5. అయిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లుట, విరాటాది రాజులు పాండవ పక్షమున చేరుట.

వాసుదేవ ఉవాచ
ఉపపన్నమిదం వాక్యం సోమకానాం ధురంధరే।
అర్థసిద్ధికరం రాజ్ఞః పాండవస్యామితౌజసః॥ 1
వాసుదేవుడు ఇలా అన్నాడు. సభాసదులారా! సోమకవంశోత్తముడైన ద్రుపదమహారాజు చెప్పిన మాటలు సముచితంగా ఉన్నాయి. తేజశ్శాలి, పాండవాగ్రేసరుడు అయిన యుధిష్ఠిరునకు కార్యసిద్ధిని కలిగించేవిధంగా ఉన్నాయి. (1)
ఏతచ్చ పూర్వం కార్యం నః సునీతమభికాంక్షతామ్।
అన్యథా హ్యాచరన్ కర్మ పురుషః స్యాత్ సుబాలిశః॥ 2
చక్కని నీతిమార్గాన్ని అనుసరించే మనకు ఇదే ముందు చేయవలసిన పని. మరొక విధంగా చేసేవాడు మహామూర్ఖుడు అవుతాడు. (2)
కిం తు సంబంధకం తుల్యమ్ అస్మాకం కురుపాండుషు।
యథేష్టం వర్తమానేషు పాండవేషు చ తేషు చ॥ 3
కౌరవులు, పాండవులు వారికి ఇష్టమైన రీతిలో మనతో ప్రవర్తిస్తున్నా మనకు మాత్రం వారిరువురితో సమానమైన సంబంధం ఉంది. (3)
వి॥సం॥ కుంతి మేనత్త అగుటచే పాండవులతోనూ, దుర్యోధనుని కుమార్తెను సంబునకు ఇవ్వటంతో కౌరవులతోనూ సమాన బంధుత్వం ఉంది. (అర్జు-సర్వ-నీల)
తే వివాహార్థమానీతా వయం సర్వే తథా భవాన్।
కృతే వివాహే ముదితా గమిష్యామో గృహాన్ ప్రతి॥ 4
మనం అందరమూ పెండ్లికని వచ్చాం. వివాహం అయింది. ఆనందంగా మన ఇల్ళకు వెళ్లిపోతాం. (4)
భవాన్ వృద్ధతమో రాజ్ఞాం వయసా చ శ్రుతేన చ।
శిష్యవత్ తే వయం సర్వే భవామేహ న సంశయః॥ 5
ద్రుపదమహాఱాజా! వయస్సుచేత, జ్ఞానంచేత రాజులందరిలోనూ నీవు పెద్దవాడివి. మేము అందరమూ నీకు నిస్సందేహంగా శిష్యులవంటివారం అవుతాం. (5)
భవంతం ధృతరాష్ట్రశ్చ సతతం బహు మన్యతే&।
ఆచార్యయోః సఖా చాసి ద్రోణస్య చ కృపస్య చ॥ 6
ధృతరాష్ట్రుడు కూడా ఎప్పుడూ నిన్ను గౌరవిస్తాడు. కౌరవపాండవులకు గురువులైన ద్రోణాచార్య కృపాచార్యులు ఇద్దరికీ నీవు స్నేహితుడివే.
స భవాన్ ప్రేషయత్వద్య పాండవార్థకరం వచః।
సర్వేషాం నిశ్చితం తన్నః ప్రేషయిష్యతి యద్ భవాన్॥ 7
కనుక పాండవులకు ప్రయోజనకరమైన సందేశాన్ని నీవే పంపతగినవాడివి. నీవు పంపే సందేశం ఏదయినా మా అందరికీ సమ్మతమే. (7)
యది తావచ్ఛమం కుర్యాత్ న్యాయేన కురుపుంగవః।
న భవేత్ కురుపాండూనాం సౌభ్రాత్రేణ మహాన్ క్షయః॥ 8
దుర్యోధనుడు శాంతియుతమైన మార్గంలో సౌభ్రాత్రంతో న్యాయం చేస్తే కురుపాండవ కుటుంబాలు నాశనం కాకుండా ఉంటాయి. (8)
అథ దర్పాన్వితో మోహాత్ న కుర్యాద్ ధృతరాష్ట్రజః।
అన్యేషాం ప్రేషయిత్వా చ పశ్చాదస్మాన్ సమాహ్వయే॥ 9
అధికారదర్పంతో మూఢుడై ఉన్న దుర్యోధనుడు సంధిప్రయత్నాన్ని అంగీకరించకపోతే ముందుగా ఇతరులకు ఆహ్వానాలు పంపి, తరువాత మమ్మల్ని పిలవండి. (9)
తతో దుర్యోధనో మందః సహామాత్యః సబాంధవః।
నిష్ఠామాపత్స్యతే మూఢః క్రుద్ధే గాండీవధన్వని॥ 10
గాండీవధారి యైన అర్జునునకు కోపంవచ్చినపుడు మూర్ఖుడు, మందబుద్ధి అయిన దుర్యోధనుడు బంధు మిత్రులు, మంత్రులతో సహా నాశనమై పోతాడు. (10)
తతః సత్కృత్య వార్ష్ణేయం విరాటః పృథివీపతిః।
గృహాన్ ప్రస్థాపయామాస సగణం సహబాంధవమ్॥ 11
జనమేజయా! ఇలా వాసుదేవుడు మాట్లాడిన తరువాత విరాటరాజు బంధుమిత్ర పరివారసమేతంగా శ్రీకృష్ణుని సత్కరించి వీడుకోలు చెప్పాడు. (11)
ద్వారకాం తు గతే కృష్ణే యుధిష్ఠిరపురోగమాః।
చక్రుః సాంగ్రామికం సర్వం విరాటశ్చ మహీపతిః॥ 12
శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లగానే ధర్మరాజు అతని సోదరులు, విరాటరాజా యుద్ధ ప్రయత్నాలు అన్నీ ప్రారంభించారు. (12)
తతః సంప్రేషయామాస విరాటః సహ బాంధవైః।
సర్వేషాం భూమిపాలానాం ద్రుపదశ్చ మహీపతిః॥ 13
విరాటరాజు, ద్రుపదరాజు తమ బంధువులతో రాజులందరికీ ఆహ్వానాలు పంపారు. (13)
వచనాత్ కురుసింహానాం మత్స్యపాంచాలయోశ్చ తే।
సమాజగ్ముర్మహీపాలాః సంప్రహృష్టా మహాబలాః॥ 14
పాండవులు, విరాట ద్రుపదమహారాజులు పంపిన ఆహ్వానంతో ఆనందించిన బలపరాక్రమసంపన్నులైన రాజులందరు వచ్చేశారు. (14)
తచ్ఛ్రుత్వా పాండుపుత్రాణాం సమాగచ్ఛన్మహద్బలమ్।
ధృతరాష్ట్రసుతాశ్చాపి సమానిన్యుర్మహీపతీన్॥ 15
పాండవపక్షానికి చాలామంది రాజులు చేరుకొన్నారని విన్న దుర్యోధనుడు తానుకూడా రాజులను రప్పించాడు. (15)
సమాకులా మహీ రాజన్ కురుపాండవకారణాత్।
తదా సమభవత్ కృత్స్నా సంప్రయాతే మహీక్షితామ్॥ 16
సంకులా చ తదా భూమిః చతురంగబలాన్వితా।
జనమేజయా! కురుపాండవుల కారణంగా భూమి కలత పడింది. చతురంగ బలాలతోకూడిన రాజుల ప్రయాణాలతో బాటలన్నీ నిండి కిటకిటలాడింది. (16 1/2)
బలాని తేషాం వీరాణామ్ ఆగచ్ఛంతి తతస్తతః।
చాలయంతీవ గాం దేవీం సపర్వతవనామిమామ్॥ 17
వెంటవెంటనే ఆ వీరుల బలగాలన్నీ పర్వతాలతో, వనాలతో కూడిన భూదేవిని కంపింపచేస్తున్నట్లుగా కదలివస్తున్నాయి. (17)
తతః ప్రజ్ఞావయోవృద్ధం పాంచాల్యః స్వపురోహితమ్।
కురుభ్యః ప్రేషయామాస యుధిష్ఠిరమతే స్థితః॥ 18
అప్పుడు ద్రుపదుడు బుద్ధిలో వయస్సులో పెద్దవాడు, ధర్మరాజు అభిప్రాయం తెలిసినవాడు అయిన తన పురోహితుణ్ణి కౌరవులవద్దకు పంపాడు. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి పురోహితయానే పంచమోఽధ్యాయః॥ 5 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగపర్వమను ఉపపర్వమున పురోహితుని ప్రయాణమను అయిదవ అధ్యాయము. (5)