2. ద్వితీయాధ్యాయము

బలరాముని భాషణము.

బలదేవ ఉవాచ
శ్రుతం భవద్భిర్గదపూర్వజస్య
వాక్యం యథా ధర్మవదర్థవచ్చ।
అజాతశత్రోశ్చ హితం హితం చ
దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞః॥ 1
సుజనులారా! అజాతశత్రువైన ధర్మరాజుకు, రాజైన దుర్యోధనునకు హితమైనదీ, ధర్మానుకూలమూ, అర్థ శాస్త్రసమ్మతమూ అయిన శ్రీకృష్ణుని సంభాషణను మీరు అందరూ విన్నారు. (1)
అర్ధం హి రాజ్యస్య విసృజ్య వీరాః
కుంతీసుతాస్తస్య కృతే యతంతే।
ప్రదాయ చార్ధం ధృతరాష్ట్రపుత్రః
సుఖీ సహాస్మాభిరతీవ మోదేత॥ 2
మహావీరులైన పాండవులు సగం వదులుకొని అర్ధరాజ్యానికి ప్రయత్నిస్తున్నారు. దుర్యోధనుడు వారు అడుగుతున్న అర్ధరాజ్యాన్ని ఇచ్చి మనతోపాటు తాను కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. (2)
వి॥సం॥ అర్ధరాజ్యాన్ని జూదంతో పోగొట్టుకొని దానికోసం ప్రయత్నిస్తున్నారు. (అర్జు-సర్వ)
తస్యకృతే = ధర్మరాజుకోసం ప్రయత్నిస్తున్నారు పాండవులు. (లక్షా)
లబ్ధ్వా హి రాజ్యం పురుషప్రవీరాః
సమ్యక్ప్రవృత్తేషు పరేషు చైవ।
ధ్రువం ప్రశాంతాః సుఖమావిశేయుః
తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానామ్॥ 3
శ్రేష్ఠులైన పాండవులు అర్ధరాజ్యాన్ని పొంది తమ వారి యందు, పరులయందు సమానమైన ప్రశాంతతతో సుఖమును పొందుదురు గాక! వారి ప్రశాంతత ప్రజలకు మేలు కలిగిస్తుంది. (3)
దుర్యోధనస్యాపి మతం చ వేత్తుం
వక్తుం చ వాక్యాని యుధిష్ఠిరస్య।
ప్రియం చ మే స్యాద్ యది తత్ర కశ్చిద్
వ్రజేచ్ఛమార్థం కురుపాండవానామ్॥ 4
దుర్యోధనుని అభిప్రాయాన్ని తెలుసుకోవడానికీ, యుధిష్ఠిరుని పలుకులను అతనికి తెలియజేయటానికీ, కౌరవపాండవులకు శాంతి కలిగించటానికీ ఎవడైనా ఒకడు రాయబారిగా వెళ్లాలి. ఈ ప్రయత్నం నాకు చాలా ప్రియమైనది. (4)
స భీష్మమామంత్ర్య కురుప్రవీరం
వైచిత్రవీర్యం చ మహానుభావమ్।
ద్రోణం సపుత్రం విదురం కృపం చ
గాంధారరాజం చ ససూతపుత్రమ్॥ 5
సర్వే చ యేఽన్యే ధృతరాష్ట్రపుత్రాః
బలప్రధానా నిగమప్రధానాః।
స్థితాశ్చ ధర్మేషు తథా స్వకేషు
లోకప్రవీరాః శ్రుతకాలవృద్ధాః॥ 6
ఏతేషు సర్వేషు సమాగతేషు
పౌరేషు వృద్ధేషు చ సంగతేషు।
బ్రవీతు వాక్యం ప్రణిపాతయుక్తం
కుంతీసుతస్యార్థకరం యథా స్యాత్॥ 7
ఆ దూత కురువృద్ధుడైన భీష్ముణ్ణి, మహానుభావుడైన ధృతరాష్ట్రునీ, ద్రోణునీ, అశ్వత్థామను, విదురుణ్ణి, కృపాచార్యునీ, శకునినీ, కర్ణునీ, కౌరవులందరినీ, బల వంతులు, వేదవిదులు, స్వధర్మనిష్ఠులు, మహావీరులు, వయోవృద్ధులు అయిన ఆ సభలోని పౌరులనూ ఉద్దేశించి వినయపూర్వకంగా పాండవులకు ప్రయోజనకరమైన విధంగా మాట్లాడాలి. (5,6,7)
సర్వాస్వవస్థాసు చ తే న కోప్యాః
గ్రస్తో హి సోఽర్థో బలమాశ్రితై స్తైః।
ప్రియాభ్యుపేతస్య యుధిష్ఠిరస్య
ద్యూతే ప్రసక్తస్య హృతం చ రాజ్యమ్॥ 8
ఏ దశలోనూ వారికి కోపం తెప్పించకూడదు. ఎందుకంటే వారు బలవంతులై రాజ్యంపై అధికారం పొంది ఉన్నారు. జూదంపై ఆసక్తితో ఆటకు వెళ్ళిన యుధిష్ఠిరుని రాజ్యం వారిచే అపహరింఛబడింది. (8)
వి॥సం॥ సర్వధాఽపి తే పాండవా: న కోప్యాః భవద్భిః - మీరు (కౌరవసభాపదులు) ఏవిధంగానూ పాండవులపై కోపించకూడదు. (నీల)
సర్వాస్వవస్థాసు చ తేన కౌట్యాత్ అని పాఠం. బాల్యాది సర్వావస్థలయందును దుర్యోధనునిచేత కపటంగా...(అర్జు)
సర్వాస్వవస్థాసు చ తే న కౌట్యాత్ అని పాఠం. అన్ని వేళలా దుర్యోధనాదులు కౌటియంతో మీ సంపదలను గ్రహించలేదు. (సర్వా)
సర్వాస్వవస్థాసు చ తేన కోపాత్ గ్రస్తః తేన = దానిచేత (రాజ్యాపహరణంచేత) కోపగ్రస్తుదు(లక్షా)
నివార్యమాణశ్చ కురుప్రవీరః
సర్వైః సుహృద్భిర్హ్యయమప్యతద్జ్ఞః।
స దీవ్యమానః ప్రతిదీవ్య చైనం
గాంధారరాజస్య సుతం మతాక్షమ్॥ 9
హిత్వా హి కర్ణం చ సుయోధనం చ
సమాహ్వయద్ దేవితుమాజమీఢః।
దురోదరాస్తత్ర సహస్రశోఽన్యే
యుధిష్ఠిరో యాన్ విషహేత జేతుమ్॥ 10
ఉత్సృజ్య తాన్ సౌబలమేవ చాయం
సమాహ్వయత్ తేన జితోఽక్షవత్యామ్।
జూదం ఆడటం సరిగా ఎరుగని కురువీరుడైన యుధిష్ఠిరుని హితులు అందరు నివారించారు. అయినా అతడు జూదానికి సిద్ధమై కర్ణుని, దుర్యోధనుని తాను గెలువగలిగిన వేలమంది జూదరులను వదలి గాంధార రాజకుమారుడు, జూదంలో నిపుణుడు అయిన శకునిచే ఆటకు పిలిచి అతనిచేతిలో ఓడిపోయాడు. (9,10 1/2)
స దీవ్యమానః ప్రతిదేవనేన
అక్షేషు నిత్యం తు పరాఙ్ముఖేషు॥ 11
సంరంభమాణో విజితః ప్రసహ్య
తత్రాపరాధః శకునేర్న కశ్చిత్।
జూదం ఆడుతున్న యుధిష్ఠిరుడు ఆటలో పాచికలు తిరగబడి ఓడిపోతూ, రోషావేశంతో జూదాన్ని కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పు ఏమీ లేదు. (11 1/2)
తస్మాత్ ప్రణమ్యైవ వచో బ్రవీతు
వైచిత్రవీర్యం బహుసామయుక్తమ్॥ 12
తథా హి శక్యో ధృతరాష్ట్రపుత్రః
స్వార్థే నియోక్తుం పురుషేణ తేన।
అందువలన ఇక్కడినుంచి వెళ్లేదూత ధృతరాష్ట్రునికి వినయపూర్వకంగా నమస్కరించి మాత్రమే సామనీతి యుక్తంగా మాట్లాడవలసి ఉంటుంది. అలా అయితేనే అతడు దుర్యోధనుని తన ప్రయోజన సిద్ధిలో నియోగించటం సాధ్యమౌతుంది. (12 1/2)
అయుద్ధమాకాంక్షత కౌరవాణాం
సామ్నైవ దుర్యోధనమాహ్వయధ్వమ్॥ 13
సామ్నా జితోఽర్థోఽర్థకరో భవేత
యుద్ధేఽనయో భవితా నేహ సోఽర్థః॥ 14
కౌరవపాండవుల మధ్య యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకోండి. సంధి ప్రయత్నం, సామోపాయంతో మాత్రమే దుర్యోధనుని పిలవండి. ఆ మార్గంలో సిద్ధించిన ప్రయోజనమే లాభదాయకం అవుతుంది. యుద్ధం వలన ఉభయపక్షాలకు నష్టం, అన్యాయం జరుగుతుంది. అది ప్రయోజనకారి కాదు. (13,14)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువత్యేవ మధుప్రవీరే
శినిప్రవీరః సహసోత్పపాత।
తచ్చాపి వాక్యం పరినింద్య తస్య
సమాదదే వాక్యమిదం సమన్యుః॥ 15
వైశంపాయనుడు ఇలా అన్నాడు - జనమేజయా! బలరాముడు ఇలా పలుకుతూ ఉండగా సాత్యకి తటాలున లేచి అడ్డుకొన్నాడు. బలరాముని పలుకులను వ్యతిరేకిస్తూ కోపంతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి బలదేవవాక్యే ద్వితీయోఽధ్యాయః॥ 2 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున బలరామసంభాషణమను ద్వితీయాధ్యాయము. (2)