11. పదకొండవ అధ్యాయము

నహుషుని ఇంద్రపదవి శచీదేవి దుఃఖము - బృహస్పతి ఓదార్పు.

శల్య ఉవాచ
ఋషయో ఽథాబ్రువన్ సర్వే దేవాశ్చ త్రిదివేశ్వరాః।
అయం వై నహుషః శ్రీమాన్ దేవరాజ్యే ఽభిషిచ్యతామ్॥ 1
శల్యుడు ఇలా అన్నాడు.
యుధిష్ఠిరా! ఇంద్రుడు కనబడని అరాజకస్థితిలో ప్రముఖులైన ఋషులు, దేవతలు అందరు సమావేశమై "తేజస్వి, యశస్వి, నిత్యధార్మికుడు, శ్రీమంతుడు అయిన సహుషుడు, దేవరాజ్యానికి రాజు కాదగినవాడు" అని నిర్ణయించారు. (1)
తే గత్వా త్వబ్రువన్ సర్వే రాజా నో భవ పార్థివ॥ 2
స తానువాచ నహుషో దేవానృషిగణాంస్తథా।
పితృభిః సహితాన్ రాజన్ పరీప్సన్ హితమాత్మనః॥ 3
నహుషుని చేరి ఋషులు, దేవతలు 'పార్థివా! నీవు మాకు రాజుగా ఉండాలి' అని పలికారు. ధర్మరాజా! పితృదేవతలతో సహా తన వద్దకు వచ్చిన దేవఋషి గణాలతో సహషుడు తనహితాన్ని కోరుకొంటూ ఇలా అన్నాడు. (2,3)
దుర్బలోఽహం న మే శక్తిః భవతాం పరిపాలనే।
బలవాన్ జాయతే రాజా బలం శక్రే హి నిత్యదా॥ 4
నేను బలహీనుణ్ణి. మిమ్మల్ని రక్షించే శక్తి నాకు లేదు. బలవంతుడు మాత్రమే రాజు కావాలి. ఇంద్రుని లోనే కదా బలం శాశ్వత మైనది. (4)
తమబ్రువన్ పునః సర్వే దేవా ఋషి పురోగమాః।
అస్మాకం తపసా యుక్తః పాహి రాజ్యం త్రివిష్టసే॥ 5
పరస్పరభయం ఘోరమ్ అస్మాకం హి న సంశయః।
అభిషిచ్యస్వ రాజేంద్ర భవ రాజా త్రివిష్టసే॥ 6
నహుషుని మాటలు విన్న దేవతలు, ఋషులు అతనితో ఇలా అన్నారు. రాజేంద్రా! నీవు మా అందరి తపశ్శక్తితో స్వర్గాన్ని పరిపాలించు. మేము ఒకరిని చూచి మరొకరం నిస్సందేహంగా భయపడుతున్నాం. నీవు అభిషేకానికి అంగీకరించు. స్వర్గానికి రాజు వగుము. (5,6)
దేవదానవ యక్షాణాం ఋషీణాం రక్షసాం తథా।
పితృగంధర్వభూతానాం చక్షుర్విషయవర్తినామ్॥ 7
తేజ ఆదాస్యసే పశ్యన్ బలవాంశ్చ భవిష్యసి।
ధర్మం పురస్కృత్య సదా సర్వలోకాధిపో భవ॥ 8
దేవతలు, దానవులు, యక్షులు, ఋషులు, రాక్షసులు, పితరులు, గంధర్వులు నీ కంటికి గోచరించే ప్రాణులు అన్నింటి తేజస్సును చూస్తూ ఉండగానే నీవు గ్రహించి బలవంతుడివి కాగలవు. నీవు ఎల్లప్పుడూ ధర్మాన్ని ముందు నడిపిస్తూ సర్వలోకాధిపతిని అగుము. (7,8)
బ్రహ్మర్షీంశ్చ దేవాంశ్చ గోపాయస్వ త్రివిష్టసే।
అభిషిక్తః స రాజేంద్ర తతో రాజా త్రివిష్టసే॥ 9
నీవు స్వర్గంలో ఉండి బ్రహ్మర్షులను, దేవతలను రక్షించు. ధర్మరాజా! ఆ మాటలు విని నహుషుడు ఇంద్రపదవిలో పట్టాభిషిక్తుడయ్యాడు. (9)
ధర్మం పురస్కృత్య తదా సర్వలోకాధిపోఽభవత్।
సుదుర్లభం వరం లబ్ధ్వా ప్రాప్య రాజ్యం త్రివిష్టపే॥ 10
ధర్మాత్మా సతతం భూత్వా కామాత్మా సమపద్యత।
అలా ధర్మాన్ని ముందుంచుకొని నహుషుడు సర్వలోకాధిపతి అయ్యాడు. అంత తేలికగా లభించని వరాన్నీ, స్వర్గరాజ్యాన్నీ పొంది నిరంతరం ధర్మాత్ముడై ఉండికూడా కామాత్ముడయ్యాడు. (10 1/2)
దేవోద్యానేషు సర్వేషు నందనోపవనేదు చ॥ 11
కైలాసే హిమవత్ పృష్టే మందరే శ్వేతపర్వతే।
సహ్యే మహేంద్రే మలయే సముద్రేషు సరిత్సు చ॥ 12
అప్సరోభిః పరివృతో దేవకన్యాసమావృతః।
నహుషో దేవరాజోఽథ క్రీడన్ బహువిధం తదా॥ 13
శృణ్వన్ దివ్యా బహువిధాః కథాః శ్రుతిమనోహరాః।
వాదిత్రాణి చ సర్వాణి గీతం చ మధురస్వనమ్॥ 14
దేవరాజైన నహుషుడు అన్ని దేవోద్యానవనాలు, నందనవనోపవనాలు, కైలాసం, హిమాలయప్రాంతం, మందర పర్వతం, శ్వేతపర్వతం, సహ్యపర్వతం, మహేంద్రపర్వతం, మలయపర్వతం, సముద్రాలు, నదులలో అప్సరసలు, దేవకన్యలతో కలసి పలువిధాలుగా క్రీడించాడు. అనేక విధాలుగా వీనులవిందైన కథలను, మధురమైన పాటలను, అన్ని రకాల వాద్యాలను విని ఆనందించాడు. (11-14)
విశ్వావసుర్నారదశ్చ గంధర్వాప్సరసాం గణాః।
ఋతవః షట్ చ దేవేంద్రం మూర్తిమంత ఉపస్థితాః॥ 15
విశ్వావసువు, నారదుడు, గంధర్వులు, అప్సరసలు, ఆరు ఋతువులు రూపుదాల్చి దేవేంద్రుడైన నహుషుని సేవించారు. (15)
మారుతః సురభిర్వాతి మనోజ్ఞః సుఖశీతలః।
ఏవం చ క్రీడతస్తస్య నహుషస్య దురాత్మనః॥ 16
సంప్రాప్తా దర్శనం దేవీ శక్రస్య మహిషీ ప్రియా।
నహుషుని కోసం సుగంధభరితమూ, సుఖశీతలమూ, మనోహరమూ అయిన గాలి వీస్తోంది. ఈ విధంగా క్రీడిస్తున్న దురాత్ముడైన నహుషునికి దేవేంద్రుని భార్య శచీదేవి కంటపడింది. (16 1/2)
స తాం సందృశ్య దుష్టాత్మా ప్రాహ సర్వాన్ సభాసదః॥ 17
ఇంద్రస్య మహిషీ దేవీ కస్మాన్మాం నోపతిష్ఠతి।
అహమింద్రో ఽస్మి దేవానాం లోకానాం చ తథేశ్వరః॥ 18
ఆగచ్ఛతు శచీ మహ్యం క్షిప్రమద్య నివేశనమ్।
దుష్టాత్ముడైన నహుషుడు శచీదేవిని చూచి సభాసదులతో "నేను దేవతలకు లోకాలకు ఇంద్రుణ్ణి, అధిపతిని. ఇంద్రుని భార్య శచీదేవి నా సేవకు ఎందుకు రాదు? నా నివాసానికి శచీదేవి వెంటనే రావాలి" అన్నాడు. (17-18 1/2)
తచ్ఛ్రుత్వా దుర్మనా దేవీ దేవీ బృహస్పతిమువాచ హ॥ 19
రక్ష మాం నహుషాద్ బ్రహ్మన్ త్వామస్మి శరణం గతా।
సర్వలక్షణ సంపన్నాం బ్రహ్మన్ త్వం మాం ప్రభాషసే॥ 20
దేవరాజస్య దయితామ్ అత్యంతం సుఖభాగినీమ్।
అవైధవ్యేన యుక్తాం చాప్యేకపత్నీం పతివ్రతామ్॥ 21
నహుషుని మాటలు విని దుఃఖపడిన శచీదేవి బృహస్పతితో ఇలా అన్నది. బ్రహ్మన్! నేను నీ రక్షణ కోరి వచ్చాను. నన్ను నహుషుని బారినుండి రక్షించు దేవగురూ! దేవరాజు భార్యనైన నన్ను సర్వలక్షణసంపన్న, సుఖభాగిని, సుమంగళి, ఏకపత్ని, పతివ్రత అని అంటూ ఉంటావు. (19-21)
ఉక్తవానసి మాం పూర్వం ఋతాం తాం కురు వై గిరమ్।
నోక్తపూర్వం చ భగవన్ వృథా తే కించిదీశ్వర॥ 22
తస్మాదేతద్ భవేత్ సత్యం త్వయోక్తం ద్విజసత్తమ।
భగవన్! పూర్వం నీవు పలికిన పలుకులన్నింటినీ నిజం చెయ్యి. గురూత్తమా! నీ నోటినుండి వచ్చినది ఏదీ అసత్యం కాదు. బ్రాహ్మణోత్తమా! అందువలన నీవు అన్న మాటలన్నీ సత్యం కావాలి. (22 1/2)
బృహస్పతిరథోవాచ శక్రాణీం భయమోహితాం॥ 23
యదుక్తాసి మయా దేవి సత్యం తద్ భవితా ధ్రువమ్।
ద్రక్ష్యసే దేవరాజానమ్ ఇంద్రం శీఘ్రమిహాగతమ్॥ 24
న భేతవ్యం చ నహుషాత్ సత్యమేతద్ బ్రవీమి తే।
సమానయిష్యే శక్రేణ న చిరాద్ భవతీమహమ్॥ 25
శచీదేవి భయంకంపితురాలై పలికిన మాటలన్నీ విన్న బృహస్పతి దేవీ! నేను పలికినవన్నీ తప్పక సత్యం అవుతాయి. త్వరలో తిరిగివచ్చిన దేవేంద్రుని నీవు చూస్తావు. నహుషుని వలన నీకేమీ భయం లేదు. నేను సత్యం చెపుతున్నాను. కొద్దికాలంలోనే నేను నిన్ను ఇంద్రునితో కలుపుతాను. (23,24,25)
అథ శుశ్రావ నహుషః శక్రాణీం శరణం గతామ్।
బృహస్పతేరంగిరసః చుక్రోధ స నృపస్తదా॥ 26
శచీదేవి బృహస్పతిని శరణువేడిన సంగతి విని నహుషుడు కోపించాడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్రాణీభయే ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున ఇంద్రాణీభయమను పదకొండవ అధ్యాయము. (11)