55. ఏబది ఐదవ అధ్యాయము

అర్జునుడు కృపాచార్యునితో యుద్ధము చేయుట.

వైశంపాయన ఉవాచ
అపయాతే తు రాధేయే దుర్యోధనపురోగమాః।
అనీకేన యథా స్వేన శనైరార్ఛంత పాండవమ్॥ 1
వైశంపాయనుడిట్లన్నాడు. కర్ణుడు పారిపోగా దుర్యోధనాది కౌరవయోధులు తమతమ సేనలతో మెల్లగా అర్జునునివైపు నడవసాగారు. (1)
బహుధా తస్య సైన్యస్య వ్యూఢస్యాపతతః శరైః।
అధారయత వేగం సః వేలేవ తు మహోదధేః॥ 2
మహాసముద్రవేగాన్ని చెలియలికట్ట అడ్డగించినట్లు, వ్యూహాత్మకంగా అనేక భాగాలుగా, బాణవర్షం కురిపిస్తూ మీదికి వస్తున్న కౌరవసేన వేగాన్ని అర్జునుడు ఆపగలిగాడు. (2)
తతః ప్రహస్య బీభత్సుః కౌంతేయః శ్వేతవాహనః।
దివ్యమస్త్రం ప్రకుర్వాణః ప్రత్యాయాద్ రథసత్తమః॥ 3
యథా రశ్మిభిరాదిత్యః ప్రచ్ఛాదయతి మేదినీమ్।
తథా గాండీవనిర్ముక్తైః శరైః పార్థో దిశో దశ॥ 4
అప్పుడు శ్వేతవాహనుడైన అర్జునుడు నవ్వి దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ కౌరవసేనను సమీపించాడు. సూర్యుడు కిరణాలతో భూమిని కప్పివేసినట్లు అర్జునుడు గాండీవంనుండి వెలువడిన బాణాలతో పది దిక్కులనూ కప్పివేశాడు. (3,4)
న రథానాం న చాశ్వానాం న గజానాం చ వర్మణామ్।
అనివిద్ధం శితైర్బాణైః ఆసీద్ ద్వ్యంగులమంతరమ్॥ 5
కౌరవసేనలోని రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, వాటి నధిరోహించిన సైనికులు, వారి కవచాలు - అన్నింటిలో అర్జునుని వాడిబాణాలు నాటని చోటు రెండు అంగుళాలు కూడా లేదు. (5)
దివ్యయోగాచ్చ పార్థస్య హయానాముత్తరస్య చ।
శిక్షాశిల్పోపపన్నత్వాత్ అస్త్రాణాం చ పరిక్రమాత్।
వీర్యవత్త్వం ద్రుతం చాగ్ర్యం దృష్ట్వా జిష్ణోరపూజయన్॥ 6
అర్జునుని దివ్యాస్త్రప్రయోగాన్ని, ప్రయోహ క్రమాన్నీ, పరాక్రమాన్నీ, వేగాన్నీ, దూసుకొనిపోయే స్వభావాన్నీ, ఉత్తరుని అశ్వశిక్షణ, రథసంచాలనాలలోని కౌశలాన్నీ చూసి శత్రువులు సైతం కొనియాడారు. (6)
కాలాగ్నిమివ బీభత్సుం నిర్దహంతమివప్రజాః।
నారయః ప్రేక్షితుం శేకుః జ్వలంతమివ పావకమ్॥ 7
అర్జునుడు సమస్తలోకాలను దహించివేసే ప్రళయ కాలాగ్ని వలె శత్రువులను దహించసాగాడు. మండిపడే నిప్పులా కనిపిస్తున్న ఆ అర్జునుని శత్రువులు కనీసం చూడలేకపోయారు. (7)
తాని గ్రస్తాన్యనీకాని రేజురర్జునమార్గణైః।
శైలంప్రతి బలాభ్రాణి వ్యాప్తానీవార్కరశ్మిభిః॥ 8
అర్జునుని బాణాలచే కప్పివేయబడిన ఆ కౌరవ సేనలు కొండదగ్గర సూర్యకిరణాలు సోకిన మేఘ సమూహంలా ప్రకాశించాయి. (8)
అశోకానాం వనానీవ చ్ఛన్నాని బహుశః శుభైః।
రేజుః పార్థశరైస్తత్ర తదా సైన్యాని భారత॥ 9
భారతా! అర్జునుని బాణాలచే గాయపరచబడిన ఆ కౌరవసేనలు వివిధపుష్పాలతో ఆవరింపబడిన అశోకవనాలవలె ప్రకాశించాయి. (9)
ప్రజోఽర్జునశరైః శీర్ణం శుష్యత్ పుష్పం హిరణ్మయమ్।
ఛత్రాణి చ పతాకాశ్చ ఖే దధార సదాగతిః॥ 10
అర్జునుని బాణాల తాకిడిచే ఛిన్నభిన్నాలైన మాలలనుండి రాలిపడుతున్న బంగారు సంపెంగ పూలను, గొడుగులను, పతాకలను గాలి ఆకాశమందే పట్టి నిలిపింది. (10)
స్వబలత్రాసనాత్ త్రస్తాః పరిపేతుర్దిశో దశ।
రథాంగదేశానాదాయ పార్థచ్ఛిన్నయుగా హయాః॥ 11
అర్జునుడు శత్రురథాలను ఖండిస్తే, తమరథికులు భయపడటంతో తామూ భయపడిన గుఱ్ఱాలు కాడి విరిగిపోగా మిగిలిన రథ భాగాలను మీదికెత్తికొని పారిపోయాయి. (11)
కర్ణకక్షవిషాణేషు అంతరోష్ఠేషు చైవ హ।
మర్మస్వంగేషు చాహత్యాపాతయత్ సమరే గజాన్॥ 12
అప్పుడు అర్జునుడు యుద్ధంలో ఏనుగులను చెవులలో, కాళ్ళ సందుల్లో, దంతాల్లో, దౌడలపై, మర్మస్థానాల్లో కొట్టి నేలపై పడగొట్టాడు. (12)
కౌరవాగ్రగజానాం తు శరీరైర్గతచేతసామ్।
క్షణేన సంవృతా భూమిః మేఘైరివ నభస్తలమ్॥ 13
యుగాంతసమయే సర్వం యథా స్థావరజంగమమ్।
కాలక్షయమశేషేణ దహత్యగ్నిశిఖః శిఖీ।
తద్వత్ పార్థో మహారాజ దదాహ సమరే రిపూన్॥ 14
తే శరా ద్విట్ శరీరేషు యథైవ న స సజ్జిరే।
ద్విడనీకేషు బీభత్సోః న ససజ్జే రథ స్తదా॥ 21
అర్జునుడు ప్రయోగించిన బాణాలు శత్రువుల శరీరాలలో ఇమడలేదు. శరీరాలను ఛేదించుకొని బయటకు వచ్చాయి. అదే విధంగా అర్జునునిరథం శత్రుసేనలలో ఇమడలేదు. శత్రుసేనను చీల్చి దూసుకొని పోయింది. (21)
సతద్ విక్షోభయామాస హ్యరాతిబలమంజసా।
అనంతభోగో భుజగః క్రీడన్నివ మహార్ణవే॥ 22
లెక్కకు మించిన పడగలు గల నాగరాజు మహా సముద్రంలో ఆడుతూ సముద్రం కలచివేసినట్లు అర్జునుడు శత్రుబలాన్ని అలవోకగా కలచివేశాడు. (22)
అస్యతో నిత్యమత్యర్థం సర్వమేవాతిగస్తథా।
అశ్రుతః శ్రూయతే భూతైః ధనుర్ఘోషః కిరీటినః॥ 23
అర్జునుడు బాణప్రయోగం చేస్తూ ఉండగా గాండీవ ధనుస్సు నుండి తీవ్రంగా ధనుష్టంకారం వినవస్తోంది. ప్రాణులు పూర్వం ఎప్పుడూ వినని ఆ ధ్వని ఇతరశబ్దాల నన్నింటినీ మించి ఉంది. (23)
సంతతాస్తత్ర మాతంగాః బాణై రల్పాంతరాంతరే।
సంవృతాస్తేన దృశ్యంతే మేఘా ఇవ గభస్తిభిః॥ 24
అర్జునుని బాణాలు శత్రువుల ఏనుగుల శరీరాలపై అణువణువునా గ్రుచ్చుకొన్నాయి. దానితో అవి సూర్యకిరణాలు ఆవరించిన మేఘాల మాదిరిగా కనిపించాయి. (24)
దిశోఽమభ్రమతః సర్వాః సవ్యదక్షిణమస్యతః।
సతతం దృశ్యతే యుద్ధే సాయకాసనమండలమ్॥ 25
అర్జునుడు(కవ్వడి కాబట్టి) కుడి ఎడమ చేతులతో అన్ని దిక్కులకు బాణాలను గుప్పిస్తున్నాడు. దానితో రణరంగంలో అర్జునుని ధనుస్సు ఎప్పుడూ చక్రాకారంలో కనిపించింది. (25)
పతంత్యరూపేషు యథా చక్షూంషి న కదాచన।
న లక్ష్యేషు శరాః పేతుః తథా గాండీవధన్వనః॥ 26
కంటిచూపు రూపరహిత పదార్థాలపై ఎప్పుడూ పడదు. అట్లే అర్జునుని బాణాలు కూడా తాను గురిపెట్టని ఎవ్వరిమీదనూ పడటం లేదు. (26)
మార్గో గజసహస్రస్య యుగపద్ గచ్ఛతో వనౌ।
యథా భవేత్తథా జజ్ఞే రథమార్గః కిరీటినః॥ 27
గుంపుగా అడవిలో నడుస్తున్న వేల ఏనుగుల మార్గం ఏరీతిగా ఉంటుందో అదే విధంగా అర్జునుని రథమార్గం కన్పట్టింది. (27)
నూనం పార్థజయైషిత్వాత శక్రః సర్వామరైః సహ।
హంత్యస్మానిత్యమన్యంత పార్థేన నిహతాః పరే॥ 28
అర్జునుని గెలుపు కోరుతున్న ఇంద్రుడే దేవతలందరి సహకారంతో తమను చంపుతున్నట్లుగా అర్జునునిచే పడిన శత్రువులు భావించారు. (28)
ఘ్నంతమత్యర్థమహితాన్ విజయం తత్ర మేనిరే।
కాలమర్జునరూపేణ సంహరంతమివ ప్రజాః॥ 29
శత్రువులను లెక్కకు మిక్కిలిగా చంపివేస్తున్న అర్జునుని చూసి సాక్షాత్తు యమధర్మరాజే అర్జునరూపంలో తమను చంపుతున్నట్లు ప్రజలు భావించారు. (29)
కురుసేనాశరీరాణి పార్థేనైవాహతాన్యపి।
సేదుః పార్థహతానీవ పార్థకర్మానుశాసనాత్॥ 30
కురుసేనల శరీరాలు అర్జునునిచేత కొట్ట బడ్డాయి. అయితే అవి అర్జునునిచేత కొట్టబడినట్లే ఛిన్నా భిన్న మయ్యాయి. అర్జునుని కర్మకు మరొకటి సాటిరాదు మరి. (30)
ఓషధీనాం శిరాంసీవ ద్విషచ్ఛీర్షాణి సోఽన్వయాత్।
అవనేశుః కురూణాం హి వీర్యాణ్యర్జునజాద్ భయాత్॥ 31
ధాన్యపుకంకులను త్రుంచినట్టు అర్జునుడు శత్రువుల తలలు త్రుంచసాగాడు. వారి పరాక్రమాలు అర్జున భయంతో వ్రాలిపోసాగాయి. (31)
అర్జునానిలభిన్నాని వనాన్యర్జునవిద్విషామ్।
చక్రుర్ణోహితధారాభిః ధరణీం లోహితాంతరామ్॥ 32
అర్జునశత్రువులనే అడవులు అర్జునుడనే గాలికి విరిగి నెత్తుటిధారలతో నేలకొరిగి భూమిని ఎఱ్ఱ బరిచాయి. (32)
లోహితేన సమాయుక్తైః పాంసుభిః పవనోద్ధృతైః।
బభూవుర్లోహితాస్తత్ర భృశమాదిత్యరశ్మయః॥ 33
నెత్తుటితో తడిసి గాలికి పైకెగసిన దుమ్మువలన గగనతలంలో సూర్యకిరణాలు మరీ ఎఱ్ఱబడ్డాయి. (33)
సార్కం ఖం తత్ క్షణేనాసీత్ సంధ్యాయామివ లోహితమ్।
అప్యస్తం ప్రాప్య సూర్యోఽపి నివర్తేత న పాండవః॥ 34
సూర్యుడు ఉండగానే సంధ్యాకాలంలో వలె ఆకాశం ఎఱ్ఱబారింది. అస్తమించిన సూర్యుడైనా తన కర్తవ్యానికి దూర మవుతాడేమో కానీ అర్జునుడు మాత్రం శత్రుపీడన నుండి వెనుకకు మరల లేడు. (34)
తా సర్వాన్ సమరే శూరాః పౌరుషే సమవస్థితాన్।
దివ్యైరస్త్రై రచింత్యాత్మా సర్వానార్ఛద్ ధనుర్ధరాన్॥ 35
ఊహింపవీలుగాని స్వభావంకలిగి, శూరుడయిన అర్జునుడు పౌరుషంతో రణరంగంలో నిలిచిన ఆ విలుకాండ్రందరిని తన దివ్యాస్త్రాలతో ఆక్రమించాడు. (35)
స తు ద్రోణం త్రిసప్తత్యా క్షురప్రాణాం సమార్పయత్।
దుఃసహం దశభిర్బాణైః ద్రౌణిమష్టాభిరేవ చ॥ 36
దుఃశాసనం ద్వాదశభిః కృపం శారద్వతం త్రిభిః।
భీష్మం శాంతననం షష్ట్వా రాజానం చ శతేన హ।
కర్ణం చ కర్ణినా కర్ణే వివ్యాధ పరవీరహా॥ 37
అర్జునుడు వాడియైన బాణాలు డెబ్బది మూడింటితో ద్రోణును, పదింటితో దుస్సహుని, ఎనిమిదింటితో అశ్వత్థామను, పండ్రెండింటితో దుశ్శాసనుని, మూడింటితో కృపుని, అరువదింటితో భీష్ముని, నూరింటితో దుర్యోధనుని కొట్టాడు. శత్రుసంహారకుడైన ఆ అర్జునుడు ఒక బాణంతో కర్ణుని గూబమీద కొట్టాడు. (36,37)
తస్మిన్ విద్ధే మహేష్వాసే కర్ణే సర్వాస్త్రకోవిదే।
హతాశ్వసూతే విరథే తతోఽనీక మభజ్యతః॥ 38
సర్వాస్త్రకోవిదుడై గొప్పవిలుకాడైన ఆ కర్ణుడు సూతుడూ, గుఱ్ఱాలూ చనిపోతే విరథుడై దెబ్బతిని యుండగా సేన అంతా చెదరిపోయింది. (38)
తత్ ప్రభగ్నం బలం దృష్ట్వా పార్థమాజి స్థితం పునః।
అభిప్రాయం సమాజ్ఞాయ వైరాటిరిదమబ్రవీత్॥ 39
ఆస్థాయ సుచిరం జిష్ణో రథం సారథినా మయా।
కతమం యాస్యసేఽనీకమ్ ఉక్తో యాస్యామ్యహం త్వయా॥ 40
అలా చెదరిపోయిన కౌరవసేననూ, ఇంకా రణరంగ మందే నిలిచియున్న అర్జునునీ చూసి అభిప్రాయ మెరిగిన ఉత్తరుడు "జయశీలీ! నా సారథ్యంలో అందమైన రథంపై నిలిచిన నీవు ఏ వీరునివైపు వెళ్లా లనుకొంటున్నావు? ఆదేశిస్తే అటే రథాన్ని నడుపుతాను" అన్నాడు. (39,40)
లోహితాశ్వమరిష్టం యం వైయాఘ్రమనుపశ్యసి।
నీలాం పతాకామాశ్రిత్య రథే తిష్ఠంతముత్తర॥ 41
కృపస్యైతదనీకాగ్ర్యం ప్రాపయస్వైతదేవ మామ్।
ఏతస్య దర్శయిష్యామి శీఘ్రాస్త్రం దృఢధన్వినః॥ 42
అర్జునుడిలా అన్నాడు. ఉత్తరా! ఎఱ్ఱని గుఱ్ఱాలు, నల్లని పతాకగల రథంపై పులితోలు కప్పుకొని సుఖంగా కూర్చొనియున్న మహాపురుషుని చూస్తున్నావు గదా! ఆయన కృపాచార్యుడు. శ్రేష్ఠమైన సేనను నడుపుతున్నాడు. అటువైపు మన రథాన్ని నడిపించు, విలుకాడైన ఆయనకు నా బాణవేగాన్ని చూపిస్తాను. (41, 42)
ధ్వజే కమండలుర్యస్య శాతకౌంభమయః శుభః।
ఆచార్య ఏష హి ద్రోణః సర్వశస్త్రభృతాం వరః॥ 43
ధ్వజంపై అందమైన బంగారు కమండలువు గల ఆయనే శస్త్రధరులలో మేటి ద్రోణాచార్యుడు. (43)
సదా మమైష మాన్యస్తు సర్వశస్త్రభృతామపి।
సుప్రసన్నం మహావీరం కురుష్వైనం ప్రదక్షిణమ్॥ 44
ఆ ద్రోణాచార్యుడు నాకే గాదు శస్త్రధారులందరకూ పూజనీయుడు. ప్రసన్నుడైన ఆ మహావీరునకు ప్రదక్షిణంగా మన రథాన్ని నడుపు. (44)
అత్రైవ వావరోహైనమ్ ఏష ధర్మః సనాతనః।
యది మే ప్రథమం ద్రోణః శరీరే ప్రహరిష్యతి।
తతోఽస్య ప్రహరిష్యామి నాస్య కోపో భవేదితి॥ 45
ఇప్పుడే ఈయనను పూజించి యుద్ధసన్నద్ధుడవై రథంపై నిలు. ఇది సనాతన ధర్మం. ద్రోణుడు నా శరీరాన్ని కొట్టినతరువాత నేను ఆయనను కొడతాను, అప్పుడది ఆయనకు కోపకారణంకాదు. (45)
అస్యావిదూరే హి ధనుః ధ్వజాగ్రే యస్య దృశ్యతే।
ఆచార్య స్యైష పుత్రో వై అశ్వత్థామా మహారథః॥ 46
సదా మమైష మాన్యస్తు సర్వశస్త్రభృతామపి।
ఏతస్య త్వం రథం ప్రాప్య నివర్తేథాః పునః పునః॥ 47
ఆ ద్రోణాచార్యునకు అల్లంతదూరంలో రథ పతాకపై విల్లున్నవాడే మహారథుడైన అశ్వత్థామ, ద్రోణుని కుమారుడు. ఆయన సదా నాకూ, శస్త్రధారులందరకూ పూజనీయుడు. ఆయన రథాన్ని సమీపించి నీవు మరల మరల వెనుదిరుగవలసి ఉంటుంది. (46,47)
య ఏషతు రథానీకే సువర్ణకవచావృతః।
సేనాగ్ర్యేణ తృతీయేన వ్యావహార్యేణ తిష్ఠతి॥ 48
యస్య నాగో ధ్వజాగ్రేఽసౌ హేమకేతనసంవృతః।
ధృతరాష్ట్రాత్మజః శ్రీమాన్ ఏష రాజా సుయోధనః॥ 49
రథసేనమధ్యలో బంగారు కవచం ధరించి యుద్ధ సన్నద్ధమై అలుపెరుగని సేనతో నిలిచియున్న వాడు అడుగో సువర్ణమయకేతనంగల ధ్వజంపై నాగచిహ్నం గలవాడు ఆయనే ధృతరాష్ట్రసుతుడు, శ్రీమంతుడు అయిన సుయోధనమహారాజు. (48,49)
వి॥తె॥ తెలుగులో నాగశబ్దానికి పాము అని అర్థం చెప్పి, తిక్కన దుర్యోధనుని ఉరగకేతనుడని, అహికేతనుడనీ చెప్పాడు. సంస్కృత వ్యాఖ్యాతలు ఏనుగు అని నాగశబ్దానికిక్కడ అర్థం చెప్పారు.
ఏతస్యాభిముఖం వీర రథం పరరథారుజమ్।
ప్రాపయస్వైష రాజా హి ప్రమాధీ యుద్ధదుర్మదః॥ 50
వీరా! శత్రురథాలను ముక్కలు చేయగల ఈ నీ రథాన్ని సుయోధనునకు అభిముఖంగా నడిపించు. ఈ రాజు శత్రువులను మథించే యుద్ధోన్మాదం గలవాడు. (50)
ఏష ద్రోణస్య శిష్యాణాం శీఘ్ఱాస్త్రే ప్రథమో మతః।
ఏతస్య దర్శయిష్యామి శీఘ్ఱాస్త్రం విపులం రణే॥ 51
వేగంగా అస్త్రాలను ప్రయోగించటంలో సుయోధనుడు ద్రోణశిష్యులలో అగ్రగణ్యుడు. ఈ నాటి యుద్ధంలో వేగంగా అస్త్రప్రయోగం చేసే కళను ఈయనకు రుచిచూపిస్తాను. (51)
నాగకక్షా తు రుచిరా ధ్వజాగ్రే యస్య తిష్ఠతి।
ఏష వైకర్తనః కర్ణో విదితః పూర్వమేవ తే॥ 52
ధ్వజాగ్రంపై అందమైన నాగకక్ష గుర్తు గలవాడు కర్ణుడని నీకు ముందే తెలుసునుగదా! (52)
ఏతస్య రథమాస్థాయ రాధేయస్య దురాత్మనః।
యత్తో భవేథాః సంగ్రామే స్పర్థతే హి మయా సదా॥ 53
దురాత్మకుడైన ఈ కర్ణుని రథాన్ని సమీపించి సావధానంగా నిలు, ఇతడెప్పుడూ యుద్ధంలో నాతో పోటీపడుతుంటాడు. (53)
యస్తు నీలానుసారేణ పంచతారేణ కేతునా।
హస్తావాపీ బృహద్ధన్వా రథే తిష్ఠతి వీర్యవాన్॥ 54
యస్య తారార్కచిత్రోఽసౌ ధ్వజో రథవరే స్థితః।
యస్యైతత్ పాండురం ఛత్రం విమలం మూర్ధ్ని తిష్ఠతి॥ 55
మహతో రథవంశస్య నానాఢ్Hవజపతాకినః।
బలాహకాగ్రే సూర్యో వా య ఏష ప్రముఖే స్థితః॥ 56
హైమం చంద్రార్కసంకాశం కవచం యస్య దృశ్యతే।
జాతరూపశిరస్త్రాణం మనస్తాపయతీవ మే॥ 57
ఏష శాంతనవో భీష్మః సర్వేషాం నః పితామహః।
రాజశ్రియాభివృద్ధశ్చ సుయోధనవశానుగః॥ 58
నల్లనిరంగుతో అయిదు నక్షత్రాల గుర్తుతో ప్రకాశిస్తున్న ధ్వజం, చేతితొడుగులు, పెద్దధనుస్సు గలిగి రథంపై నిలిచియున్నవాడు, నక్షత్ర సూర్య చిహ్నాలతో చిత్రితమైన ధ్వజం, తలపై తెల్లని గొడుగులతో రథంపై నిలిచి యున్నవాడు, నానావిధ ధ్వజపతాకలు గల రథ సమూహంలో మేఘాలముందు సూర్యునివలె అగ్రభాగాన నిలిచి, సూర్య చంద్ర సమాన మైన బంగారు కవచం, బంగారు శిరస్త్రాణం ధరించి నామనస్సును తపింపజేస్తున్న వాడు అడుగో ఆయనే శంతనుకుమారుడు భీష్ముడు. మాకందరకును పితామహుడు. రాజాశ్రయంలో నున్నవాడు, సుయోధనుని మాట మేరకు నడుచుకొనేవాడు.' (54-58)
పశ్చాదేష ప్రయాతవ్యః న మే విఘ్నకరో భవేత్।
ఏతేన యుధ్యమానస్య యత్తః సంయచ్ఛ మే హయాన్॥ 59
ఈయన నా మార్గానికి అడ్డురాడు. కాబట్టి తర్వాత ఈయనకు ఎదురేగవచ్చు. ఈయనతో యుద్ధం చేస్తున్న సమయంలో సావధానంగా గుఱ్ఱాలను అదుపు చేసుకోవాలి. (59)
తతోఽభ్యవహదవ్యగ్రః వైరాటిః సవ్యసాచినమ్।
యత్రాతిష్ఠత్ కృపో రాజన్ యోత్స్యమానో ధనంజయమ్॥ 60
రాజా! ఆ మాటలు విన్న ఉత్తరుడు సావధానుడై యుద్ధసన్నద్ధుడై యున్న కృపుని దగ్గరకు అర్జునుని కొనిపోయాడు. (60)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణ పర్వణి అర్జున కృపసంగ్రామే నామ ఏకోన పంచపంచాశత్తమోఽధ్యాయః॥ 55 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
అర్జునకృపసంగ్రామ మను ఏబదిఐదవ అధ్యాయము. (55)
ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష న చ కశ్చిత్ సృణోతి మే।
ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే॥