16. పదునారవ అధ్యాయము
కీచకుడు ద్రౌపదిని అవమానించుట.
కీచక ఉవాచ
స్వాగతం తే సుకేశాంతే సువ్యుష్టా రజనీ మమ।
స్వామినీ త్వమనుప్రాప్తా ప్రకురుష్వ మమ ప్రియమ్॥ 1
కీచకుడిలా అన్నాడు. 'చక్కని ముంగురులు కల సైరంధ్రీ! నీకు స్వాగతం. ఈ రాత్రి చక్కగా గడిచి నాకు సుప్రభాత మయింది. నాకు రాణివై ప్రీతి కలిగించి. (1)
సువర్ణమాలాః కంబూశ్చ కుండలే పరిహాటకే।
నానాపత్ట్తనజే శుభ్రే మణిరత్నం చ శోభనమ్॥ 2
ఆహరంతు చ వస్త్రాణి కౌశికాన్యజినాని చ।
నీకోసం బంగారు హారాలు, శంఖపుగాజులు, వివిధ నగరాల్లో తయారుచేయబడిన శుభ్రమైన పసిడి తాటంకాలు, అందమైన మణిరత్నాభరణాలు, పట్టుచీరలు, మృగచర్మాలు మొదలైనవి తెమ్మని నేను దాసీలను ఆజ్ఞాపిస్తాను. (2 1/2)
అస్తి మే శయనం దివ్యం త్వదర్థముపకల్పితమ్।
ఏహి తత్ర మయాసార్ధం పిబస్వ మధుమాధవీమ్॥ 3
నేను నీకోసం ఇంతకుముందే నా దివ్యమైన శయ్యను ఏర్పాటు చేసి ఉంచాను. రా. నాతో కలిసి తీయని మాధ్వీరసాన్ని త్రాగుదువుగాని.' (3)
ద్రౌపద్యువాచ
(నాహం శక్యా త్వయా స్ప్రష్టుం నిషాదేనేవ బ్రాహ్మణీ।
మా గమిష్యసి దుర్బుద్ధే గతిం దుర్గాంతరాంతరమ్॥
ద్రౌపది ఇలా సమాధానం చెపుతోంది. దుర్మతీ! నిషాదుడు బ్రాహ్మణస్త్రీని అంటజాలనట్లుగా నీవు నన్ను తాకలేవు. నీవు నన్ను అవమానించి అత్యంత దుర్గతిని పొందకు.
యత్ర గచ్ఛంతి బహవః పరదారాభిమర్శకాః।
నరాః సంభిన్నమర్యాదాః కీటవచ్చ గుహాశయాః॥)
ధర్మమర్యాదను అతిక్రమించి పరస్త్రీని స్పృశించిన మనుష్యులు చాలామంది గుంటల్లో పొర్లే పురుగులుగా పుడతారు. నీవు అట్టి దుర్దశను పొందకు.
అస్రైషీద్ రాజపుత్రీ మాం సురాహారీం తవాంతికమ్।
పానమాహర మే క్లిప్రం పిపాసా మేఽతి చాబ్రవీత్॥ 4
రాజపుత్రి సుదేష్ణ నన్ను మదిర తెమ్మని నీవద్దకు పంపింది. "నాకు బాగా దాహం వేస్తోంది. వెంటనే నేను త్రాగడానికి తగిన పానీయాన్ని తీసుకురా" అని కూడా చెప్పింది. (4)
కీచక ఉవాచ
అన్యా భద్రే నయిష్యంతి రాజపుత్ర్యాః ప్రతిశ్రుతమ్।
ఇత్యేతాం దక్షిణే పాణౌ సూతపుత్రః పరామృశత్॥ 5
కీచకు డిలా అన్నాడు. 'కళ్యాణీ! రాజపుత్రి సుదేష్ణ అడిగినదాన్ని వేరేదాసీలు తీసుకువెడతారులే' అని చెప్పి సూతపుత్రుడు ద్రౌపది కుడిచేతిని పట్టుకొన్నాడు. (5)
ద్రౌపద్యువాచ
యథైవాహం నాభిచరే కదాచిత్
పతీన్ మదాద్ వై మనసాపి జాతు।
తేనైవ సత్యేన వశీకృతం త్వాం
ద్రష్టాస్మి పాపం పరికృష్యమాణమ్॥ 6
ద్రౌపది ఇలా అన్నది.' ఓరిపాపీ! నేను ఇంతవరకు ఎప్పుడూకూడా మనసులో నైనా కోపంతో నాపతులకు విరుద్ధంగా ప్రవర్తించని దాన నయితే, ఆ సత్యప్రభావానికే నీవు చిక్కి నశించిపోవడం చూస్తాను.' (6)
వైశంపాయన ఉవాచ
స తామభిప్రేక్ష్య విశాలనేత్రాం
జిఘృక్షమాణః పరిభర్త్సయంతీమ్।
జగ్రాహ తాముత్తరవస్త్రదేశే
స కీచకస్తాం సహసాఽక్షిపంతీమ్॥ 7
వైశంపాయనుడు చెపుతున్నాడు. రాజా! విశాలమైన కన్నులు కల ఆ ద్రౌపది ఈ రీతిగా తన్ను నిందించడం చూసి కీచకుడు ఆమెను పట్టుకోబోయాడు. కాని ఆమె వెంటనే అతడిని తోసివేసి వెనక్కి జరిగింది. అంతలోనే కీచకుడు ఆమె పైట కొంగును పట్టుకున్నాడు. (7)
ప్రగృహ్యమాణా తు మహాజవేన
ముహుర్వినిఃశ్వస్య చ రాజపుత్రీ।
తయా సమాక్షిప్తతనుః స పాపః
పపాత శాఖీవ నికృత్తమూలః॥ 8
అప్పుడతడు వేగంగా ఆమెను తనవశం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఇటు రాజకుమారి ద్రౌపది కూడా మాటిమాటికీ నిట్టూరుస్తూ అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది. ఆమె ప్రయత్నపూర్వకంగా తన రెండు చేతులతో కీచకుడిని ఒక్కసారిగా వేగంగా తోసివేసింది. దానితో ఆ పాపాత్ముడు మొదలు నరికిన చెట్టులాగా నేలమీద కూలబడ్డాడు. (8)
సా గృహీతా విధున్వానా భూమావాక్షిప్య కీచకమ్।
సభాం శరణమాగచ్ఛత్ యత్ర రాజా యుధిష్ఠిరః॥ 9
ఇలా కీచకుడు పట్టుకోగా అతడిని భూమిమీద పడద్రోసి భయంతో వణికిపోతీ ద్రౌపది పరుగెత్తుతూ యుధిష్ఠిరుడు ఉన్న రాజసభను శరణుచొచ్చింది. (9)
తాం కీచకః ప్రధావంతీం కేశపాశే పరామృశత్।
అథైనాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదావధీత్॥ 10
కీచకుడు కూడా లేచి; పారిపోతున్న ద్రౌపదిని వెన్నంటి ఆమె జుట్టు పట్టుకొన్నాడు. పైగా అతడు రాజుగారు చూస్తూ ఉండగానే ఆమెను కిందపడేసి తన్నాడు. (10)
తస్య యోఽసౌ తదార్కేణ రాక్షసః సంనియోజితః।
స కీచకమపోవాహ వాతవేగేన భారత॥ 11
భారతా! ఇంతలోనే సూర్యభగవానుడు ద్రౌపది రక్షణకోసం నియమించిన రాక్షసుడు కీచకుని పట్టుకొని తుఫాను వేగంతో దూరంగా విసిరివేశాడు. (11)
స పపాత తదా భూమౌ రక్షోబలసమాహతః।
విఘూర్ణమానో నిశ్చేష్టః ఛిన్నమాల ఇవ ద్రుమః॥ 12
రాఖ్షసుడు బలంగా తోసివేయడంవలన కీచకుని శరీరం అంతా గిర్రున తిరిగిపోయింది. అతడు మొదలు నరికిన చెట్టులా నిశ్చేష్టుడై భూమిమీద పడిపోయాడు. (12)
(సభాయాం పశ్యతో రాజ్ఞః విరాటస్య మహాత్మనః।
బ్రాహ్మణానాం చ వృద్ధానాం క్షత్రియాణాం చ పశ్యతామ్॥
తస్యాః పాదాభితప్తాయాః ముఖాద్ రుధిరమాస్రవత్।
తాం దృష్ట్వా తత్ర తే సభ్యా హాహాభూతా సమంతతః॥
న యుక్తం సూతపుత్రేతి కీచకేతి చ మానవాః।
కిమియం వధ్యతే బాలా కృపణా చాప్యబాంధవా॥)
(సభలో మహాత్ముడైన రాజు, వృద్ధబ్రాహ్మణులు, క్షత్రియులు అందరూ చూస్తూనే ఉన్నారు. కీచకుడు తన్నడం చేత దెబ్బ తగిలిన ద్రౌపది ముఖంనుండి రక్తం స్రవిస్తోంది. ఆమెను అట్టి అవస్థలో చూసిన సభాసదులందరూ అన్నివైపులనుండి హాహాకారాలు చేశారు. వారు "సూతపుత్రా! కీచకా! నీవు చేసిన ఈపని మంచిది కాదు. ఈమె బాంధవులు లేని నిస్సహాయ రాలైన అబల, ఈమె నెందుకు బాధిస్తున్నావు?' అని అడిగారు.)
తాం చాసీనౌ దదృశతుః భీమసేనయుధిష్ఠిరౌ।
అమృష్యమాణౌ కృష్ణాయాః కీచకేన పరాభవమ్॥ 13
ఆ సమయంలో భీమసేనుడు, యుధిష్ఠిరుడు కూడా రాజసభలో కూర్చుని ఉన్నారు. వారు ద్రౌపదికి కీచకుడు చేసిన అవమానాన్ని తమ కళ్లారా చూశారు. దానిని వారు సహించలేకపోయారు. (13)
తస్య భీమౌ వధం ప్రేప్సుః కీచకస్య దురాత్మనః।
దంతైర్దంతాంస్తదా రోషాత్ నిష్పిపేష మహామనాః॥ 14
మహాత్ముడైన భీముడు పాపాత్ముడైన కీచకుని చంపాలనుకొని కోపంతో ఆ సమయంలో పళ్లు పటపట కొరికాడు. (14)
ధూమచ్ఛాయా హ్యభజతాం నేత్రే చోచ్ఛ్రితపక్ష్మణీ।
సస్వేదా భ్రుకుటీ చోగ్రా లలాటే సమవర్తత॥ 15
అతని కంటి రెప్పలు పైకిలేచి తీక్ష్ణమయ్యాయి. కన్నులలో పొగనీడలు వ్యాపించినట్లయింది. నుదుటి మీద చెమట పట్టింది. కనుబొమలు ముడిపడు భయంకరంగా కనిపించసాగాడు. (15)
హస్తేన మమృజే చైవ లలాటం పరవీరహా।
భూయశ్చ త్వరితః క్రుద్ధాః సహసోత్థాతుమైచ్ఛత॥ 16
శత్రువీరులను చంపగల భీముడు చేతితో నుదుటి మీది చెమటను తుడుచుకొన్నాడు. వెంటనే ప్రచండమైన కోపంతో క్రుద్ధుడై ఒక్కసారిగా లేవబోయాడు. (16)
అథావమృద్నాదంగుష్ఠమ్ అంగుష్ఠేన యుధిష్ఠిరః।
ప్రబోధనభయాద్ రాజా భీమం తం ప్రత్యషేధయత్॥ 17
అప్పుడు రహస్యం వెల్లడి అయిపోతుందనే భయంతో ధర్మరాజు తన బొటన వేలితో భీముని బొటనవ్రేలిని నొక్కిపెట్టి భీముని కోపాన్ని అడ్డుకున్నాడు. (17)
తం మత్తమివ మాతంగం వీక్షమాణం వనస్పతిమ్।
స తమావారయామాస భీమసేనం యుధిష్ఠిరః॥ 18
భీమసేనుడు మదించిన ఏనుగులా ఒకచెట్టువైపు చూడడం గమనించి యుధిష్ఠిరుడు అతనిని వారిస్తూ ఇలా అన్నాడు. (18)
ఆలోకయపి కిం వృక్షం సూద దారుకృతేన వై।
యది తే దారుభిః కృత్యం బహిర్వృక్షాన్నిగృహ్యతామ్॥ 19
వల్లవుడా! ఏమి నీవు వంటకట్టెలకోసం చెట్టువైపు చూస్తున్నావా? వంటకోసం ఎండుకట్టెలు కావాలనుకొంటే బయటకు వెళ్లి తెచ్చుకో. (19)
(యస్య చార్ధ్రస్య వృక్షస్య శీతచ్ఛాయాం సమాశ్రయేత్।
న తస్య పర్ణం ద్రుహ్యేత పూర్వవృత్తమనుస్మరన్॥
ఏ పచ్చని చెట్టుయొక్క చల్లని నీడలో ఆశ్రయం పొందుతున్నామో దాని ఒక్క ఆకుకయినా నష్టం కలిగించకూడదు. అది అంతకు ముందు చేసిన ఉపకారాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ దానిని రక్షించాలి.
ఇంగితజ్ఞః స తు భ్రాతుః తూష్ణీమాసీద వృకోదరః।
భీమస్య తు సమారంభం దృష్ట్వా రాజ్ఞశ్చ చేష్టితమ్।
ద్రౌపద్యభ్యధికం క్రుద్ధా ప్రారుదత్ సా పునః పునః।
కీచకేనానుగమనాత్ కృష్ణా తామ్రాయతేక్షణా।)
అన్నగారి సంకేతాన్ని తెలుసుకొన్న భీముడు ఊరకుండిపోయాడు. భీముని కోపాన్నీ, ధర్మరాజు యొక్క శాంతిపూర్వకమైన చేష్టనూ చూసి ద్రౌపదికి అంతులేని కోపం వచ్చింది. కీచకుడు వెన్నంటి తరమడంచేత ఆమె కన్నులు కోపంతో ఎరుపెక్కాయి. ఆమె అవమానంతో మాటిమాటికీ ఏడవసాగింది.
సా సభాద్వారమాసాద్య రుదతీ మత్స్యమబ్రవీత్।
అవేక్షమాణా సుశ్రోణీ పతీంస్తాన్ దీనచేతసః॥ 20
ఆ ద్రౌపది రాజసభాద్వారం దగ్గరకు వచ్చి దీనహృదయులై ఉన్న భర్తలవైపు చూస్తూ మత్స్యరాజుతో ఇలా అంది. (20)
ఆకారమభిరక్షంతీ ప్రతిజ్ఞాధర్మసంహితా।
దహ్యమానేవ రౌద్రేణ చక్షుషా ద్రుపదాత్మజా॥ 21
అప్పుడు ద్రౌపది ప్రతిజ్ఞారూపమైన ధర్మానికి కట్టుబడిన కారణంగా తన ఆకారాన్ని మరుగు పరచుకొంటూ కన్నులతో దహించి వేస్తుందా అన్నట్టుగా భయంకలిగిస్తూ చూసింది. (21)
(ద్రౌపద్యువాచ
ప్రజారక్షణ శీలానాం రాజ్ఞాం హ్యమితతేజసామ్।
కార్యం హి పాలనం నిత్యం ధర్మే సత్యే చ తిష్ఠతామ్॥
స్వప్రజాయాం ప్రజాయాం చ విశేషం నాధిగచ్ఛతామ్।
ద్రౌపది అంటోంది. సహజంగానే రాజ్యంలోని ప్రజలను రక్షించాలనుకొని, ఎల్లప్పుడూ సత్యధర్మ మార్గాలలో నడుచుకునే రాజులకు, ప్రజలయందు, తన కన్న సంతానమునందు ఎలాంటి తేడా లేదనుకునే తేజస్వులయిన రాజులకు ఆశ్రితజనులను రక్షించడం తప్పనిసరిగా చేయవలసిన పని.
ప్రియేష్వపి చ ద్వేష్యేషు సమత్వం యే సమాశ్రితాః।
వివాదేషు ప్రవృత్తేషు సమం కార్యానుదర్శినా।
రాజ్ఞా ధర్మాసనస్థేన జితౌ లోకావుభావపి॥
ప్రియజనులపట్ల, ద్వేషింపదగిన వారిపట్ల సమభావం కలిగిన రాజులు, వివాదాలు చెలరేగినపుడు ధర్మాసనం మీద కూర్చుని సమభావంతో ప్రతివివాదాన్ని విచారించే వారు ఇహపర లోకాలు రెంటిలోను జయం పొందుతారు.
రాజన్! ధర్మాసనస్థోఽపి రక్ష మాం త్వమనాగసీమ్॥
అహం త్వనపరాధ్యంతీ కీచకేన దురాత్మనా।
పశ్యతస్తే మహారాజ హతా పాదేన దాసవత్॥
రాజా! మీరు ధర్మాసనం మీద కూర్చున్నారు. నిరపరాధిని, అబలను అయిన నన్ను రక్షించండి. మహారాజా! నేను ఏ అపరాధమూ చేయనప్పటికీ కీచకుడు మీరు చూస్తూండగానే నన్ను బానిసను తన్నినట్లు తన్నాడు.
మత్స్యాధిప! ప్రజా రక్ష పితా పుత్రానివౌరసాన్।
యస్త్వధర్మేణ కార్యాణి మోహాత్మా కురుతే నృపః।
అచిరాత్ తం దురాత్మానం వశే కుర్వంతి శత్రవః॥
మత్స్యరాజా! తండ్రి తన కన్నపుత్రులను రక్షించునట్లుగా మీరు మీ ప్రజలను సంరక్షించండి. మోహగతుడై అధర్మకార్యం చేసే ఆ దురాత్ముని శత్రువులు శీఘ్రమే తమ వశం చేసుకొంటారు.
మత్స్యానాం కులజస్త్వం హి తేషాం సత్యం పరాయణమ్।
త్వం కిలైవంవిధో జాతః కులే ధర్మపరాయణే॥
మీరు మత్స్యవంశంలో పుట్టారు. మత్స్య రాజులకు సత్యమే గొప్ప ఆశ్రయంగా ఉంది. మీరు కూడా అట్టి ధర్మపరాయణమైన వంశంలో ధర్మాత్ముని గానే పుట్టారు.
అతస్త్వాహమభిక్రందే శరణార్థం నరాధిప।
త్రాహి మామద్య రాజేంద్ర కీచకాత్ పాపపూరుషాత్॥
కాబట్టి రాజా! నిన్ను నేను శరణుకోరి ఆక్రందిస్తున్నాను. రాజేంద్రా! ఈ నాడు పాపాత్ముడైన కీచకుని బారినుండి నన్ను రక్షించు.
అనాథమిహ మాం జ్ఞాత్వా కీచకః పురుషాధమః।
ప్రహరత్యేవ నీచాత్మా న తు ధర్మమవేక్షతే॥
పురుషాధముడైన కీచకుడు ఇక్కడ నేను అసహాయురాలిని అని తెలిసి తన్నాడు. ఆ నీచుడు ధర్మాన్ని చూడటం లేదు.
అకార్యాణామనారంభాత్ కార్యాణామనుపాలనాత్।
ప్రజాసు యే సువృత్తాస్తే స్వర్గమాయాంతి భూమిపాః॥
రాజులు చేయకూడని పనులు చేయకపోవడం వలననూ, చేయవలసిన పనులను నిరంతరం చేస్తూ ఉండడం వలననూ, ప్రజలపట్ల చక్కని నడత కలిగి ఉన్నపుడు వారు స్వర్గాన్ని పొందగలరు.
కార్యాకార్యవిశేషజ్ఞాః కామకారేణ పార్థివ।
ప్రజాసు కిల్బిషం కృత్వా నరకం యాంత్యధోముఖాః॥
రాజా! రాజులు కర్తవ్యం ఏదో అకర్తవ్యం ఏదో తేడాను గుర్తెరిగికూడా స్వేచ్ఛాచారులై ప్రజలపట్ల పాపాచారులై ప్రవర్తిస్తే వారు అధోముఖులై నరకానికే పోతారు.
నైవ యజ్ఞైర్న వా దానైః న గురోరుపసేవయా।
ప్రాప్నువంతి తథా ధర్మం యథా కార్యానుపాలనాత్॥
రాజులు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం వలన పొందే పుణ్యాన్ని యజ్ఞంచేతగాని, దానంచేతగాని, గురుసేవచేతగాని పొందలేరు.
క్రియాయామక్రియాయాం చ ప్రాపణే పుణ్యపాపయోః।
ప్రజాయాం సృజ్యమానాయాం పురా హ్యేతదుదాహృతమ్॥
ఏతద్ వో మానుషాః సమ్యక్ కార్యం ద్వంద్వతయా భువి।
అస్మిన్ సునీతే దుర్నీతే లభతే కర్మజం ఫలమ్॥
పూర్వకాలంలో సృష్టిరచన చేసే సమయంలో బ్రహ్మ కర్మలు చేయడంలోను, చేయకపోవడంలోను కలిగే పుణ్యపాపాలప్రాప్తి గురించి ఇలా చెప్పాడు. మానవులారా! మీరంతా ఈ భూలోకంలో ద్వంద్వ రూపంలో ప్రాప్తించే ధర్మాధర్మాల విషయంలో బాగా ఆలోచించి పనులు చేయాలి. ఎందు కంటే మంచిదైనా చెడ్డదైనా ఏ నీతిని అనుసరించి పని చేస్తారో అటువంటి కర్మ ఫలితమే లభిస్తుంది.
కల్యాణకారీ కల్యాణం పాపకారీ చ పాపకమ్।
తేన గచ్ఛతి సంసర్గం స్వర్గాయ నరకాయ చ॥
మంగళకరమైన పనులు చేసేవాడు శుభాన్ని, పాపపుపనులు చేసేవాడు దుఃఖాన్నీ అనుభవిస్తాడు. వీటి సాంగత్యాన్ని పొందినవారు(కర్మానుసారంగా) స్వర్గ నరకాలు పొందుతారు.
సుకృతం దుష్కృతం వాపి కృత్వా మోహేన మానవః।
పశ్చాత్తాపేన తప్యేత స్వబుద్ధ్యా మరణం గతః।
మనుష్యుడు మోహవశుడై సత్కర్మగాని, దుష్కర్మ గాని చేస్తే మరణం తరువాత కూడా మనసులోనే పశ్చాత్తాపం చెందుతీ ఉంటాడు.
ఏవముక్త్వా పరం వాక్యం విససర్జ శతక్రతుమ్।
శక్రోఽప్యాపృచ్ఛ్వ బ్రహ్మాణం దేవరాజ్యమపాలయత్॥
ఈ విధంగా మంచిమాటలు చెప్పి బ్రహ్మ ఇంద్రుడికి వీడ్కోలు చెప్పాడు. ఇంద్రుడు కూడా బ్రహ్మ అనుమతిని తీసుకొని దేవలోకానికి వచ్చి దేవ సామ్రాజ్యాన్ని పరిపాలించసాగాడు.
యథోక్తం దేవదేవేన బ్రహ్మణా పరమేష్ఠినా।
తథా త్వమపి రాజేంద్ర కార్యాకార్యే స్థిరో భవ॥
రాజేంద్రా! దేవాదిదేవుడు పరమేష్ఠి అయిన బ్రహ్మ ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించి నీవుకూడా కర్తవ్యమేదో, అకర్తవ్యమేదో నిర్ణయించుకోవడంలో దృఢంగా వ్యవహరించు.
వైశంపాయన ఉవాచ
ఏవం విలపమానాయాం పాంచాల్యాం మత్స్యపుంగవః।
అశక్తః కీచకం తత్ర శాసితుం బలదర్పితమ్॥
వైశంపాయనుడన్నాడు - రాజా! పాంచాల రాజకుమారి ద్రౌపది ఈ రీతిగా విలపిస్తున్నప్పటికీ కూడా మత్స్యరాజు విరాటుడు బలగర్వితుడైన కీచకుని శాసించడానికి సమర్థుడు కాలేదు.
విరాటరాజః సూతం తు సంత్వేనైవ న్యవారయత్।
కీచకం మత్స్యరాజేన కృతాగసమనిందితా॥
నాపరాధానురూపేణ దండేన ప్రతిపాదితమ్।
పాంచాలరాజస్య సుతా దృష్ట్వా సురసుతోపమా।
ధర్మజ్ఞా వ్యవహారాణాం కీచకం కృతకిల్బిషమ్॥
సంప్రేక్ష్య చ వరారోహా సర్వాంస్తత్ర సభాసదః।
విరాటం చాహ పాంచాలీ దుఃఖేనావిష్టచేతసా॥)
విరాటరాజు శాంతిపూర్వకంగానే బుజ్జగించి నచ్చచెప్పి సూతుణ్ణి అలా చేయవద్దని వారించాడు. కీచకుడు పెద్ద అపరాధమే చేసినా మత్స్యరాజు ఆ అపరాధానికి తగిన దండన విధించలేదు. ఇది చూసి దేవకన్యను పోలిన సౌందర్యం కలిగి, వ్యవహారధర్మం తెలిసి, పతివ్రత అయిన ద్రౌపది ఉత్తమమైన ధర్మాన్ని స్మరించుకోంటూ రాజైన విరాటునీ, సమతసభాదులను చూస్తూ దుఃఖిత హృదయయై ఇలాఅంది.
యేషాం వైరీ న స్వపితి షష్ఠేఽపి విషయే వసన్।
తేషాం మాం మానినీం భార్యాం సూతపుత్రః పదావధీత్॥ 22
'నా భర్తలతో వైరాన్ని పూనినవాడు ఐదుదేశాలు దాటి ఆరవదేశంలో నివసిస్తూ ఉన్నా భయంతో నిద్రపోలేడు. అటువంటివారికి భార్యనై మానవతినైన నన్ను అసహాయురాలిని అబలను ఈనాడు ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. (22)
యే దద్యుర్న చ యాచేయుః బ్రహ్మణ్యాః సత్యవాదినః।
తేషాం మాం మానినీం భార్యాం సూతపుత్రః పదావధీత్॥ 23
ఎప్పుడూ ఇవ్వడమేగాని పుచ్చుకోవడం ఎరుగని వారై, బ్రాహ్మణులయందు భక్తి కలిగి సత్య వాదులైన వారి భార్యవై మానవతినైన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. (23)
యేషాం దుందుభినిర్ఘోషః జ్యాఘోషః శ్రూయతేఽనిశమ్।
తేషాం మాం మానినీం భార్యాం సూతపుత్రః పదావధీత్॥ 24
ఎవరి ధనుష్టంకారం దేవదుందుభుల ధ్వనివలె నిరంతరం వినపడుతూ ఉంటుందో వారి భార్యను మానవతిని అయిన నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. (24)
యే చ తేజస్వినో దాంతాః బలవంతోఽతిమానినః।
తేషాం మాం మానినీం భార్యాం సూతపుత్రః పదావధీత్॥ 25
తేజస్సంపన్నులు, జితేంద్రియులు, బలవంతులు, అత్యంతమానధనులు అయిన వారి భార్యను, మానవతిని నన్ను ఒక సూతపుత్రుడు కాలితో తన్నాడు. (25)
సర్వలోక మిమం హన్యుః ధర్మపాశసితాస్తు యే।
తేషాం మాం మానినీం భార్యాం సూతపుత్రః పదావధీత్॥ 26
నాభర్తలు ఈ లోకాన్నంతటినీ సంహరించగలరు. కాని వారు ధర్మానికి కట్టుబడినవారు. వారి భార్యను మానవతిని అయిన నన్ను సూతపుత్రుడు కాలితో తన్నాడు. (26)
శరణం యే ప్రపన్నానాం భవంతి శరణార్థినామ్।
చరంతి లోకే ప్రచ్ఛన్నాః క్వ ను తేఽద్య మహారథాః॥ 27
శరణు కోరి వచ్చిన వారికి శరణు ఇచ్చేవారు, మహారథులు, తమరూపాలు మరుగుపరుచుకొని ఇపుడు ఈ లోకంలో ఎక్కడ సంచరిస్తున్నారో? (27)
కథం తే సూతపుత్రేణ వధ్యమానాం ప్రియాం సతీమ్।
మర్షయంతి యథా క్లీబాః బలవంతోఽమితౌజపః॥ 28
మిక్కిలి తేజస్వులు, బలవంతులు అయిన వారు పతివ్రత అయిన తమ ప్రియపత్నిని ఒక సూతపుత్రుడు తన్నుతూ ఉంటే ఆ అవమానాన్ని పిరికివారివలె నపుంసకులవలె ఎలా సహించ గలుగుతున్నారు? (28)
క్వ ను తేషా మమర్షశ్చ వీర్యం తేజశ్చ వర్తతే।
న పరీప్సంతి యే భార్యాం వధ్యమానాం దురాత్మనా॥ 29
ఈనాడు వారి క్రోధం, పరాక్రమం, తేజస్సు ఎక్కడకు పోయాయి? ఒక దురాత్ముడు తన్నుతూండగా తమ భార్యను రక్షించలేకపోతున్నారు. (29)
అధిక్షేపాపమానాదేః ప్రయుక్తస్య పరేణ యత్।
ప్రాణాత్యయేప్యసహనం తత్తేజః సముదాహృతమ్॥ (విష)
మయాత్ర శక్యం కిం కర్తుం విరాటే ధర్మదూషకే।
యః పశ్యన్ మాం మర్షయతి వధ్యమానామనాగసమ్॥ 30
నిరపరాధిని అబలను అయిన నన్ను తన ఎదుటనే తన్నుతూ ఉంటే చూసి సహించి ఊరకున్న ఈ విరాటమహారాజుకూడా ధర్మదూషకుడే. ఇతని వంటి వారు ఉండగా నేను ఈ అవమానానికి బదులు తీర్చుకోవడానికి ఏం చేయగలను? (30)
న రాజా రఆజవత్ కించిత్ సమాచరతి కీచకే।
దస్యూనామివ ధర్మస్తే న హి సంసది శోభతే॥ 31
నాహమేతేన యుక్తం వై హంతుం మత్స్య తవాంతికే।
సభాసదోఽత్ర పశ్యంతు కీచకస్య వ్యతిక్రమమ్॥ 32
ఇతడు రాజు అయి ఉండికూడా కీచకుని పట్ల రాజోచితమైన కొద్దిపాటి న్యాయం కూడా చేయలేక పోయాడు. మత్స్యరాజా! నీ ఈ బందిపోటుధర్మం ఈ రాజసభకు శోభనివ్వదు. నీ సమక్షమందే ఈ కీచకుడు నన్ను హింసించడం తగినదేనా? ఇక్కడ కూర్చున్న సభాసదులు కూడా కీచకుని యొక్క ఈ అత్యాచారాన్ని చూశారుగదా. (31,32)
కీచకో న చ ధర్మజ్ఞః న చ మత్స్యః కథంచన।
సభాసదోఽప్యధర్మజ్ఞాః య ఏవం పర్యుపాసతే॥ 33
కీచకునికి ధర్మజ్ఞానం లేదు. ఈ రాజుకూడా ఏ రకంగానూ ధర్మజ్ఞుడు కాడు. అధర్మపరుడైన ఈ రాజు దగ్గర ఉన్న సభాసదులు కూడా ధర్మాన్ని ఎరుగరు.' (33)
వైశంపాయన ఉవాచ
ఏవంవిధైర్వచోభిః సా తదా కృష్ణాశ్రులోచనా।
ఉపాలభత రాజానం మత్స్యానాం వరవర్ణినీ॥ 34
వైశంపాయను డన్నాడు. రాజా! ఉత్తమమైన వర్ణం కల ద్రౌపది అపుడు నీరునిండిన కళ్లతో ఇటువంటి మాటలతో మత్స్యరాజును తీవ్రంగా నిందించింది. (34)
విరాట ఉవాచ
పరోక్షం నాభిజానామి విగ్రహం యువయోరహమ్।
అర్థతత్త్వమవిజ్ఞాయ కిం ను స్యాత్ కౌశలం మమ॥ 35
అప్పుడు విరాటుడన్నాడు. 'సైరంధ్రీ! మా పరోక్షంలో మీ ఇరువురిమధ్య ఎలాంటి తగవు ఉందో అది నేనెరుగను. వాస్తవవిషయ మేదో తెలియకుండా న్యాయం చేయడంలో నేనేం నేర్పు చూపగలను?' (35)
వైశంపాయన ఉవాచ
తతస్తు సభ్యా విజ్ఞాయ కృష్ణాం భూయోఽభ్యపూజయన్।
సాధు సాధ్వితి చాప్యాహుః కీచకం చ వ్యగర్హయన్॥ 36
వైశంపాయను డన్నాడు. పిమ్మట సభాసదులందరూ విషయం తెలుసుకొని ద్రౌపదిని మిక్కిలి ప్రశంసించారు. కీచకుని నిందిస్తూ ఆమెకు అనేక సాధువాదాలు తెలిపారు. (36)
సభ్యా ఊచుః
యస్యేయం చారుపర్వాంగీ భార్యా స్యాదాయతేక్షణా।
పరో లాభస్తు తస్య స్యాత్ న చ శోచేత్ కథంచన॥ 37
సభాసదులు ఇలా అన్నారు. సర్వాంగసుందరి, విశాల మయిన నేత్రాలుగల యీ సాధ్వి ఎవరి ధర్మపత్నియో వానికి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది. అతనికి ఏప్రకారంగానూ శోకం కలగదు. (37)
(యస్యా గాత్రం శుభం పీనం ముఖం జయతి పంకజమ్।
గతిర్హంసం స్మితం కుందం సైషా నార్హతి పద్వధమ్॥
ఈమె శరీరం శోభాకరంగా పుష్టిగా ఉంది. ముఖం పద్మాన్ని జయిస్తోంది. మందగమనం హంసనడకను జయిస్తోంది. చిరునవ్వు కుందపుష్పాల శోభను తిరస్కరిస్తోంది. ఇటువంటి స్త్రీ పాదప్రహారానికి తగినదికాదు.
ద్వాత్రింశద్ రశనా యస్యాం శ్వేతా మంసనిబంధనాః।
స్నిగ్ధాశ్చ మృదవః కేశాః సైషా నార్హతి పద్వధమ్॥
ఈమె ముప్పదిరెండు పళ్లు చిగుళ్లతో దృఢంగా ఉండి తెల్లగా మెరుస్తున్నాయి. వెంట్రుకలు నిగనిగ లాడుతూ మృదువుగా ఉన్నాయి. ఇట్టి ఈమె తన్నులు తినదగినది కాదు.
పద్మం చక్రం ధ్వజం శంఖం ప్రాసాదో మకరస్తథా।
యస్యాః పాణితలే సంతి సైషా నార్హతి పద్వధమ్॥
ఈమె అరచేతులలో పద్మం, చక్రం, ధ్వజం, శంఖం, మందిరం, మొసలిచిహ్నం ఉన్నాయి. అట్టి శుభచిహ్నాలున్న ఈమె తన్నులు తినడం ఎంతమాత్రం ఉచితం కాదు.
ఆవర్తాః ఖలు చత్వారః సర్వే చైవ ప్రదక్షిణాః।
సమం గాత్రం శుభం స్నిగ్ధం యస్యా నార్హతి పద్వధమ్॥
శరీరంలో నాలుగు సుడులు, అన్నీ కుడికి తిరిగినవే ఉన్నాయి. శరీరమంతా సమానంగా, శుభలక్షణాలతో కూడి నిగనిగలాడుతోంది. ఈమె తన్నులు తినడానికి యోగ్యమైనది కాదు.
అచ్ఛిద్రహస్తపాదా చ అచ్ఛిద్రరశనా చ యా।
కన్యా కమలపత్రాక్షి కథమర్హతి పద్వధమ్॥
ఈమె చేతులలోగాని, కాళ్లతో కాని, దంతాలలో గాని, ఎట్టి దోషాలూ లేవు. తామరరేకుల వంటి కన్నులు గల ఈమె కాలితాపులకు ఎట్లు అర్హురా లవుతుంది?
సేయం లక్షణ సంపన్నా పూర్ణచంద్రనిభాననా।
సురూపిణీ సువదనా నేయం యోగ్యా పదా వధమ్॥
సమస్త శుభలక్షణాలూ కల ఈమె ముఖం నిండుచంద్రునివలె ఉంది. సుందరి, రూపసి, చక్కని మోము కలిగిన ఈమె కాలితో తన్ని తిరస్కరింపదగినది కాదు.
దేవదేవీవ సుభగా శక్రదేవీవ శోభనా।
అప్సరా ఇవ సౌరూప్యా నేయం యోగ్యా పదా వధమ్॥)
ఈమె దేవతావనిత వలె సౌభాగ్యశాలిని. ఇంద్రుని భార్య శచీదేవివలె శోభాసంపన్నురాలు. అప్సరసవలె మిక్కిలి అందగత్తె. ఈమె తన్నులు తినడానికి యోగ్యురాలు కానే కాదు.
న హీదృశే మనుష్యేషు సులభా వరవర్ణినీ।
నారీ సర్వానవద్యాంగీ దేవీం మన్యామహే వయమ్॥ 38
మనుష్యజాతిలో అయితే ఇటువంటి సాధ్వి, సుందరి అయిన స్త్రీ ఉండడం సులభం కాదు. ఈమె శరీరం సమస్తం నిర్దుష్టంగా ఉంది. మేము ఈమెను మానవ కాంతగా కాదు, దేవీరూపంగా భావిస్తున్నాం. (38)
వైశంపాయన ఉవాచ
ఏవం సంపూజయంతస్తే కృష్ణాం ప్రేక్ష్య సభాసదః।
యుధిష్ఠిరస్య కోపాత్ తు లలాటే స్వేద ఆగమత్॥ 39
వైశంపాయనుడు చెప్తున్నాడు. రాజా! ఈ విధంగా ద్రౌపదిని చూసి సభాసదులందరూ ప్రశంసిస్తూంటే కీచకుని పై కలిగిన కోపంతో యుధిష్ఠిరుని నుదుటి మీద చెమటలు పట్టాయి. (39)
(సా వినిఃశ్వస్య సుశ్రోణీ భూమావంతర్ముఖీ స్థితా।
తూష్ణీమాసీత్ తదా దృష్ట్వా వివక్షంతం యుధిష్ఠిరమ్॥)
అనంతరం ద్రౌపది దీర్ఘంగా నిట్టూర్చి తల దించుకుని అక్కడే నిలబడిపోయింది. యుధిష్ఠిరుడు ఏదో చెప్పడానికి సిద్ధపడడం చూసి ఆమె మౌనంగా ఉండిపోయింది.
అథాబ్రవీత్ రాజపుత్రీం కౌరవ్యో మహిషీం ప్రియామ్।
గచ్ఛ సైరంధ్రి మాత్రస్థాః సుదేష్ణాయా నివేశనమ్॥ 40
అప్పుడు కురువంశజుడయిన ధర్మరాజు తమకు ప్రియమైన రాణి ద్రౌపదితో ఇలా అన్నాడు. 'సైరంధ్రీ! ఇప్పుడిక నీవు ఇక్కడ నిలువకు. రాణి సుదేష్ణ భవనానికి వెళ్లిపో. (40)
భర్తార మనురుంధంత్యః క్లిశ్హ్యంతే వీరపత్నయః।
శుశ్రూషయా క్లిశ్యమానాః పతిలోకం జయంత్యుత॥ 41
భర్తలను అనుసరించే వీరపత్నులు అన్ని కష్టాలను మౌనంగా భరిస్తారు. పతిసేవాపూర్వకమైన కష్టాలను భరించే ఆ సాధ్వీమణులు పతులను మించి విజయం సాధించగలుగుతారు. (41)
మన్యే న కాలం క్రోధస్య పశ్యంతి పతయస్తవ।
తేన త్వాం నాభిధావంతి గంధర్వాః సూర్యవర్చసః॥ 42
సూర్యవర్చస్వులైన నీ పతులు గంధర్వులు కోపం చూపడానికి తగిన సమయం కాదనుకొంటున్నారని నేను అనుకొంటున్నాను. కాబట్టే నీదగ్గరకు వారు పరుగెత్తుకొని రావడంలేదు. (42)
(శ్రూయంతాం తే సుకేశాంతే మోక్షధర్మాశ్రయాః కథాః।
యథా ధర్మః కులస్త్రీణాం దృష్టో ధర్మానురోధనాత్॥
చక్కని ముంగురులు కల సైరంధ్రీ! మోక్ష ధర్మానికి సంబంధించిన మాటలు విను. ధర్మ శాస్త్రాన్ని అనుసరించి కులస్త్రీల ధర్మం ఇలా ఉంటుంది.
నాస్తి కశ్చిత్ స్త్రియా యజ్ఞః న శ్రాద్ధం నాప్యుపోషణమ్।
యా చ భర్తరి శుశ్రూషా సా స్వర్గాయాభిజాయతే॥
స్త్రీలకు ఏ యజ్ఞమూ లేదు. శ్రాద్ధమూ లేదు. ఉపవాసవిధానమూ లేదు. తమ భర్తలకు సేవ చేయడం వలననే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది.
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే।
పుత్రస్తు స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి॥
కుమారిగా ఉన్నపుడు తండ్రి, యౌవనంలో భర్త, వార్ధక్యంలో పుత్రుడు స్త్రీలను రక్షిస్తూ ఉంటారు. స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండతగదు.
భర్తౄన్ ప్రతి తథా పత్న్యః న క్రుధ్యంతి కదాచన।
బహుభిశ్చ పరిక్లేశైః అవజ్ఞాతాశ్చ శత్రుభిః॥
పతివ్రతలయిన స్త్రీలు అనేకరకాలయిన కష్టాలు సహిస్తూ శత్రువులచేత అవమానింపబడినా కూడా పతులపై ఎప్పుడూ క్రోధం చూపకూడదు.
అనన్యభావశుశ్రూషాః పుణ్యలోకం వ్రజంత్యుత।
మ క్రుద్ధాన్ ప్రతి యాయాద్ వై పతీంస్తే వృత్రహా అపి॥
ఈరీతిగా అనన్యభావంతో పతిశుశ్రూష చేసిన స్త్రీలు పుణ్యలోకాలు పొందుతారు. సైరంధ్రీ! నీ పతులు కనుక కోపిస్తే వృత్రాసురుని చంపిన ఆ ఇంద్రుడుకూడా యుద్ధంలో వారిని ఎదుర్కోలేడు.
యది తే సమయః కశ్చిత్ కృతో హ్యాయతలోచనే।
తం స్మరస్య క్షమాశీలే క్షమా ధర్మో హ్యనుత్తమః॥
విశాలలోచనా! ఒకవేళ నీకు వారితో ఏమయినా ఒప్పందం ఉందేమో అది గుర్తుకు తెచ్చుకో. క్షమాశీలీ! క్షమ అన్నిటికంటె ఉత్తమమయిన ధర్మం.
క్షమా సత్యం క్షమా దానం క్షమా ధర్మః క్షమా తపః।
క్షమావతామయం లోకః పరలోకః క్షమావతామ్॥
ద్వ్యంశినో ద్వాదశాంగస్య చతుర్వింశతిపర్వణః।
కః షష్టిత్రిశతారస్య మాసోనస్యాక్షమీ భవేత్॥
క్షమయే సత్యం, క్షమయే దానం, క్షమయే ధర్మం, క్షమయే తపస్సుకూడా. క్షమావంతులకు ఈలోకం పరలోకం కూడా ఉంటాయి. రెండు అంశాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం), పన్నెండు అంగాలు(మాసాలు), ఇరవై నాలుగు పర్వాలు, (పక్షాలు), మూడువందల అరవై ఆకులు(దినాలు) కల కాలచక్రం పూర్తికావడానికి ఒక్కమాసమే తక్కువైతే దానికోసం ప్రతీక్షించకుండా క్షమను ఎవరు విడిచిపెట్టగలరు?'
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్తే తిష్ఠంతీం పునరేవాహ ధర్మరాట్।)
వైశంపాయను డన్నాడు. రాజా! ఇంత చెప్పినా కూడా ద్రౌపది అక్కడే నిలబడిఉంది. అప్పుడు ధర్మరాజు మరలా ఇలా అన్నాడు.
కాలజ్ఞాసి న సైరంధ్రి శైలూషీవ విరోదిషి।
విఘ్నం కరోషి మత్స్యానాం దీవ్యతాం రాజసంసది॥ 43
సైరంధ్రీ! సమయాన్ని నీవు గుర్తించడంలేదు. కనుకనే నటి లాగా రాజసభలో ఏడుస్తూ ఉన్నావు. పైగా ద్యూతక్రీడలో నిమగ్నమై ఉన్న మత్స్యమహారాజులకు, సభలో జూదానికి విఘ్నం కలిగిస్తున్నావు. (43)
గచ్ఛ సైరంధ్రి గంధర్వాః కరిష్యంతి తవ ప్రియమ్।
వ్యపనేష్యంతి తే దుఃఖం యేన తే విప్రియం కృతమ్॥ 44
సైరంధ్ర్యువాచ
అతీవ తేషాం ఘృణినామ్ అర్థేఽహం ధర్మచారిణీ।
తస్య తస్యైవ తే వధ్యాః యేషాం జ్యేష్ఠోఽక్షదేవితా॥ 45
సైరంధ్రి అన్నది. 'ఆ గంధర్వులలో పెద్దన్నగారు జూదం ఆడుతూ ఉంటాడు. ఆ దయాత్ములపట్ల నేను ఎప్పుడూ అత్యంత ధర్మపరాయణురాలిగానే ఉంటున్నాను. నాకు అవమానం కలిగించిన దురాత్ములను వారిలో ఎవ్వరైనా చంపవచ్చు.' (45)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా ప్రాద్రవత్ కృష్ణా సుదేష్ణాయా నివేశనమ్।
కేశాన్ ముక్త్వా చ సుశ్రోణీ సంరంభాల్లోహితేక్షణా॥ 46
వైశంపాయను డన్నాడు. ఇలా అని.. (సుందరమైన కటిప్రదేశంగల) ద్రౌపది విసురుగా నడుస్తూ రాణి సుదేష్ణ భవనానికి వెళ్లిపోయింది. ఆమె జుట్టు విడిపోయింది. కళ్లు కోపంతో ఎరుపెక్కి పోయాయి. (46)
శుశుభే వదనం తస్యాః రుదత్యాః సుచిరం తదా।
మేఘమేఖావినిర్ముక్తం దివీన శశిమండలమ్॥ 47
ఆ సమయంలో ఏడుస్తున్న ద్రౌపదియొక్క అందమైన ముఖం ఆకాశంలో మేఘమాలికనుండి విముక్తమైన చంద్రబింబంవలె శోభించింది. (47)
(పాంసుకుంఠితసర్వాంగీ గజరాజవధూరివ।
ప్రతస్థే నాగనాసోరూః భర్తురాజ్ఞాయ శాసనమ్॥
ద్రౌపది శరీరమంతా ధూళితో నిండిన ఆడఏనుగు వలె భర్త ఆజ్ఞను శిరసావహించి రాజసభనుండి అంతఃపురానికి వెళ్లింది.
విముక్తా మృగశాబాక్షీ నిరంతరపయోధరా।
ప్రభా నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతా॥
లేడిపిల్ల కన్నులవలె చంచలమైన కనులు, క్రిక్కిరిసిన చనులు కల ద్రౌపది కీచకుని చేతినుండి తప్పించుకొని శోకదుఃఖాలతో వర్షాకాలపు మేఘాల చేత కప్పబడిన చంద్రకాంతివలె మలినమై ఉంది.
యస్యా హ్యర్థే పాండవేయాః త్యజేయురపి జీవితమ్।
తాం తే దృష్ట్వా తథా కృష్ణాం క్షమిణో ధర్మచారిణః॥
సమయం నాతివర్తంతే వేలామివ మహోదధిః॥)
ఏ ద్రౌపదికోసం పాండవులందరూ తమ ప్రాణాలు కూడా అర్పిస్తారో ఆ ద్రౌపదియొక్క అవస్థను చూసికూడా ధర్మాత్ములైన పాండవులు తమ క్షమను విడువలేదు. సముద్రం చెలియలికట్టను దాటనట్లుగా వారు అజ్ఞాతవాస సమయాన్ని అతిక్రమించలేదు.
సుదేష్ణోవాచ
కస్త్వావధీద్ వరారోహే కస్మాద్ రోదిషి శోభనే।
కస్యాద్య న సుఖం భద్రే కేన తే విప్రియం కృతమ్॥ 48
'సుందరాంగీ! నిన్నెవరు కొట్టారు? చక్కనిదానా! నీవు ఎందుకు ఏడుస్తున్నావు? శోభనాంగీ! ఈ రోజు ఎవరిసుఖం ముగిసిపోయింది? ఎవరు నీకు అపరాధం చేశారు? (48)
(కిమిదం పద్మసంకాశం సుదంతోష్ఠాక్షినాసికమ్।
రుదంత్యా అవమృష్టాస్రం పూర్ణేందుసమవర్చసమ్॥
కమలం వలె కమనీయమై, అందమైన పలువరుస, పెదవులు, కన్నులు, ముక్కు కలిగి, పూర్ణచంద్రునితో సమానమైన కాంతి కలిగిన నీ ఈ అందమైన ముఖం ఇలా ఉందేమిటి? ఏడుపుతో ముఖం మీద కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకో.
బింబీష్ఠం కృష్ణతారాభ్యామ్ అత్యంతరుచిరప్రభమ్।
నయనాభ్యామజిహ్మాభ్యాం ముఖం తే ముంచతే జలమ్॥
నల్లని కంటిపాపలు కల సరళమైన నేత్రాలతో, దొండపండు వంటి పెదవితో, అత్యంతమనోహరమైన కాంతితో వెలిగే నీ ముఖం ఇప్పుడు ఎందుకు కన్నీటిని వర్షిస్తోంది?'
వైశంపాయన ఉవాచ
తాం నిఃశ్వస్యాబ్రవీత్ కృష్ణా జానంతీ నామ పృచ్ఛసి।
భ్రాత్రే త్వం మామనుప్రేష్య కిమేవం త్వం వికత్థసే॥)
వైశంపాయను డంటున్నాడు - అప్పుడు ద్రౌపది దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అంది - నీకు అంతా తెలిసికూడా నన్నెందుకు అడుగుతావు? స్వయంగా నీవే నీ తమ్ముడి దగ్గరకు పంపి, ఇప్పు డిలాంటి మాటలు ఎందుకు అంటున్నావు?
ద్రౌపద్యువాచ
కీచకో మావధీత్ తత్ర సురాహారీం గతాం తవ।
సభాయాం పశ్యతో రాజ్ఞః యథైవ విజనే వనే॥ 49
ద్రౌపది ఇలా అంది.' నేను నీకోసం మదిర తేవడానికి వెళ్లాను. అక్కడ కీచకుడు సభలో రాజు చూస్తుండగానే నిర్జనవనంలో అబలను హించించి నట్లుగా నన్ను తన్నాడు.' (49)
సుదేష్ణోవాచ
ఘాతయామి సుకేశాంతే కీచకం యది మన్యసే।
యోఽసౌ త్వాం కామసమ్మత్తః దుర్లభామవమన్యతే॥ 50
సుదేష్ణ అన్నది. 'చక్కని ముంగురులు కల సుందరీ! కామోన్మత్తుడై నీవంటి దుర్లభమైన దేవిని అవమానించిన ఆ కీచకుని నీవు అంగీకరిస్తే చంపిస్తాను, శిక్షిస్తాను.' (50)
సైరంధ్ర్యువాచ
అన్యే చైనం వధిష్యంతి యేషామాగః కరోతి సః।
మన్యే చైవాద్య సువ్యక్తం యమలోకం గమిష్యతి॥ 51
సైరంధ్రి అన్నది.' అతడు ఎవరిపట్ల అపరాధం చేశాడో వారే అతనిని చంపుతారు. నాకు తెలుసు... వాడు ఇప్పుడు నిశ్చయంగా యమలోకానికి పోతాడని.' (51)
(భ్రాతుః ప్రయచ్ఛ త్వరితా జీవశ్రాద్ధం త్వమద్య వై।
సుదృష్టం కురు వై చైనం నాసూన్ మన్యే ధరిష్యతి॥
రాణీ! ఈ రోజే నీవు నీ తమ్ముడికి వెంటనే జీవశ్రాద్ధం పెట్టించు. దానాలన్నీ ఇప్పించు. అంతేకాదు. కన్నులనిండుగా బాగా అతడిని చూసుకో. ఇక అతడి ప్రాణాలు నిలువవు అని నా నమ్మకం.
తేషాం హి మమ భర్తౄణాం పంచానాం ధర్మచారిణామ్।
ఏకో దుర్ధర్షణోఽత్యర్థం బలే చాప్రతిమో భువి॥
నిర్మనుష్యమిమం లోకం కుర్యాత్ క్రుద్ధో నిశామిమామ్।
న చ సంక్రుధ్యతే తావద్ గంధర్వః కామరూపధృక్॥
ధర్మాత్ములయిన నా భర్తలు ఐదుగురిలో ఒకడు అత్యంత దుస్సహమైన క్రోధంగల వీరుడు. ఈ భూమిమీద అతనితో సమానమైన బలం గలవాడు వేరొకడు లేడు. అతడు కోపిస్తే ఈరాత్రిలోనే ఈప్రపంచాన్ని నిర్మానుష్యం చేయగలడు. కాని కామరూపధారి అయిన ఆ గంధర్వుడు ఇంతవరకు ఎందుకు కోపించలేదో తెలియదు.'
వైశంపాయన ఉవాచ
సుదేష్ణా మేవముక్త్వా తు సైరంధ్రీ దుఃఖమోహితా।
కీచకస్య వధార్థాయ వ్రతదీక్షాముపాగమత్॥
వైశంపాయనుడు చెపుతున్నాడు - రాణి సుదేష్ణతో ఇలా చెప్పి దుఃఖవివశ అయిన సైరంధ్రి కీచకవధకు వ్రతదీక్ష పూనింది.
అభ్యర్థితా చ నారీభిః మానితా చ సుదేష్ణయా।
న చ స్నాతి న చాశ్నాతి న పాంసూన్ పరిమార్జతి॥
ఇతరస్త్రీలు ఎంత ప్రార్థించినా, రాణి సుదేష్ణ ఎంత బ్రతిమాలినా ఆమె స్నానం చేయలేదు. భోజనం చేయ లేదు. కనీసం ఒంటిమీద ధూళికూడా తుడుచుకోలేదు.
రుధిరక్లిన్నవదనా బభూవ రుదితేక్షణా।
తాం తథా శోకసంతప్తాం దృష్ట్వా ప్రరుదితాం స్త్రియః।
కీచకస్య వధం సర్వాః మనోభిశ్చ శశంసిరే॥
ఆమె ముఖం రక్తంతో తడిసింది. (ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది) కన్నులు కన్నీటితో నిండి పోయాయి. ఈరకంగా శోక సంతప్తురాలై ఏడుస్తున్న ఆమెను చూసి అచ్చటి స్త్రీలంతా మనుసులోనే కీచకుని చావును ఊహించుకొన్నారు.
జనమేజయ ఉవాచ
అహో దుఃఖతరం ప్రాప్తా కీచకేన పదాహతా।
పతివ్రతా మహాభాగా ద్రౌపదీ యోషితాం వరా॥
జనమేజయుడు అన్నాడు. ప్రపంచంలోని స్త్రీలందరికంటె శ్రేష్ఠురాలు, పతివ్రత, మహానుభావురాలు అయిన ద్రౌపది కీచకుని చేత తన్నబడింది. గొప్ప దుఃఖాన్ని పొందింది. అయ్యో! ఆమెకు ఎంతటి క్లేశం కలిగింది!
దుఃశలాం మానయంతీ యా భర్తౄణాం భగినీం శుభమ్।
నాశపత్ సింధురాజం తం బలాత్కారేణ వాహితా॥
సింధురాజు జయద్రథుడు బలవంతంగా ఆమెను అపహరించిన సమయంలోకూడా ఆమె తన భర్తలకు సోదరి అయిన దుశ్శల గౌరవాన్ని నిలబెడుతూ ఆ కష్టాన్ని సహించిందే కాని అతనిని శపించలేదు.
తేజోరాశిరియం దేవీ ధర్మజ్ఞా సత్యవాదినీ।
కేశపక్షే పరామృష్టా మర్షయిష్యత్యశక్తవత్॥
నైతత్ కారణమల్పం హి శ్రోతుకామోఽస్మి సత్తమ।
కృష్ణాయాస్తు పరిక్లేశాత్ మనో మే దూయతే భృశమ్॥
దేవి ద్రౌపది తేజోరాశి, ధర్మజ్ఞ, సత్యవాదిని. ఆమె వంటి తేజస్విని జుట్టు పట్టుకొని ఈడ్వబడినపుడు అసమర్థురాలివలె నిశ్శబ్దంగా ఎందుకు సహించింది? ఆమె అలా సహించిందంటే దానికి కారణం చిన్నదై ఉండదు. సాధుసత్తమా! నాకు ఆ కారణం వినాలని ఉంది. ద్రౌపదికి కలిగిన కష్టం విన్న నా మనసు మిక్కిలి వ్యాకులంగా ఉంది.
కస్య వంశే సముద్భూతః స చ దుర్లలితో మునే।
బలోన్మత్తః కథం చాసీత్ శ్యాలో మాత్స్యస్య కీచకః॥
మునీశ్వరా! మత్స్యరాజు బావమరిది అయిన దుష్టకీచకుడు ఏ వంశంలో జన్మించాడు? అతడు బలంచేత ఉన్మత్తుడు ఎలా అయ్యాడు?
వైశంపాయన ఉవాచ
త్వదుక్తోఽయమనుప్రశ్నః కురూణాం కీర్తివర్ధనీ।
ఏతత్ సర్వం తథా వక్ష్యే విస్తరేణైవ పార్థివ॥
వైశంపాయనుడు చెప్పాడు - కురువంశకీర్తిని వృద్ధిపొందించేవాడా! నీవు అడిగిన ఈ ప్రశ్న సరియైనదే. నేను ఇదంతా సవిస్తారంగా చెపుతాను.
బ్రాహ్మణ్యాం క్షత్రియాజ్జాతః సూతో భవతి పార్థివ।
ప్రాతిలోమ్యేన జాతానాం స హ్యేకో ద్విజ ఏవ తు॥
రాజా! క్షత్రియుడైన తండ్రికి, బ్రాహ్మణి అయిన తల్లికి పుట్టినవాడు 'సూతుడు' అనబడతాడు. ప్రతిలోమసంకరమైన జాతులలో కేవలం ఈ సూతజాతి మాత్రమే ద్విజజాతిగా చెప్పబడుతోంది.
రథకారమితీమం హి క్రియాయుక్తం ద్విజన్మనామ్।
క్షత్రియాదవరం వైశ్యాద్ విశిష్టమితి చక్షతే॥
ద్విజులకు ఉచితమైన పనులు చేసే ఆ సూతుడినే రథకారుడు అని కూడా అంటారు. ఇతడిని క్షత్రియుని కంటె తక్కువగానూ, వైశ్యునికంటె ఎక్కువగాను చెప్తారు.
సహ సూతేన సంబంధః కృతపూర్వో నరేశ్వరైః।
తథాపి తైర్మహీపాల రాజశబ్దో న లభ్యతే॥
రాజా! పూర్వపురాజులు సూతజాతితో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకొన్నారు. అయినా వారికి రాజ శబ్దం లభించలేదు.
తేషాం తు సూతవిషయః సూతానాం నామతః కృతః।
ఉపజీవ్య చ యత్ క్షత్రం లబ్ధం సూతేన తత్ పురా॥
వారికి సూతుల పేరుమీదుగా సూతరాజ్యమే ఏర్పాటు చేయబడింది. సూతజాతికి చెందిన ఒక పురుషుడు ఎవరో ఒక క్షత్రియుడికి సేవ చేయడం ద్వారా ఆ రాజ్యం ప్రాప్తించింది.
సూతానామధిపో రాజా కేకయా నామ విశ్రుతః।
రాజకన్యాసముద్భూతః సారథ్యేఽనుపమోఽభవత్॥
సుప్రసిద్ధుడయిన కేకయుడు అనే రాజు సూతులకు అధిపతి. అతడు ఎవరీ ఒక క్షత్రియకన్య గర్భం నుండి పుట్టాడు. అతడు సారథికృత్యంలో ఆరితేరినవాడు.
పుత్రాస్తస్య కురుశ్రేష్ఠ మాలవ్యాం జజ్ఞిరే తదా।
తేషామతిబలో జ్యేష్ఠః కీచకః సర్వజిత్ ప్రభో॥
కురుశ్రేష్ఠా! అతనికి మాళవియందు అనేకపుత్రులు కలిగారు. రాజా! ఆ పుత్రులలో కీచకుడే అందరికంటె పెద్దవాడు. అతడు మిక్కిలి బలవంతుడు. అందరినీ జయించగల యోధుడు.
ద్వితీయాయాం తు మాలవ్యాం చిత్రా హ్యవరజాభవత్।
తాం సుదేష్ణేతి వై ప్రాహుః విరాటమహిషీం ప్రియామ్॥
రాజు అయిన కేకయునికి రెండవ భార్య కూడా మాళవ కన్యయే. ఆమె యందు కీచకబంధువు లందరికీ చిన్నచెల్లెలుగా 'చిత్ర' అనే పేరుగల కన్య పుట్టింది. ఆమెనే సుదేష్ణ అని కూడా అంటారు. ఆమెయే తరువాత కాలంలో మహారాజు విరాటుడికి పట్టపురాణి అయింది.
తాం విరాటస్య మాత్స్యస్య కేకయః ప్రదదౌ ముదా।
సురథాయాం మృతాయాం తు కౌసల్యాం శ్వేతమాతరి॥
విరాటరాజు యొక్క పెద్దరాణి కోసలదేశపు రాజకుమారి సురథ. ఆమె శ్వేతుడనే వానికి కన్నతల్లి. ఆమె చనిపోయిన తరువాత కేకయరాజు తన కూతురు సుదేష్ణను మత్స్యరాజు విరాటునకు ఇచ్చి ఆనందంగా వివాహం చేశాడు.
సుదేష్ణాం మహిషీం లబ్ధ్వా రాజా దుఃఖమపానుదత్।
ఉత్తరం చోత్తరాం చైవ విరాటాత్ పృథివీపతే।
సుదేష్ణా సుషువే దేవీ కైకేయీ కులవృద్ధయే॥
సుదేష్ణను మహారాణిగా పొంది రాజు విరాటుడు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. రాజా! కేకయకుమారి రాణి సుదేష్ణ విరాటుని వలన అతని వంశాన్ని వృద్ధి పొందిస్తూ ఉత్తరుడు, ఉత్తర అనే ఇద్దరు బిడ్డలను కన్నది.
మాతృష్వసృసుతాం రాజన్ కీచకస్తామనిందితామ్।
సదా పరిచరన్ ప్రీత్యా విరాటే న్యవసత్ సుఖీ॥
రాజా! కీచకుడు తన పినతల్లి కూతురయిన సాధ్వి సుదేష్ణను ప్రీతిపూర్వకంగా సేవిస్తూ విరాటుని దగ్గర సుఖంగా నివసిస్తున్నాడు.
భ్రాతరస్తస్య విక్రాంతాః సర్వే చ తమనువ్రతాః।
విరాటస్యైవ సంహృష్టా బలం కోశం చ వర్ధయన్॥
అతని తమ్ముళ్లు అందరూ పరాక్రమవంతులు. కీచకుని పట్ల అనురాగం భక్తి కలవారు. కాబట్టి వారు కూడ విరాటుని బలాన్ని, కోశాన్ని వృద్ధి చేస్తూ అక్కడే సంతోషంగా ఉండసాగారు.
కాలేయా నామ దైతేయాః ప్రాయశో భువి విశ్రుతాః।
జజ్ఞిరే కీచకా రాజన్ బాణో జ్యేష్ఠస్తతోఽభవత్॥
స హి సర్వాస్త్రసంపన్నః బలవాన్ భీమవిక్రమః।
కీచకో నష్టమర్యాదః బభూవ భయదో నృణామ్॥
రాజా! ఈ భూమండలంలో కాలేయులనే పేరుతో తరచుగా వినుతి కెక్కిన దైత్యులే ఈ కీచకుల రూపంలో పుట్టారు. కాలేయులలో బాణుడు అందరికంటె పెద్దవాడు. అతడే సంపూర్ణ శస్త్రాస్త్రసంపన్నుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, మహాబలుడు అయిన కీచకుడు అయ్యాడు. అతడు ధర్మమర్యాదను అతిక్రమించేవాడు, మనుష్యులను భయపెట్టేవాడు.
తం ప్రాప్య బలసమ్మత్తం విరాటః పృథివీపతిః।
జిగాయ సర్వాంశ్చ రిపూన్ యథేంద్రో దానవానివ॥
ఆ బలోన్మత్తుడయిన కీచకుని సహాయం పొంది ఇంద్రుడు దానవులను జయించినట్లు విరాటుడు కూడా సమస్తశత్రువులను జయించాడు.
మేఖలాంశ్చ త్రిగర్తాంశ్చ దశార్ణాంశ్చ కశేరుకాన్।
మాలవాన్ యవనాంశ్చైవ పులిందాన్ కాశికోసలాన్॥
అంగాన్ వంగాన్ కలింగాంశ్చ తంగణాన్ పరతంగణాన్।
మలదాన్ నిషధాంశ్చైవ తుండికేరాంశ్చ కోంకణాన్॥
కరదాంశ్చ నిషిద్ధాంశ్చ శివాన్ దుశ్ఛిల్లికాంస్తథా।
అన్యే చ బహవః శూరాః నానాజనపదేశ్వరాః॥
కీచకేన రణే భగ్నాః వ్యద్రవంత దిశో దశ॥
మేఖల, త్రిగర్త, దశార్ణ, కశేరుక, మాలవ, యవన, పులింద, కాశీ, కోసల, అంగ, వంగ, కలింగ, తంగణ, పరతంగణ, మలద, నిషధ, తుండికేర, కోంకణ, కరద, నిషిద్ధ, శివ, దుశ్ఛిల్లిక - మొదలగు అనేక జనపదాల నాయకులు, అనేక శూరవీరరాజులు యుద్ధభూమిలో కీచకునిచేత పరాజితులై దశదిశలకు పారిపోయారు.
తమేవం వీర్యసంపన్నం నాగాయుతబలం రణే।
విరాటస్తత్ర సేనాయాః చకార పతిమాత్మనః॥
ఇటువంటి పరాక్రమసంపన్నుడై, యుద్ధంలో పదివేల ఏనుగుల బలం కలిగి ఉండే కీచకుడిని రాజు విరాటుడు తనకు సేనాపతిగా చేసుకొన్నాడు.
విరాటభ్రాతరశ్చైవ దశ దాశరథోపమాః।
తేచైనానన్వవర్తంత కీచకాన్ బలవత్తరాన్॥
దశరథనందనుడైన శ్రీరామునితో సమానమైన శక్తి కలిగిన విరాటుని పదిమంది తమ్ముళ్లూ కూడా మిక్కిలి బలవంతులైన కీచకబంధువులనే అనుసరించేవారు.
ఏవంవిధబలోపేతాః కీచకాస్తే న తద్విధాః।
రాజ్ఞః శ్యాలా మహాత్మానః విరాటస్య హితైషిణః॥
అట్టి బలసంపన్నులైన కీచకులు విరాటరాజుకు బావమరదులై శౌర్యంలో తమకు సాటివచ్చేవారే లేరు అనిపించుకొన్నారు. వారు విరాటరాజుకు ఎప్పుడూ హితైషులుగా ఉన్నారు.
ఏతత్ తే కథితం సర్వం కీచకస్య పరాక్రమమ్।
ద్రౌపదీ న శశాపైనం యస్మాత్ తద్ గదతః శృణు॥
ఈ రీతిగా నేను నీకు కీచకుని పరాక్రమానికి సంబంధించిన సంగతి అంతా చెప్పాను. ఇక ద్రౌపది అతనిని ఎందుకు శపించలేదో ఆ సంగతి కూడా విను.
క్షరతీతి తపః క్రోధాత్ ఋషయో న శపంతి హి।
జానంతీ తద్ యథా తత్త్వం పాంచాలీ న శశాప తమ్॥
క్రోధం వలన తపస్సు నష్టమవుతుంది. అందుకనే ఋషులుకూడా వెంటనే ఎవరికీ శాపం ఇవ్వరు. ద్రౌపదికి ఈ విషయం బాగా తెలుసు. కనుకనే అతనిని శపించలేదు.
క్షమా ధర్మః క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా యశః।
క్షమా సత్యం క్షమా శీలం క్షమా కీర్తిః క్షమా పరమ్॥
క్షమా పుణ్యం క్షమా తీర్థం క్షమా సర్వమితి శ్రుతిః।
క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతామ్।
ఏతత్ సర్వం విజానంతీ సా క్షమా మన్వపద్యత॥
సహనమే ధర్మం, దానం, యజ్ఞం, క్షమయే యశస్సు, సత్యం, శీలం, కీర్తి, క్షమయే అన్నింటికంటె ఉత్కృష్టతత్త్వం. క్షమయే పుణ్యం, క్షమయే తీర్థం. క్షమయే సమస్తం - అని శ్రుతి చెప్తోంది. ఈ లోకం క్షమావంతులది. పరలోకంకూడా వారిదే. ద్రౌపదికి ఇదంతా తెలుసు కనుకనే క్షమను ఆశ్రయించింది.
భర్తౄణాం మతమాజ్ఞాయ క్షమిణాం ధర్మచారిణామ్।
నాశపత్ తం విశాలాక్షీ సతీ శక్తాపి భారత॥
భరతనందనా! క్షమాశీలులు ధర్మాత్ములు అయిన పతుల భావం తెలిసినది కనుక విశాలనేత్రాలు గల ఆ ద్రౌపదీసాధ్వి సమర్థురాలైనా కీచకుని శపించలేదు.
పాండవాశ్చాపి తే సర్వే ద్రౌపదీం ప్రేక్ష్య దుఃఖితాః।
క్రోధాగ్నినా వ్యదహ్యంత తదా కాలవ్యపేక్షయా॥
పాండవులందరూ కూడా ద్రౌపది దురవస్థను చూసి దుఃఖితులు ఐనా అజ్ఞాతవాస సమయపూర్తి కోసం ఎదురుచూస్తూ క్రోధాగ్నితో మండిపోతున్నారు.
అధ భీమో మహాబాహుః సూదయిష్యంస్తు కీచకమ్।
వారితో ధర్మపుత్రేణ వేలయేవ మహోదధిః।
మహాబలుడైన భీముడు మాత్రం కీచకుని అప్పుడే చంపడానికి సిద్ధపడ్డాడు కాని మహాసాగరాన్ని చెలియలి కట్టవలె ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు అతనిని అడ్డుకున్నాడు.
సంధార్య మనసా రోషం దివారాత్రం వినిఃశ్వసన్।
మహానసే తదా కృచ్ఛ్రాత్ సుష్వాస రజనీం చ తామ్॥)
అతడు మనసులోనే కోపాన్ని అణచుకొని రాత్రిఅంతా దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ కాలం గడుపుతున్నాడు. ఆరోజు పాకశాలకు పోయి రాత్రి చాలా కష్టంమీద పడుకొన్నాడు.
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి ద్రౌపదీపరిభవే షోడశోఽధ్యాయః॥ 16 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున కీచకవధపర్వము అను ఉపపర్వమున
ద్రౌపదీపరాభవము అను పదునారవ అధ్యాయము. (16)
(దాక్షిణాత్య అధికపాఠము 92 శ్లోకములతో కలిపి మొత్తం 143 శ్లోకాలు)