62. అరువది రెండవ అధ్యాయము

అర్జునుడు కౌరవయోధులందరితో యుద్ధముచేయుట.

వైశంపాయన ఉవాచ
అథ సంగమ్య సర్వే తే కౌరవాణాం మహారథాః।
అర్జునం సహితా యత్తాః ప్రత్యయుధ్యంత భారత॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆపై కౌరవసేనలోని మహారథులందరు ఒక్కటై సావధానులై అర్జునుని ఎదిరించారు. (1)
స సాయకమయైర్జాలైః సర్వతస్తాన్ మహారథాన్।
ప్రాచ్ఛాదయదమేయాత్మా నీహారేణేవ పర్వతాన్॥ 2
అయితే అవధిలేని ఆత్మబలంగల అర్జునుడు మంచు కొండలను కప్పినట్లు అన్నివైపులా బాణాలతో ఆ మహారథులందరిని క్రమ్మేశాడు. (2)
నదద్భిశ్చ మహానాగైః హ్రేషమాణైశ్చ వాజిభిః।
భేరీశంఖనినాదైశ్చ సశబ్దస్తుములోఽభవత్॥ 3
మదపుటేనుగుల ఘీంకారాలు, గుఱ్ఱాల సకిలింతలి, భేరీశంఖనినాదాలు కలిసి రణభూమిలో కోలాహలం ఎక్కువయింది. (3)
నరాశ్వకాయాన్ నిర్భిద్య లౌహాని కవచాని చ।
పార్థస్య శరజాలాని వినిష్పేతుః సహస్రశః॥ 4
అర్జునుని బాణాలు సైనికులశరీరాలనూ, గుఱ్ఱాల శరీరాలను భేదించి, లోహమయకవచాలను చీల్చుకొని వేలకు వేలుగా నేలపై పడసాగాయి. (4)
త్వరమాణః శరానస్యన్ పాండవః ప్రబభౌ రణే।
మధ్యందినగతోఽర్చిష్మాన్ శరదీవ దివాకరః॥ 5
శరత్కాలంలో మధ్యందినమార్తాండును మండినట్లు రణభూమిలో వేగంగా బాణాలను ప్రయోగిస్తూ అర్జునుడు వెలిగిపోయాడు. (5)
ఉపప్లవంతి విత్రస్తాః రథేభ్యో రథినస్తథా।
సాదినశ్చాశ్వపృష్ఠేభ్యః భూమౌ చైవ పదాతయః॥ 6
ఆ రణభూమిలో బెదిరిపోయిన రథికులు రథాలనుండీ, అశ్వికులు గుఱ్ఱాలమీదనుండీ జారి పడ్డారు. సైనికులు క్రిందపడ్డారు. అందరూ పారిపోసాగారు. (6)
శరైః సంఛిద్యమానానాం కవచానాం మహాత్మనామ్।
తామ్రరాజితలౌహానాం ప్రాదురాసీన్మహాస్వనః॥ 7
మహానుభావులయిన వీరుల శరీరాలపై నున్న రాగి, వెండి, ఇనుప కవచాలను అర్జునుడు బాణాలతో చీల్చివేస్తుంటే పెద్ద ధ్వని ఏర్పడింది. (7)
ఛన్నమాయోధనం సర్వం శరీరైర్గతచేతసామ్।
గజాశ్వసాదినాం తత్ర శితబాణాత్తజీవితైః॥ 8
రథోపస్థాభిపతితైః ఆస్తృతా మానవైర్మహీ।
ప్రనృత్యతీవ సంగ్రామే చాపహస్తో ధనంజయః॥ 9
రణభూమి అంతా మృతవీరుల శరీరాలతో నిండిపోయింది. వాడిబాణాలవలన ప్రాణాలు కోల్పోయిన గజబల, అశ్వబల, రథికుల శరీరాలతో భూమి కప్పివేయబడింది. ధనుష్పాణి అయిన అర్జునుడు రణరంగంలో నృత్యం చేస్తున్నట్లు అనిపించింది. (8,9)
శ్రుత్వా గాండీవనిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః।
త్రస్తాని సర్వసైన్యాని వ్యపాగచ్ఛన్ మహాహవాత్॥ 10
కుండలోష్ణీషధారీణి జాతరూపస్రజస్తథా।
పతితాని స్మ దృశ్యంతే శిరాంసి రణమూర్ధని॥ 11
పిడుగుపాటు వంటి గాండీవధ్వని విని భయపడి సర్వసేననూ ఆ మహాయుద్ధంనుండి తొలగిపోయాయి. కుండలాలు, తలపాగాలు ధరించియున్న తలలు రణభూమిలో పడి కనిపిస్తున్నాయి. బంగారు హారాలు కూడా చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. (10,11)
విశిఖోన్మథితైర్గాత్రైః బాహుభిశ్చ సకార్ముకైః।
సహస్తాభరణైశ్చాన్యైః ప్రచ్ఛన్నా భాతి మేదినీ॥ 12
అర్జునుని బాణాలచే కలచివేయబడిన శరీరాలు, ధనుస్సులు ధరించియున్న బాహువులు, హస్తాభరణాలు వీడిపోని బాహువులు ఆ రణభూమిని కప్పివేశాయి. వాటితో అది వింతగా ప్రకాశిస్తోంది. (12)
శిరసాం పాత్యమానానామ్ అంతరా విశితైః శరైః।
అశ్మవృష్టిరివాకాశాత్ అభవద్ భరతర్షభ॥ 13
జనమేజయా! అర్జునుని వాడిబాణాలకు తెగిపడుతున్న సైనికుల శిరస్సుల శ్రేణి ఆకాశంనుండి కురుస్తున్న రాళ్ళవానలా కనిపిస్తోంది. (13)
దర్శయిత్వా తథాఽఽత్మానం రౌద్రం రుద్రపరాక్రమః।
అవరుద్ధోఽచరత్ పార్థః వర్షాణి త్రిదశాని చ।
క్రోధాగ్నిముత్సృజన్ వీరః ధార్తరాష్ట్రేషు పాండవః॥ 14
భయంకరమైన తన పరాక్రమాన్ని నిరోధించికొని అర్జునుడు పదమూడు సంవత్సరాలు అరణ్యంలో సంచరించాడు. ఇప్పుడు యుద్ధసమయంలో కౌరవులపై తన క్రోధాన్ని వెడలగ్రక్కుతూ రుద్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. (14)
తస్య తద్ దహతః సైన్యం దృష్ట్వా చైవ పరాక్రమమ్।
సర్వే శాంతిపరా యోధాః ధార్తరాష్ట్రస్య పశ్యతః॥ 15
సైన్యాని దహించివేస్తున్న ఆ అర్జునుని పరాక్రమాన్ని గమనించి సుయోధనుని సేనలు ఆయన చూస్తుండగానే చల్లబడి నిలిచిపోయాయి. (15)
విత్రాసయిత్వా తత్ సైన్యం ద్రావయిత్వా మహారథాన్।
అర్జునో జయతాం శ్రేష్ఠః పర్యవర్తత భారత॥ 16
జనమేజయా! జయశీలులలో అగ్రగణ్యుడైన అర్జునుడు సైన్యాన్ని భయపెట్టి, మహారథులను పారద్రోలి రణరంగంలో విహరించసాగాడు. (16)
ప్రావర్తయన్నదీం ఘోరాం శోణితోదాం తరంగిణీమ్।
అస్థిశైవాలసంబాధాం యుగాంతే కాలనిర్మితామ్॥ 17
అర్జునుడు భయానకమైన నెత్తుటేరును అక్కడ పారించాడు. ఆ ఏటిలో నెత్తురే నీరు. ఎముకలే నాచు. ప్రళయకాలంలో యముడు నిర్మించిన ఏరులా అది కనిపిస్తోంది. (17)
శరచాపవనాం ఘోరాం కేశశైవాలశాధ్వలామ్।
తనుతోష్ణీషసంబాధాం నాగకూర్మమహాద్విపామ్॥ 18
ఆ నెత్తుటేటిలో విండ్లు, బాణాలే తిప్పలు, వెంట్రుకలే నాచు, గడ్డి. దానిలో కవచాలూ, తలపాగాలు నిండిఉన్నాయి. అక్కడి ఏనుగులే తాబేళ్ళుగా, నీటి ఏనుగులుగా కనిపిస్తున్నాయి. (18)
మేదోవసాసృక్ ప్రవాహాం మహాభయవివర్ధినీమ్।
రౌద్రరూపాం మహాభీమాం శ్వాసదైరభినాదితామ్॥ 19
ఆ నెత్తుటేరు మెదడు, వస, నెత్తురు కలిసి ప్రవహిస్తోంది. మహాభయంకరంగా రౌద్రరూపంతో కనిపిస్తోంది. క్రూరజంతువులు అక్కడ కోలాహలధ్వని చేస్తున్నాయి. (19)
తీక్ష్ణశస్త్రమహాగ్రాహాం క్రవ్యాదగణసేవితామ్।
ముక్తాహారోర్మికలిలాం చిత్రాలంకారబుద్బుదామ్॥ 20
ఆ నెత్తుటేటిలో తీక్ష్ణమైన శస్త్రాలే మొసళ్ళు. అది క్రూరమృగాలకు నెలవైంధి. ముక్తాహారాలే తరంగాలుగా, విచిత్రాభరణాలే బుడగలుగా ప్రవహిస్తోంది. (20)
శరసంఘమహావర్తాం నాగనక్రాం దురత్యయామ్।
మహారథ మహాద్వీపాం శంఖదుందుభినిస్వనామ్।
చకార చ తదా పార్థో నదీం దుస్తరశోణితామ్॥ 21
ఆ నెత్తురుటేటిలో బాణసమూహాలే పెద్దసుడులు. ఏనుగులే మొసళ్ళు. మహారథాలే పెద్దద్వీపాలు. అది దాటశక్యం కానిది. శంఖాలు, దుందుభులు అక్కడ మార్మ్రోగుతున్నాయి. అటువంటి నెత్తుటేటిని అర్జునుడు ప్రవహింపజేశాడు. (21)
ఆదదానస్య హి శరాన్ సంధాయ చ విముంచతః।
వికర్షతశ్చ గాండీవం న కశ్చిద్ దదృశే జనః॥ 22
అర్జునుడు బాణాలను తీయటం, వింటితో కూర్చటం, వదలటం, గాండీవాన్ని ఆకర్షించటం ఎవ్వరికీ తెలియటం లేదు. (22)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి అర్జున సంకులయుద్ధే ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణ పర్వమను ఉపపర్వమున అర్జునుడు సంకులయుద్ధము చేయుట అను అరువదిరెండవ అధ్యాయము. (62)