61. అరువదియొకటవ అధ్యాయము
అర్జునుడు దుశ్శాసనాదులను ఓడించుట.
వైశంపాయన ఉవాచ
తతో వైకర్తనం జిత్వా పార్థో వైరాటిమబ్రవీత్।
ఏతన్మాం ప్రాపయానీకం యత్ర తాలో హిరణ్మయః॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - జనమేజయా! అర్జునుడు కర్ణుని ఓడించి "బంగారు తాటిచెట్టుధ్వజం గల భీష్మునివైపు నన్ను నడిపించు" అని ఉత్తరునితో అన్నాడు. (1)
అత్ర శాంతనవో భీష్మః రథేఽస్మాకం పితామహః।
కాంక్షమాణో మయా యుద్ధం తిష్ఠత్యమరదర్శనః॥ 2
ఆ రథంమీద మా కందరకు పితామహుడైన భీష్ముడు నాతో యుద్ధం చేయాలన్న కోరికతో నిలిచి యున్నాడు. ఆయన దర్శనం దేవదర్శనమే. (2)
అథ సైన్యం మహద్ దృష్ట్వా రథనాగహయాకులమ్।
అబ్రవీదుత్తరః పార్థమ్ అపవిద్ధః శరైర్భృశమ్॥ 3
నాహం శక్ష్యామి వీరేహ నియంతుం తే హయోత్తమాన్।
విషీదంతి మమ ప్రాణాః మనో విహ్వలతీవ మే॥ 4
ఆ మాటలు విని అప్పటికే బాణాలతో తీవ్రంగా గాయపడిన ఉత్తరుడు రథాలతో, ఏనుగులతో, గుఱ్ఱాలతో నిండిఉన్న ఆ మహాసేనను చూసి "వీరా! ఈ రణరంగంలో నీ గుఱ్ఱాలను నేనిక నియంత్రించలేను. నా ప్రాణాలు కడంటాయి. నామనస్సు కలత్ పడుతోంది' అని అర్జునునితో అన్నాడు. (3,4)
అస్త్రాణామివ దివ్యానాం ప్రభావః సంప్రయుజ్యతామ్।
త్వయా చ కురుభిశ్చైవ ద్రవంతీవ దిశో దశ॥ 5
"నీవూ, కౌరవులూ ప్రయోగిస్తున్న దివ్యాస్త్రాల ప్రభావం పదిదిక్కులనూ తరుముతున్నట్లు నా కనిపిస్తోంది." (5)
గంధేన మూర్ఛితశ్చాహం వసారుధిరమేదసామ్।
ద్వైధీభూతం మనో మేఽద్య తవ చైవ ప్రపశ్యతః॥ 6
"వస, నెత్తురు, మేదస్సుల వాసనతో నాకు మూర్ఛవస్తోంది. నిన్ను చూస్తుంటే మనస్సు డోలాయమాన మవుతోంది." (6)
అదృష్టపూర్వః శూరాణాం మయా సంఖ్యే సమాగమః।
గదాపాతేన మహతా శంఖానాం నినదేన చ॥ 7
సింహనాదైశ్చ శూరాణాం గజానాం బృహితైస్తథా।
గాండీవశబ్దేన భృశమ్ అశనిప్రతిమేన చ।
శ్రుతిః స్మృతిశ్చ మే వీర ప్రణష్టా మూఢచేతసః॥ 8
"యుద్ధంలో ఇటువంటి శూరుల కలయికను నేనింతకు ముందెప్పుడూ చూడలేదు. గదల పెనుదెబ్బలతో, శంఖ ధ్వనులతో, వీరుల సింహనాదాలతో పిడుగుపాటు వంటి నీగాండీవధ్వనితో నామనస్సు మూఢతకు లోనైంది. నా శ్రవణశక్తి, స్మరణశక్తి కూడా నశించాయి." (7,8)
అలాతచక్రప్రతిమం మండలం సతతం త్వయా।
వ్యాక్షిప్యమాణం సమరే గాండీవం చ ప్రకర్షతా।
దృష్టిః ప్రచలితా వీర హృదయం దీర్యతీవ మే॥ 9
"రణభూమిలో అదేపనిగా నీవు గాండీవాన్ని టంకారం చేస్తూ లాగుతుంటే కొఱవిని చక్రంగా త్రిప్పినట్లు నాకనిపిస్తోంది. నాకళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. నా హృదయం బ్రద్దలవుతున్నట్లుంది." (9)
వపుశ్చోగ్రం తవ రణే క్రుద్ధస్యేవ పినాకినః।
వ్యాయచ్ఛతస్తవ భుజం దృష్ట్వా భీర్మే భవత్యపి॥ 10
"యుద్ధసమయంలో నీ శరీరం కోపించిన రుద్రుని శరీరంవలె భయానకంగా ఉంది. నీవు వింటినారిని లాగుతూ భుజాలను విశాలం చేస్తుంటే చూస్తున్న నాకు భయం కలుగుతోంది". (10)
నాదదానం న సంధానం న ముంచంతం శరోత్తమాన్।
త్వామహం సంప్రపశ్యామి పశ్యన్నపి న చేతనః॥ 11
"ఆ బాణాలను నీవు ఎప్పుడు తీస్తున్నావో, ఎప్పుడు సంధిస్తున్నావో, ఎప్పుడు వదులుతున్నావో నాకు కనిపించటం లేదు. ఒకవేళ కన్పించినా నేను గ్రహించలేకపోతున్నాను". (11)
అవసీదంతి మే ప్రాణాః భూరియం చలతీవ చ।
న చ ప్రతోదం రశ్మీంశ్చ సంయంతుం శక్తిరస్తి మే॥ 12
"నా ప్రాణాలు కడంటుతున్నాయి. ఈభూమి కదులుతున్నట్లు అనిపిస్తోది. గుఱ్ఱాల పగ్గాలను కానీ కొరడాను కానీ పట్టుకొనే శక్తికూడా నాకు లేదు." (12)
అర్జున ఉవాచ
మా భైషీః స్తంభయాత్మానం త్వయాపి నరపుంగవ।
అత్యద్భుతాని కర్మాణి కృతాని రణమూర్ధని॥ 13
అర్జునుడిలా అన్నాడు. "నరశ్రేష్ఠా! భయపడవద్దు. నిన్ను నీవు కుదురపరచుకో. రణరంగంలో నీవు కూడా అద్భుత కార్యాలను చేశావు. (13)
రాజపుత్రోఽసి భద్రం తే కులే మత్స్యస్య విశ్రుతే।
జాతస్త్వం శత్రుదమనే నావసీదితుమర్హసి॥ 14
ధృతిం కృత్వా సువిపులాం రాజపుత్ర రథే మమ।
యుధ్యమానస్య సమరే హయాన్ సంయచ్ఛ శత్రుహన్॥ 15
నీవు రాజకుమారుడవు. నీకు మేలే జరుగుతుంది. ప్రసిద్ధికెక్కిన మత్స్యవంశంలో పుట్టినవాడవు. శత్రు సంహార సమయంలో చెదిరిపోకూడదు. శత్రువులను చంపగలవాడవు. ధైర్యం తెచ్చుకొని నా రథంపై కూర్చొని నేను యుద్ధం చేస్తుంటే గుఱ్ఱాలను నియంత్రించు" (14,15)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహాబాహుః వైరాటిం నరసత్తమః।
అర్జునో రథినాం శ్రేష్ఠః ఉత్తరం వాక్యమబ్రవీత్॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఈ విధంగా ఉత్తరకుమారుని సముదాయించి నరులలో, రథికులలో కూడా శ్రేష్ఠుడైన అర్జునుడు ఉత్తరునితో మరల ఇలా అన్నాడు. (16)
సేనాగ్రమాశు భీష్మస్య ప్రాపయస్వైతదేవ మామ్।
ఆచ్ఛేత్స్యామహమేతస్య ధనుర్జ్యామపి చాహవే॥ 17
"వెంటనే నన్ను, నా రథాన్నీ భీష్ముని సేనాముఖం దగ్గరకు నడిపించు. ఈ యుద్ధంలో ఆయన వింటిని, వింటినారిని కూడా ఛేదిస్తాను. (17)
అస్యంతం దివ్యమస్త్రం మాం చిత్రమద్య నిశామయ।
శతహ్రదామివాయాంతీం స్తనయిత్నోరివాంబరే॥ 18
సువర్ణపృష్ఠం గాండీవం ద్రక్ష్యంతి కురవో మమ।
దక్షిణేనాథ వామేన కతరేణ స్విదస్యతి॥ 19
ఇతి మాం సంగతాః సర్వే తర్కయిష్యంతి శత్రవః।
శోణితోదాం రథావర్తాం నాగనక్రాం దురత్యయామ్।
నదీం ప్రస్కందయిష్యామి పరలోకప్రవాహినీమ్॥ 20
నేడు విచిత్రంగా దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్న నన్ను నీవు చూస్తావు. సువర్ణపృష్ఠం గల గాండీవం నుండి బాణాలు వెలువడుతుంటే గగనతలంలో మేఘం నుండి వెలువడిన మెరుపుతీగను చూసినట్టు కౌరవులు చూతారు. శత్రువులందరూ ఒక్కటై కూడి నేను బాణాలను ఎడమచేతితో వదలుతున్నానో, కుడిచేతితో వదలుతున్నానో అర్థంగాక తర్కించుకొంటారు. నెత్తురే నీరుగా, రథాలే సుడులుగా, ఏనుగులే మొసళ్ళుగా దాటవీలుగాని రక్తనదిని ప్రవహింప జేస్తాను. ఆ నది పరలోకానికి ప్రవహిస్తుంది." (18-20)
పాణిపాదశిరఃపృష్ఠ బాహుశాఖానిరంతరమ్।
వనం కురూణాం ఛేత్స్యామి శరైః సంనతపర్వభిః॥ 21
"వంగిన కణుపులు గల నాభాణాలతో ఈ రోజు కాళ్ళు, చేతులు, తలలు, వీపులు, బాహువులు - కొమ్మలు గాగల దట్టమైన ఈ కౌరవవనాన్ని నరికేస్తాను" (21)
జయతః కౌరవీం సేనామ్ ఏకస్య మమ ధన్వినః।
శతం మార్గా భవిష్యంతి పావకస్యేవ కాననే॥ 22
అరణ్యంలో పుట్టిన దావాగ్నికి అన్ని వైపులా దారు లేర్పడినట్లు అద్వితీయంగా కౌరవసేనను జయిస్తున్న ఈ విలుకానికి(అర్జునునకు) వందలదార్లు ఏర్పడుతాయి. (22)
మయా చక్రమివావిద్ధం సైన్యం ద్రక్ష్యసి కేవలమ్।
ఇష్వస్త్రే శిక్షితం చిత్రమ్ అహం దర్శయితాస్మి తే॥ 23
నాబాణాలచే గాయపరచబడి చక్రంలా గిరగిర తిరిగే సైన్యాన్ని నీవు చూస్తావు. నీవు నేర్చిన విలువిద్యలోని విచిత్రాలనన్నింటినీ నీకు చూపిస్తాను. (23)
అసంభ్రాంతో రథే తిష్ఠ సమేషు విషమేషు చ।
దివమావృత్య తిష్ఠంతం గిరిం భింద్యాం స్మ పత్రిభిః॥ 24
నీవు ఎగుడుదిగుడైనా సరే బెదిరిపోక రథం మీదనే నిలు. నా బాణాలతో ఆకాశాన్ని ఆవరించి ఉన్న పర్వతాన్ని అయినా ఈరోజు బ్రద్ధలు కొడతాను. (24)
అహమింద్రస్య వచనాత్ సంగ్రామేఽభ్యహనం పురా।
పౌలోమాన్ కాలఖంజాంశ్చ సహస్రాణి శతాని చ॥ 25
నేను గతంలో ఇంద్రుని మాటమేరకు పౌలోమ కాలఖంజాది రాక్షసులను లక్షలకొలదిగ యుద్ధంలో సంహరించాను. (25)
అహమింద్రాద్ దృఢాం ముష్టిం బ్రహ్మణః కృతహస్తతామ్।
ప్రగాఢే తుములం చిత్రమ్ ఇతివిద్ధి ప్రజాపతేః॥ 26
నేను వింటిని పట్టేటప్పుడు పిడికిలి బిగించటాన్ని ఇంద్రుని దగ్గరనుండి, బాణాలను ప్రయోగించేటప్పుడు చేతి నేర్పును బ్రహ్మనుండి, సంకటస్థితిలో విచిత్రంగా యుద్ధం చేయటాన్ని ప్రజాపతి నుండి నేర్చుకొన్నానని తెలుసుకో. (26)
అహం పారే సముద్రస్య హిరణ్యపురవాసినామ్।
జిత్వా షష్టిం సహస్రాణి రథినాముగ్రధన్వినామ్॥ 27
"నేను సాగరతీరంలోని హిరణ్యపురంలో నివసిస్తున్న అరువదివేలమందిని ఓడించాను. వారు గొప్ప విలుకాండ్రు, మహారథికులు. (27)
శీర్యమాణాని కూలాని ప్రవృద్ధేనేవ వారిణా।
మయా కురూణాం బృందాని పాత్యమానాని పశ్య వై॥ 28
జలప్రవాహం వరదగా మారి, ఒడ్డులను కోసి, కూలద్రోసినట్టు కౌరవబృందాలను నేను పడగొడుతుంటే నీవు చూడు. (28)
ధ్వజవృక్షం పత్తితృణం రథసింహగణాయుతమ్।
వనమాదీపయిష్యామి కురూణామగ్నితేజసా॥ 29
ధ్వజాలే చెట్లుగా, సైనికులే తౄణప్రాయంగా, రథాలే సింహసమూహాలుగా ఉన్న కౌరవవనాన్ని నా శస్త్రాస్త్ర రూపమైన అగ్నితో తగులబెడతాను. (29)
తానహం రథనీడేభ్యః శరైః సంనతపర్వభిః।
యత్తాన్ సర్వానతిబలాన్ యోత్స్యమానానవస్థితాన్।
ఏకః సంకాలయిష్యామి వజ్రపాణిరివాసురాన్॥ 30
వంగినకణుపులు గల నా బాణాలతో కౌరవులను రథాలనే గూళ్ళనుండి క్రిందకు పడగొడతాను. ఇంద్రుడు రాక్షసులను సంహరించినట్లు నేనొక్కడనే యుద్ధసన్నద్ధులై నిలిచిన బలసంపన్నులైన వీరుల నందరనూ నశింపజేస్తాను. (30)
రౌద్రం రుద్రాదహం హ్యస్త్రం వారుణాం వరుణాదపి।
అస్త్రమాగ్నేయమగ్నేశ్చ వయవ్యం మాతరిశ్వనః।
వజ్రాదీని తథాస్త్రాణి శక్రాదహమవాప్తవాన్॥ 31
నేను రుద్రునినుండి రౌద్రాస్త్రాన్ని, వరుణుని నుండి వారుణాస్త్రాన్ని, అగ్నినుండి ఆగ్నేయాస్త్రాన్ని, వాయువు నుండి వాయవ్యాస్త్రాన్ని, ఇంద్రునినుండి వజ్రాస్త్రం మొదలగు అస్త్రాలనూ పొంది ఉన్నాను. (31)
ధార్తరాష్ట్రవనం ఘోరం నరసింహాభిరక్షితమ్।
అహముత్పాటయిష్యామి వైరాటే వ్యేతు తే భయమ్॥ 32
వీరనర సింహాలచే రక్షింపబడుతున్న ఘోరమైన ధార్తరాష్ట్రవనాన్ని నేను పెలికంచివేస్తాను. ఉత్తరకుమారా! నీవు కూడ భయపడ నవసరంలేదు" (32)
వైశంపాయన ఉవాచ
ఏవమాశ్వాసుతస్తేన వైరాటిః సవ్యసాచినా।
వ్యవాగాహద్ రథానీకం భీమం భీష్మాభిరక్షితమ్॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు! జనమేజయా! అర్జునుడు అలా అనునయిస్తే ఉత్తరకుమారుడు భీష్మునిచే రక్షింపబడి యున్న ఆ రథసమూహంలోనికి చొచ్చుకుపోయాడు. (33)
తమాయాంతం మహాబాహుం జిగీషంతం రణే కురూన్।
అభ్యవారయదవ్యగ్రః క్రూరకర్మాఽఽపగాసుతః॥ 34
యుద్ధంలో కౌరవులను జయించాలన్న కోరికతో వస్తున్న ఆ మహాబాహువైన అర్జునుని తీవ్రకర్ముడైన భీష్ముడు తొట్రుపడకుండా నివారించాడు. (34)
తస్య జిష్ణురుపావృత్య ధ్వజం మూలాదపాతయత్।
వికృష్య కలధౌతాగ్రైః స విద్ధః ప్రాపతద్ భువి॥ 35
అప్పుడు జయశీలుడైన అర్జునుడు భీష్మునివైపు తిరిగి బంగారు మొనలుగల వాడి బాణాలతో ఆ భీష్ముని ధ్వజాన్ని మూలం నుండి పెల్లగించాడు. ఆ దెబ్బతిని అది నేలకూలింది. (35)
తం చిత్రమాల్యాభరణాః కృతవిద్యా మనస్వినః।
ఆగచ్ఛన్ భీమధన్వానం చత్వారశ్చ మహాబలాః॥ 36
దుశ్శాసనో వికర్ణశ్చ దుస్సహోఽథ వివింశతిః।
ఆగత్య భీమధన్వానం బీభత్సుం పర్యవారయన్॥ 37
అంతలో విచిత్రమైన మాలలు, ఆభరణాలు ధరించి, విలువిద్యలో నేర్పుగల, అభిమానవంతులు, మహాబలులు అయిన నలుగురు వీరులు - దుశ్శాసన, వికర్ణ, దుస్సహ, వివింశతులు భయంకరమైన ధనుస్సుగల అర్జునుని చుట్టుముట్టారు. (36,37)
దుశ్శాసనస్తు భల్లేన విద్ధ్వా వైరాటిముత్తరమ్।
ద్వితీయేనార్జునం వీరః ప్రత్యవిధ్యత్ స్తనాంతరే॥ 38
దుశ్శాసనుడు ఒక బాణంతో విరాటకుమారుడైన ఉత్తరుని గాయపరచి మరొక బాణంతో అర్జునుని రొమ్ముపై కొట్టాడు. (38)
తస్య జిష్ణురుపావృత్య పృథుధారేణ కార్ముకమ్।
చకర్త గార్ధ్రపత్రేణ జాతరూపపరిష్కృతమ్॥ 39
అప్పుడు అర్జునుడు అతనివైపు తిరిగి విశాలమైన వాదర, గ్రద్దఈకలు గల బాణంతో స్వర్ణమయమైన దుశ్శాసనుని ధనుస్సును ఖండించాడు. (39)
అథైనం పంచభిః పశ్చాత్ ప్రత్యవిధ్యత్ స్తనాంతరే।
సోఽపయాతో రణం హిత్వా పార్థబాణప్రపీడితః॥ 40
తరువాత అయిదు బాణాలతో దుశ్శాసనుని రొమ్ముపై కొట్టాడు. అర్జునుని బాణాల బాధను తట్టు కోలేక దుశ్శాసనుడు యుద్ధం విడిచి పారిపోయాడు. (40)
తం వికర్ణః శరైస్తీక్ష్ణైః గృధ్రపత్రైరజిహ్మగైః।
వివ్యాధ పరవీరఘ్నమ్ అర్జునం ధృతరాష్ట్రజః॥ 41
అలా శత్రుసంహారం చేస్తున్న ఆ అర్జునుని గ్రద్దఈకలు గలిగి, వాడియైన సూటిబాణాలతో ధృతరాష్ట్రకుమారుడు వికర్ణుడు బాధించాడు. (41)
తతస్తమపి కౌంతేయః శరేణానతపర్వణా।
లలాటేఽభ్యహనత్ తూర్ణం స విద్ధః ప్రాపతద్ రథాత్॥ 42
అంతట అర్జునుడు వంగినకణుపులుగల బాణంతో వికర్ణుని నుదుటిపై కొట్టాడు. గాయపడిన వికర్ణుడు వెంటనే రథం మీదనుండి పడ్డాడు. (42)
తతః పార్థమభిద్రుత్య దుస్సహః స వివింశతిః।
అవాకిరచ్ఛరైస్త్రీక్ష్ణైః పరీప్సుర్భ్రాతరం రణే॥ 43
తరువాత యుద్ధంలో దుస్సహుడు, వివింశతి అర్జునునిమీదికురికి సోదరునిపాటునకు ప్రతీకారంగా ఆయనపై వాడియైన బాణాలను కురిపించారు. (43)
తావుభౌ గార్ధ్రపత్రాబ్యాం నిశితాభ్యాం ధనంజయః।
విద్ధ్వా యుగపదవ్యగ్రః తయోర్వాహానసూదయత్॥ 44
గ్రద్ద ఈకలు గల వాడిబాణాలతో అర్జునుడు దుస్సహ వివింశతుల నిద్దరినీ ఒక్కసారిగా గాయపరచి స్తిమితంగా వారి గుఱ్ఱాలను సంహరించాడు. (44)
తౌ హతాశ్వౌ విభిన్నాంగౌ ధృతరాష్ట్రాత్మజావుభౌ।
అభిపత్య రథైరన్యైః అపనీతౌ పదానుగైః॥ 45
గుఱ్ఱాలను కోల్పోయి గాయపడిన శరీరంగల ఆ ధృతరాష్ట్రకుమారుల నిద్దరినీ సైనికులు వచ్చి ఇతరరథాలమీద తొలగించుకొనిపోయారు. (45)
సర్వా దిశశ్చాభ్యపతద్ బీభత్సురపరాజితః।
కిరీటమాలీ కౌంతేయః లబ్ధలక్షో మహాబలః॥ 46
ఓటమినెరుగని బీభత్సుడు, కిరీటి, మహాబలుడు అయిన అర్జునుడు గురితప్పకుండా సేనలో అన్ని దిక్కులా సంచరింప సాగాడు. (46)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణి గోహరణపర్వణి అర్జున దుశ్శాసనాదియుద్ధే ఏకషష్టితమోఽధ్యాయః॥ 61 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున గోహరణపర్వమను ఉపపర్వమున అర్జునదుశ్శాసనాది యుద్ధమను అరువది యొకటవ అధ్యాయము. (61)