12. పండ్రెండవ అధ్యాయము

నకులుడు అశ్వశిక్షకుడుగ నియుక్తుడగుట.

వైశంపాయన ఉవాచ
అథాపరోఽదృశ్యత పాండవః ప్రభుః
విరాటరాజం తరసా సమేయివాన్।
తమాపతంతం దదృశే పృథగ్ జనః
విముక్తమభ్రాదివ సూర్యమండలమ్॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! పాండవులలో మరొకశక్తిశాలి నకులుడు విరాటరాజును సమీపించాడు. వస్తున్న అతనిని చూసి సాధారణజనులు మేఘాల్లోంచి వచ్చే సూర్యుడనుకొన్నారు. (1)
వి॥తె॥ మేఘంలోనుండి విడివడిన సూర్యమండలం వలె నకులుడున్నాడని వ్యాసుడంటే.... దాన్ని మరింత రమ్యంగా తిక్కన "ఉదయించే సూర్యుని పద్మాలు చూచినట్లు ప్రజల కళ్లు వికసిల్లి నకులుని స్ఫురద్రూపం మీద పడుతున్నాయి" అని వర్ణిస్తాడు. (1-256)
స వై హయానైక్షత తాంస్తతస్తతః
సమీక్షమాణం స దదర్శ మత్స్యరాట్।
తతోఽబ్రవీత్ తాననుగాన్ నరేశ్వరః
కుతోఽయమాయాతి నరోఽమరోపమః॥ 2
స్వయం హయానీక్షతి మామకాన్ దృఢం
ధ్రువం హయజ్ఞో భవితా విచక్షణః।
ప్రవేశ్యతామేష సమీపమాశు మే
విభాతి వీరో హి యథామరస్తథా॥ 3
అతడు వచ్చి అక్కడున్న గుఱ్ఱాలను చూస్తున్నాడు. అలా చూస్తున్న అతనిని మత్స్యరాజు విరాటుడు చూశాడు. విరాటుడు అనుచరులతో ఇలా అన్నాడు. 'ఇతడు ఎక్కడ నుండి వస్తున్నాడు? ఇంద్రునిలా ఉన్నాడెవరు? ఇతడు స్వయంగా నాగుఱ్ఱాలను పట్టిపట్టి చూస్తున్నాడు. తప్పక ఇతడు అశ్వపరిజ్ఞానంగల వివేకవంతుడు కావాలి. ఈ వీరుడు అమరునివలె ప్రకాశిస్తున్నాడు. ఇతనిని వెంటనే నాముందర ప్రవేశపెట్టండి.' (2,3)
అభ్యేత్య రాజానమమిత్రహాబ్రవీత్
జయోఽస్తు తే పార్థివ భద్రమస్తు వః।
హయేషు యుక్తో నృప సమ్మతః సదా
తవాశ్వసూతో నిపుణో భవామ్యహమ్॥ 4
అపుడు శత్రుంజయుడైన నకులుడు రాజును సమీపించి ఇలా అన్నాడు. 'రాజా! మీకు జయమగుగాక. మీకు శుభమగుగాక. నేను గుఱ్ఱాలకు శిక్షణనివ్వడంలో నేర్పరిని. సదా రాజులకు ఇష్టుడను. మీగుఱ్ఱాలకు నేర్పరియగు సారథిని అవుతాను.' (4)
విరాట ఉవాచ
దదామి యానాని ధనం నివేశనం
మమాశ్వసూతో భవితుం త్వమర్హసి।
కుతోఽసి కస్యాసి కథం త్వమాగతః
ప్రబ్రూహి శిల్పం తవ విద్యతే చ యత్॥ 5
విరాటుడు అన్నాడు. 'ఓయీ! నీకు రథాలూ, ధనమూ, నివాసమూ, ఇస్తున్నాను. నా అశ్వాలకు సారథిగా ఉండటానికి నీవు అర్హుడవు. నీవు ఎక్కడ నుండి వస్తున్నావు? ఏ రాజుకు సంబంధించిన వాడవు? ఎలా వచ్చావు? నీకు దేనియందు నైపుణ్యముందో వివరింగా చెప్పు.' (5)
నకుల ఉవాచ
పంచానాం పాండుపుత్రాణాం జ్యేష్ఠో భ్రాతా యుధిష్ఠిరః।
తేనాహనుశ్వేషు పురా నియుక్తః శత్రుకర్శన॥ 6
అశ్వానాం ప్రకృతిం వేద్మి వినయం చాపి సర్వశః।
దుష్టానాం ప్రతిపత్తిం చ కృత్స్నం చైవ చికిత్సితమ్॥ 7
నకులుడు ఇలా అన్నాడు. 'శత్రుమర్దనా! పాండుకుమారులైదుగురిలీ జ్యేష్ఠుడైన యుధిష్ఠిరుడు నన్ను పూర్వం అశ్వాలను చూడటానికి నియమించాడు. అశ్వాల స్వభావం ఎఱుగుదును. వాటిని లొంగదీసుకోవటమూ తెలుసును. గుర్రాల రోగాలూ, వాటి నివారణమూ పూర్తిగా ఎరుగుదును. (6,7)
న కాతరం స్యాన్మమ జాతు వాహనం
న మేఽస్మి దుష్టా వడవా కుతో హయాః।
జనస్తు మామాహ స చాపి పాండవః
యుధిష్ఠిరో గ్రంధికమేవ నామతః॥ 8
నావాహనం ఎప్పుడూ పిరికిది కాజాలదు. నవద్ద చెడ్డదైన ఆడుగుర్ర్రం ఒకటికూడా లేదు. ఇక మహ గుర్రాల విషయం చెప్పాలా! జనులూ, యుధిష్ఠిరుడూ నన్ను గ్రంధికుడని అనేవారు. (8)
(మాతలిరివ దేవపతేః
దశరథనృపతేః సుమంత్ర ఇవ యంతా।
సుమహ ఇహ జామదగ్నేః
తథైవ తవ శిక్షయామ్యశ్యాన్॥
యుధిష్ఠిరస్య రాజేంద్ర నరరాజస్య శాసనాత్।
శతసాహస్రకోటీనామ్ అశ్వానామస్మి రక్షితా॥)
దేవేంద్రుని సారథియైన మాతలివలె, దశరథుని సారథి సుమంత్రునివలె, పరశురాము సారథి సుమహుని వలె నీగుర్రాలకు నేను శిక్షణనిస్తాను. రాజేంద్రా! మహారాజైన యుధిష్ఠిరుని శాసనంవల్ల లక్షకోటి గుర్రాలకు రక్షకునిగా ఉన్నాను.'
విరాట ఉవాచ
యదస్తి కించిన్మమ వాజివాహనం
తదస్తు సర్వం త్వదధీనమద్య వై।
యే చాపి కేచిన్మమ వాజియోజకాః
త్వదాశ్రయాః సారథయశ్చ సంతు మే॥ 9
విరాటుడు అన్నాడు. 'నాగుఱ్ఱాలు, రథాలు, అన్నీ ఇప్పుడే నీఅధీనం అవుతాయి. నావద్దనున్న సారథులంతా నీఅధీనంలో ఉందురుగాక! (9)
ఇదం తవేష్టం యది వై సురోపమ
బ్రవీహి యత్ తే ప్రసమీక్షితం వసు।
న తేఽనురూపం హయకర్మ విద్యతే
ప్రభాసి రాజేవ హి సమ్మతో మమ॥ 10
యుధిష్ఠిరస్యేవ హి దర్శనేన మే
సమం తవేదం ప్రియమత్ర దర్శనమ్।
కథం తు భృత్యైః స వినాకృతో వనే
వసత్యనింద్యో రమతే చ పాండవః॥ 11
దైవసమానా! ఈ పని నీకిష్టమైతే ఇందుకు నీవు కోరే ధనమెంతో చెప్పు. ఈ అశ్వకర్మ నీకు నిజానికి తగినది కాదు. రాజు వలె ప్రకాశిస్తున్నా వని నాఅభిప్రాయం. ఇక్కడ నీదర్శనం యుధిష్ఠిరుని దర్శనంవలె నాకు ప్రియంగా ఉంది. సేవకులు లేకుండా అరణ్యంలో మహానుభావుడైన ఆ ధర్మరాజెలా సంతోషంగా నివసిస్తున్నాడో! (10,11)
వైశంపాయన ఉవాచ
తథా స గంధర్వవరోపమో యువా
విరాటరాజ్ఞా ముదితేన పూజితః।
న చైవమన్యేఽపి విదుః కథంచన
ప్రియాభిరామం విచరంతమంతరా॥ 12
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! అలా గంధర్వ శ్రేష్ఠునిపోలిన యువకుడైన ఆ నకులుని విరాటరాజు ఆనందంతో సత్కరించాడు. అందమైన ప్రియమైన రూపంతో తిరుగుతున్న అతనిని గూర్చి ఇతరులెవ్వరూ తెలుసుకోలేక పోయారు. (12)
ఏవం హి మత్స్యే న్యవసంత పాండవాః
యథా ప్రతిజ్ఞాభిరమోఘదర్శనాః।
అజ్ఞాతచర్యాం వ్యచరన్ సమాహితాః
సముద్రనేమీపతయోఽతిదుఃఖితాః॥ 13
ఇలా పాండవులు తమ ప్రతిజ్ఞకనుగుణంగా సార్థకదర్శనంతో మత్స్యదేశంలో నివసించారు. భూమండలాధిపతులైనప్పటికీ మిక్కిలి దుఃఖంతో, జాగరూకులై అజ్ఞాతవాసం చేశారు. (13)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి నకుల ప్రవేశో నామ ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవప్రవేశ పర్వమను ఉపపర్వమున నకులప్రవేశమను పండ్రెండవ అధ్యాయము. (12)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకములతో కలిపి మొత్తం 15 శ్లోకములు.)