30. ముప్పదియవ అధ్యాయము
సుశర్మ దక్షిణగోగ్రహణము చేయుట.
వైశంపాయన ఉవాచ
అథ రాజా త్రిగర్తానాం సుశర్మా రథయూథపః।
ప్రాప్తకాలమిదం వాక్యమ్ ఉవాచ త్వరితో బలీ॥ 1
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! తరువాత త్రిగర్తరాజు, మహాబలవంతుడు, రథసైన్యం కలవాడు అయిన సుశర్మ తొందరపాటుతో ఆ సమయానికి ఇలా అన్నాడు. (1)
అసకృన్నికృతాః పూర్వం మత్స్యశాల్వేయకైః ప్రభో।
సూతేనైవ చ మత్స్యస్య కీచకేన పునః పునః॥ 2
బాధితో బంధుభిః సార్ధం బలాద్ బలవతా విభో।
స కర్ణమభ్యుదీక్ష్యాథ దుర్యోధనమభాషత॥ 3
అతడు కర్ణునివైపు చూసి దుర్యోధనునితో ఇలా అన్నాడు. 'ప్రభూ! పూర్వం మత్స్య, సాల్వదేశ సైనికులు చాలా సార్లు దాడిచేసి మాకు కష్టం కలిగించారు. మత్స్యరాజు సేనాపతి, మహాబలవంతుడు, సూతపుత్రుడు అయిన కీచకుడు తమ బంధువులతో కూడా మాటి మాటికి దాడిచేసి నన్ను బలంతో బాధించాడు. (2,3)
అసకృన్మత్స్య రాజ్ఞా మే రాష్ట్రం బాధితమోజసా।
ప్రణేతా కీచకస్తస్య బలవానభవత్ పురా॥ 4
మత్స్యదేశపు రాజు ఇంతకుమునుపు చాలాసార్లు తన బల పరాక్రమాలతో దాడి చేసి, మా రాష్ట్రాన్ని క్లేశపెట్టాడు. బలవంతుడయిన కీచకుడే అతని సేనా నాయకుడు. (4)
క్రూరోఽమర్షీ సుదుష్టాత్మా భువి ప్రఖ్యాతవిక్రమః।
నిహతః స తు గంధర్వైః పాపకర్మా నృశంసవాన్॥ 5
ఆ దుష్టాత్ముడు మిక్కిలి క్రూరుడు, కోపం కలవాడు. ఈ భూమిపై ప్రసిద్ధపరాక్రమం కలవాడు. దయలేనివాడు, పాపాచారుడు. ఆ కీచకుడు ఇప్పుడు గంధర్వుల వల్ల చంపబడ్డాడు. (5)
తస్మిన్ వినిహతే రాజా హతదర్పో నిరాశ్రయః।
భవిష్యతి నిరుత్సాహః విరాట ఇతి మే మతిః॥ 6
అతడు మరణించాక విరాటరాజు గర్వంపోయి ఆశ్రయం లేనివాడు, నిరుత్సాహుడూ అవుతాడని నా అభిప్రాయం. (6)
తత్ర యాత్రా మమ మతా యది తే రోచతేఽనఘ।
కౌరవాణాం చ సర్వేషాం కర్ణస్య చ మహాత్మనః॥ 7
దోషరహితుడా! నీకంగీకార మయితే ఆమత్స్య రాజ్యంపై దండయాత్ర చేయడం నాకు సమ్మతం. కౌరవులందరకే కాదు. మహాత్ముడయిన కర్ణుడికి కూడా ఈ దాడి ఇష్టం. (7)
ఏతత్ప్రాప్తమహం మన్యే కార్యమాత్యయికం హి నః।
రాష్ట్రం తస్యాభియాస్యామః బహుధాన్యసమాకులమ్॥ 8
మనం ధనధాన్య సంపన్న మయిన మత్స్యదేశాన్ని ఆక్రమించే అదృష్టకాలం వచ్చింది. ఇది మనకు మిక్కిలి ఆవశ్యకకార్యమని నేను భావిస్తున్నాను. (8)
ఆదదామోఽస్య రత్నాని వివిధాని వసూని చ।
గ్రామాన్ రాష్ట్రాణి వా తస్య హరిష్యామో విభాగశః॥ 9
విరాటరాజుకు చాలా రకాల రత్నాలు, ధనాలు ఉన్నాయి. అతని గోవులు, గ్రామాలు, రాష్ట్రమూ జయించి పంచుకుని తీసుకుందాం. (9)
అథవా గో సహస్రాణి శుభాని చ బహూని చ।
వివిధాని హరిష్యామః ప్రతిపీడ్య పురం బలాత్॥ 10
లేదా అతని పురంలో అందమయిన ఆవులు వేలకొలది ఉన్నాయి. మన బలంతో ఆ పురాన్ని ముట్టడించి ఆ గోవులను లాగుకుందాం. (10)
కౌరవైః సహ సంగత్య త్రిగర్తైశ్చ విశాంపతే।
గా స్తస్యాపహరామోఽద్య సర్వైశ్చైవ సుసంహతాః॥ 11
మహారాజా! కౌరవులు, త్రిగర్త సైనికులు కలిసి సంఘటితంగా ఉండి మనం విరాటుని గోవులను అపహరిద్దాం. (11)
సంవిభాగేన కృత్వా తు నిబధ్నీమోఽస్య పౌరుషమ్।
హత్వా చాస్య చమూం కృత్స్యాం వశమేవానయామహే॥ 12
అతని బలాన్ని రెండుభాగాలుగా అనుకొని మనం చెరొకవైపు నుంచి ముట్టడించి బాధిద్దాము. అతని సామర్థ్యాన్ని నష్టపరచి మొత్తం సైన్యాన్ని వశం చేసుకుందాం. (12)
తం వశే న్యాయతః కృత్వా సుఖం వత్స్యామహే వయమ్।
భవతాం బలవృద్ధిశ్చ భవిష్యతి న సంశయః॥ 13
విరాటుని నీతితో వశం చేసుకుని మనం సుఖంగా నివసిద్దాం. దీని వల్ల మీసైన్యమూ, శక్తీ వృద్ధి పొందుతాము. సందేహం లేదు.' (13)
తచ్ఛ్రుత్వా వచనం తస్య కర్ణో రాజానమబ్రవీత్।
సూక్తం సుశర్మణా వాక్యం ప్రాప్తకాలం హితం చ నః॥ 14
త్రిగర్తరాజు మాట విని కర్ణుడు దుర్యోధనునితో చెప్పాడు. 'సుశర్మ సరిగ్గా చెప్పాడు. ఇది ఈ సమయానికి తగినదీ, మనకు హితాన్ని కలిగించేది. (14)
తస్మాత్ క్షిప్రం వినిర్యామః యోజయిత్వా వరూథినీమ్।
విభజ్య చాప్యనీకాని యథా త్వం మన్యసేఽనఘ॥ 15
కాబట్టి సైన్యాన్ని సిద్ధం చేసుకుని కొన్ని భాగాలుగా విభజించుకొని వెంటనే దాడికి బయలుదేరుదాం. లేదా నీవు ఎలా చేస్తే బాగుంటుందనుకుంటే అలా చేద్దాం. (15)
ప్రాజ్ఞో వా కురువృద్ధోఽయం సర్వేషాం నః పితామహః।
ఆచార్యశ్చ యథా ద్రోణః కృపః శారద్వతస్తథా।
మన్యంతే తే యథా సర్వే తథా యాత్రా విధీయతామ్॥ 16
లేదా కురుకులంలో అందరికంటె వృద్ధుడు, మనకు తాతగారు, పరమబుద్ధిమంతుడూ అయిన భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఏరీతి తగినదని భావిస్తారో ఆ రీతిగా దండయాత్ర చేయవచ్చు. (16)
సంమంత్ర్య చాశు గచ్ఛామః సాధనార్థం మహీపతేః।
కించ నః పాండవైః కార్యం హీనార్థబలపౌరుషైః॥ 17
మనం కలిసి బాగా ఆలోచించి విరాటరాజును వశం చేసుకోవడం కోసం వేగంగా దండయాత్ర చేయాలి. పాండవులు ధనం, బలం, పౌరుషం లేనివారు. కాబట్టి వారితో మనకు పని యేమి? (17)
అత్యంతం వా ప్రణష్టాస్తే ప్రాప్తా వాపి యమక్షయమ్।
యామో రాజన్ నిరుద్విగ్నాః విరాటనగరం వయమ్।
ఆదాస్యామో హి గాస్తస్య వివిధాని వసూని చ॥ 18
రాజా! వారు అసలు కనబడకుండా పోయారో, యమలోకానికే వెళ్ళారో! మనం ఉద్వేగం లేకుండా విరాటనగరంపై దాడిచేయాలి. అక్కడ మనం విరాటుని గోవులను, ధనరత్నాలను వశపరుచుకొని తీసుకొని రావాలి.' (18)
వైశంపాయన ఉవాచ
తతో దుర్యోధనో రాజా వాక్యమాదాయ తస్య తత్।
వైకర్తనస్య కర్ణస్య క్షిప్ర మాజ్ఞాపయత్ స్వయమ్॥ 19
శాసనే నిత్య సంయుక్తం దుఃశాసనమనంతరమ్।
సహ వృద్ధైస్తు సమ్మంత్ర్య క్షిప్రం యోజయ వాహినీమ్॥ 20
వైశంపాయనుడు చెప్పాడు. జనమేజయ మహారాజా! దుర్యోధనుడు సూర్యపుత్రు డయిన కర్ణుని మాటను స్వీకరించి, తన ఆజ్ఞను పాటించడానికి సదా సిద్ధంగా ఉన్న తమ్ముడైన దుశ్శాసనునికి వెంటనే స్వయంగా ఆదేశ మిచ్చాడు-' పెద్దవారితో ఆలోచించి వెంటనే సేనను దండయాత్రకు సిద్ధం చేయాలి. (19,20)
యథోద్దేశం చ గచ్ఛామః సహితాస్తత్ర కౌరవైః।
సుశర్మా చ యథోద్దిష్టం దేశం యాతు మహారథః॥
త్రిగర్తైః సహితో రాజా సమగ్రబలవాహనః॥ 21
మనం ఏవైపునుండి దాడిచేయాలీ ఆ వైపునకు మనం కౌరవ సైనికులతో బయలుదేరాలి. మహారథికుడు సుశర్మ త్రిగర్తులతో కూడా నిశ్చయించిన దిక్కువైపు తన సమస్త సైన్యంతో, వాహనాలతో వెళ్ళాలి. (21)
ప్రాగేవ హి సుసంవీతః మత్స్యస్య విషయం ప్రతి।
జఘన్యతో వయం తత్ర యాస్యామో దివసాంతరే॥
విషయం మత్స్యరాజస్య సుసమృద్ధం సుసంహతాః॥ 22
అన్ని సాధనాలతో కూడి సుశర్మ మొదట మత్స్యదేశంపై ఆక్రమణం చేయాలి. ఆ వెనుక ఒకరోజు తరువాత మనవారు కూడా పూర్తిగా సంఘటితమై విరాటుని సమృద్ధమయిన రాజ్యంపై దాడిచేయాలి. (22)
తే యాంతు సహితా స్తత్ర విరాటనగరం ప్రతి।
క్షిప్రం గోపాన్ సమాసాద్య గృహ్ణంతు విపులం ధనమ్॥ 23
త్రిగర్తసైనికులు కలిసి ఒక్కసారి వేగంగా విరాటనగరంపై దాడి చేయాలి. మొదట గోపకుల దగ్గరకు వెళ్ళి, అక్కడ అధికంగా ఉన్న గోధనంపై అధికారం పొందాలి. (23)
గవాం శతసహస్రాణి శ్రీమంతి గుణవంతి చ।
వయమప్యనుగృహ్ణీమః ద్విధా కృత్వా వరూథినీమ్॥ 24
మనం మన సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి సుందరమై, సుగుణాలు కలిగి లక్షలసంఖ్యలోనున్న విరాటుని ఆవులను అపహరించాలి.' (24)
వైశంపాయన ఉవాచ
తే స్మ గత్వా యథోద్దిష్టాం దిశం వహ్నిర్మహీపతే।
సంవద్ధా రథినః సర్వే సపదాతా బలోత్కటాః॥ 25
ప్రతివైరం చికీర్షంతః గోషు గృద్ధా మహాబలాః।
ఆదాతుం గాః సుశర్మాథ కృష్ణపక్షస్య సప్తమీమ్॥ 26
వైశంపాయనుడు చెప్పాడు. రాజా! తదనంతరం పూర్వవైరానికి ప్రతీకారం చేయాలనుకొనే సుశర్మ, త్రిగర్త రథికులు, పదాతులు కవచాదులను ధరించి సిద్ధమయ్యారు. వారందరూ గొప్ప బలవంతులు, ప్రచండ పరాక్రమం కలవారు. సుశర్మ విరాటుని గోవులను అపహరించడం కోసం పూర్వం నిశ్చయించిన ప్రణాళిక ననుసరించి కృష్ణపక్ష సప్తమినాడు ఆగ్నేయం వైపునుండి విరాటనగరంపై దాడి చేశారు. (25,26)
అపరే దివసే సర్వే రాజన్ సంభూయ కౌరవాః।
అష్టమ్యాం తే న్యగృహ్ణంత గోకులాని సహస్రశః॥ 27
రాజా! మరునాడు అష్టమీ తిథిలో మరో వైపునుండి కౌరవులందరూ కలిసి దాడిచేసి వేల గోసమూహాలను పట్టుకొన్నారు. (27)
నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్. (3-129)
ఇతి శ్రీమహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే సుశర్మాభియానే త్రింశోఽధ్యాయః॥ 30 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున దక్షిణగోగ్రహణమునకై
సుశర్మ మత్స్యదేశముపై దండెత్తుట అను ముప్పదియవ అధ్యాయము. (30)