36. ముప్పది ఆరవ అధ్యాయము

ఉత్తరుడు సారథికొఱకు వెదకుట, ద్రౌపది బృహన్నలనుగూర్చి చెప్పుట.

ఉత్తర ఉవాచ
అద్యాహమనుగచ్ఛేయం దృఢధన్వా గవాం పదమ్।
యో మే సారథిః కశ్చిత్ భవేదశ్వేషు కోవిదః॥ 1
ఉత్తరుడు అన్నాడు. 'గుర్రాలను చక్కగా నడిపించే నేర్పు గల సారథి నాకొకడుంటే దృఢమైన ధనుస్సు గల నేను ఇపుడే ఆవులను అనుసరించి వెడతాను. (1)
తం త్వహం నావగచ్ఛామి యో మే యంతా భవేన్నరః।
పశ్యధ్వం సారథిం క్షిప్రం మమ యుక్తం ప్రయాస్యతః॥ 2
కాని నాకు సారథి కాగల వాడెవరో తెలిసికొన లేకున్నాను. యుద్ధానికి వెళ్లే నాకు తగిన సారథిని వెంటనే చూడండి. (2)
అష్టావింశతిరాత్రం వా మాసం వా మానమంతతః।
యత్ తదాసీన్మహద్ యుద్ధం తత్ర మే సారథిర్హతః॥ 3
గతంలో సుమారు ఇరవై ఎనిమిది ముప్పై రోజుల పాటు జరిగిన యుద్ధంలో నా సారథి చనిపోయాడు. (3)
స లభేయం యదా త్వన్యం హయయానవిదం నరమ్।
త్వరావానద్య యత్వాహం సముచ్ఛ్రితమహాధ్వజమ్॥ 4
విగాహ్య తత్ పరానీకం గజవాజిరథాకులమ్।
శస్త్రప్రతాపనిర్వీర్యాన్ కురూన్ జిత్వాఽఽనయే పశూన్॥ 5
అలా సారథిని కోల్పోయిన నేను, సారథ్యపు నేర్పు లెరిగిన వేరొకనిని పొంది వెంటనే ఇపుడే వెళ్ళి పతాకాలు ఎత్తుకొని, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన శత్రుసైన్యంలో మునిగి, నా ఆయుధాల ప్రతాపంతో బలహీనులైన కౌరవులను జయించి పశువులను తిరిగి తీసుకొని వస్తాను. (4,5)
దుర్యోధనం శాంతనవం కర్ణం వైకర్తనం కృపమ్।
ద్రోణం చ సహపుత్రేణ మహేష్వాసాన్ సమాగతాన్॥ 6
విత్రాసయిత్వా సంగ్రామే దానవానివ వజ్రభృత్।
అనేనైవ ముహూర్తేన పునః ప్రత్యానయే పశూన్॥ 7
ఇంద్రుడు రాక్షసులను బెదరగొట్టినట్లు యుద్ధంలో గొప్పధనుస్సులను ధరించి వచ్చిన దుర్యోధనుని, (శంతనుకుమారుడగు) భీష్ముని, (సూర్యపుత్రుడగు) కర్ణుని, కృపాచార్యుని, అశ్వత్థామతో కూడిన ద్రోణాచార్యుని బెదరగొట్టి, క్షణంలో మరల పశువులను తిరిగి తేగలను.(6,7)
వి॥తె॥ ఇక్కడ తిక్కన "కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మత్సముద్యమ స్ఫురణము జూచి పార్థుఁడను బుద్ధి గలంగఁగ" అంటూ చక్కని రచనా శిల్పం ప్రదర్శించాడు. (చూడుడు విరా-అధ్యా-68శ్లో45. తె॥విరాట- 4-11)
శూన్యమాసాద్య కురవః ప్రయాన్త్యాదాయ గోధనమ్।
కిం ను శక్యం మయా కర్తుం యదహం తత్ర నాభవమ్॥ 8
రక్షణలేని స్థితిని గమనించి కౌరవులు గోధనాన్ని తోలుకొనొ పోతున్నారు. అచటలేని నేను ఏమి చేయగలుగుతాను? (8)
పశ్యేయురద్య మే వీర్యం కురవస్తే సమాగతాః।
కిం ను పార్థోఽర్జునః సాక్షాత్ అయమస్మాన్ ప్రబాధతే॥ 9
వచ్చిన కౌరవులు నేడు నా పరాక్రమం రుచి చూస్తారు. 'సాక్షాత్తు అర్జునుడా ఇతడు... మనలను మిక్కిలి బాధిస్తున్నాడు.' అని కౌరవులు అనుకోవాలి. (9)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తదర్జునో వాక్యం రాజ్ఞః పుత్రస్య భాషతః।
అతీతసమయే కాలే ప్రియాం భార్యామనిందితామ్॥ 10
ద్రుపదస్య సుతాం తన్వీం పాంచాలీం పావకాత్మజామ్।
సత్యార్జవగుణోపేతాం భర్తుః ప్రియహితే రతామ్॥ 11
ఉవాచ రహసి ప్రీతః కృష్ణాం సర్వార్థకోవిదః।
ఉత్తరం బ్రూహి కల్యాణి క్షిప్రం మద్వచనాదిదమ్॥ 12
వైశంపాయనుడు అన్నాడు. అలా అంటున్న రాజకుమారుని మాటలు విని అర్జునుడు అజ్ఞాతవాస సమయం ముగిసినందుకు ప్రీతిని పొందాడు. అన్ని ప్రయోజనాలను సిద్ధింపజేసుకొనే నేర్పు గలవాడు కావున ఏకాంతంలో, తన ప్రియమైన భార్య, నిందింప తగనిది, ద్రుపద మహారాజు కుమార్తె, యౌవనవతి, పాంచాల రాజకుమారి, అగ్నినుండి పుట్టినది, నిజమేపలుకుతూ, ఋజువుగ ప్రవర్తించేది, భర్తకు ఇష్టమై హితమైన పనియందే ఆసక్తి కలది, నల్లనిది అగు ద్రౌపదితో ఇలా అన్నాడు - శుభాంగీ! నామాటగా వెంటనే ఉత్తరునితో ఇలా చెప్పు. (10-12)
వి॥తె॥ ఇక్కడ తెలుగులో ద్రౌపది విని వెళ్ళి బృహన్నలతో చెప్పిందని మార్చాడు - ఆసమయంలో ఉత్తరుని మాటలు విన్న ద్రౌపదికి అమర్షము - అపహాసమూ కలిగాయనీ, అందులోనే మెరుపులాంటి ఆలోచన వచ్చిందని వ్రాశాడు. (విరా-4-13)
అయం వై పాండవస్యాసీత్ సారథిః సమ్మతో దృఢః।
మహాయుద్ధేషు సంసిద్ధః స తే యంతా భవిష్యతి॥ 13
దృఢంగా ఉన్న ఈ బృహన్నల అర్జునునకు రథం తోలేవాడు, ఇష్టుడు. రణ విజయుడు. అట్టివాడు నీకు సారథి అవుతాడు. (13)
వైశంపాయనుడు ఉవాచ
తస్య తద్ వచనం స్త్రీషు భాషతశ్చ పునః పునః।
న సామర్షత పాంచాలో బీభత్సోః పరికీర్తినమ్॥ 14
వైశంపాయనుడు కొనసాగించాడు. పాంచాల రాజకుమారియైన ఆ ద్రౌపది స్త్రీల మధ్య మాటిమాటికి అర్జునునితో పోల్చుకుంటూ పలుకుతున్న ఉత్తరుని మాటలను విని ఓర్చుకొనలేక పోయింది. (14)
అథైనముపసంగమ్య స్త్రీమధ్యాత్ సా తపస్వినీ।
వ్రీడమానేవ శనకైః ఇదం వచనమబ్రవీత్॥ 15
ఎంతో నిబ్బరంగల ఆమె స్త్రీల మధ్యనుండి ఉత్తరుని సమీపించి సిగ్గుపడుతున్నట్లు మెల్లగా ఇలా అంది. (15)
యోఽసౌ బృహద్వారణాభః యువా సుప్రియదర్శనః।
బృహన్నలేతి విఖ్యాతః పార్థస్యాసీత్ స సారథిః॥ 16
ధనుష్యనవరశ్చాసీత్ తస్య శిష్యో మహాత్మనః।
దృష్టపూర్వో మయా వీర చరన్త్యా పాండవాన్ ప్రతి॥ 17
యదా తత్ పావకో దానమ్ అదహత్ ఖాండవం మహత్।
అర్జునస్య తదానేన సంగృహీతా హయోత్తమాః॥ 18
పెద్దఏనుగులా ఉన్న యువకుడు, ప్రియదర్శనుడు అయిన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేశాడు. వీరుడా! ఇతడు మహాత్ముడైన ఆ అర్జునుడికి శిష్యుడు. ధనుర్విద్యలో అతనికి తీసిపోడు. పాండవుల దగ్గరున్న నేను పూర్వం చూశాను. గొప్పదైన ఖాండవ వనాన్ని దావానల (కార్చిచ్చు)మై అగ్ని తగుల బెడుతున్నప్పుడు ఇతడే అర్జునుడి గుర్రాల్ని అదుపు చేశాడు. (16-18)
తేన సారథినా పార్థః సర్వభూతాని సర్వశః।
అజయత్ ఖాండవప్రస్థే న హి యంతాస్తి తాదృశః॥ 19
ఈ సారథివల్లనే అర్జునుడు ఖాండవప్రస్థంలో అన్ని భూతాలనూ జయించాడు. ఇతనికి సాటియైన సారథి మరియొకడు లేడు గదా! (19)
వి॥ నిజానికి ఖాండవ దహనంలో అర్జునునికి సారథి లేడు.
ఉత్తర ఉవాచ
సైరంధ్రి జానాపి యువా మ
నపుంసకో నైవ భవేద్ యథాఽసౌ।
అహం న శక్నోమి బృహన్నలాం శుభే
వక్తుం స్వయం యచ్ఛ హయాన్ మమేతి వై॥ 20
ఉత్తరుడు చెపుతున్నాడు. సైరంధ్రీ! నీవెరిగిన ఈ యువకుడు నపుంసకుడు కానేరడు. శుభరూపిణీ! నేను స్వయమ్గా బృహన్నలతో నాగుర్రాలను తోలమని చెప్పలేను. (20)
ద్రౌపద్యువాచ
యేయం కుమారీ సుశ్రోణీ భగినీ తే యవీయసీ।
అస్యాః స వీర వచనం కరిష్యతి న సంశయః॥ 21
వీరుడా! చక్కని చిన్నది, నీ చెల్లెలున్నది గదా! అతడామె మాటను తప్పక పాటిస్తాడు. సందేహం లేదు. (21)
యది వై సారథిః స స్యాత్ కురూన్ సర్వాన్ న సంశయః।
జిత్వా గాశ్చ సమాదాయ ధ్రువమాగమనం భవేత్॥ 22
అతడే సారథి అయితే నిస్సందేహంగా కౌరవులందర్నీ జయించి, ఆవుల్ని తీసికొని రావడం తథ్యం. (22)
వి॥తె॥ ఇక్కడ తిక్కన "కౌరవసేనగాదు త్రిజగంబులు నొక్కట నెత్తివచ్చినన్ దేరు బృహన్నలావశగతిం జరియించిన గెల్వవచ్చు" అన్నాడు - అనగా "రథం బృహన్నలా వశమైతే గెలవవచ్చు" "యదివై సారథిప్స స్యాత్" అన్న సంస్కృతానికి మరింత విశాలార్థం చేకూర్చాడు తిక్కన. రథం ముందు సారథి వశం అవుతుంది. ఆసారథి రథికుని వశమవుతాడు. ముందుముందు సారథియే రథికుడవుతాడని సూచన ఇందులో కనబడుతుంది. సైరంధ్రి ఇంకా ఇలా సమర్థిస్తుంది కూడా-
తద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన! మున్నెఱుంగుదున్ కారణజన్మమై తనువికారము వచ్చినఁబెంపు దప్పునే! అని. (4-22)
ఏవముక్తః స సైరంధ్ర్యా భగినీం ప్రత్యభాషత।
గచ్ఛ త్వ మనవద్యాంగి తామానయ బృహన్నలామ్॥ 23
సైరంధ్రి ఇలా చెప్పాక అతడు సోదరితో 'శోభనాంగీ! నీవు వెళ్ళి ఆ బృహన్నలను తీసికొనిరా' అన్నాడు. (23)
సా భ్రాత్రా ప్రేషితా శీఘ్రమ్ అగచ్ఛన్నర్తనాగృహమ్।
యత్రాస్తే స మహాబాహుః ఛన్నః సత్రేన పాండవః॥ 24
సోదరునిచే పంపబడి ఉత్తర వెంటనే కపటవేషంలో తనను కప్పిపుచ్చుకొన్న అర్జునుడున్న నర్తనశాలకు వెళ్ళింది. (24)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే బృహన్నలాసారథ్యకథనే షట్ త్రింశోఽధ్యాయః॥ 36 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోగ్రహణపర్వమను ఉపపర్వమున ఉత్తరగోగ్రహణమున ద్రౌపది బృహన్నలా సారథ్యము గురించి చెప్పుట అను ముప్పది ఆరవ అధ్యాయము. (36)