3. తృతీయాధ్యాయము

సాత్యకి వీరోచిత సంభాషణము.

సాత్యకి రువాచ
యాదృశః పురుషస్యాత్మా తాదృశం సంప్రభాషతే।
యథారూపోఽంతరాత్మా తే తథారూపం ప్రభాషసే॥ 1
సాత్యకి ఇలా అన్నాడు. బలరామా!! మన్సుష్యునకు ఎలాంటి హృదయం ఉంటే అలాంటిమాటలే అతని నోటినుండి వస్తాయి. మీకు కూడా ఎటువంటి అంతఃకరణ ఉన్నదో అటువంటి మాటలే మీరు మాట్లాడుతున్నారు. (1)
సంతి వై పురుషాః శూరాః సంతి కాపురుషాస్తథా।
ఉభావేతౌ దృఢౌ పక్షౌ దృశ్యేతే పురుషాన్ ప్రతి॥ 2
పురుషలలో శూరులూ ఉన్నారు. అలాగే కుత్సితులూ/సోమరులూ ఉన్నారు. మానవులలో ఈ రెండురకాల వారూ కనిపిస్తూ ఉంటారు. (2)
ఏకస్మిన్నేవ జాయేతే కులే క్లీబమహాబలౌ।
ఫలాఫలవతీ శాఖే యథైకస్మిన్ వనస్పతౌ॥ 3
ఒకే చెట్టు కొమ్మల్లో ఒకటి పండ్లు ఉన్నదీ మరొకటి లేనిదీ ఉన్నట్లే ఒకే వంశంలో పిరికివాడూ, మహావీరుడూ కూడా జన్మిస్తూ ఉంటారు. (3)
నాభ్యసూయామి తే వాక్యం బ్రువతో లాంగలధ్వజ।
యే తు శృణ్వంతి తే వాక్యం తావసూయామి మాధవ॥ 4
బలరామా! నీవు మాట్లాడిన మాట నేను తప్పు పట్టడంలేదు. ఆ మాటలను మౌనంగా వింటూ కూర్చున్న వారిని తప్పుపడుతున్నాను. (4)
వి॥సం॥ 1) 2వ అధ్యాయం 11 వ శ్లోకంలో "శకుని తప్పు లేదు" అన్నమాట. (నీల)
2) 'లాంగల ధ్వజ' అనే సంబోధన నిందాగర్భంగా అన్నది (అర్జు, సర్వ)
వి॥తె॥ ఈ భావం తెలుగులో తిక్కన ఇలా తీర్చిదిద్దాడు.
ఇట్టు లాడఁదగునె? యిది నీక పోలు; ని
న్నేమనంగ నేర్తు నిత్తెఱంగు
పాడిగాఁగఁ బూని పలుకంగఁ జెవి యొడ్డి
ఆదరించువారి నందుఁగాక!
ఉద్యోగ-1-23
కథం హి ధర్మరాజస్య దోషమల్పమపి బ్రువన్।
లభతే పరిషన్మధ్యే వ్యాహర్తుమకుతోభయః॥ 5
ఎవడైనా సభలో నిర్భయుడై ధర్మరాజుపై ఏ చిన్న దోషమైనా ఆరోపించటానికి ఎలా సాధ్యమౌతుంది? (5)
సమాహూయ మహాత్మానం జితవంతోఽక్షకోవిదాః।
అనక్షజ్ఞం యథాశ్రద్ధం తేషు ధర్మజయః కుతః॥ 6
ఆసక్తి లేనివాడు, జూదం ఆడటం సరిగా చేతకాని వాడు, మహాత్ముడు అయిన ధర్మరాజును జూదంలో నిపుణులైన వారు తమ ఇంటికి పిలిచి, ఆడించి, గెలిస్తే అది ధర్మజయం ఎలా అవుతుంది. (6)
యది కుంతీసుతం గేహే క్రీడంతం భ్రాతృభిస్సహ।
అభిగమ్య జయేయుస్తే తత్ తేషాం ధర్మతో భవేత్।
సమాహూయ తు రాజానం క్షత్రధర్మరతం సదా॥ 7
నికృత్యా జితవంతస్తే కిం ను తేషాం పరం శుభమ్।
కథం ప్రణిపతేచ్చాయమ్ ఇహ కృత్వా పణం పరమ్॥ 8
సోదరులతో కలసి తన ఇంటిలో జూదమాడుతున్న ధర్మరాజు వద్దకు వచ్చి, ఆడి; గెలిచి ఉంటే అది వారికి ధర్మజయం అవుతుంది. క్షత్రియధర్మాన్ని అనుసరించే యుధిష్ఠిరుని జూదానికి పిలిచి మోసం చేసి గెలిస్తే వారు చేసింది మంచిపని ఎలా అవుతుంది? పైగా ధర్మరాజు ప్రతిజ్ఞను పూర్తిచేశాక వచ్చి వారికి ఎలా తలవంచుతాడు? (7-8)
వనవాసాద్ విముక్తస్తు ప్రాప్తః పైతామహం పదమ్।
యద్యయం పాపవిత్తాని కామయేత యుధిష్ఠిరః॥ 9
ఏవమప్యయమత్యంతం పరాన్ నార్హతి యాచితుమ్।
వనవాసం నుండి విముక్తుడు కాగానే ధర్మరాజు పైతృకమైన రాజ్యాన్ని పొందటానికి అర్హుడైనాడు. అతడేమైనా అన్యాయంగా తన రాజ్యాన్ని పొందగోరుతున్నాడా? అలా అయినా దీనుడై అతడు శత్రువులను యాచించటం తగదు. (9 1/2)
కథం చ ధర్మయుక్తాస్తే న చ రాజ్యం జిహీర్షవః॥ 10
నివృత్తవాసాన్ కౌంతేయాన్ య ఆహుర్విదితా ఇతి।
నియమం ప్రకారం వనవాసాన్ని పూర్తిచేసుకొని వచ్చిన పాండవులకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వకుండా అపహరించిన కౌరవులు ధర్మయుక్తులు ఎలా అవుతారు? వారిని విజ్ఞులని ఎవరు అంటారు? (10 1/2)
అనునీతా హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ। 11
న వ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు।
భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అనునయంతో చెప్పినా పాండవులకు పైతృకమైన సంపదను ఇవ్వటానికి కౌరవులు సిద్ధపడటం లేదు. (11 1/2)
అహం తు తాన్ శితైర్బాణైః అనునీయ రణే బలాత్॥ 12
పాదయోః పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః।
నేనైతే కౌరవులను యుద్ధంలో పదునైన బాణాలతో లాక్కువచ్చి మహాత్ముడైన ధర్మరాజు పాదాలపై పడేస్తాను. (12 1/2)
అథ తేన వ్యవస్యంతి ప్రణిపాతాయ ధీమతః॥ 13
గమిష్యంతి సహామాత్యాః యమస్య సదనం ప్రతి।
కౌరవులు బుద్ధిశాలియైన ధర్మజుని పాదాలపై పడ కూడదనుకొంటే మంత్రులతో కలిసి యమలోకానికి పోతారు. (13 1/2)
న హి తే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః॥ 14
వేగం సమర్థాః సంసోఢుం వజ్రస్యేవ మహీధరాః।
మహాపర్వతాలైనా వజ్రాయుధం వేగాన్ని తట్టు కోలేనట్టు వీరావేశంతో యుద్ధంచేసే ఈ సాత్యకి దెబ్బలకు వారెవరూ ఆగలేదు. (14 1/2)
కో హి గాండీవధన్వానం కశ్చ చక్రాయుధం యుధి॥ 15
మాం చాపి విషహేత్ క్రుద్ధం కశ్చ భీమం దురాసదమ్।
యమౌ చ దృఢధన్వానౌ యమకాలోపమద్యుతీ।
విరాటద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతీ॥ 16
కో జిజీవిషురాసాదేద్ ధృష్టద్యుమ్నం చ పార్షతమ్।
అర్జునుని, చక్రాయుధుడైన కృష్ణుని, భయంకరుడైన భీముని, నన్నూ యుద్ధంలో ఎవడు ఎదుర్కొన గలడు? విలువిద్యలో ఆరితేరిన నకుల సహదేవులు, విరాటద్రుపదులు కాలయముల వంటివారు. వారినీ, మహా వీరుడైన ధృష్టద్యుమ్నునీ ఎదుర్కొని ఎవరు బ్రతుకుతారు? (15 16 1/2)
వి.సం. యముడు శరీరం నుండి ప్రాణాలను లాగుతాడు. కాలుడు ఆయుస్సుకు హద్దు గీస్తాడు. (నీల)
పంచైతాన్ పాండవేయాంస్తు ద్రౌపద్యాః కీర్తివర్ధవాన్॥ 17
సమప్రమాణాన్ పాండూనాం సమవీర్యాన్ మదోత్కటాన్।
సౌభద్రం చ మహేష్వాసమ్ అమరైరపి దుస్సహమ్॥ 18
గదప్రద్యుమ్నసాంబాంశ్చ కాలసూర్యానలోపమాన్।
ఉపపాండవులు ద్రౌపదికీర్తిని పెంచేవారు. ఉత్సాహ వంతులు. అయిదుగురూ పాండవులతో సమానమైన బలం గలవారు. సుభద్రకొడుకు అభిమన్యుడు దేవతలకు కూడా అసాధ్యుడు. గదుడు కాలునివంటివాడు. ప్రద్యుమ్నుడు సూర్యుని వంటివాడు. సాంబుడు నిప్పువంటివాడు. వీరందరినీ ఎదుర్కొని ఎవరయినా బ్రతుకగలరా? (17, 18 1/2)
తే వయం ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహ॥ 19
కర్ణం చైవ నిహత్యాజౌ అభిషేక్ష్యామ పాండవమ్।
దుర్యోధనుని, శకునిని, కర్ణుని మేము యుద్ధంలో చంపి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తాము. (19 1/2)
నాధర్మో విద్యతే కశ్చిత్ శత్రూన్ హత్వాఽతతాయినః॥ 20
అధర్మ్యమయశస్యం చ శాత్రవాణాం ప్రయాచనమ్।
దుర్మార్గులైన శత్రువులను చంపటంలో కొంచెం కూడా అధర్మం లేదు కాని శత్రువులను యాచించటం అధర్మమూ, అపకీర్తికరమూ అవుతుంది. (20 1/2)
హృద్గతస్తస్య యః కామః తం కురుధ్వమతంద్రితాః॥ 21
నిసృష్టం ధృతరాష్ట్రేణ రాజ్యం ప్రాప్నోతు పాండవః।
అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః॥ 22
నిహతా వా రణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే॥ 23
ధర్మరాజు హృదయంలో ఉన్న కోరికను అలసట లేకుండా తీర్చండి. ధృతరాష్ట్రుడు ఇచ్చిన రాజ్యాన్ని ధర్మరాజు పొందుగాక! పాండునందనుడైన యుధిష్ఠిరుడు రాజ్యాన్ని అయినా పొందాలి లేదా కౌరవులను యుద్ధరంగంలో చంపి అయినా నిద్రపోవాలి. (21, 22, 23)
వి॥తె॥ సాత్యకి అభిప్రాయాన్ని వ్యాఖ్యానిస్తూ తిక్కన చక్కగా ఇలా చెప్పాడు.
దైన్యము దక్కి దూత యుచితంబుగఁ బాండునృపాలు పాలు రా
జన్యవరుండు ధర్మజుడు సమ్మతి వేడెడు, నన్నలోకసా
మాన్యవిధిం దగంగ గరిమంబున నిచ్చినఁబుచ్చికొంద మ
న్యోన్యవిరుద్ధభాషణము లాడినఁదత్ఫల మాతఁడందెడున్.
ఉద్యోగ-1-32
వెళ్లిన దూత దైన్యం లేకుండా "పాండురాజు రాజ్యభాగంతో ధర్మరాజు సంతృప్తి పడుతున్నాడు" అని గౌరవంతో లోకసామాన్య పద్ధతిలో మాట్లాడాలి. అప్పుడు గౌరవం తప్పకుండా ఇస్తే పుచ్చు కుందాం. కాక విరుద్ధంగా మాట్లాడితే దాని ఫలితం ఆ దుర్యోధనుడే పొందుతాడు.
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సాత్యకి క్రోధవాక్యే తృతీయోఽధ్యాయః॥ 3 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున సాత్యకి క్రోధవాక్యమను తృతీయాధ్యాయము. (3)