6. ఆరవ అధ్యాయము
ద్రుపద పురోహితుని హస్తినాపుర ప్రయాణము.
ద్రుపద ఉవాచ
భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః।
బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః నరేష్వపి ద్విజాతయః॥ 1
ద్రుపదుడు ఇలా అన్నాడు. పుట్టిన ప్రాణులలో జంగమ ప్రాణులు శ్రేష్ఠం. వానిలో గుఱ్ఱం, కుక్క మొదలైన బుద్ధి జీవులు శ్రేష్ఠం. బుద్ధి జీవులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శ్రేష్ఠులు. (1)
ద్విజేషు వైద్యాః శ్రేయాంసః వైద్యేషు కృతబుద్ధయః।
కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః॥ 2
ద్విజులలో విద్యావంతులు శ్రేష్ఠులు, విద్యావంతులలో సిద్ధాంతవేత్తలు, వారిలో సిద్ధాంతాలను ఆచరించేవారు, వారిలో బ్రహ్మవాదులు శ్రేష్ఠులు. (2)
స భవాన్ కృతబుద్ధీనాం ప్రధాన ఇతి మే మతిః।
కులేన చ విశిష్టో ఽ సి వయసా చ శ్రుతేన చ॥ 3
పూజ్యా! కృతబుద్ధులలో నీవు ప్రధానుడవని నా అభి ప్రాయం. వంశం, వయస్సు, విద్యలచే నీవు విశిష్టుడవు. (3)
ప్రజ్ఞయా సదృశశ్చాపి శుక్రేణాంగిరసేన చ।
విదితం చాపి తే సర్వం యథావృత్తః స కౌరవః॥ 4
నీవు బుద్ధిలో బృహస్పతికి, శుక్రునికి సమానుడవు. దుర్యోధనుని నడవడిక కూడా మొత్తం నీకు తెలుసు. (4)
పాండవశ్చ యథావృత్తః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ధృతరాష్ట్రస్య విదితే వంచితాః పాండవాః పరైః॥ 5
కుంతీపాండురాజుల పుత్రుడైన ధర్మరాజు నడవడిక కూడా నీకు తెలుసు. ధృతరాష్ట్రునికి తెలిసిన స్థితిలోనే పాండవులు శత్రువులచే వంచింపబడ్డారు. (5)
విదురేణానునీతోఽపి పుత్రమేవానువర్తతే।
శకునిర్బుద్ధిపూర్వం హి కుంతీపుత్రం సమాహ్వయత్॥ 6
అనక్షజ్ఞం మతాక్షః సన్ క్షత్రవృత్తే స్థితం శుచిమ్।
విదురుడు ఎంత వినయంగా చెప్పినా ధృతరాష్ట్రుడు కొడుకునే అనుసరిస్తాడు. శకుని తాను జూదంలో నిపుణుడై జూదం స్రిగారాని ధర్మరాజును బుద్ధిపూర్వకంగా జూదానికి పిలిచాడు. ధర్మరాజు పరిశుద్ధుడు క్షత్రియ ధర్మాలను పాటించేవాడు. (6 1/2)
తే తథా వంచయిత్వా తు ధర్మరాజం యుధిష్ఠిరమ్॥ 7
న కస్యాంచిదవస్థాయాం రాజ్యం దాస్యంతి వై స్వయమ్।
ఆ విధంగా ధర్మరాజును మోసగించినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని స్వయంగా తిరిగి ఇవ్వలేరు. (7 1/2)
భవాంస్తు ధర్మసంయుక్తం ధృతరాష్ట్రం బ్రువన్ వచః॥ 8
మనాంసి తస్య యోధానాం ధ్రువమావర్తయిష్యతి।
నీవు ధర్మోక్తులు చెపుతూ ధృతరాష్ట్రునీ, అతని వెంట ఉన్నయోధుల మనస్సులనూ తప్పక మార్చగలవు. (8 1/2)
విదురశ్చాపి తద్వాక్యం సాధయిష్యతి తావకమ్॥ 9
భీష్మద్రోణకృపాదీనాం భేదం సంజనయిష్యతి।
విదురుడు కూడా నీ మాటలను సమర్థిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారికే భేదం పుట్టిస్తాడు. (9 1/2)
అమాత్యేషు చ భిన్నేషు యోధేషు వుముఖేషు చ।
పునరేకత్రకరణం తేషాం కర్మ భవిష్యతి।
మంత్రులలో భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు, యోధులు యుద్ధవిముఖులు అయినప్పుడు వారందరినీ ఒక త్రాటిమీదకు తేవటమే పెద్దపని అవుతుంది. (10 1/2)
ఏతస్మిన్నంతరే పార్థాః సుఖమేకాగ్రబుద్ధయః॥ 11
సేనాకర్మ కరిష్యంతి ద్రవ్యాణాం చైవ సంచయమ్।
ఇంతలో ఏకాగ్రచిత్తులైన పాండవులు సైన్యాన్ని ద్రవ్యాలను సమకూర్చుకొనే పనులను సులువుగా చేయగలుగుతారు. (11 1/2)
విద్యమానేషు చ స్వేషు లంబమానే తథా త్వయి॥ 12
న తథా తే కరిష్యంతి సేనాకర్మ న సంశయః।
వారి జనమూ, నీవూ అక్కడ ఉండి ఆలస్యం చేస్తుంటే వారు పాండవులు చేసినంత చక్కగా యుద్ధ ప్రయత్నాలు చేయలేరు. (12 1/2)
ఏతత్ ప్రయోజనం చాత్ర ప్రాధాన్యేనోపలభ్యతే॥ 13
సంగత్యా ధృతరాష్ట్రస్య కుర్యాత్ ధర్మ్యం వచస్తవ।
నీవు దూతగా వెళ్లటంలో ఇది ప్రధానప్రయోజన మౌతుంది. ధర్మబద్ధమైన నీ మాట విని ధృతరాష్ట్రుని మనసు మారే అపకాశమూ ఉంది. (13 1/2)
స భవాన్ ధర్మయుక్తశ్చ ధర్మ్యం తేషు సమాచరన్॥ 14
కృపాలుషు పరిక్లేశాన్ పాండవీయాన్ ప్రకీర్తయన్।
వృద్ధేషు కులధర్మం చ బ్రువన్ పూర్వైరనుష్ఠితమ్॥ 15
విభేత్స్యతి మనాంస్యేషామ్ ఇతి మే నాత్ర సంశయః।
ధర్మపరాయణుడవైన నీవు అక్కడ ధర్మానుకూలంగా ప్రవర్తించు. కృపాళువులైన పెద్దలకు పాండవుల క్లేశాలను వివరించి చెప్పు. వారి పూర్వులు అనుష్ఠించిన కులధర్మాలను గుర్తుచెయ్యి. వీటి ద్వారా వారి మనస్సులు మారి దుర్యోధనునితో తప్పక విభేదిస్తారు. సందేహం లేదు. (14,15 1/2)
న చ తేభ్యో భయం తేఽస్తి బ్రాహ్మణో హ్యసి వేదవిత్॥ 16
దూతకర్మణి యుక్తశ్చ స్థవిరశ్చ విశేషతః।
నీవు బ్రాహ్మణుడవు. వేద పండితుడవు. వృద్ధుడవు. విశేషించి దూతగా వెళుతున్నావు కనుక వారి నుండి నీకు భయంలేదు. (16 1/2)
స భవాన్ పుష్యయోగేన ముహూర్తేన జయేన చ।
కౌరవేయాన్ ప్రయాత్వాశు కౌంతేయస్యార్థసిద్ధయే॥ 17
నీవు పుష్యనక్షత్రంలో కూడిన జయముహూర్తంలో బయలు దేరి ధర్మరాజు యొక్క సిద్ధికోసం కౌరవసభకు చేరుకో. (17)
వైశం పాయన ఉవాచ
తథానుశిష్టః ప్రయయౌ ద్రుపదేన మహాత్మనా।
పురోధా వృత్తసంపన్నః నగరం నాగసాహ్వయమ్॥ 18
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! ఆ విధంగా మహారాజు సూచనలు అందుకొన్న సదాచార సంపన్ను డైన పురోహితుడు హస్తినాపురానికి బయలుదేరాడు. (18)
శిష్యైః పరివృతో విద్వాన్ నీతిశాస్త్రార్థకోవిదః।
పాండవానాం హితార్థాయ కౌరవాన్ ప్రతి జగ్మివాన్॥ 19
విద్వాంసుడు, నీతి శాస్త్రకోవిదుడూ అయిన ద్రుపద పురోహితుడు శిష్యులతో కలసి పాండవుల హితం కోసం కౌరవుల వద్దకు వెళ్లాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగపర్వణి పురోహితయానే షష్ఠోఽధ్యాయః॥ 6 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున పురోహిత యానమను ఆరవ అధ్యాయము. (6)