31. ముప్పదియొకటవ అధ్యాయము

పాండవులు నలుగురు విరాటుని సైన్యముతో యుద్ధమునకు వెళ్లుట.

వైశంపాయన ఉవాచ
తతస్తేషాం మహారాజ తత్త్రైవామితతేజసామ్।
ఛద్మలింగప్రవిష్టానాం పాండవానాం మహాత్మనామ్॥ 1
వ్యతీతః సమయః సమ్యగ్ వసతాం వై పురోత్తమే।
కుర్వతాం తస్య కర్మాణి విరాటస్య మహీపతేః॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! ఆ దినాల్లో మారువేషాల్లో దాగి, ఆ మహానగరంలో విరాట రాజు పనులు చేస్తూ నివసించే తేజస్వులు, మహాత్ములు అయిన పాండవులకు పదమూడవ సంవత్సరం చక్కగా పూర్తి అయింది. (1,2)
కీచకే తు హతే రాజా విరాటః పరవీరహా।
పరాం సంభావనాం చక్రే కుంతీపుత్రే యుధిష్ఠిరే॥ 3
కీచకుడు చంపబడిన తరువాత శత్రునాశకుడయిన విరాటుడు కుంతీకుమారుడయిన యుధిష్ఠిరునిపై బాగా ఆదరంతో ఉండి గొప్ప ఆశలు పెట్టుకున్నాడు. (3)
వి॥సం॥ సంభావనా - కీచకునివలె ధర్మరాజుకూడా తనకు తన విజయాలకు సహకరించగలడన్న భావన. (నీల, సర్వ)
తతస్త్రయోదశస్యాంతే తస్య వర్షస్య భారత।
సుశర్మణా గృహీతం తత్ గోధనం తరసా బహు॥ 4
భారతా! తరువాత పదమూడవ సంవత్సరానికి చివర సుశర్మ వేగంతో ఆక్రమించి విరాటుని గోవుల నెన్నింటినో పట్టుకొన్నాడు. (4)
(తత శ్శబ్దో మహానాసీత్ రేణుశ్చ దివమస్పృశత్।
శంఖదుందుభిఘోషశ్చ భేరీణాం చ మహాస్వనః।
గవాశ్వరథనాగానాం నరాణాం చ పదాతినామ్।
ఆ సమయంలో పెద్ద కోలాహలమయింది. ధూళి ఆకాశాన్ని తాకింది. శంఖాలు, దుందుభులు, భేరులు అధికంగా ధ్వనించాయి. గోవులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు, పదాతులయిన సైనికులు బాగా శబ్దాలు చేశారు.
ఏవం తైస్త్వభినిర్యాయ మత్స్యరాజస్య గోధనే।
త్రిగర్తైర్గృహ్యమాణే తు గోపాలాః ప్రతుఅషేధయన్॥
ఈరీతిగా త్రిగర్త దేశీయయోధులు మత్స్యరాజు గోధనాన్ని తీసుకొని వెళ్ళే సమయంలో ఆ గోరక్షకులు సైనికులను అడ్డగించారు.
అథ త్రిగర్తా బహవః పరిగృహ్య ధనం బహు।
పరిక్షిప్య హయైః శీఘ్రైః రథవ్రాతైశ్చ భారత।
గోపాలాన్ ప్రత్యయుధ్యంత రణే కృత్వా జయే ధృతిమ్॥
తే హన్యమానా బహుభిః ప్రాసతోమరపాణిభిః।
గోపాలా గోకులే భక్తాః వారయామాసురోజసా।
పరశ్వథైశ్చ ముసలైః భిందిపాలైశ్చ ముద్గరైః॥
గోపాలాకర్షణైశ్చిత్రైః జఘ్నురశ్వాన్ సమంతతః।
భారతా! అపుడు త్రిగర్తులు చాలా ధనం తీసుకుని తమ వశం చేసుకోవడం కోసం వేగంగా వెళ్ళే గుర్రాలు, రథాలద్వారా యుద్ధంలో విజయం సాధించాలని దృఢసంకల్పం చేసుకుని గోపాలురతో యుద్ధం ప్రారంభించారు. త్రిగర్తుల సంఖ్య చాలా ఉంది. వారు ప్రాసములు, తోమరాలు పట్టుకుని విరాటుని గోపాలకులను చంపుతున్నారు. గోవులను పాలించే గోపాలురు బలంతో ఆ సైన్యాన్ని నిరోధించారు. ఆ గోపాలకులు పరశ్వథాలు, రోకళ్ళు, భిందిపాలాలు, ముద్గ్రాలు, కర్షణాలనే ఆయుధాలతో అంతటా గుర్రాలను కొట్టారు.
తే హన్యమానాః సంక్రుద్ధాః త్రిగర్తా రథయోధినః।
విసృజ్య శరవర్షాణి గోపాన్ వ్యద్రావయన్ రణే॥)
గోపాలకుల దెబ్బలచే మిక్కిలి కోపగించిన త్రిగర్తులు రథాలపై యుద్ధం చేస్తూ బాణవర్షంతో గోపాలురను రణభూమినుండి తరిమివేశారు.
తతో జవేన మహతా గోపః పురమథావ్రజత్।
స దృష్ట్వా మత్స్యరాజం చ రథాత్ ప్రస్కంద్య కుండలీ॥ 5
కుండలాలు ధరించిన గోపకుడు రథం ఎక్కి వేగంగా వెళ్ళి నగరాన్ని చేరాడు. మత్స్యరాజును చూసి దూరంనుండి రథం దిగాడు. (5)
శూరైః పరివృతం యోధైః కుండలాంగదధారిభిః।
సంవృతం మంత్రిభిః సార్ధం పాండవైశ్చ మహాత్మభిః॥ 6
తం సభాయాం మహారాజమ్ ఆసీనం రాష్ట్రవర్ధనమ్।
తమ దేశానికి ఔన్నత్యం కలిగించే విరాటుడు కుండలాలు, భుజకీర్తులు ధరించి వీరయోధులతో, మంత్రులతో, మహాత్ములయిన పాండవులతో కూడిన రాజసభలో కూర్చుని ఉన్నాడు. (6 1/2)
సోబ్రవీదుపసంగమ్య విరాటం ప్రణతస్టదా॥ 7
అస్మాన్ యుధి వినిర్జిత్య పరిభూయ సబాంధవాన్।
గవాం శతసహస్రాణి త్రిగర్తాః కాలయంతి తే॥ 8
విరాటుని చెంతకు వెళ్ళి గోపాలకుడు ప్రణామం చేసి చెప్పాడు. "త్రిగర్త సైనికులు మమ్ము రణరంగంలో ఓడించి సోదరబంధువులతో కూడ మనల్ని తిరస్కరించి లక్షలకొలదీ ఉన్న మన ఆవులను తీసుకొని పోతున్నారు. (7,8)
తాన్ పరీప్సస్వ రాజేంద్ర మా నేశుః పశవస్తవ।
తచ్ఛ్రుత్వా నృపతిః సేనాం మత్స్యానాం సమయోజయత్॥ 9
రాజేంద్రా! వాటిని విడిపించుకొని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీ పశువులు నశించవు. మీచేతులలో నుండి బయటికి పోవు." అని గోపాలకుడు చెప్పిన మాట విని మత్స్యదేశ రాజు సేనను సిద్ధం చేశాడు. (9)
రథనాగాశ్వకలిలాం పత్తిధ్వజసమాకులామ్।
రాజానో రాజపుత్త్రాశ్చ తనుత్రాణ్యథ భేజిరే॥ 10
దానిలో రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు, పదాతులు అనే చతురంగ సైన్యం ఉంది. ఆసైన్యం ధ్వజ పతాకాలతో నిండి ఉంది. రాజులు, రాజకుమారులు కవచాలను ధరించారు. (10)
భానుమంతి విచిత్రాణి శూరసేవ్యాని భాగశః।
స వజ్రాయసగర్భంతు కవచం తత్ర కాంచనమ్॥ 11
విరాటస్య ప్రియో భ్రాతా శతానీకోఽభ్యహారయత్।
ఆ కవచాలు బాగా కాంతికలవీ, విచిత్రమైనవీ, శూరులు ధరించడానికి యోగ్యమైనవి. విరాటరాజు ప్రియసోదరుడు శతానీకుడు బంగారుకవచం ధరించాడు. దానిలో మేలైన వజ్రాలు పొదగబడి ఉన్నాయి. (11 1/2)
సర్వపారసవం వర్మ కళ్యాణపటలం దృఢమ్॥
శతానీకాదవరజః మదిరాక్షో ఽభ్యహారయత్॥ 12
శతానీకుని తమ్ముని పేరు మదిరాక్షుడు అతడు బంగారు రేకులతో కప్పబడిన సుదృఢకవచాన్ని ధరించాడు. అన్ని అస్త్రశస్త్రాలను సహించగలిగిన ఆ కవచాన్ని ఉక్కుతో నిర్మించారు. (12)
శతసూర్యం శతావర్తం శతబిందు శతాక్షిమత॥ 13
అభేద్యకల్పం మత్స్యానాం రాజా కవచమాహరత్।
ఉత్సేధే యస్య పద్మాని శతం సౌగంధికాని చ॥ 14
మత్స్యదేశరాజు విరాటుడు అభేద్యకల్పమనే కవచం ధరించాడు. ఇది ఏ అస్త్రశస్త్రాలతోనూ విరగదు. దాని యందు సూర్యునితో సమానంగా ప్రకాశించే నూరుపూవులు చెక్కినారు. నూరు సుడులు, నూరుచిన్న చక్రాలు, నూరు కన్నుల బొమ్మలు చెక్కారు. ఇవికాక దానిపై క్రింద నుండి పైకి సౌగంధిక కమలాల పంక్తిని చెక్కారు. (13,14)
సువర్ణపృష్ఠం సూర్యాభం సూర్యదత్తోఽభ్యహారయత్।
దృఢ మాయసగర్భం చ శ్వేతం వర్మ శతాక్షిమత్॥ 15
విరాటస్య సుతో జ్యేష్ఠః వీరః శంఖోఽభ్యహారయత్।
సేనాపతి సూర్యదత్తుడు బంగారపు వెన్నుకలిగి సూర్యునితో సమానంగా ప్రకాశించే కవచం ధరించాడు. విరాటుని పెద్దకుమారుడు, వీరవరుడు ఐన శంఖుడు తెల్లని రంగుకల సుదృఢకవచాన్ని ధరించాడు. దానికి లోపల ఇనుముంది. బయట కంటి బొమ్మలు నూరు చిత్రించారు. (15 1/2)
శతశశ్చ తనుత్రాణి యథాస్వం తే మహారథాః॥ 16
యోత్స్యమానా అనహ్యంత దేవరూపాః ప్రహారిణః।
ఈ రీతిగా దేవతలతో సమానమైన రూపం కలిగిన వేలకొలది మహారథులు యుద్ధంకోసం సిద్ధమయి తమ తమ వైభవాన్ని అనుసరించి కవచాల్ని ధరించారు. వారందరు అన్నిరకాల యుద్ధాలలో నిపుణులు. (16 1/2)
సూపస్కరేషు శుభ్రేషు మహత్సు చ మహారథాః॥ 17
పృథక్ కాంచనసంనాహాన్ రథేష్వశ్వానయోజయన్।
అందమయిన చక్రాలు కలిగి, విశాలమయి ప్రకాశించే రథాలకు మహారథికులు బంగారు అలంకారాలు గల గుర్రాలను పూన్చారు. (17 1/2)
సూర్యచంద్రప్రతీకాశే రథే దివ్యే హిరణ్మయే॥ 18
మహానుభావో మత్స్యస్య ధ్వజ ఉచ్ఛిశ్రియే తదా।
మత్స్యరాజు సువర్ణ దివ్య రథమందు బాగా ఎత్తయిన జెండా నిలుపబడింది. ఆ రథం సూర్యచంద్రులతో సమానంగా ప్రకాశిస్తోంది. (18 1/2)
అథాన్యాన్ వివిధాకారాన్ ధ్వజాన్ హేమపరిష్కృతాన్॥ 19
యథాస్వం క్షత్రియాః శూరాః రథేషు సమయోజయన్।
ఇలాగే ఇతరవీక్షత్రియులు కూడా తమ రథాలకు యథాశక్తిగా బంగారు అలంకారాలు కలిగిన వివిధ రూపాలయిన జెండాలను నిలిపారు. (19 1/2)
(రథేషు యుజ్యమానేషు కంకో రాజానమబ్రవీత్।
మయాప్యస్త్రం చతుర్మార్గమ్ అవాస్తమ్ ఋషిసత్తమాత్॥
దంశితో రథమాస్థాయ పదం నిర్యామ్యహం గవామ్।
అయం చ బలవాన్ శూరః వల్లవో దృశ్యతేఽనఘ॥
గోసంఖ్యమశ్చబంధం చ రథేషు సమయోజయ।
నైతే న జాతు యుధ్యేయుః గవార్థమితి మే మతిః॥)
అథ మత్స్యోఽబ్రవీద్ రాజా శతానీకం జఘన్యజమ్॥ 20
రథాలు సిద్ధమయి వెళ్ళే సమయంలో కంకుభట్టు విరాటునితో అన్నాడు. "నేనుకూడా ఒక మహర్షివల్ల నాలుగు విధాల ధనుర్వేద శిక్షణను పొందాను. కాబట్టి నేను కవచాన్ని ధరించి రథంపై కూర్చుని గోవుల పాదచిహ్నాలను అనుసరిమ్చి వెడతాను. రాజా! ఇక్కడ వల్లవుడనే వంటవాడు బలవంతుడుగా, శూరుడుగా కనబడుతున్నాడు. గోవులను లెక్కించే గోశాలాధ్యక్షుడు తంతిపాలుని, గుఱ్ఱాలకు శిక్షణ వ్యవస్థను నిర్వహించే గ్రంథికుని కూడా రథంపై కూర్చోబెట్టండి. వీరు గోవులకోసం యుద్ధం చేయడంలో వెనుకంజ వేయరని నానమ్మకం").
తరువాత మత్స్యరాజు తన తమ్ముడు శతానీకునితో ఇలా అన్నాడు. (20)
కంకవల్లవగోపాలాః దామగ్రంథిశ్చ వీర్యవాన్।
యుధ్యేయురితి మే బుద్ధిః వర్తతే నాత్ర సంశయః॥ 21
సోదరా! కంకుడు, వల్లవుడు, తంతిపాలుడు, గ్రంథికుడు గూడా యుద్ధం చేయగలరు. ఇందులో సందేహం లేదు అని నాకు తోస్తోంది. (21)
ఏతేషామపి దీయంతాం రథా ధ్వజపతాకినః।
కవచాని చ చిత్రాణి దృఢాని చ మృదూని చ॥ 22
ప్రతిముంచంతు గాత్రేషు దీయంతామాయుధాని చ।
వీరాంగరూపాః పురుషా నాగరాజకరోపమాః॥ 23
కాబట్టి వీరికి కూడా ధ్వజాలు, పతాకాలతో శోభించే రథాలు ఇయ్యి. వారు కూడా పైన దృఢంగా లోపల మృదువుగా ఉండే కవచాలను తమ శరీరాలకు ధరించాలి. వీరికి కూడా అన్నిరకాలయిన అస్త్రశస్త్రాలు ఇవ్వండి. వీరి శరీరమూ, స్వరూపమూ వీరోచితంగా ఉన్నాయి. ఈ వీరపురుషుల భుజాలు గజరాజు తొండంలా శోభిస్తున్నాయి. (22,23)
నేమే జాతు న యుధ్యేరన్ ఇతి మే ధీయతే మతిః।
ఏతచ్ఛ్రుత్వా తు నృపతేః వాక్యం త్వరితమానసః।
శతానీకస్తు పార్థేభ్యః రథాన్ రాజన్ సమాదిశత్॥ 24
వీరు యుద్ధం చేయకుండా ఉండలేరు. వీరు నిశ్చయంగా యుద్ధ నిపుణులు. జనమేజయా! రాజు పలికిన యీ వాక్యం విని శతానీకుడు మనసు తొందరపడగా కుంతీపుత్రులకై శీఘ్రంగా రథాలు తీసుకిరావడానికి ఆదేశం ఇచ్చాడు. (24)
సహదేవాయ రాజ్ఞే చ భీమాయ నకులాయ చ।
తాన్ ప్రహృష్టాం స్తతః సూతాః రాజభక్తిపురస్కృతాః॥ 25
నిర్దిష్టా నరదేవేన రథాన్ శీఘ్రమయోజయన్।
సహదేవునికి, ధర్మజునకు, భీమసేనునికి, నకులునకు, రథాలను తీసుకిరావడానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మాటతో పాండవులు బాగా ప్రసన్నులయ్యారు. అపుడు రాజభక్తులైన సారథులు విరాటుడు చెప్పిన ప్రకారం రథాలను తొందరగా పూన్చి తీసుకు వచ్చారు. (25 1/2)
కవచాని విచిత్రాణి మృదూని చ దృఢాని చ॥ 26
విరాటః ప్రాదిశద్ యాని తేషామక్లిష్టకర్మణామ్॥
తాన్యాముచ్య శరీరేషు దమ్శితాస్తే పరంతపాః॥ 27
తరువాత అనాయాసంగా పరాక్రమించే పాండవులకు విరాటరాజు తన చేతులతో విచిత్ర కవచాల నిచ్చాడు. అవి పైభాగంలో సుదృఢంగా, లోపల కోమలంగా ఉన్నాయి.
అవి తీసుకుని ఆ వీరులు తమ శరీరాలకు వాటివాటి స్థానాల్లో కట్టుకున్నారు. (26,27)
రథాన్ హయైః సుసంపన్నాన్ ఆస్థాయ చ నరోత్తమాః।
నిర్యయుర్ముదితాః పార్థాః శత్రుసంఘావమర్దినః॥ 28
శత్రుసమూహాలను మర్దించే నరశ్రేష్ఠులైన కుంతీ పుత్రులు గుర్రాలను పూన్చిన రథాలెక్కి ప్రసన్నులై రాజభవనంనుండి బయటకు బయలుదేరారు. (28)
తరస్వినశ్ఛన్నరూపాః సర్వే యుద్ధవిశారదాః।
రథాన్ హేమపరిచ్ఛన్నాన్ ఆస్థాయ చ మహారథాః॥ 29
విరాటమన్వయుః పార్థాః సహితాః కురుపుంగవాః।
చత్వారో భ్రాతరః శూరాః పాండవాః సత్యవిక్రమాః॥ 30
వారు చాలా వేగంగా వెళ్ళారు. వారింతవరకు వారి అసలు స్వరూపాలను దాచి ఉంచారు. వారందరూ అన్ని యుద్ధకళలలోనూ మిక్కిలి నిపుణులు. కురువంశానికి శిరోమణులవంటి మహారథులయిన ఆ నలుగురు కుంతీకుమారులు బంగారంతో అలంకరించిన రథాలపై కూర్చున్నారు. వారు విరాటుని వెనుక వెడుతున్నారు. పాండవులు నలుగురూ శూరులు, సత్యపరాక్రమం కలవారు. (29,30)
(దీర్ఘాణాం చ దృఢానాం చ ధనుషాం తే యథాబలమ్।
ఉత్కృష్య పాశాన్ మౌర్వీణాం వీరాశ్చాపేష్వయోజయన్॥
తతః సువాసనః సర్వే తే వీరాశ్చందనోక్షితాః।
చోదితా నరదేవేన క్షిప్రమశ్వానచోదయన్॥
తే హయా హేమసంఛన్నాః బృహంతః సాధువాహినః।
చోదితాః ప్రత్యదృశ్యంతే పక్షిణామివ పంక్తయః॥)
ఆ వీరులు పొడవైన దృఢమైన అల్లెత్రాళ్ళను తమబలాన్ననుసరించి పైకిలాగి ధనుస్సు రెండవ కొనకు తగిలించారు. సుందరవస్త్రాలను ధరించి చందనం పూసుకున్న ఆ వీరులు నలుగురూ విరాటరాజు ఆజ్ఞచేత వేగంగా తమ గుర్రాలను నడిపించారు. రథభారాన్ని వహించగలిగి, బంగారంతో అలంకరించిన ఆ గుఱ్ఱాలు పాండవులు నడుపుతుండగా వరుస కట్టి ఎగిరే పక్షుల వలె కనపడ్డాయి.
భీమాశ్చ మత్తమాతంగాః ప్రభిన్న కరటాముఖాః।
క్షరంతశ్చైవ నాగేంద్రాః సుదంతాః షష్టిహాయనాః॥ 31
స్వారూఢాః యుద్ధకుశలైః శిక్షితా హస్తిసాదిభిః।
రాజానమన్వయుః పశ్చాత్ చలంత ఇవ పర్వతాః॥ 32
గండస్థలంనుండి మదజలం స్రవించేవి భయంకర మైనవి, సుందరమైన దంతాలు కలవి, అరవైసంవత్సరాల వయసు కలవి, యుద్ధనిపుణులయిన మావటి వాండ్రచే శిక్షణను పొందినవి, కదిలే పర్వతాలలా ఉండే గజాలు పాండవులు ఎక్కగా విరాటరాజు వెంట వెళ్ళాయి. (31,32)
విశారదానాం ముఖ్యానాం హృష్టానాం చారుజీవినామ్।
అష్టా రథసహస్రాణి దశ నాగశతాని చ॥ 33
షష్టిశ్చాశ్వసహస్రాణి మత్స్యానామభినిర్యయుః।
తదనీకం విరాటస్య శుశుభే భరతర్షభ॥ 34
యుద్ధకళలో నిపుణులు, ప్రసన్నంగా ఉండేవారు, ఉత్తమజీవనం కలవారు, మత్స్యదేశంలో చాలా ప్రధానులు - ఆ సైన్యంలో ఎనిమిదివేల రథికులు, వెయ్యిమంది గజయోధులు, అరవైవేల అశ్వికులు ఉన్నారు. వారు యుద్ధానికి సన్నద్ధులై బయలుదేరారు. భరతర్షభా! విరాటుని ఆ విశాలసైన్యం మిక్కిలి శోభిస్తోంది. (33,34)
సంప్రయాతం తదా రాజన్ నిరీక్షంతం గవాం పదమ్।
తద్బలాగ్ర్యం విరాటస్య సంప్రస్థితమశోభత।
దృఢాయుధజనాకీర్ణం గజాశ్వరథసంకులమ్॥ 35
రాజా! ఆ సమయంలో గోవుల పదచిహ్నాలను చూస్తూ యుద్ధానికి బయలుదేరిన విరాటుని శ్రేష్ఠమయిన సేన అపూర్వశోభను పొందింది. ఆసైన్యంలోని పదాతి సైనికుల చేతిలో దృఢమయిన కత్తులున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలతోనూ కూడిన యోధులతో ఆసైన్యం నిండిఉంది. (35)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి దక్షిణగోగ్రహే మత్స్యరజరణోద్యోగే ఏకత్రింశోఽధ్యాయః॥ 31 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున దక్షిణగోగ్రహణమున మత్స్యదేశపురజు యుద్ధసన్నాహము అను ముప్పది ఒకటవ అధ్యాయము. (31)
(దాక్షిణాత్యప్రతిలో ఉన్న 13 శ్లోకాలు కలుపుకొని మొత్తం 48 శ్లోకాలు)