15. పదునైదవ అధ్యాయము

సుదేష్ణ కీచకుని ఇంటికి ద్రౌపదిని పంపుట.

వైశంపాయన ఉవాచ
ప్రత్యాఖ్యాతో రాజపుత్ర్యా సుదేష్ణాం కీచకోఽబ్రవీత్।
అమర్యాదేన కామేన ఘోరేణాభిపరిప్లుతః॥ 1
వైశంపాయనుడంటున్నాడు. రాజకుమారి ద్రౌపది చేత తిరస్కరింపబడి వెళ్లిన కీచకుడు హద్దు లెరుగని భయంకరమైన కామంలో కొట్టుమిట్టాడుతూ సుదేష్ణతో ఇలా అన్నాడు. (1)
యథా కైకేయి సైరంధ్రీ సమేయాత్ తద్ విధీయతామ్।
యేనోపాయేన సైరంధ్రీ భజేన్మాం గజగామినీ।
తం సుదేష్ణే పరీప్సస్వ ప్రాణాన్ మోహాత్ ప్రహాసిషమ్॥ 2
కేకయరాజపుత్రీ! గజగమన అయిన ఆ సైరంధ్రి నాదగ్గరకు వచ్చి నన్ను అంగీకరించే ఉపాయం ఆలోచించు. ఆ పనిచెయ్యి. ఆమె మీది మోహంతో నా ప్రాణాలు పోకుండా చూడు. (2)
వైశంపాయన ఉవాచ
తస్య సా బహుశః శ్రుత్వా వాచం విలపతస్తదా।
విరాటమహిషీ దేవీ కృపాం చక్రే మనస్వినీ॥ 3
విలపిస్తున్న కీచకుని మాటలు విని అప్పుడు విరాటుని మహారాణి సుదేష్ణ మనసులో అతనిపట్ల జాలి కలిగింది. (3)
(సుదేష్ణోవాచ
శరణాగతేయం సుశ్రోణీ మయా దత్తాభయా చ సా।
శుభాచారా చ భద్రం తే నైనాం వక్తుమిహోత్సహే॥
సుదేష్ణ ఇలా అన్నది. 'ఈ సుందరి సైరంధ్రి నా ఆశ్రయంలో ఉంది. నేనీమెకు అభయం ఇచ్చాను. నీకు మేలు కలుగుగాక! ఈమె ఎంతో సదాచారిణి. నేను ఈమెకు నీ మనోగతాన్ని చెప్పలేను.
నైషా శక్యా హి చాన్యేన స్ప్రష్టుం పాపేన చేతసా।
గంధర్వాః కిల పంచైనాం రక్షంతి రమయంతి చ॥
ఈమెను పరపురుషు లెవరూ దుర్బుద్ధితో తాక లేరు. ఈమెను ఐదుగురు గంధర్వులు రక్షిస్తూ ఉంటారు. సుఖపెడుతూ ఉంటారు.
ఏవమేషా మమాచష్టే తథా ప్రథమసంగమే।
తథైవ గజనాసోరుః సత్యమాహ మమాంతికే॥
తే హి క్రుద్ధా మహాత్మానః నాశయేయుర్హి జీవితమ్।
ఈమె ఈ విషయాన్ని మొదటిసారి కలిసినపుడే చెప్పింది. ఈ సుందరి(తన్ను ఎవరైనా అవమానపరిస్తే కోపిస్తే తన భర్తలు(అతని) ప్రాణాలను తీస్తారని నా ఎదుట వాస్తవం చెప్పింది.
రాజా చైవ సమీక్ష్యైనాం సమ్మోహం గతనానిహ॥
మయా చ సత్యవచనైః అనునీతో మహీపతిః।
రాజుకూడా ఈమెను చూసి మోహితు డయ్యాడు. అప్పుడు నేను(ఆమె చెప్పిన యథార్థ వచనాలన్ని చెప్పి)ఎలాగో నచ్చచెప్పాను.
సోఽప్యేనామనిశం దృష్ట్వా మనసైనాభ్యనందత॥
భయాద్ గంధర్వముఖ్యానాం జీవితస్యోపఘాతినామ్।
మనసాపి తతస్త్వేనాం న చింతయతి పార్థివః॥
అప్పటినుండి ఆయనకూడా లోలోపలే ఆమెను మెచ్చుకోసాగారు. గంధర్వులు ప్రాణాలు తీస్తారనే భయంతో మహారాజు ఎప్పుడూ కూడా మనసులోనైనా ఆమెను గురించి తలచుకొనేవారు కారు.
తే హి క్రుద్ధా మహాత్మానః గరుడానిలతేజసః।
దహేయురపి లోకాంస్త్రీన్ యుగాంతేష్విన భాస్కరాః।
మహాత్ములైన ఆ గంధర్వులు గరుడునివలె, వాయువువలె, మిక్కిలి వేగం కలవారు. వారు కోపిస్తే ప్రళయకాలపు సూర్యులవలె ముల్లోకాలను దగ్ధం చేయగలరు.
సైరంధ్ర్యా హ్యేతదాఖ్యాతం మమ తేషాం మహద్ బలమ్।
తవ చాహమిదం గుహ్యం స్నేహాదాఖ్యామి బంధువత్॥
సైరంధ్రి స్వయంగా నాకు వారు బలాన్ని గూర్చి చెప్పింది. సోదరప్రేమ కారణంగా నేను నీకు ఈ రహస్యాన్ని చెప్పాను.
మా గమిష్యసి వై కృచ్ఛ్రాం గతిం పరమదుర్గమామ్।
బలినస్తే రుజం కుర్యుః కులస్య చ ధనస్య చ॥
ఈమెను ధ్యానిస్తూ నీవు మిక్కిలి అనూహ్యమైన సంకటపరిస్థితిలో చిక్కుకోకు. గంధర్వులు బలవంతులు. వారు నీ వంశాన్ని, సంపదనూ కూడా నాశనం చేస్తారు.
తస్మాన్నాస్యాం మనః కర్తుం యది ప్రాణాః ప్రియాస్తవ।
మా చింతయేథా మాగాస్త్వం మత్ప్రియం చ యదీచ్ఛసి॥
అందుకని నీకు నీప్రాణాలమీద తీపి ఉంటే, నాకు ప్రియాన్ని చేయాలనుకుంటే ఈ సైరంధ్రిమీద మనసు పడకు. ఆమెను గూర్చిన ఆలోచనలు వదిలి పెట్టు. ఆమె దగ్గరకు కూడా పోవద్దు.'
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు దుష్టాత్మా భగినీం కీచకోఽబ్రవీత్।
వైశంపాయను డన్నాడు. సుదేష్ణ ఇలా చెప్పగా దుష్టాత్ముడైన కీచకుడు తన సోదరితో ఇలా అన్నాడు.
కీచక ఉవాచ
గంధర్వాణాం శతం వాపి సహస్రమయుతాని వా।
అహమేకో హనిష్యామి గంధర్వాన్ పంచ కిం పునః॥
కీచకు డంటున్నాడు. నేను వందలు, వేలు, లక్షల గంధర్వులనుకూడా ఒక్కడినే చంపి వేయగలను. ఇక ఐదుగురు లెక్కా?
విశంపాయన ఉవాచ
ఏవముక్తా సుదేష్ణా తు శోకేనాభిప్రపీడితా।
అహో దుఃఖమహో కృచ్ఛ్రమ్ అహో పాపమితిస్మ హ।
ప్రారుదద్ భృశదుఃఖార్తా విపాకం తస్య వీక్ష్య సా॥
పాతాలేషు పతత్యేషః విలపన్ బడబాముఖే।
వైశంపాయనుడు చెపుతున్నాడు.
కీచకుడిలా చెప్పేసరికి సుదేష్ణ శోకంతో మిక్కిలి వ్యథ చెందింది. మనుసులోనే "అయ్యో! గొప్పదుఃఖం, సంకటం, పాపం కలుగుతున్నాయి" అనుకొంది. దీని వలన కలిగే పరిణామాన్ని తలచుకొని మిక్కిలి దుఃఖార్తురాలై రోదించసాగింది. మనసులో తన తమ్ముడు పిచ్చి మాటలు మాట్లాడుతీ స్వయంగా పాతాళంలోనో బడబాగ్నిలోనో పడిపోతున్నాడని అనుకొంది.
(ఆ తరువాత ఆమె కీచకునికి ఇలా చెప్పసాగింది)
త్వత్కృతే వినశిష్యంతి భ్రాతరః సుహృదశ్చ మే।
కిం ని శక్యం మయా కర్తుం యత్ త్వమేవమభిప్లుతః।
న చ శ్రేయోఽభిజానీషే కామమేవానువర్తసే॥
'నాకు తెలుసు. నీకారణంగా నా సోదరులు, మిత్రులూ అందరూ నశించిపోతారు. నీవు ఇటువంటి అనుచితమైన కోరికను మనసులో ఉంచుకొన్నావు. నేను దీనికోసం ఏమి చేయగలను? నీ మేలేదో నీవు తెలుసు కోలేకపోతున్నావు. కేవలం కామానికి దాసుడివవుతున్నావు.
ధ్రువం గతాయుస్త్వం పాపయదేవం కామమోహితః।
అకర్తవ్యే హి మాం పాపే నియునంక్షి నరాధమ॥
పాపీ! నిశ్చయంగా నీ ఆయువు తీరిపోయింది. అందుకే నీవు కామామోహితుడవు అవుతున్నావు. నరాధమా! నీవు నన్ను ఎప్పటికీ చేయకూడని పాప కృత్యానికి ఒడిగట్టెలా చేస్తున్నావు.
అపి చైతత్ పురా ప్రోక్తం నిపుణైర్మనుజోత్తమైః।
ఏకస్తు కురుతే పాపం స్వజాతిస్తేన హన్యతే॥
కులంలో ఒక్కడు పాపం చేస్తే, వాని కారణంగా ఆ కులంలోని వారందదూ నశించిపోతారని పూర్వం పెద్దలు, నిపుణులు సరిగానే చెప్పారు.
వి॥ రామాయణంలో ఇదే చెప్పారు. సువేల పర్వతం ఎక్కేముందు రాముడు సుగ్రీవునితో "రావణుని తప్పుకు వంశమంతా నాశనం చేయవలసివస్తోంది" అంటాడు.
ఏకో హి కురుతే పాపం కాలపాశవశంగతః
నీచేనాత్మాపచారేణ కులం తేన వినశ్యతి(యుద్ధ-38-7)
గతస్త్వం ధర్మరాజస్య విషయం నాత్ర సంశయః।
అదూషకమిమం సర్వం స్వజనం ఘాతయిష్యసి॥
నీవు యముని ఇంటికి వెళ్తున్నావు. ఇందులో సందేహం లేదు. నీవు నీతో బాటు నిరపరాధులైన సమస్త బంధువులనూ కూడా చంపించబోతున్నావు.
ఏతత్ తు మే దుఃఖతరం యేనాహం భ్రాతృసౌహృదాత్।
విదితార్థా కరిష్యామి తుష్టోభవ కులక్షయాత్॥)
నేను ఈ సమస్త పరిణామాలనూ తెలిసికూడా సోదరప్రేమతో నీ ఆజ్ఞ పాటిస్తున్నాను. అదే నాకు అన్నింటిని మించిన దుఃఖకారణం నీవు మాత్రం వంశాన్ని అంతరింపచేసి సంతుష్టుడవు అగుదువు కాని.
స్వమంత్రమభిసంధాయ తస్యార్థమనుచింత్య చ।
ఉద్యోగం చైవ కృష్ణాయాః సుదేష్ణా సూతమబ్రవీత్॥ 4
తరువాత సుదేష్ణ తాను చేయవలసిన దేమితో ఆలోచించి, కీచకుని కోరికను గుర్తించి, అతనికి ద్రౌపదియొక్క పొందు లభించడానికి తగిన ఉపాయాన్ని నిశ్చయించుకొని అతనితో ఇలా అంది. (4)
వి॥సం॥ స్వమంత్ర మభిసంధాయ
1. స్వమంత్ర అనగా స్వార్థము- అనగా "ఈసైరంధ్రి కీచకుని కామిస్తే నా భర్త అభిలషించడు"
2. తస్యార్థ మనుచింత్య - కీచకు డీమెను రహస్యంగా అనుభవిస్తే అతని కామాగ్ని చల్లారుతుంది. విరహంతో చనిపోడు. అని దాని భావం.
3. ఉద్వేగందైవ కృష్ణాయాః - ఈ పైరెండూ కుదరకపోయినా కూడా సైరంధ్రికి క్లేశమే కలుగుతుంది. ఈ మూడింటిని ఆలోచించి సుదేష్ణ ఇలా అంటోంది. (విష)
కృష్ణ యొక్క ప్రాప్తి కోసమయిన ప్రయత్నం గురించి ఆలోచించి - అని. (నీల)
వి॥ తె॥ ఇక్కడ అన్నీకలిపి వచ్చేటట్లు తిక్కన ఇలా చెప్పాడు.
1. ఆవల వచ్చు నాపదలకన్నిటికోర్చి, 2. లతాంగి గూర్చికా కీ వెడమాటలన్ మరల డెన్నివిధంబులఁజూపి చెప్పినం గావలమైన వీఁ డుదగు కార్యము వట్టునె? 3. వీని కెమ్మెయిం జూపు నిజెంబు మన్మథుని శాతశరంబులనైన నక్కటా (విరా-2-78) అని మూడువిధాలలోని మన్మథుని చేత చావు తప్పదు అనుకొని ఒప్పుకొంటుంది.
పర్వణి త్వం సముద్దిశయ సురామన్నం చ కారయ।
తత్రైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాంతికమ్॥ 5
'నీవు పర్వదినాన్ని పురస్కరించుకొని నీ ఇంటిలో మద్యాన్ని, భోజనసామగ్రిని సిద్ధం చేయించు. ఆపైన నేను సైరంధ్రిని సుర తెచ్చే మిషమీద నీదగ్గరకు పంపుతాను. (5)
తత్ర సంప్రేషితామేనాం విజనే నిరవగ్రహే।
సాంత్వయేథా యథాకామం సాంత్వ్యమానా రమేద్యది॥ 6
అక్కడికి పంపబడిన ఈమెను ఏకాంతంలో ఎలాంటి ఆటంకం లేకుండా నీ ఇచ్ఛానుసారం బుజ్జగించుకో. నీ బుజ్జగింపులు పొందాక ఆమె నీకు వశమవడానికి ఉద్యుక్తురాలు కావచ్చును.' (6)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తః స వ్నిష్క్రమ్య భగిన్యా వచనాత్ తదా।
సురామాహారయామాస రాజార్హాం సుపరిష్కృతామ్॥ 7
భక్ష్యాంశ్చ వివిధాకారాన్ బహూంశ్చోచ్చావచాంస్తదా।
కారయామాస కుశలైః అన్నం పానం సుశోభనమ్॥ 8
వైశంపాయనుడు చెపుతున్నాడు - సోదరి మాటలను విని ఊరట పొందిన కీచకుడు అప్పుడు అక్కడనుండి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి అతడు సమయానుకూలంగా నేర్పుగల వంటవాళ్లను పిలిపించి రాజులుపయోగించ తగిన ఉత్తమమైన రుచికరమైన మద్యాన్ని తెప్పించాడు. ఇంకా రకరకాల పిండివంటలను, శ్రేష్ఠమైన అన్నపానాలను తయారు చేయించాడు. (7,8)
తస్మిన్ కృతే తదా దేవీ కీచకేనోపమంత్రితా।
ఆ ఏర్పాట్లన్నీ అయిన తరువాత కీచకుడు సుదేష్ణను భోజనానికి పిలిచాడు. (8 1/2)
(త్వరావాన్ కాలపాశేన కంఠే బద్ధః పశుర్యథా।
నావబుధ్యత మూఢాత్మా మరణం సముపస్థితమ్॥
మూఢాత్ముడైన కీచకుడు మెడలో ఉరితాడు కట్టబడిన పశువువలె తనను సమీపిస్తున్న మృత్యువును గుర్తించ లేకపోతున్నాడు. అతడు ద్రౌపదిని పొందాలను ఉవ్విళ్ళూరుతున్నాడు.
కీచక ఉవాచ
మధు మద్యం బహువిధం భక్ష్యాంశ్చ వివిధాః కృతాః।
సుదేష్ణే బ్రూహి సైరంధ్రీం యథా సా మే గృహం వ్రజేత్॥
కీచకుడంటున్నాడు. 'సుదేష్ణా! అనేక విధాలైన మధురమైన మద్యాలను తెప్పించాను. రకరకాల వంటకాలను సిద్ధం చేయించాను. ఇక ఇప్పుడు సైరంధ్రి నా ఇంటికి వచ్చేలా నీవు ఆమెకు చెప్పు.
కేనచిత్ త్వద్య కార్యేణ త్వర శీఘ్రం మమ ప్రియమ్।
అహం హి శరణం దేవం ప్రపద్యే వృషభధ్వజమ్।
సమాగమం మే సైరంధ్ర్యా మరణం వా దిశేతి వై॥
ఏదో ఒక పని వంకతో ఈరోజు ఆమెను త్వరగా నాదగ్గరకు పంపు. నా కోరికను త్వరగా సిద్ధింపచేయి. నేను భగవంతుడైన శంకరుని శరణు కోరి "ప్రభూ! నన్ను సైరంధ్రితో కలుపు. లేదా మరణం ప్రసాదించు" అని వేడుకొంటున్నాను.'
వైశంపాయన ఉవాచ
సా తమాహ వినిఃశ్వస్య ప్రతిగచ్ఛ స్వకం గృహమ్।
ఏషాహమపి సైరంధ్రీం సురార్థే తూర్ణమాదిశే॥
వైశంపాయనుడంటున్నాడు. అప్పుడు సుదేష్ణ దీర్ఘంగా నిట్టూర్చి అతనితో "నీవు నీ ఇంటికి వెళ్లు. నేను సైరంధ్రిని వెంటనే అక్కడకు మదిర తెమ్మని పంపుతాను." అన్నది.
ఏవముక్తస్తు పాపాత్మా కీచకస్త్వరితః పునః।
స్వగృహం ప్రావిశత్ తూర్ణం సైరంధ్రీగతమానసః॥)
ఆమె అలా చెప్పడంతో సైరంధ్రిని తలచుకొంటూ పాపాత్ముడైన కీచకుడు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
సుదేష్ణా ప్రేషయామాస సైరంధ్రీం కీచకాలయమ్॥ 9
అప్పుడు సుదేష్ణ సైరంధ్రిని కీచకుని ఇంటికి పంపింది. (9)
సుదేష్ణోవాచ
ఉత్తిష్ఠ గచ్ఛ సైరంధ్రి కీచకస్య నివేశనమ్।
పానమానయ కల్యాణి పిపాసా మాం ప్రబాధతే॥ 10
సుదేష్ణ అంటోంది.' సైరంధ్రీ! లే. కీచకుని ఇంటికి వెళ్లు. కల్యాణీ! నన్ను దాహం బాగా బాధిస్తోంది. అందుకని అక్కడి నుండి నేను త్రాగడానికి తగిన పానీయాన్ని తెచ్చిపెట్టు.' (10)
సైరంధ్ర్యువాచ
న గచ్ఛేయమహం తస్య రాజపుత్రి నివేశనమ్।
త్వమేవ రాజ్ఞి జానాసి యథా స నిరపత్రపః॥ 11
సైరంధ్రి అన్నది.' రాజకుమారీ! నేను అతని ఇంటికి వెళ్లలేను. మహారాణీ! నీకు కూడా తెలుసుగదా. అతడెంత సిగ్గుమాలినవాడో. (11)
న చాహమనవద్యాంగి తవ వేశ్మని భామిని।
కామవృత్తా భవిష్యామి పతీనాం వ్యభిచారిణీ॥ 12
చక్కని శరీరసౌష్ఠవం కలదానా! నేను నీ భవనంలో నా భర్తల దృష్టిలో స్వేచ్ఛాచారిణిగ, వ్యభిచారిణిగ మారి ఉండలేను. (12)
త్వం చైవ దేవి జానాసి యథా చ సమయః కృతః।
ప్రవిశంత్యా మయా పూర్వం తవ వేశ్మని భామిని॥ 13
దేవీ! పూర్వం నేను ఈ రాజభవనంలో ప్రవేశించే సమయంలో చేసిన ప్రతిజ్ఞ కూడా మీకు తెలుసు. (13)
కీచకస్తు సుకేశాంతే మూఢో మదనదర్పితః।
సోఽవమంస్యతి మాం దృష్ట్వా న యాస్యే తత్ర శోభనే॥ 14
చక్కని ముంగురులు కలదానా! మూర్ఖుడైన కీచకుడు మదనదర్పంతో ఉన్మత్తుడై ఉన్నాడు. అతడు నన్ను చూడగానే అవమానిస్తాడు. కనుక నేను అక్కడికి వెళ్లను. (14)
సంతి బహ్వ్యస్తవ ప్రేష్యాః రాజపుత్రి వశానుగాః।
అన్యాం ప్రేషయ భద్రం తే స హి మామవమంస్యతే॥ 15
రాజపుత్రీ! నీ దగ్గర ఇంకా చాలామంది దాసీలు ఉన్నారు. వారిలో ఎవరినైనా ఒకరిని పంపు. నీకు మేలు జరుగుతుంది. నేను వెళ్తే కీచకుడు తప్పకుండా నన్ను అవమానపరుస్తాడు.' (15)
సుదేష్ణోవాచ
నైవ త్వం జాతు హింస్యాత్ సః ఇతః సంప్రేషితాం మయా।
ఇత్యుక్త్వా ప్రదదౌ పాత్రం సపిధానం హిరణ్మయమ్॥ 16
సుదేష్ణ అన్నది. 'నేను నిన్ను ఇక్కడి నుండి పంపుతున్నాను. కనుక అక్కడ అతడు నీకు ఏ హానీ చేయడు' అని చెప్పి సుదేష్ణ ద్రౌపది చేతిలో మూత ఉన్న ఒక బంగారు పాత్రను పెట్టింది. (16)
సా శంకమానా రుదతో దైవం శరణమీయుషీ।
ప్రాతిష్ఠత సురాహారీ కీచకస్య నివేశనమ్॥ 17
ద్రౌపది మద్యం తేవడానికి ఆ పాత్రను తీసుకుని శంకిత హృదయంతో ఏడుస్తూ (తన పాతివ్రత్యాన్ని రక్షించుకోవడానికి మనసులోనే) సూర్యభగవానుని వేడుకొంటూ కీచకుని యింటికి బయలుదేరింది. (17)
సైరంధ్ర్యువాచ
యథాహమన్యం భర్తృభ్యః నాభిజానామి కంచన।
తేన సత్యేన మాం ప్రాప్తాం మా కుర్యాత్ కీచకో వశే॥ 18
సైరంధ్రి అన్నది. భగవంతుడా! నేను నా పతులను తప్ప వేరెవరినీ మనసులో తలవని దాననయితే, ఆ సత్యప్రభావం వల్ల కీచకుడు తన ఇంటికి వచ్చిన అబలమైన నన్ను బలవంత పెట్టకుండును గాక!. (18)
వి॥ తె॥ ఇక్కడ తెలుగులో ముందు "మహాపదలకుం బరిహరణంబు హరిస్మరణంబ" అనుకొంటుంది సైరంధ్రి. తరువాత సుదేష్ణ మందిరం వెలువడి సూర్యుని చూసి ప్రార్థిస్తుంది. "అసాహదిత్యో బ్రహ్మ" అనిపించిందామెకు, ముందు నారాయణుని, వెంటనే ప్రత్యక్ష దైవమయిన సూర్యనారాయణుని ధ్యానించింది.
వైశంపాయన ఉవాచ
ఉపాతిష్ఠత సా సూర్యం ముహూర్తమబలా తతః।
స తస్యాస్తనుమధ్యాయాః సర్వం సూర్యోఽవబుద్ధవాన్॥ 19
అంతర్హితం తతస్తస్యాః రక్షో రక్షార్థమాదిశత్।
తచ్చైనాం నాజహాత్ తత్ర సర్వావస్థాస్వనిందితామ్॥ 20
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! అన్ని విధాలా అబల అయిన ఆ ద్రౌపది కొద్దిసేపు సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండిపోయింది. అప్పుడు సూర్యుడు ఆ ద్రౌపదియొక్క పరిస్థితిని అంతటిని గ్రహించి ఆమె రక్షణకోసం అదృశ్యరూపంలో ఒక రాక్షసుడిని నియమించాడు. వాడు ఎట్టి పరిస్థితులలోను పతివ్రత అయిన ద్రౌపదిని అక్కడ అసహాయురాలిగా వదిలిపెట్టడు. (19,20)
తాం మృగీమివ సంత్రస్తాం దృష్ట్వా కృష్ణాం సమీపగామ్।
ఉదతిష్ఠన్ముదా సూతః నావం లబ్ధ్వేవ పారగః॥ 21
భీతి చెందిన ఆడలేడివలె భయపడుతూ ద్రౌపది సమీపించడం చూసి కీచకుడు ఆనందంతో పొంగిపోయి లేచి నిలబడ్డాడు. నదిని దాటాలనుకొన్నవానికి నావ లభించినంత ఆనందం పొందాడు. (21)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి ద్రౌపదీసురాహరణే పంచదశోఽధ్యాయః॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధ పర్వమను ఉపపర్వమున
ద్రౌపది మదిర తెచ్చుట - అను పదునైదవ అధ్యాయము. (15)
(దాక్షిణాత్యప్రతి అధికపాఠము 25 శ్లోకాలు కలుపుకొని మొత్తం 46 శ్లోకములు.)