష్ఠిర ఉవాచ
ప్రాప్తో వివాదః ప్రథమం విశాంపతే
న విద్యతే కంచన మత్స్య హీనతః।
న మే జితః కశ్చన ధారయేద్ ధనం
వరో మమైషోఽస్తు తవ ప్రసాదజః (తః) ॥ 14
యుధిష్ఠిరుడు అన్నాడు. మత్స్యరాజా! నరాధిపా! జూదంలో హీనునివల్లనూ వివాదం రాదని లేదు. నాచే జయింపబడిన వాడెవడూ నాకు అప్పుపెట్టకూడదు. నీ అనుగ్రహం వలన నాకీవరముండుగాక. (14)
విరాట ఉవాచ
హన్యామవశ్యం యది తేఽప్రియం చరేత్
ప్రవ్రాజయేయం విషయాద్ ద్విజాంస్తథా।
శృణ్వంతు మే జానపదాః సమాగతాః
కంకో యథాహం విషయే ప్రభుస్తథా॥ 15
విరాటుడు చెప్తున్నాడు. నీకు అప్రియంగా నడచినవానిని తప్పక వధిస్తాను. వారు బ్రాహ్మణులయితే దేశంనుండి బహిష్కరిస్తాను. ఇక్కడున్న ప్రజలందరూ నామాటను వినండి. 'ఈదేశాన నేనెట్లు ప్రభువునో అట్లే ఈ కంకుడు కూడ.' (15)
సమానయానో భవితాసి మే సఖా
ప్రభూతవస్త్రో బహుపానభోజనః।
పశ్యేస్త్వమంతశ్చ బహిశ్చ సర్వదా
కృతం చ తే ద్వారమపావృతం మయా॥ 16
ఇక నీవు నాస్నేహితుడవు. నాతో సమానమైన వాహనమూ, గొప్పవస్త్రాలు, కావలసిన అన్నపానాలూ నీకు సమకూరుతాయి. ఆంతరంగికంగా, బాహ్యంగా నీకోసం మా ద్వారం తెరిచే ఉంటుంది. (16)
యే త్వానువాదేయురవృత్తికర్శితాః
బ్రూయాశ్చ తేషాం వచనేన మాం సదా।
దాస్యామి సర్వం తదహం న సంశయః
న తే భయం విద్యతి సంనిధౌ మమ॥ 17
జీవనోపాధిలేక కృశించి విన్నవించటానికి నీవద్దకు వస్తే వారి మాటలు నాకు చెప్పు. అన్నింటిని నేను ఇస్తాను. నీవు సందేహించకు. నావద్ద నీకెట్టి భయమూ లేదు. (17)
వైశంపాయన ఉవాచ
(ఏవం తు రాజ్ఞః ప్రథమః సమాగమః
బభూవ మత్స్యస్య యుధిష్ఠిరస్య చ।
విరాటరాజస్య హి తేన సంగమః
బభూవ విష్ణోరివ వజ్రపాణినా॥
వైశంపాయనుడు చెపుతున్నాడు. జనమేజయా! ఇలా మత్స్యరాజుకూ, ధర్మరాజుకూ మొదటి సమాగమం జరిగింది. శ్రీమహావిష్ణువుకూ ఇంద్రునికీ లాగా, విరాటరాజుకు ఆ ధర్మరాజుకు కలయిక జరిగింది.
తమాసనస్థం ప్రియరూపదర్శనం
నిరీక్ష్యమాణో న తతర్ప భూమిపః।
సభాం చ తాం ప్రజ్వలయన్ యుధిష్ఠిరః
శ్రియా యథా శక్ర ఇవ త్రివిష్టపమ్॥)
ప్రియమైనరూపంతో ఆసనంమీదున్న ఆ ధర్మరాజును చూస్తున్న విరాటరాజు తృప్తినొందలేదు. ఇంద్రుడు తనకాంతిచే స్వర్గాన్ని ప్రకాశింపజేసినట్లు ధర్మరాజు ఆ సభను ప్రకాశింప జేశాడు.
ఏవం స లబ్ధ్వా తు వరం సమాగమం
విరాటరాజేన నరర్షభస్తథా।
ఉవాస ధీరః పరమార్చితః సుఖీ
న చాపి కశ్చిచ్చరితం బుబోధ తత్॥ 18
ఇలా నరశ్రేష్ఠుడైన ధర్మరాజు విరాటరాజును కలిసి అతని చేత పూజింపబడుతూ ధీరుడై సుఖంగా ఉన్నాడు. అతని చరిత్ర ఎవరూ తెలియకపోయారు. (18)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశ పర్వణి యుధిష్ఠిరప్రవేశో నామ సప్తమోఽధ్యాయః॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశ పర్వమను
ఉపపర్వమున యుధిష్ఠిరప్రవేశమను ఏడవ అధ్యాయము. (7)
(దాక్షిణత్య అధికపాఠము 12 శ్లోకములతో కలిపి మొత్తం 30 శ్లోకములు)
మాతాపితృసహస్రాణి పుత్రదారశతాని చ।
సంసారేష్వనుభూతాని యాంతి యాస్యంతి చాపరే॥