11. పదునొకండవ అధ్యాయము
అర్జునుడు విరాటుని కొలువులో కన్యలకు నృత్యము నేర్పుటకు నియుక్తుడగుట.
వైశంపాయన ఉవాచ
అథాపరోఽధృశ్యత రూపసంపదా
స్త్రీణామలంకారధరో బృహత్పుమాన్।
ప్రాకారవప్రే ప్రతిముచ్య కుండలే
దీర్ఘే చ కంబూపరిహాటకే శుభే॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. తరువాత అందమైన రూపంతో, స్త్రీల అలంకారాలు, పొడవైన కుండలాలు, బంగారుగాజులూ ధరించిన ఒకానొక ఉన్నతపురుషుడు కోటగోడవద్ద కనబడ్డాడు. (1)
బాహూ చ దీర్ఘాన్ ప్రవికీర్య మూర్ధజాన్
మహాభుజో వారణతుల్యవిక్రమః।
గతేన భూమిం ప్రతికంపయంస్తదా
విరాటమాసాద్య సభాసమీపతః॥ 2
అతడు పొడవైన చేతులూపుకుంటూ శిరోజాలు విదల్చుకుంటూ, ఏనుగునడకతో భూమిని కంపింపజేస్తూ విరాటుని సభాసమీపానికి వచ్చాడు. (2)
తం ప్రేక్ష్య రాజోపగతం సభాతలే
వ్యాజాత్ ప్రతిచ్ఛన్నమరిప్రమాథినమ్।
విరాటమానం పరమేణ వర్చసా
సుతం మహేంద్రస్య గజేంద్రక్రమమ్॥ 3
సర్వానపృచ్ఛచ్చ సభానుచారిణః
కుతోఽయమాయాతి పురా న మే శ్రుతః।
న చైనమూచుర్విదితం తదా నరాః
సవిస్మయం వాక్యమిదం నృపోఽబ్రవీత్॥ 4
ఏదో కారణంవలన తననిజరూపం దాచిపెట్టి మారు వేషంలో సభలోకి వచ్చిన, శత్రుసంహారకుడై, గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ, గజేంద్రపరాక్రమం కల్గి ఉన్న మహేంద్రుని కుమారుడైన అర్జునుని చూసి, విరాటరాజు సభాసదులతో 'ఇతడు ఎక్కడ నుండి వస్తున్నాడు? మునుపు నేను వినియుండలేదు. జనులు ఇతనిని ఎరుగున్నవానిగా చెప్పటం లేదు' అంటూ ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. (3,4)
సత్త్వోపపన్నః పురుషోఽమరోపమః
శ్యామో యువా వారణయూథపోపమః।
ఆముచ్య కంబూపరి హాటకే శుభే
విముచ్య వేణీమపినహ్య కుండలే॥ 5
స్రగ్వీ సుకేశః పరిధాయ చాన్యథా
శుశోభ ధన్వీ కవచీ శరీ యథా।
ఆరుహ్య యానాం పరిధావతాం భవాన్
సుతైః సమో మే భవ వా మయా సమః॥ 6
'ఓయీ! బలశాలివైన నీవు దైవంలా ఉన్నావు. గజరాజులా ఉన్నావు. నల్లని యువకుడివై ఉన్నావు. చేతులకు శంఖవలయాలపై బంగారుగాజులు ధరించావు. జుట్టువిరబోసుకుని కుండలాలు ధరించావు.
పూల మాలను ధరించావు. మంచి కేశాలున్నాయి. వేరే విధంగా వస్త్రం ధరించి, ధనుర్బాణాలూ, కవచం ధరించి వీరునివలె ఉన్నావు. నీవు రథం ఎక్కి తిరుగు, నాకుమారులతో లేదా నాతో సమానుడవై ఉండు. (5,6)
వృద్ధో హ్యహం వై పరిహారకామః
సర్వాన్ మత్స్యాంస్తరసా పాలయస్వ।
నైవంవిధాః క్లీబరూపా భవంతి
కథంచనేతి ప్రతిభాతి మే మనః॥ 7
నేను వృద్ధుడిని. రాజ్యభారం తగ్గించుకోవాలనుకొంటున్నాను. నీవు శక్తితో ఈ మత్స్యదేశం పాలించు. ఇలాంటిరూపం కలవారు నపుంసకులు కారు అని నామనసు చెపుతోంది.' (7)
(అర్జున ఉవాచ
వేణీం ప్రకుర్యాం రుచిరే చ కుండలే
తథా స్రజః ప్రావరణాని సంహరే।
స్నానం చరేయం విమృజే చ దర్పణం
విశేషకేష్వేవ చ కౌశలం మమ॥
క్లీబేషు బాలేషు జనేషు నర్తనే
శిక్షాప్రదానేషు చ యోగ్యతా మమ।
కరోమి వేణీషు చ పుష్పపూరణం
న మే స్త్రియః కర్మణి కౌశలాధికాః॥
అర్జునుడు అన్నాడు. 'నేను కేశాలు అలంకరిస్తాను. అందంగా చెవికమ్మలు పెట్టగలను. అందమైన దండలు,
ఉత్తరీయాలు, మేలిముసుగులూ అలంకరించిన గలను. స్నానం చేయించగలను. అద్దాన్ని శుభ్రం చేయగలను. చందనరేఖాద్యలంకారాల్లో నాకు నేర్పు ఉన్నది. నపుంసకులలో. బాలురలో, సాధారణజనులలో తిరుగుతాను. నాట్యం చేయటంలో, నాట్య శిక్షణలో నాకు అర్హత ఉంది. జడలలో పూలను అలంకరిస్తాను. స్త్రీలు ఈ పనిలో నాకంటె ఎక్కువ నేర్పరులు కారు.'
తమబ్రవీత్ ప్రాంశుముదీక్ష్య విస్మితః
విరాటరాజోపసృతం మహాయశాః।
తన్ను సమీపించిన ఆ ఉన్నతిని చూసి మహాయశస్వి విరాటరాజు ఆశ్చర్యపడి యిలా అన్నాడు.
విరాట ఉవాచ
నార్హస్తు వేషోఽయమనూర్జితస్తే
నాపుంస్త్వమర్హో నరదేవసింహ।
తవైష వేశోఽశుభవేషభూషణైః
విభూషితో భూతపతేరివ ప్రభో॥
విభాతి భానోరివ రశ్మిమాలినః
ఘనావరుద్ధే గగనే ఘనైరివ।
ధనుర్హి మన్యే తవ శోభయేద్ భుజౌ
తథా హి పీనావతిమాత్రమాయతౌ॥)
విరాటుడు అన్నాడు. 'నరరాజసింహా! హీనమైన ఈవేషమూ, ఈ పీడితనమూ నీకు తగినది కాదు. అమంగళకరమైన ఈ అలంకారాలూ, వేషమూ పశుపతికి అలంకారంలా ఉన్నాయి. దట్టమైన మేఘాలు కప్పిన సూర్యునివలె ప్రకాశిస్తున్నావు. బలిష్ఠాలైన నీ ఆజానుబాహువులకు విల్లుమాత్రమే శోభకలిగిస్తుందని నానమ్మకం.')
అర్జున ఉవాచ
గాయామి నృత్యామ్యథ వాదయామి
భద్రోఽస్మి నృత్యే కుశలోఽస్మి గీతే।
త్వముత్తరాయై ప్రదిశస్వ మాం స్వయం
భవామి దేవ్యా నరదేవ నర్తకః॥ 8
అర్జునుడు చెప్పాడు. 'రాజా! నేను గానం చేస్తాను. నృత్యం చేస్తాను. మృదంగవాదనంకూడ చేస్తాను. నృత్యంలో, గానంలో నేర్పరిని. నీవు నీకుమార్తె ఉత్తరకు విద్య నేర్పటానికి నన్ను నియమించు. నేను స్వయంగా ఆమెకు నర్తకుడను (నాట్యాచార్యుడను) అవుతాను. (8)
ఇదం తు రూపం మమ యేన కిం తవ
ప్రకీర్తయిత్వా భృశశోకవర్ధనమ్।
బృహన్నలాం మాం నరదేవ విద్ధి
సుతం సుతాం వా పితృమాతృవర్జితామ్॥ 9
నీవు నారూపాన్ని ప్రశంసించి ప్రయోజనంలేదు. అది నా దుఃఖాన్ని మరింత పెంచుతుంది. తల్లిదండ్రులు వదిలివేసిన కొడుకో లేక కూతురో ఈ బృహన్నల అనుకో.' (9)
విరాట ఉవాచ
దదామి తే హంత వరం బృహన్నలే
సుతాం చ మే నర్తయ యాశ్చ తాదృశీః।
ఇదం తు తే కర్మ సమం న మే మతం
సముద్రనేమిం పృథివీం త్వమర్హసి॥ 10
విరాటు డన్నాడు. 'బృహన్నలా! నీవు కోరిన వరం ఇస్తున్నా. నాకుమార్తెకూ, ఇతర కన్యలకూ, నృత్యం నేర్పు. కాని ఈ నీ పని నాకిష్టం లేదు. నీవు నిజానికి సముద్రాలు హద్దుగా గల ఈ భూమిని పాలింపదగిన వాడవు.' (10)
వైశంపాయన ఉవాచ
బృహన్నలాం తామభివీక్ష్య మత్స్యరాట్
కలాసు నృత్యేషు తథైవ వాదితే।
సమ్మంత్ర్య రాజా వివిధైః స్వమంత్రిభిః
పరీక్ష్య చైనం ప్రమదాభిరాశు వై॥ 11
అపుంస్త్వమప్యస్య నిశమ్య చ స్థిరం
తతః కుమారీపురముత్ససర్జ తమ్॥
వైశంపాయనుడు అన్నాడు. మత్స్యరాజు విరాటుడు ఆ బృహన్నలను చూసి వివిధమంత్రులతో ఆలోచన చేసిన్ కళలలో నృత్యములలో, వాదనములలో అతనిని స్త్రీలచే పరీక్ష చేయించి, అతని నపుంసకత్వం నిజమైనదని స్థిరపరచుకొని అతనిని కన్యకాంతఃపురానికి పంపాడు. (11 1/2)
స శిక్షయామాస చ గీతవాదితమ్
సుతాం విరాటస్య ధనంజయః ప్రభుః॥ 12
సఖీశ్చ తస్యాః పరిచారికాస్తథా
ప్రియశ్చ తాసాం స బభూవ పాండవః॥ 13
తథా స సత్త్రేణ ధనంజయో వసన్
ప్రియాణి కుర్వన్ సహ తాభీరాత్మవాన్।
తథా చ తం తత్ర న జజ్ఞిరే జనాః
బహిశ్చరా వాప్యథ చాంతరే చరాః॥ 14
సమర్థుడైన ధనంజయుడు విరాటుని పుత్రికకూ ఆమె చెలులకూ, పరిచారికలకూ, నృత్యగీతవాద్యాలను నేర్పసాగాడు. దీనితో అతడు వారికిష్టుడయ్యాడు. ఇలా మారువేషంలో రహస్యంగా అర్జునుడు అక్కడ నివసిస్తూ, వారితో కలిసి ఇష్టమైన పనులు చేస్తూ మనస్సును స్వాధీన పరచుకొని ఉన్నాడు. అంతఃపురంలో తిరిగేవారు గాని, బయటవారుకాని, అతనిని గూర్చి తెలుసుకోలేకపోయారు. (12-14)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవ ప్రవేశ పర్వణి అర్జున ప్రవేశో నామ ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవ ప్రవేశ పర్వమను ఉపపర్వమున అర్జునప్రవేశమను పదునొకండవ అధ్యాయము. (11)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2శ్లోకాలతో కలిపి మొత్తం 18 1/2 శ్లోకాలు.)