59. ఏబదితొమ్మిదవ అధ్యాయము

అశ్వత్థామతో అర్జునుడు యుద్ధము చేయుట.

వైశంపాయన ఉవాచ
తతో ద్రౌణి ర్మహారాజ ప్రయయావర్జునం రణే।
తం పార్థః ప్రతిజగ్రాహ వాయువేగమివోద్ధతమ్।
శరజాలేన మహతా వర్షమాణమివాంబుదమ్॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! అటు తర్వాత అశ్వత్థామ రణంలో అర్జునుని ఎదిరించాడు. అర్జునుడు వర్షించే మేఘంలాగా ఘనమైన బాణ సమూహంతో వాయువేగంతో తీవ్రరూపంతో వస్తున్న అశ్వత్థామను నిరోధించాడు. (1)
తయోర్దేవాసురసమః సంవిపాతో మహానభూత్।
కిరతోః శరజాలాని వృత్రవాసవయోరివ॥ 2
ఆ ఇద్దరి మధ్య దేవాసురసంగ్రామంలాగా ఘోర యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు బాణసమూహాలను విసురుతూ ఆ ఇద్దరూ వృత్రాసుర దేవేంద్రులవలె కనిపించారు. (2)
న స్మ సూర్యస్తదా భాతి న చ వాతి సమీరణః।
శరజాలావృతే వ్యోమ్ని ఛాయాభూతే సమంతతః॥ 3
వారి బాణసమూహంతో కప్పబడిన ఆకాశం అంతటా అంధకారబంధురమైంది. అప్పుడు సూర్యుడూ ప్రకాశించలేదు. గాలీ ప్రసరించలేదు. (3)
మహాంశ్చటచటాశబ్దః యోధయోర్హన్యమానయోః।
దహ్యతామివ వేణూనామ్ ఆసీత్ పరపురంజయ॥ 4
(శత్రుజేతవయిన) జనమేజయా! ఆ ఇద్దరు యోధులూ ఒకరి నొకరు హింసించుకొంటుంటే వెదురు బొంగులు మండుతున్న శబ్దం మిక్కుటమైంది. (4)
హయానస్యార్జునః సర్వాన్ కృతవానల్పజీవితాన్।
తే రాజన్ న ప్రజానంత దిశం కాంచనమోహితాః॥ 5
అర్జునుడు అశ్వత్థామగుఱ్ఱాలను గాయపరచి అల్పాయుర్దాయం గల వాటినిగా చేశాడు. రాజా! మూర్ఛిల్లిన ఆ గుఱ్ఱాలకు దిక్కులుతోచడం లేదు. (5)
తతో ద్రౌణిర్మహావీర్యః పార్థస్య విచరిష్యతః।
వివరం సూక్ష్మమాలోక్య జ్యాం చిచ్ఛేద క్షురేణ హ।
తదస్యాపూజయన్ దేవాః కర్మ దృష్ట్వాతిమానుషమ్॥ 6
అప్పుడు మహాపరాక్రమశాలి అయిన అశ్వత్థామ రణరంగంలో విహరిస్తున్న అర్జునునిలోని చిన్న ఏమరు పాటును పసికట్టి చాకువంటి బాణంత్ఫ్ అర్జునుని వింటినారిని త్రెంచాడు. అమానుషమైన ఆయన చేష్టను చూసి దేవతలు అభినందించారు. (6)
ద్రోణో భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చైవ మహారథాః।
సాధు సాధ్వితి భాషంతోఽపూజయన్ కర్మ తస్య తత్॥ 7
మహారథులు ద్రోణ, భీష్మ, కర్ణ, కృపులు అశ్వత్థామ చేసిన పనిని భళా భళా అని ప్రశంసించారు. (7)
తతో ద్రౌణిర్ధనుఃశ్రేష్ఠమ్ అపకృష్య రథర్షభమ్।
పునరేవాహనత్ పార్థం హృదయే కంకపత్రిభిః॥ 8
ఆ తరువాత అశ్వత్థామ తన వింటిని ఎక్కుపెట్టి లంక పత్రాలు గల బాణాలతో మరల అర్జునుని వక్షఃస్థలాన్ని గాయపరిచాడు. (8)
తతః పార్థో మహాబాహుః ప్రహస్య స్వనవత్ తదా।
యోజయామాస నవయా మౌర్వ్యా గాండీవమోజసా॥ 9
అపుడు బలశాలి అయిన అర్జునుడు పెద్దగా నవ్వి, కొత్తనారిని బలంగా గాండీవానికి తగిలించాడు. (9)
తతోఽర్ధచంద్రమావృత్య తేన పార్థః సమాగమత్।
వారణేనేవ మత్తేన మత్తో వారణయూథపః॥ 10
ఆ తరువాత అర్జునుడు నుదుటిపైనున్న చెమటను తుడుచుకొని మదించిన గజరాజు మదించిన మరో గజంతో తలపడినట్లు అశ్వత్థామతో తలపడ్డాడు. (10)
వి॥సం॥ తతః అర్ధ చంద్రమ్ - ఆవృత్య - 1. అర్ధచంద్రాకారంగా వంచిన ధనుస్సును రక్షించి అని (అర్జు)
2. అర్ధచంద్రాకారంగా ఉన్న లలాటాన్ని ఆవరించిన స్వేదంతో వింటినారిని తుడిచి (నీల)(సర్వ)
తతః ప్రవవృతే యుద్ధం పృథివ్యామేకవీరయోః।
రణమధ్యే ద్వయోరేవం సుమహల్లోమహర్షణమ్॥ 11
లోకంలో అద్వితీయవీరులయిన ఆ అర్జున అశ్వత్థామల మధ్య (ప్రేక్షకులకు) గగుర్పాటు కల్గేటట్లు భీకరయుద్ధం జరిగింది. (11)
తౌ వీరౌ దదృశుః సర్వే కురవో విస్మయాన్వితాః।
యుధ్యమానౌ మహావీర్యౌ యూథపావివ సంగతౌ॥ 12
తలపడిన గజరాజులవలె పోరాడుతున్న ఆవీరులను కౌరవులంతా ఆశ్చర్యంతో చూశారు. (12)
తౌ సమాజఘ్నతుర్వీరౌ అన్యోన్యం పురుషర్షభౌ।
శరైరాశీవిషాకారైః జ్వలద్భిరివ పన్నగైః॥ 13
పురుషశ్రేష్ఠులూ, మహావీరులూ అయిన ఇద్దరు సర్పాకృతితో మండిపడుతున్న బాణాలతో ఒకరినొకరు కొట్టుకొన్నారు. (13)
అక్షయ్యా విషుధీ దివ్యౌ పాండవస్య మహాత్మనః।
తేన పార్థో రణే శూరః తస్థౌ గిరిరివాచలః॥ 14
అశ్వత్థామః పునర్బాణాః క్షుప్రమభ్యస్యతో రణే।
జగ్ముః పరిక్షయం తూర్ణమ్ అభూత్ తేనాధికోఽర్జునః॥ 15
అశ్వత్థామ వేగంగా యుద్ధంలో బాణాలను గుప్పించటం వలన అవి త్వరగా తరిగిపోయాయి. దానితో అర్జునునిది పైచేయి అయినది. (15)
తతః కర్ణో మహాచాపం వికృష్యాభ్యధికం తదా।
అవాక్షిపత్ తతః శబ్దః హాహాకారో మహానభూత్॥ 16
అప్పుడు కర్ణుడు తన మహాచాపాన్ని ఎక్కుపెట్టి టంకారం చేశాడు. దానితో అక్కడ హాహాకారాల ధ్వని పెద్దదయింది. (16)
తతశ్చక్షుర్దధే పార్థః యత్ర విస్ఫార్యతే ధనుః।
దదర్శ తత్ర రాధేయం తస్య కోపో వ్యవర్ధత॥ 17
వెంటనే అర్జునుడు ధనుష్టంకారం విన వచ్చిన వైపి దృష్టి సారించాడు. అక్కడ కర్ణుని చూడగానే అర్జునునికి కోపం అతిశయించింది. (17)
సరోషవశమాపన్నః కర్ణమేవ జిఘాంసయా।
తమైక్షత వివృత్తాభ్యాం నేత్రాభ్యాం కురుపుంగవః॥ 18
అర్జునుడు కోపించి, కర్ణుని చంపాలని కన్నులు విప్పార్చి కర్ణుని వైపు చూశాడు. (18)
తథా తు విముఖే పార్థే ద్రోణపుత్రస్య సాయకాన్।
త్వరితాః పురుషా రాజన్ ఉపాజహ్రుః సహస్రశః॥ 19
రాజా! అలా అర్జునుడు దృష్టి మరల్చి అశ్వత్థామ బాణాలకు విముఖుడు కాగా వేలకొలదిగ కౌరవసేనలు వచ్చి అశ్వత్థామను అక్కడనుండి కొనిపోయాయి. (19)
ఉత్సృజ్య చ మహాబాహుః ద్రోణపుత్రం ధనంజయః।
అభిదుద్రావ సహసా కర్ణమేవ సపత్నజిత్॥ 20
ఆజానుబాహువూ, శత్రుంజయుడూ అయిన అర్జునుడు అశ్వత్థామను విడిచి వెంటనే కర్ణుని మీదకే దూకాడు. (20)
తమభిద్రుత్య కౌంతేయః క్రోధసంరక్తలోచనః।
కామయన్ ద్వైరథం తేన యుద్ధం వచనమబ్రవీత్॥ 21
కుంతికొడుకైన అర్జునుడు కర్ణుని సమీపించి అతనితో ధ్వైరథయుద్ధం చేయగోరి కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ఇలా పలికాడు. (21)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి ఉత్తరగోగ్రహే అర్జునాశ్వత్థామయుద్ధే ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున
ఉత్తరగోగ్రహణమున అర్జునాశ్వత్థామల యుద్ధమను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)