37. ముప్పదిఏడవ అధ్యాయము

ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధమునకు వెళ్ళుట.

వైశంపాయన ఉవాచ
సా ప్రాద్రవత్ కాంచనమాల్యధారిణీ
జ్యేష్ఠేన భ్రాత్రా ప్రహితా యశస్వినీ।
సుదక్షిణా వేదివిలగ్నమధ్యా
సా పద్మపత్రాభనిభా శిఖండినీ॥ 1
తన్వీ శుభాంగీ మణిచిత్రమేఖలా
మత్స్యస్య రాజ్ఞో దుహితా శ్రియా వృతా।
తన్నర్తనాగారమరాలపక్ష్మా
శతహ్రదా మేఘమివాన్వపద్యత॥ 2
ఆ ఉత్తర బంగారుమాలలు దాల్చింది. అన్న పంపితే బయలుదేరింది. పెద్దల అభిప్రాయము ననుసరించే పేరున్నది. యజ్ఞవేదిక వంటి సన్నని నడుముకల్గి, లక్ష్మిలా మెరిసిపోతోంది. నెమలిపింఛం తలపై ధరించింది. శుభలక్షణాలున్న యువతి. మణులు పొదిగిన ఒడ్డాణం దాల్చిన ఉత్తర, మేఘంలో మెరుపులా ఆ నర్తనశాలవైపు పరుగుతీసింది. (1,2)
సా హస్తిహస్తోపమసంహితోరూః
స్వనిందితా చారుదతీ సుమధ్యమా।
ఆసాద్య తం వై వరమాల్యధారిణీ
పార్థం శుభా నాగవధూరివ ద్విపమ్॥ 3
దృఢంగా ఉన్న ఆమె తొడలు ఏనుగు తొండాల వలె ఉన్నాయి. లోపమెరుగని సౌందర్యం, చక్కని పలువరుస, చిక్కిన నడుము కల్గి శ్రేష్ఠములైన హారాలు ధరించి గజరాజును చేరే ఆడుఏనుగులా శోభిల్లుతూ ఉత్తర ఆ అర్జునుని సమీపించింది. (3)
సా రత్నభూతా మనసః ప్రియార్చితా
సుతా విరాటస్య యథేంద్రలక్ష్మీః।
సుదర్శనీయా ప్రముఖే యశస్విన్
ప్రీత్యాబ్రవీదర్జున మాయతేక్షణా॥ 4
స్త్రీలలో రత్నం వంటిది. మనసుకు హాయి గొలుపుతూ(రాజభవనంలో) ఇంద్రుని సామ్రాజ్య లక్ష్మివలె పూజింపబడుతూ, కంటికి చూడముచ్చటైనది. మంచిపేరు, విశాలమైన కన్నులూ గల విరాటకుమారి ఉత్తర సంతోషంతో అర్జునుని పలుకరించింది. (4)
సుసంహతోరూం కనకోజ్జ్వలత్వచం
పార్థః కుమారీం స తదాభ్యభాషత।
కిమాగమః కాంచనమాల్యధారిణి
మృగాక్షి కిం త్వం త్వరితేవ భామిని॥
కిం తే ముఖం సుందరి న ప్రసన్నమ్
ఆచక్ష్వ తత్త్వం మమ శీఘ్రమంగనే॥ 5
ఒరసికొనే ఊరువులూ, బంగారు మేనిచాయ కల ఆ చిన్నదానితో అర్జునుడు 'బంగారుహారాలను ధరించినదానా! నీరాకకు కారణమేమి? లేడిచూపుల దానా! త్వరపడుతున్నా వేల? సుందరీ! నీముఖం ప్రసన్నంగాలేదేం? త్వరగా నాకు విషయమంతా చెప్పు' అని అడిగాడు. (5)
వైశంపాయన ఉవాచ
స తాం దృష్ట్వా విశాలాక్షీం రాజపుత్రీం సఖీం తథా।
ప్రహసన్నబ్రవీత్ రాజన్ కిమాగమనమిత్యుత॥ 6
తమబ్రవీద్ రాజపుత్రీ సముపేత్య నరర్షభమ్।
ప్రణయం భావయంతీ సా సఖీమధ్య ఇదం వచః॥ 7
వైశంపాయనుడు అన్నాడు. రాజా! విశాలమైన కన్నులుగల రాజకుమారిని చూసి అతడు నవ్వుతూ ఆమె రాకకు కారణమడిగాడు. నరశ్రేష్ఠుడైన అర్జునుని సమీపించి ఆ రాజకుమార్తె చెలికత్తెలమధ్య ప్రేమ పూర్వకంగా అతనితో ఇలా అంది. (6,7)
గావో రాష్ట్రస్య కురుభిః కాల్యంతే నో బృహన్నలే।
తా విజేతుం మమ భ్రాతా ప్రయాస్యతి ధనుర్ధరః॥ 8
'బృహన్నలా! మనదేశానికి చెందిన ఆవుల్ని కౌరవులు తోలుకొనిపోతున్నారు. వాటిని జయించటానికి ధనుస్సుచేత పట్టి నా అన్న వెళ్తున్నాడు. (8)
నాచిరం నిహతస్తస్య సంగ్రామే రథసారథిః।
తేన నాస్తి సమః సూతః యోఽస్య సారథ్యమాచరేత్॥ 9
ఈమధ్యనే యుద్ధంలో అతని రథసారథి చని పోయాడు. అతనికి సారథ్యం చేయగల ఆ సూతునితో సమానుడెవడూ లేడు. (9)
తస్మై ప్రయతమానాయ సారథ్యర్థం బృహన్నలే।
ఆచచక్షే హయజ్ఞానే సైరంధ్రీ కౌశలం తవ॥ 10
బృహన్నలా! సారథికొరకు ప్రయత్నిస్తున్నా అతనికి సైరంధ్రి(ద్రౌపది) గుర్రాల విషయంలో నీ నేర్పును గురించి చెప్పింది. (10)
అర్జునస్య కిలాసీస్త్వం సారథిర్దయితః పురా।
త్వయాజయత్ సహాయేన పృథివీం పాండవర్షభః॥ 11
మునుపు నీవు అర్జునుడికి ఇష్టుడవైన సారథివట. పాండవశ్రేష్ఠుడైన అతడు నీ సహాయంతో భూమిని జయించాడట. (11)
సా సారథ్యం మమ భ్రాతుః కురు సాధు బృహన్నలే।
పురా దూరతరం గావః హ్రియంతే కురుభిర్హి నః॥ 12
ఇప్పటికే కౌరవులు మన ఆవుల్ని చాలాదూరం తోలుకొని పోయారు. బృహన్నలా! అలాంటి నీవు నా అన్నకు చక్కగా సారథ్యం చెయ్యి. (12)
అథైతద్ వచనం మేఽద్య నియుక్తా న కరిష్యసి।
ప్రణయాదుచ్యమానా త్వం పరిత్యక్ష్యామి జీవితమ్॥ 13
ఎంతో ప్రేమగా ఈమాట చెపుతున్నాను. నీవు నేడు నామాటను పాటింపకపోతే ప్రాణాలు విడిచి పెట్టేస్తాను.' (13)
ఏవముక్తస్తు సుశ్రోణ్యా తయా సఖ్యా పరంతపః।
జగామ రాజపుత్రస్య సకామమమితౌజసః॥ 14
తమావ్రజంతం త్వరితం ప్రభిన్నమివ కుంజరమ్।
అన్వగచ్ఛద్ విశాలాక్షీ గజం గజవధూరివ॥ 15
అందమైన పిరుదులుకల ఆ ఉత్తర అడగ్గానే అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరుని వద్దకు వెళ్ళాడు.
మదపుటేనుగులా వెడుతున్న ఆ అర్జునుని, ఉత్తర ఆడ ఏనుగు వలె అనుసరించింది. (14,15)
వి॥తె॥ సంస్కృతంలో అర్జునుడు మరుమాటాడకుండా బయలుదేరాడు. తెలుగులో సరసమైన సమాధానమిచ్చి మరీ బయలుదేరాడు. ఆ సమాధానం ఇది.
క॥ భవదీయప్రార్థనచేఁ
దివిరి పరమ దుష్కరములు తీర్చియయిన ను
త్సవ మొనరించెద సార
థ్యవిధం బొకఁడనగనేల యంబుజవదనా! (4-81)
ఒకసారథ్యమేనా ఏమయినా చేస్తాను. అంటే తానే రథికుడనవుతా నని సూచన. ఉత్తరకు తెలిసిందో లేదో కాని పాఠకులకు మాత్రం చటుక్కున స్ఫురిస్తుంది.
దూరాదేవ తు తాం ప్రేక్ష్య రాజపుత్త్రో ఽభ్యభాషత।
త్వయా సారథినా పార్థః ఖాండవేఽగ్నిమతర్పయత్॥ 16
పృథివీమజయత్ కృత్స్నాం కుంతీపుత్రో ధనంజయః।
సైరంధ్రీ త్వాం సమాచష్టే సా హి జానాతి పాండవాన్॥ 17
దూరంనుండే ఆ బృహన్నలను చూసి రాజకుమారుడైన ఉత్తరుడు 'నీవు సారథిగా ఉండటంచేత అర్జునుడు ఖాండవవనంలో అగ్నిని తృప్తిపరచాడు.
కుంతికొడుకు అయిన ధనంజయుడు(అర్జునుడు) భూమినంతా జయించాడు. సైరంధ్రి నీగురించి చెప్పింది. ఆమెకు పాండవుల గురించి బాగా తెలుసుకదా!
సంయచ్ఛ మామకానశ్వాన్ తథైవ త్వం బృహన్నలే।
కురుభిర్యోత్స్యమానస్య గోధనాని పరీప్సతః॥ 18
బృహన్నలా! అలాగే నీవు గోధనాన్ని తిరిగి తేవాలనే కోరికతో, కౌరవులతో తలపడుతున్నా నాగుర్రాల్ని కూడ అదుపుచెయ్యి. (18)
అర్జునస్య కిలాసీస్త్వం సారథిర్దయితః పురా।
త్వయాజయత్ సహాయేన పృథివీం పాండవర్షభః॥ 19
పూర్వం నీవు అర్జునుడికి ఇష్టమైన సారథిగా ఉండేవాడివి. పాండవుల్లో శ్రేష్టుడైన అర్జునుడు నీ సహాయంతో భూమిని జయించాడు.' (19)
ఏవముక్తా ప్రత్యువాచ రాజపుత్రం బృహన్నలా।
కా శక్తి ర్మమ సారథ్యం కర్తుం సంగ్రామమూర్ధని॥ 20
ఇలా అన్నాక బృహన్నల రాజకుమారునితో "యుద్ధప్రాంగణంలో సారథ్యం చెయ్యటానికి నాశక్తి ఏపాటిది?" అన్నాడు. (20)
గీతం వా యది వా నృత్యం వాదిత్రం వా పృథగ్విధమ్।
తత్ కరిష్యామి భద్రం తే సారథ్యం తు కుతో మమ॥ 21
పాడటమో, నాట్యం చెయ్యటమో, అనేక రకాలైన వాద్యాలను వాయించటమీ చెయ్యగలను కాని మాకు సారథ్యం నేర్పు ఎక్కడిది? నీకు శుభం కలుగుగాక. (21)
వి॥సం॥ గీతం నాల్గు రకాలు. పదం, మానం, వికృష్టం, మధురం.
పండితాః పదమిచ్ఛంతి మానమిచ్ఛంతి గాయనాః।
స్త్రియో మధురమిచ్ఛంతి వికృష్టమితరే జనాః॥
(పండితులు పదాన్ని, గాయకులు మానాన్ని, స్త్రీలు మధురాన్ని, ఇతరులు వికృష్టాన్ని ఇష్టపడతారు.) నృత్తం నాలుగు రకాలు. లాస్యం, తాండవం, ఉత్కటం, వేతాలం. వాద్యం నాలుగు రకాలు. తతం, వితతం, ఘనం, సుషిరం.
తతం తంత్రీకృతం విద్యాద్వితతం మురజూదికమ్।
ఘనం కాంస్యకృతం జ్ఞేయం సుషిరం వంశమేవ చ॥
తతం = తీగెలనుమీటి చేసే వాద్యవిశేషం.
వితతం = మృదంగాదులు.
ఘనం = కంచుతాళం మొదలయినవి.
సుషిరం = వేణువు. (విష)
ఉత్తర ఉవాచ
బృహన్నలే గాయనో వా నర్తనో వా పునర్భవ।
క్షిప్రం మే రథమాస్థాయ నిగృహ్ణీష్వ హయోత్తమాన్॥ 22
బృహన్నలా! తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గాయకుడివో, నర్తకుడివో కావచ్చు. ముందు నా రథమెక్కి మేలుజాతి గుర్రాల్ని అదుపుచెయ్యి. (22)
వైశంపాయన ఉవాచ
స తత్ర నర్మసంయుక్తమ్ అకరోత్ పాండవో బహు।
ఉత్తరాయాః ప్రముఖతః సర్వం జానన్నరిందమః॥ 23
వైశంపాయనుడు అన్నాడు. శత్రువుల్ని అణచగల ఆ అర్జునుడు అంతా తెలిసికూడ ఉత్తర ఎదుట నవ్వు పుట్టేటట్లు ఎన్నోవిధాలుగా తెలియనితనాన్ని ప్రదర్శించాడు. (23)
ఊర్ధ్వముత్ క్షిప్య కవచం శరీరే ప్రత్యముంచత।
కుమార్యస్తత్ర తం దృష్ట్వా ప్రాహసన్ పృథులోచనాః॥ 24
కవచాన్ని పైకెత్తి ఒంటిపై పెట్టుకున్నాడు. ఇది చూసి అక్కడున్న రాకుమార్తెలు కళ్లు పెద్దవి చేసుకొని నవ్వుకున్నారు. (24)
స తు దృష్ట్వా విముహ్యంతం స్వయమేవోత్తరస్తతః।
కవచేన మహార్హేణ సమనహ్యద్ బృహన్నలామ్॥ 25
కవచం సరిగా తొడుగుకొన లేకుండా ఉన్న అతణ్ణి చూసి ఉత్తరుడు తానే స్వయంగా కవచాన్ని బృహన్నలకు తొడిగాడు. (25)
స బిభ్రత్ కవచం చాగ్ర్యం స్వయమప్యంశుమత్ప్రభమ్।
ధ్వజం చ సింహముచ్ఛ్రిత్య సారథ్యే సమకల్పయత్॥ 26
ఉత్తరుడు తానుకూడా సూర్యకాంతికల కవచాన్ని ధరించి, సింహధ్వజాన్ని రథంపైకెత్తి బృహన్నలను సారథ్యం చెయ్యటానికి నియమించాడు. (26)
ధనూంషి చ మహార్హాణి బాణాంశ్చ రుచిరాన్ బహూన్।
అదాయ ప్రయయౌ వీరః స బృహన్నలసారథిః॥ 27
ఎంతో విలువైన ధనుస్సుల్ని మెరిసే బాణాల్ని తీసుకొని, బృహన్నలను సారథిగా చేసుకొని ఆవీరుడు (ఉత్తరుడు) యుద్ధానికి బయలుదేరాడు. (27)
అథోత్తరా చ కన్యాశ్చ సఖ్యస్తామబ్రువం స్తదా।
బృహన్నలే ఆనయేథాః వాసాంసి రుచిరాణి చ॥ 28
పాంచాలికార్థం చిత్రాణి సూక్ష్మాణి చ మృదూని చ।
విజిత్య సంగ్రామగతాన్ భీష్మద్రోణముఖాన్ కురూన్॥ 29
అప్పుడు ఉత్తర, ఆమె చెలులు ఇలా అన్నారు. 'బృహన్నలా! యుద్ధభూమికి వచ్చిన భీష్మద్రోణుల్ని ఇతర కౌరవుల్ని జయించి, అందమైన చిన్నచిన్న మెత్తని రంగురంగుల వస్త్రాలను ఆటబొమ్మలు చేసుకోవటానికి తెచ్చి పెట్ట'మని అడిగారు. (28,29)
ఏవం తా బ్రువతీః కన్యాః సహితాః పాండునందనః।
ప్రత్యువాచ హసన్ పార్థః మేఘదుందుభినిఃస్వనః॥ 30
ఇలా అడుగుతున్న ఆ కన్యలందరితో పాండుని కొడుకు అర్జునుడు నవ్వుతూ మేఘధ్వనిలా, దుందుభి ధ్వనిలా ఉన్న గంభీరస్వరంతో బదులిచ్చాడు. (30)
బృహన్నలోవాచ
యద్యుత్తరోఽయం సంగ్రామే విజేష్యతి మహారథాన్।
అథాహరిష్యే వాసాంసి దివ్యాని రుచిరాణి చ॥ 31
'బృహన్నల అన్నాడు. ఉత్తరుడు యుద్ధంలో మహారథవీరుల్ని గెలిస్తే తప్పకుండా దివ్యమైన, అందమైన వస్త్రాల్ని తెస్తాను.' (31)
వి॥తె॥ తెలుగులో చక్కని చమత్కారం జోడించాడు. ఉత్తరుడు జయలక్ష్మిని స్వీకరిస్తాడుట గదా! చీరలు పట్టుకురావడం ఏమంత పని" ఎలాగయినా తెతాను" - అని.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తు బీభత్సుః తతః ప్రాచోదయద్ధయాన్।
కురూనభిముఖః శూరః నానాధ్వజపతాకినః॥ 32
ఇలా అంటూ వీరుడైన ఆ అర్జునుడు వెంటనే అనేక విధాలైన ధ్వజపతాకలున్న కౌరవులవైపు గుర్రాల్ని పోనిచ్చాడు. (32)
తముత్తరం వీక్ష్య రథోత్తమే స్థితం
బృహన్నలాయాః సహితం మహాభుజమ్।
స్త్రియశ్చ కన్యాశ్చ ద్విజాశ్చ సువ్రతాః
ప్రదక్షిణం చక్రురథోచురంగనాః॥ 33
పెద్దరథంపై బృహన్నలతో కలిసి కూర్చున్న ఆ ఉత్తరుణ్ణి చూసి స్త్రీలు, కన్యలు, నియమపరులైన బ్రాహ్మణులు రథానికి ప్రదక్షిణం చేసి ఇలా అన్నారు. (33)
యదర్జునస్యర్షభ తుల్యగామినః
పురాభవత్ ఖాండవదాహమంగలమ్।
కురూన్ సమాసాద్య రణే బృహన్నలే
సహోత్తరేణాద్య తదస్తు మంగలమ్॥ 34
బృహన్నలా! మునుపు వృషభతుల్యమైన గంభీర గమనం కల అర్జునుడికి ఖాండవదహన సమయంలో కలిగిన శుభమే ఉత్తరుడితో కలిసి యుద్ధరంగంలో కౌరవుల దగ్గరికి వెళ్తున్న నీకు కలగాలి. (34)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే ఉత్తరనిర్యాణం నామ సప్తత్రింశోఽధ్యాయః॥ 37 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున ఉత్తర గోగ్రహణమున ఉత్తరుడు యుద్ధమునకు వెళ్ళుట అను ముప్పది ఏడవ అధ్యాయము. (37)