58. ఏబదియెనిమిదవ అధ్యాయము
అర్జునుడు ద్రోణునితో యుద్ధము చేయుట.
వైశంపాయన ఉవాచ
కృపేఽపనీతే ద్రోణస్తు ప్రగృహ్య సశరం ధనుః।
అభ్యద్రవదనాధృష్యః శోణాశ్వః శ్వేతవాహనమ్॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కృపాచార్యుడు రణభూమినుండి తొలగింపబడిన తరువాత ఎఱ్ఱని గుఱ్ఱాలతో, ఎదురులేని ద్రోణుడు ధనుర్బాణాలు చేత బట్టి శ్వేతవాహనుడైన అర్జునుని మీదికి వచ్చాడు. (1)
స తు రుక్మరథం దృష్ట్వా గురుమాయాంతమంతికాత్।
అర్జునో జయతాం శ్రేష్ఠః ఉత్తరం వాక్యమబ్రవీత్॥ 2
బంగారురథాన్ని ఎక్కి తన దగ్గరకే వస్తున్న ద్రోణాచార్యుని చూసి జయశీలి అర్జునుడు ఉత్తరునితో ఇలా అన్నాడు. (2)
అర్జున ఉవాచ
యత్రైషా కాంచనీ వేదీ ధ్వజే యస్య ప్రకాశతే।
ఉచ్ఛ్రితా ప్రవరే దండే పతాకాభిరలంకృతా।
అత్ర మాం వహ భద్రం తే ద్రోణానీకాయ సారథే॥ 3
అర్జునుడిలా అన్నాడు. 'సారథీ! నీకు శుభం కలుగుతుంది. రథధ్వజంపై ఎత్తయిన గెడకఱ్ఱపై పతాకలపై ప్రకాశిస్తున్న కాంచనమయవేదొ గల రథమే ద్రోణాచార్యునిది. ఆ సేనవైపు నన్ను నడుపు. (3)
అశ్వాః శోణాః ప్రకాశంతే బృహంతశ్చారువాహినః।
స్నిగ్ధవిద్రుమసంకాశాః తామ్రాస్యాః ప్రియదర్శనాః।
యుక్తా రథవరే యస్య సర్వశిక్షావిశారదాః॥ 4
దీర్ఘబాహుర్మహాతేజాః బలరూపసమన్వితః।
సర్వలోకేషు విశ్రాంతః భారద్వాజః ప్రతాపవాన్॥ 5
సమస్త శిక్షణలో నైపుణ్యం కలిగి, నిగనిగలాడే పగడాలవలె ఎఱ్ఱని ముఖాలు గలవి, అందమై, చక్కగా రథాన్ని లాగే, పెద్ద, ఎఱ్ఱని గుఱ్ఱాలు గల ఆ శ్రేష్ఠరథంపై నున్నవాడు ద్రోణాచార్యుడు. ఆయన దీర్ఘబాహువు, తేజస్వి, బలరూప సంపన్నుడు, పరాక్రమశాలి, లోకప్రసిద్ధుడుకూడా. (4,5)
బుద్ధ్యా తుల్యో హ్యుశనసా బృహస్పతిసమో నయే।
వేదాస్తథైవ చత్వారః బ్రహ్మచర్యం తథైవ చ॥ 6
ససంహారాణి సర్వాణి దివ్యాన్యస్త్రాణి మారిష।
ధనుర్వేదశ్చ కార్స్న్యేన యస్మిన నిత్యం ప్రతిషీతః॥ 7
ఆర్యాః ఆయన బుద్ధిలో శుక్రాచార్యుడు. నీతిలో బృహస్పతి. నాలుగు వేదాలు, బ్రహ్మచర్యం, ఉపసంహారవిధానంతో కూడ అన్ని దివ్యాస్త్రాలు, సమస్త ధనుర్వేద విద్య ఆయనలో స్థిరంగా ఉంటాయి. (6,7)
క్షమా దమశ్చ సత్యం చ ఆనృశంశ్యమథార్జవమ్।
ఏతే చాన్యేచ బహవః యస్మిన్ నిత్యం ద్విజే గుణాః॥ 8
ఆ బ్రాహ్మణునిలో క్షమ, నిగ్రహం, సత్యం, కోమలత్వం, ఋజుత్వం - ఇంకా చాలా సుగుణాలు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి. (8)
తేనాహం యోద్ధుమిచ్ఛామి మహాభాగేన సంయుగే।
తస్మాత్ తం ప్రాపయాచార్యం క్షిప్రముత్తర వాహయ॥ 9
ఈ రణభూమిలో ఆ మహానుభావునితో యుద్ధం చేయాలని ఉంది. కాబట్టి ఉత్తరా! రథాన్ని నడుపు. నన్ను వెంటనే ఆయన దగ్గరకు చేర్చు.' (9)
వైశంపాయన ఉవాచ
అర్జునేనైవముక్తస్తు వైరాటిర్హేమభూషణాన్।
చోదయామాస తానశ్వాన్ భారద్వాజరథం ప్రతి॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! అర్జునుడు అలా అనగానే ఉత్తరుడు సువర్ణాభరణాలు గల ఆ అశ్వాలను ద్రోణుని వైపు నడిపించాడు. (10)
తమాపతంతం వేగేన పాండవం రథినాం వరమ్।
ద్రోణః ప్రత్యుద్యయౌ పార్థం మత్తో మత్తమివ ద్విపమ్॥ 11
వేగంగా తన మీదకు వస్తున్న రథికశ్రేష్ఠుడైన ఆ అర్జునుని చూసి మదపుటేనుగు మదపుటేనుగును డీకొన్నట్టు ద్రోణుడు ఎదిరించాడు. (11)
తతః ప్రాధ్మాపయచ్ఛంఖం భేరీశతనినాదినమ్।
ప్రచుక్షుభే బలం సర్వమ్ ఉద్భూత ఇవ సాగరః॥ 12
ఆ తరువాత వందల నగారాల ధ్వనితో సమాన మైన ధ్వని చేసే శంఖాన్ని ద్రోణుడు పూరించాడు. అది విని సేన మొత్తం పోటెత్తిన సముద్రంలా కలత పడింది. (12)
అథ శోణాన్ సదశ్వాంస్తాన్ హంసవర్ణైర్మనోజవైః।
మిశ్రితాన్ సమరే దృష్ట్వా వ్యస్మయంత రణే నరాః॥ 13
మనోవేగంగల అర్జునుని తెల్లనిగుఱ్ఱాలను ద్రోణుని ఎఱ్ఱని మేలిజాతి గుఱ్ఱాలు సమీపిస్తే రణభూమిలో నున్నవారంతా ఆశ్చర్యపోయారు. (13)
తౌ రథౌ వీర్యసంపన్నౌ దృష్ట్వా సంగ్రామమూర్ధని।
ఆచార్య శిష్యావజితా కృతవిద్యా మనస్వినౌ॥ 14
సమాశ్లిష్టా తదాన్యోన్యం ద్రోణపార్థౌ మహాబలౌ।
దృష్ట్వా ప్రాకంపత ముహుః భరతానాం మహద్బలమ్॥ 15
గురుశిష్యులయిన ద్రోణార్జునులు ఇరువురూ మహారథులు, పరాక్రమసంపన్నులు, అభిమానవంతులు, విలువిద్యలో నిష్ణాతులు కూడా. రణరంగపు మొనలో ఓటమినెరుగని వారిద్దరు ఎవరి రథంపై వారుండియే ఒకరినొకరు కౌగిలించు కొన్నారు. అదృశ్యాన్ని చూసి కౌరవుల(భరత వంశస్థుల) ఆ మేటిసేన పదే పదే వణికిపోయింది. (14,15)
హర్షయుక్త స్తతః పార్థః ప్రహసన్నివ వీర్యవాన్।
రథం రథేన ద్రోణస్య సమాసాద్య మహారథః॥ 16
అభివాద్య మహాబాహుః సామపూర్వమిదం వచః।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా కౌంతేయః పరవీరహా॥ 17
తరువాత శత్రుసంహారకుడైన మహారథుడు, మహాపరాక్రమశాలి, మహాబాహువు అయిన అర్జునుడు పరమానందపడి తన రథాన్ని ద్రోణాచార్యుని రథానికి దగ్గరగా తీసికొనిపోయి నమస్కరించి నవ్వుతూ సౌమ్యంగా మధురంగా ఇలా అన్నాడు. (16,17)
ఉషితాః స్మో వనే వాసం ప్రతికర్మ చికీర్షవః।
కోపం నార్హసి నః కర్తుం సదా సమరదుర్జయ॥ 18
అహం తు ప్రహృతే పూర్వం ప్రహరిష్యామి తేఽనఘ।
ఇతి మే వర్తతే బుద్ధిః తద్ భవాన్ కర్తుమర్హసి॥ 19
'అనఘా! యుద్ధంలో తమరు ఎప్పుడూ దుర్జయులే. ప్రతీకారదృష్టితోనే మేము వనవాసం చేశాము. ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడ్డాము. తమరు మాపై కోపింపవలదు. ముందుగా తమరు నన్ను కొట్టితే తరువాత తమరిని కొట్టాలని నా అభిమతం. కాబట్టి తమరే ముందు నన్ను కొట్టండి.' (18,19)
తహోఽస్మై ప్రాహిణోద్ ద్రోణః శరానధికవింశతిమ్।
అప్రాప్తాంశ్చైవ తాన్ పార్థః చిచ్ఛేద కృతహస్తవత్॥ 20
తరువాత ద్రోణాచార్యుడు అర్జునునిపై ఇరువది యొక్క బాణాలను ప్రయోగించాడు. కానీ అర్జునుడు వాటినన్నింటినీ ఎంతో నేర్పుగల వానివలె తన దగ్గరకు చేరకముందే కండించాడు. (20)
తతః శరసహస్రేణ రథం పార్థస్య వీర్యవాన్।
అవాకిరత్ తతో ద్రోణః శీఘ్రమస్త్రం విదర్శయన్॥ 21
అపుడు పరాక్రమశాలి అయిన ద్రోణుడు తన అస్త్రవిద్యానైపుణ్యాన్నీ వేగాన్నీ ప్రదర్శిస్తూ అర్జునుని రథంపై వేయిబాణాలను కురిపించాడు. (21)
హయాంశ్చ రజతప్రఖ్యాన్ కంకపత్రైః శిలాశితైః।
అవాకిరదమేయాత్మా పార్థం సంకోపయన్నివ॥ 22
లెక్కలేని ఆత్మబలంగల ఆ ద్రోణుడు సాన పెట్టబడి, పక్షి ఈకలు గల బాణాలను వెండిలా మెరిసి పోతున్న అర్జునుని గుఱ్ఱాలపై అర్జునునిలో కోసం రగుల్కొల్పుతున్నట్టు ప్రయోగించాడు. (22)
ఏవం ప్రవవృతే యుద్ధం భారద్వాజకిరీటినోః।
సమం విముంచతో స్సంఖ్యే విశిఖాన్ దీప్తతేజసః॥ 23
ఈ విధంగా రణభూమిలో సమానస్థాయిలో ఒకరిపైనొకరు మెరిసిపోతున్న బాణలు ప్రయోగిస్తున్న ద్రోణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. (23)
తావుభౌ ఖ్యాతకర్మాణౌ ఉభౌ వాయుసమౌ జవే।
ఉభౌ దివ్యాస్త్రవిదుషౌ ఉభావుత్తమతేజసౌ।
క్షిపంతౌ శరజాలాని మోహయామాసతుర్నృపాన్॥ 24
ద్రోణార్జును లిద్దరూ ప్రసిద్ధపరాక్రమవంతులు. ఇద్దరూ వాయువేగం గలవారు. ఇద్దరూ దివ్యాస్త్ర సంపన్నులు. ఇద్దరూ ఉత్తమ తేజస్సు గలవారు. ఆ ఇరువురూ బాణసమూహాలను ప్రయోగిస్తూ రాజులను మోహింప జేశారు. (24)
వ్యస్మయంత తతో యోధాః యే తత్రాసన్ సమాగతాః।
శరాన్ విసృజతో స్తూర్ణం సాధు సాధ్విత్యపూజయన్॥ 25
అక్కడ చేరిన యోధులంతా ఆశ్చర్యపడుతూ, వేగంగా బాణాలను వదలుతున్న ఆ ఇద్దరినీ 'భళీ భళీ; అని ప్రశంసించారు. (25)
ద్రోణం హి సమరే కోఽన్యః యోద్ధుమర్హతి ఫాల్గునాత్।
రౌద్రః క్షత్రియ ధర్మోఽయం గురుణా యదయుధ్యత।
ఇత్యబ్రువన్ జనాస్తత్ర సంగ్రామశిరసి స్థితాః॥ 26
అనిమొనలో నున్న జనులందరూ "ద్రోణాచార్యునితో పోరాడటం ఆర్జునునకే చెల్లింది. క్షత్రియధర్మం చాలా క్రూరమైనది. అందుకే గురువుతో కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది" అని అనుకొన్నారు. (26)
వీరౌ తావభిసంరబ్ధౌ సంనికృష్టౌ మహాభుజౌ।
ఛాదయేతాం శరవ్రాతైః అన్యోన్యమపరాజితౌ॥ 27
మహాభుజులు ద్రోణార్జునులు కోపంతో దగ్గరై ఒకరినొకరు బాణసమూహాలతో కప్పి వేశారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఓటమి నంగీకరించే వారు కాదు. (27)
విస్ఫార్య సుమహచ్చాపం హేమపృష్ఠం దురాసదమ్।
భారద్వాజోఽథ సంక్రుద్ధః ఫాల్గునం ప్రత్యవిధ్యత॥ 28
ఆపై ద్రోణాచార్యుడు మిక్కిలి కోపించి బంగారు తొడుగుతో, ఇతరులకు పొందశక్యం కాని ధనుస్సు నెక్కుపెట్టి అర్జునుని గాయపరిచాడు. (28)
స సాయకమయైర్జాలైః అర్జునస్య రథం ప్రతి।
భానుమద్భిః శిలాధౌతైః భానోరాచ్ఛాదయత్ ప్రభామ్॥ 29
ద్రోణాచార్యుడు అర్జునుని రథంపై బాణాల వలను కప్పివేశాడు. అంతేగాక సానపెట్టబడి తేజస్సు గల బాణాలతో సూర్యకాంతిని సైతం కప్పివేశాడు. (29)
పార్థం చ సుమహాబాహుః మహావేగైర్మహారథః।
వివ్యాధ నిశితైర్బాణైః మేఘో వృష్ట్యేవ పర్వతమ్॥ 30
మేఘం పర్వతంపై కురిసిన రీతిగా మహాబాహువు, మహారథుడు అయిన ద్రోణుడు వాడియై తీవ్ర వేగంగల బాణాలతో అర్జునుని గాయపరిచాడు. (30)
తథైవ దివ్యం గాండీవం ధనురాదాయ పాండవః।
శత్రుఘ్నం వేగవాన్ హృష్టః భారసాధనముత్తమమ్॥ 31
విససర్జ శరాంశ్చిత్రాన్ సువర్ణవికృతాన్ బహూన్।
నాశయన్ శరవర్షాణి భారద్వాజస్య వీర్యవాన్।
తూర్ణం చాపవినిర్ముక్తైః తదద్భుతమివాభవత్॥ 32
అదే విధంగా హర్షనిర్భరుడై వేగశాలి అయిన పాండుకుమారుడు అర్జునుడు భారాన్ని సహించి శత్రువులను సంహరించగలిగే ఉత్తమమూ, దివ్యమూ అయిన గాండీవాన్ని ధరించి స్వర్ణభూషితాలైన అనేక విచిత్రబాణాల వర్షాన్ని కురిపించాడు. పరాక్రమశాలి అయిన పార్థుడు తన వింటి నుండి వెలువడిన శరవర్షంతో ద్రోణాచార్యుడు కురిపించిన బాణవర్షాన్ని నశింప జేశాడు. అది అద్భుతదృశ్యమైంది. (31,32)
స రథేన చరన్ పార్థః ప్రేక్షణీయో ధనంజయః।
యుగపద్ దిక్షు సర్పాసు సర్వతోఽస్త్రాణ్యదర్శయత్॥ 33
ఏకచ్ఛాయమివాకాశం బాణైశ్చక్రే సమంతతః।
నాదృశ్యత తదా ద్రోణః నీహారేణేవ సంవృతః॥ 34
రథంపై విహరిస్తున్న ధనంజయుడు అందరికీ చూడదగిన వాడయ్యాడు. అన్ని దిక్కులా ఒక్క మారుగా బాణవర్షాన్ని కురిపించి ఆకాశాన్ని అంతటా ఆవరించి అంధకారనిమగ్నం చేశాడు. ఆ సమయంలో మంచు కప్పినట్లై ద్రోణుడు కూడా కనిపించలేదు. (33,34)
తస్యాభవత్ తదా రూపం సంవృతస్య శరోత్తమైః।
జాజ్వల్యమానస్య తదా పర్వతస్యేవ సర్వతః॥ 35
బాణాలతో కప్పబడిన అప్పటి ద్రోణుని శరీరం అన్ని వైపుల మండుతున్న పర్వతం వలె కనిపించింది. (35)
దృష్ట్వా తు పార్థస్య రణే శరైః స్వరథమావృతమ్।
స విస్ఫార్య ధనుఃశ్రేష్ఠం మేఘస్తనితనిస్వనమ్॥ 36
అగ్నిచక్రోపమం ఘోరం వ్యకర్షత్ పరమాయుధమ్।
వ్యశాతయచ్ఛరాంస్తాంస్తు ద్రోణః సమితిశోభనః॥ 37
రణరంగంలో రాణింపుగల ద్రోణుడు అర్జునుని బాణాలచే కప్పబడిన తనరథాన్ని చూసి ఉఱుములా ధ్వనించే తనపరమాయుధాన్ని - శ్రేష్ఠధనుస్సును - అగ్నిచక్రంలాగా భయంకరంగా లాగాడు. అర్జునుడు ప్రయోగించిన బాణాలను దానితో రూపుమాపాడు. (36,37)
మహానభూత్ తతఃశబ్దః వంశానామివ దహ్యతామ్॥ 38
అప్పుడు తగులబడుతున్న వెదురుబొంగులేమో అన్నట్లు పెద్ద ధ్వని కలిగింది. (38)
జాంబూనదమయైః పుంఖైః చిత్రచాపవినిర్గతైః।
ప్రాచ్ఛాదయదమేయాత్మా దిశః సూర్యస్య చ ప్రభమ్॥ 39
అమేయమనోబుద్ధులు గల ఆ ద్రోణుడు తన ధనుస్సునుండి వెలువడిన బంగారుబాణాలతో దిక్కులను, సూర్యకాంతిని కూడా కప్పివేశాడు. (39)
తతః కనకపుంఖానాం శరాణాం నతపర్వణామ్।
వియచ్చరాణాం వియతి దృశ్యంతే బహవో వ్రజాః॥ 40
అప్పుడు బంగారుపిడులు, వంగిన కణుపులు గల బాణసమూహాలు ఆకాశంలో ఎన్నో కనిపించాయి. (40)
ద్రోణస్య పుంఖసక్తాశ్చ ప్రభవంతః శరాసనాత్।
ఏకో దీర్ఘ ఇవాదృశ్యత్ ఆకాశే సంహతః శరః॥ 41
ద్రోణుని వింటినుండి పుంఖానుపుంఖంగా వెలువడుతున్న బాణాలు కలిసి ఆకాశంలో ఒకే పొడవైన బాణంలా కనిపించాయి. (41)
ఏవం తౌ స్వర్ణవికృతాన్ విముంచంతౌ మహాశరాన్।
ఆకాశం సంవృతం వీరౌ ఉల్కాభిరివ చక్రతుః॥ 42
ఇలా ఆ ఇరువురు వీరులూ గొప్పవైన బంగారు బాణాలను విడుస్తూ ఆకాశాన్ని ఉల్కలతో నిండిన దానిలా చేశారు. (42)
శరాస్తయోస్తు విబభుః కంకబర్హిణవాససః।
పంక్త్యః శరది స్వస్థానాం హంసానాం చరతామివ॥ 43
గ్రద్ద ఈకలు, నెమలి ఈకలు గల ఆ ద్రోణార్జునుల బాణాలు శరత్కాలంలో నెమ్మదిగా సంచరిస్తున్న హంసల పంక్తులవలె శోభించాయి. (43)
యుద్ధం సమభవత్ తత్ర సుసంరబ్ధం మహాత్మనోః।
ద్రోణపాండవయోర్ఘోరం వృత్రవాసవయోరివ॥ 44
మహానుభావులైన ఆ ద్రోణార్జునుల రోషపూర్ణమైన యుద్ధం ఇంద్ర వృత్రాసురుల సంగ్రామంలా భయంకరంగా కనిపించింది. (44)
తౌ గజావివ చాసాద్య విషాణాగ్రైః పరస్పరమ్।
శరైః పూర్ణాయతోత్సృష్టైః అన్యోన్యమభిజఘ్నతుః॥ 45
రెండు ఏనుగులు ఎదురుపడి ఒకదానినొకటి దంతాల కొనలతో కొట్టుకొన్నట్టు ఆ ద్రోణార్జునులు వింటిని బాగుగా లాగి విడిచిన బాణలతో ఒకరినొకరు గాయపరచుకొన్నారు. (45)
తౌ వ్యవహరతాం యుద్ధే సంరబ్ధౌ రణశోభినౌ।
ఉదీరయంతౌ సమరే దివ్యాన్యస్త్రాణి భాగశః॥ 46
క్రోధంతో నిండిన ఆ ద్రోణార్జునులు రణ రంగంలో మిక్కిలిగా శోభిస్తున్నారు. వారిరువురూ ఏరి ఏరి వారి వారి దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ ధర్మబద్ధంగా యుద్ధం చేశారు. (46)
అథ త్వాచార్యముఖ్యేన శరాన్ సృష్టాన్ శిలాశితాన్।
న్యవారయచ్ఛితైర్బాణైః అర్జునో జయతాం వరః॥ 47
తరువాత జయశీలులలో శ్రేష్ఠుడైన అర్జునుడు తన వాడిబాణాలతో ఆచార్యశ్రేష్ఠుడైన ద్రోణుడు ప్రయోగించిన సానబట్టిన బాణాలను నివారించాడు. (47)
దర్శయన్ వీక్షమాణానామ్ అస్త్రముగ్రపరాక్రమః।
ఇషుభిస్తూర్ణమాకాశం బహుభిశ్చ సమావృణోత్॥ 48
జిఘాంసం తం నరవ్యాఘ్రమ్ అర్జునం తిగ్మతేజసమ్।
ఆచార్యముఖ్యః సమరే ద్రోణః శస్త్రభృతాం వరః।
అర్జునేన సహాక్రీడత్ శరైః సంనతపర్వభిః॥ 49
తీవ్రపరాక్రమంగల అర్జునుడు ప్రేక్షకులకు ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేక బాణాలతో వెంటనే ఆకాశాన్ని కప్పివేశాడు. నరశ్రేష్ఠుడు, ప్రచండ తేజస్కుడు అయిన అర్జునుడు ఎదిరిని మట్టుపెట్టాలని కోరుతున్నప్పటికీ మేటి విలుకాడు. ఉత్తమగురువు అయిన ద్రోణుడు అర్జునుని నిలువరించి వంపుగల బాణాలతో అర్జునునితో ఆడుకొన్నాడు. (48,49)
దివ్యాన్యస్త్రాణి వర్షంతం తస్మిన్ వై తుములే రణే।
అస్రై రస్త్రాణి సంవార్య ఫాల్గునం సమయోధయత్॥ 50
ఆ సంకులసమరంలో దివ్యాస్త్రాలు కురిపిస్తున్న అర్జునుని అస్త్రాలను తన అస్త్రాలతో నివారిస్తూ ద్రోణుడు యుద్ధం చేయసాగాడు. (50)
తయోరాసీత్ సంప్రహారః క్రుద్ధయోర్నరసింహయోః।
అమర్షొణోస్తదాన్యోన్యం దేవదానవయోరివ॥ 51
కోపించిన ఆ నరశ్రేష్ఠుల యుద్ధం పరస్పరం పోటీపడే దేవదానవుల యుద్ధంలా జరిగింది. (51)
ఐంద్రం వాయవ్యమాగ్నేయమ్ అస్త్రమష్ట్రేణ పాండవః।
ద్రోణేన ముక్తమాత్రం తు గ్రసతి స్మ పునః పునః॥ 52
ద్రోణుడు ఇంద్ర, వాయు, అగ్ని దేవతా సంబంధాలైన అస్త్రాలను ప్రయోగిస్తే అర్జునుడు వాటిని వదిలీ వదలకముందే తన అస్త్రాలతో మాటిమాటికి అణిచి వేయసాగాడు. (52)
ఏవం శూరౌ మహేష్వాసౌ విసృజంతౌ శితాన్ శరాన్।
ఏకచ్ఛాయం చక్రతుస్తౌ ఆకాశం శరవృష్టిభిః॥ 53
ఈ విధంగా శూరులు, మేటివిలుకాండ్రు, అయి వాడి బాణాలను వదలుతున్న ఆ ద్రోణార్జునులు బాణవర్షంతో ఆకాశాన్ని అంధకారబంధురం చేశారు. (53)
తత్రార్జునేన ముక్తానాం పతతాం వై శరీరిషు।
పర్వతేష్వివ వజ్రాణాం శర్ణాణాం శ్రూయతే స్వనః॥ 54
అర్జునుడు విడిచిన బాణాలు దేహధారులపై పడుతూ పర్వతాలపై పడుతున్న వజ్రాయుధం వలె శబ్దం చేశాయి. (54)
తతో నాగా రథాశ్చైవ వాజినశ్చ విశాంపతే।
శోణితాక్తౌ వ్యదృశ్యంత పుష్పితా ఇవ కింశుకాః॥ 55
జనమేజయా! అప్పుడు ఏనుగులు, రథికులు, గుఱ్ఱాలు నెత్తుటితో తడిసి, పుష్పించిన మోదుగు చెట్లవలె కనిపించాయి. (55)
బాహుభిశ్చ సకేయూరైః విచిత్రైశ్చ మహారథైః।
సువర్ణచిత్రైః కవచైః ధ్వజైశ్చ వినిపాతితైః॥ 56
యోధైశ్చ నిహతైస్తత్ర పార్థబాణప్రపీడితైః।
బలమాసీత్ సముద్భ్రాంతం ద్రోణార్జునసమాగమే॥ 57
ద్రోణార్జునుల ఆ యుద్ధంలో అర్జునుని బాణాల తాకిడిచే ఎందరో యోధులు మరణించారు. భుజకీర్తులు గల భుజాలెన్నో తెగి పడిపోయాయి. విచిత్ర వేషభూషలుగల మహారథులు పడిపోయారు. సువర్ణ ఖచితమైన కవచాలు, ధ్వజాలు నేలగూలాయి. ఇదంతా చూసి సైన్యమంతా భయంతో నిశ్చేష్టమై పోయింది. (56,57)
విధున్వానౌ తు తౌ తత్ర ధనుషీ భారసాధనే।
ఆచ్ఛాదయేతామన్యోన్యం తతక్షతురథేషుభిః॥ 58
అక్కడ ద్రోణార్జునులు దృఢమైన ధనుస్సులను విదిలిస్తూ, ఒకరి నొకరు క్షీణింప జేస్తూ, బాణాలతో క్రమ్మి వేశారు. (58)
తయోః సమభవద్ యుద్ధం తుములం భరతర్షభ।
ద్రోణకౌంతేయయోస్తత్ర బలివాసవయోరివ॥ 59
భరతవంశశ్రేష్ఠా! జనమేజయా! ద్రోణార్జునుల మధ్య సంకులసమరం జరిగింది. అది బలిచక్రవర్తి, ఇంద్రుల మధ్య జరిగిన సంగ్రామాన్ని తలపింప జేసింది. (59)
అథ పూర్ణాయతోత్సృష్టైః శరైః సంనతపర్వభిః।
వ్యదారయేతామన్యోన్యం ప్రాణద్యూతే ప్రవర్తితే॥ 60
అంత ద్రోణార్జునులు ఇరువురూ ప్రాణాలను పణంగా పెట్టి జూదమాడినట్లు విండ్లను పూర్తిగా లాగి వంగిన కణుపులు గల బాణాలతో ఒకరినొకరు చీల్చుకొన సాగారు. (60)
అథాంతరిక్షే నాదోఽభూత్ ద్రోణం తత్ర ప్రశంసతామ్।
దుష్కరం కృతవాన్ ద్రోణః యదర్జునమయోధయత్॥ 61
ప్రమాథినం మహావీర్యం దృఢముష్టిం దురాసదమ్।
జేతారం దేవదైత్యానాం సర్వేషాం చ మహారథమ్॥ 62
అప్పుడు ద్రోణుని ప్రశంసిస్తున్న దేవతల పలుకులు ఆకాశం నుండి వినిపించాయి. "ద్రోణుడు ఇంతవరకూ అర్జునుని నిలువరించటమంటే దుష్కర కార్యాన్ని సాధించినట్లే. అర్జునుడు శత్రుమర్దనుడు, పరాక్రమశాలి, గట్టి పిడికిలి గలవాడు, ఎదిరింపరానివాడు. దేవ దానవులనూ, సమస్త మహారథులను సయితం ఓడించిన వాడు గదా!" (61,62)
అవిశ్రమం చ శిక్షాం చ లాఘవం దూరపాతితామ్।
పార్థస్య సమరే దృష్ట్వా ద్రోణస్యాభూచ్చ విస్మయః॥ 63
ఆ రణరంగంలో అర్జునుని స్థైర్యాన్నీ, అస్త్రవిద్యా నైపుణ్యాన్ను, హస్తలాఘవాన్నీ, దూరానికి బాణాలు విసిరే నేర్పరితనాన్నీ చూసి ద్రోణుడు కూడా ఆశ్చర్యపోయాడు. (63)
అథ గాండీవముద్యమ్య దివ్యం ధనురమర్షణః।
విచకర్ష రణే పార్థః బాహుభ్యాం భరతర్షభ॥ 64
జనమేజయా! తరువాత ఆ రణభూమిలో కోపించిన అర్జునుడు తన దివ్యధనువైన గాండీవాన్ని ఎత్తి రెండు చేతులతో ఆకర్షించసాగాడు. (64)
తస్య బాణమయం వర్షం శలభానామివాయతిమ్।
దృష్ట్వా తే విస్మితాః సర్వే సాధు సాధ్విత్యపూజయన్॥ 65
మిడతల దండువలె మీద పడుతున్న ఆ అర్జునుని బాణవర్షాన్ని చూసి ఆశ్చర్య పోయిన సైనికులంతా "భళా, భళా" అని అర్జునుని అభినందించారు. (65)
న చ బాణాంతరే వాయుః అస్య శక్నోతి సర్పితుమ్।
అనిశం సందధానస్య శరానుత్సృజతస్తథా॥ 66
దదర్శ నాంతరం కశ్చిత్ పార్థస్యాదదతోఽపి చ॥ 67
అర్జునుని బాణాల మధ్య ప్రవేశించటానికి గాలికి కూడా వీలు కావటం లేదు. ఎప్పుడూ చేతిలో బాణాలు, ఎప్పుడూ శరసంధానాలు, ఎప్పుడూ బాణప్రయోగాలు. అర్జునుని ఆ కార్యక్రమంలో క్షణం కూడా అంతరం (వ్యవధానం) కనిపించలేదు. (66,67)
తథా శీఘ్రాస్త్రయుద్ధే తు వర్తమానే సుదారుణే।
శీఘ్రం శీఘ్రతరం పార్థః శరానన్యానుదీరయత్॥ 68
ఈ రీతిగా వేగంతో కూడిన అస్త్ర ప్రయోగాలతో కూడిన దారుణయుద్ధం జరుగుతుంటే అర్జునుడు, మరీ వేగంగా వివిధాస్త్రాలను ప్రకటింప జేయసాగాడు. (68)
తతః శతసహస్రాణి శరాణాం నతపర్వణామ్।
యుగపత్ ప్రాపతంస్తత్ర ద్రోణస్య రథమంతికాత్॥ 69
కీర్యమాణే తథా ద్రోణే శరైర్గాండీవధన్వనా।
హాహాకారో మహానాసీత్ సైన్యానాం భరతర్షభ॥ 70
జనమేజయా! తరువాత వంగిన కణుపులు గల లక్ష ద్రోణాచార్యుని రథానికి దగ్గరగా ఒక్కసారిగా పడ్డాయి. ఆ విధంగా అర్జునుడు ద్రోణుని బాణాలతో ఆవరిస్తే సైన్యంలో గొప్ప కలకలం బయలు దేరింది. (69,70)
పండవస్య తు శీఘ్రాస్త్రం మఘవా ప్రత్యపూజయత్।
గంధర్వాప్సరసశ్చైవ యే చ తత్ర సమాగతాః॥ 71
అర్జునుని శీఘ్ఱాస్త్రప్రయోగాన్ని ఇంద్రుడు అభినందించాడు. అక్కడకు వచ్చిన గంధర్వులు, అప్సరసలు కూడా అర్జునుని ప్రశంసించారు. (71)
తతో వృందేన మహతా రథానాం రథయూధపః।
ఆచార్యపుత్రః సహసా పాండవం పర్యవారయత్॥ 72
అప్పుడు రథ సేనాధిపతి అయిన అశ్వత్థామ పెద్ద రథికబృందంతో వెంటనే అర్జునుని చుట్టు ముట్టాడు. (72)
అశ్వత్థామా తు తత్కర్మ హృదయేన మహాత్మనః।
పూజయామాస పార్థస్య కోపం చాస్యాకరోద్ భృశమ్॥ 73
అశ్వత్థామ మహాత్ముడైన ఆ అర్జునుని పరాక్రమాన్ని మనసారా అభినందించాడు, తీవ్ర కోపాన్నీ ప్రదర్శించాడు. (73)
స మన్యువశమాపన్నః పార్థమభ్యద్రవద్ రణే।
కిరన్ శరసహస్రాణి పర్జన్య ఇవ వృష్టిమాన్॥ 74
అశ్వత్థామ కోపవశుడై, కురుస్తున్న మేఘంలాగా అర్జునునిపై వేలకొలదీ బాణాలను విడుస్తూ యుద్ధంలో అర్జునునికి ఎదురు నిలిచాడు. (74)
ఆవృత్య తు మహాబాహుః యతో ద్రౌణిస్తతో హయాన్।
అంతరం ప్రదదౌ పార్థః ద్రోణస్య వ్యపసర్పితుమ్॥ 75
అప్పుడు మహాబాహువయిన అర్జునుడు తన రథాన్ని అశ్వత్థామ వైపుకు నడిపించి ద్రోణుడు తప్పుకొనటానికి అవకాశమిచ్చాడు. (75)
స తు లబ్ధ్వాంతరం తూర్ణమ్ అపాయాజ్జవనైర్హయైః।
భిన్నవర్మధ్వజః శూరః నికృత్తః పరమేషుభిః॥ 76
అర్జునుని దివ్య బాణాల తాకిడిచే బ్రద్దలైన కవచం, ధనుస్సు గల ఆ శూరుడు గాయపడి, అవకాశం దొరకగానే వెంటనే అక్కడనుండి జవనాశ్వాల రథంతో తొలగిపోయాడు. (76)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ద్రోణాపయానే అష్టపంచాశత్తమోఽధ్యాయః॥ 58 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున
ఉత్తరగోగ్రహణమున ద్రోణాపయానమను ఏబది యెనిమిదవ అధ్యాయము. (58)