12. పన్నెండవ అధ్యాయము
ఇంద్రాణి నహుషుని వద్దకు వెళ్లుట.
శల్య ఉవాచ
క్రుద్ధంతు నహుషం దృష్ట్వా దేవా ఋషిపురోగమాః।
అబ్రువన్ దేవరాజానం నహుషం ఘోరదర్శనమ్॥ 1
శల్యుడు చెపుతున్నాడు.
యుధిష్ఠిరా! క్రోధ పూరితుడై ఉన్న నహుషుని చూచి దేవతలు ఋషులను ముందుంచుకొని అతని వద్దకు వెళ్లారు. అప్పుడు అతని చూపు చాలా భయంకరంగా ఉంది. దేవతలు, ఋషులు ఇలా అన్నారు. (1)
దేవరాజ జహి క్రోధం త్వయి క్రుద్ధే జగద్ విభో।
త్రస్తం సాసురగంధర్వం సకిన్నరమహోరగమ్॥ 2
దేవరాజా! క్రోధాన్ని విడిచిపెట్టు. ప్రభూ! నీవు కోపిస్తే అసురులు, గంధర్వులు, కిన్నరులు, మహానాగగణంతో సహా జగత్తు అంతా భయపడి పోయింది. (2)
జహి క్రోధమిమం సాధో న కుప్యంతి భవద్విధాః।
పరస్య పత్నీ సా దేవీ ప్రసీదస్వ సురేశ్వర॥ 3
సాధూ! నీవు క్రోధాన్ని విడిచిపెట్టు. నీవంటి ఉత్తములు మరొకరిపై కోపించరు. సురేశ్వరా! ప్రసన్నతతో శాంతించు. శచీదేవి మరొకని భార్య. (3)
నివర్తయ మనః పాపాత్ పరదారాభిమర్శనాత్।
దేవరాజో ఽసి భద్రం తే ప్రజా ధర్మేణ పాలయ॥ 4
పరస్త్రీలను తాకటం పాపం. దానినుండి మనస్సు మరల్చుకో. నీవు దేవతల రాజువు. ధర్మపూర్వకంగా ప్రజలను పరిపాలించు. నీకు శుభమగు గాక! (4)
ఏవముక్తో న జగ్రాహ తద్వచః కామమోహితః।
అథ దేవానువాచేదమ్ ఇంద్రం ప్రతి సురాధిపః॥ 5
వారందరు ఇలా చెప్పినప్పటికీ కామమోహితుడైన నహుషుడు వారి మాటలను లెక్కపెట్టలేదు. ఇంద్రుని గూర్చి దేవతలతో ఇలా అన్నాడు. (5)
అహల్యా ధర్షితా పూర్వమ్ ఋషిపత్నీ యశస్వినీ।
జీవతో భర్తురింద్రేణ స వః కిం న నివారితః॥ 6
దేవతలారా! పూర్వం ఇంద్రుడు ప్రసిద్ధురాలైన ఋషిపత్ని అహల్యను భర్త బ్రతికి ఉండగానే పాడుచేశాడు. అప్పుడు మీరు అతనిని ఎందుకు ఆపలేదు? (6)
బహూని చ నృశంసాని కృతానీంద్రేణ వై పురా।
వైధర్మ్యాణ్యుపధాశ్చైవ స వః కిం న నివారితః॥ 7
గతంలో ఇంద్రుడు చాలా క్రూరకార్యాలు చేశాడు. అధార్మికమైన మోసాలు, అన్యాయాలు ఎన్నో చేశాడు. అప్పుడు మీరు అతనిని ఎందుకు ఆపలేదు? (7)
ఉపతిష్ఠతు దేవీ మామ్ ఏతదస్యా హితం పరమ్।
యుష్మాకం చ సదా దేవాః శివమేవం భవిష్యతి॥ 8
శచీదేవి నా దగ్గరకు రావాలి. దానివలన ఆమెకు మేలు జరుగుతుంది. దేవతలారా! మీ అందరికి ఇలా శుభం కలుగుతుంది. (8)
దేవా ఊచుః
ఇంద్రాణీమానయిష్యామః యథేచ్ఛసి దివస్పతే।
జహి క్రోధమిమం వీర ప్రీతో భవ సురేశ్వర॥ 9
దేవతలు పలికారు, స్వర్గాధిపతీ! దేవేశ్వరా! వీరా! నీవు కోరినట్టుగానే శచీదేవిని నీవద్దకు తీసుకివస్తాం. క్రోధాన్ని విడిచిపెట్టు. సంతోషంగా ఉండు. (9)
శల్య ఉవాచ
ఇత్యుక్త్వా తం తదా దేవాః ఋషిభిః సహ భారత।
జగ్ముర్బృహస్పతిం వక్తుం ఇంద్రాణీం చాశుభం వచః॥ 10
శల్యుడు పలికాడు. ధర్మరాజా! దేవతలు, ఋషులు సహుషునితో ఇలా పలికి శచీదేవికి ఈ చెడువార్తను చెప్పటానికి బృహస్పతి దగ్గరకు వెళ్లారు. (10)
జానీమః శరణం ప్రాప్తాం ఇంద్రాణీం తవ వేశ్మని।
దత్తాభయాం చ విప్రేంద్ర త్వయా దేవర్షిసత్తమ॥ 11
దేవర్షి సత్తమా! బ్రాహ్మణోత్తమా! శచీదేవి నిన్ను శరణువేడి, నీ దగ్గరే ఉన్నదనీ, నీవు ఆమెకు అభయం ఇచ్చావనీ మాకు తెలుసు. (11)
తే త్వాం దేవాః సగంధర్వాః ఋషయశ్చ మహాద్యుతే।
ప్రసాదయంతి చేంద్రాణీ నహుషాయ ప్రదీయతామ్॥ 12
తేజశ్శాలీ! దేవతలు, గంధర్వులు, ఋషులు నిన్ను ప్రార్థిస్తున్నారు. శచీదేవిని నహుషునికి ఇయ్యి. (12)
ఇంద్రాద్ విశిష్టో నహుషః దేవరాజో మహాద్యుతిః।
వృణోత్విమం వరారోహా భర్తృత్వే వరవర్ణినీ॥ 13
ఇప్పుడు తేజస్వి అయిన నహుషుడు దేవతల రాజు. ఇంద్రుని కన్న గొప్పవాడు. అందమైన రంగు రూపు ఉన్న శచీదేవి ఇతనిని వరించుగాక! (13)
ఏవముక్తా తు సా దేవీ బాష్పముత్సృజ్య సస్వనమ్।
ఉవాచ రుదతీ దీనా బృహస్పతిమిదం వచః॥ 14
దేవతల మాటలు విన్న శచీదేవి కన్నీటితో వెక్కి వెక్కి ఏడుస్తూ దీనురాలై బృహస్పతితో ఇలా పలికింది. (14)
నాహమిచ్ఛామి నహుషం పతిం దేవర్షిసత్తమ।
శరణాగతాస్మి తే బ్రహ్మన్ త్రాయస్వ మహతో భయాత్॥ 15
దేవర్షి సత్తమా! బ్రహ్మన్! నేను నహుషుని భర్తగా ఇష్టపడటం లేదు. నేను నిన్ను శరణువేడాను. ఈ మహాభయం నుండి నన్ను రక్షించు. (15)
బృహస్పతిరువాచ
శరణాగతం న త్యజేయమ్ ఇంద్రాణి మమ నిశ్చయః।
ధర్మజ్ఞాం సత్యశీలాం చ న త్యజేయమనిందితే॥ 16
బృహస్పతి పలికాడు. ఇంద్రాణీ! నన్ను శరణువేడిన వారిని నేను విడిచిపెట్టను. ఇది నా ప్రతిజ్ఞ. సాధ్వీ! ధర్మం తెలిసినదానివి, సత్యశీలవు అయిన నిన్ను విడిచిపెట్టను. (16)
నాకార్యం కర్తుమిచ్ఛామి బ్రాహ్మణః సన్ విశేషతః।
శ్రుతధర్మా సత్యశీలః జానన్ ధర్మానుశాసనమ్॥ 17
నాహమేతత్ కరిష్యామి గచ్ఛధ్వం వై సురోత్తమాః।
అస్మింశ్చార్థే పురా గీతం బ్రహ్మణా శ్రూయతామిదమ్॥ 18
బ్రాహ్మణుడైన నేను ఈ చెడ్డపని చేయలేను. విశేషమ్గా ధర్మాలను విని ఉన్నాను. సత్యపాలన చేస్తున్నాను. శాస్త్రాలలో చెప్పిన ధర్మాలు తెలిసి ఉన్నాను. దేవోత్తములారా! నేను ఈ పని చేయలేను. వెళ్లండి. ఈ సందర్భంలో పూర్వం బ్రహ్మ గానం చేసిన ఈ గీతాన్ని వినండి. (17,18)
న తస్య బీజం రోహతి రోహకాలే
న తస్య వర్షం వర్షతి వర్షకాలే।
భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే
న స త్రాతారం లభతే త్రాణమిచ్ఛన్॥ 19
భయంతో రక్షణకోసం ఆశ్రయించిన వానిని శత్రువుకు ఇచ్చే వానికి మొలకెత్తవలసిన కాలంలో విత్తనం మొలకెత్తదు. కురవవలసిన కాలంలో వర్షం కురవదు. వాడు రక్షణ కోరినప్పుడు రక్షకుడు దొరకడు. (19)
మోఘమన్నం విందతి చాప్యచేతాః
స్వర్గాల్లోకాద్ భ్రశ్యతి నష్టచేష్టః।
భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై
న తస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః॥ 20
భయంతో రక్షణకోరి వచ్చిన వానిని శత్రువుకు అప్పగించే హీనచిత్తునికి తిన్న అన్నం వ్యర్థం అవుతుంది. ఆ దుష్టుడు స్వర్గం నుండి పతనమౌతాడు. వాడు వేసిన హవ్యాన్ని దేవతలు స్వీకరించరు. (20)
ప్రమీయతే చాస్య ప్రజా హ్యకాలే
సదా వివాసం పితరో ఽ స్య కుర్వతే।
భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే
సేంద్రా దేవాః ప్రహరంత్యస్య వజ్రమ్॥ 21
భయంతో రక్షణకోరి వచ్చిన వానిని శత్రువుకు ఇచ్చిన వాని సంతానం చిన్నతనంలో మరణిస్తారు. వాని పితృదేవతలు నరకంలో పడి ఉంటారు. ఇంద్రాది దేవతలు వానిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు. (21)
ఏతదేవం విజానన్ వై న దాస్యామి శచీమిమామ్।
ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియామ్॥ 22
ఈ విధమైన బ్రహ్మోపదేశం తెలిసిన నేను ఇంద్రుని పట్టమహిషి, జగత్ ప్రసిద్ధురాలు, అయిన శచీదేవిని ఇవ్వను. (22)
అస్యా హితం భవేద్ యచ్చ మమ చాపి హితం భవేత్।
క్రియతాం తత్ సురశ్రేష్ఠాః న హి దాస్యామ్యహం శచీమ్॥ 23
సురశ్రేష్ఠులారా! ఈమెకు ఏది హితం అవుతుందో అది నాకూ హితం అవుతుంది. మీరు ఆ పని చెయ్యండి. శచీదేవిని నేను ఇవ్వను. (23)
శల్య ఉవాచ
అథ దేవాః సగంధర్వాః గురుమాహురిదం వచః।
కథం సునీతం ను భవేత్ మంత్రయస్వ బృహస్పతే॥ 24
శల్యుడు పలికాడు
ధర్మరాజా! అప్పుడు దేవతలు, గంధర్వులు బృహస్పతితో ఇలా అన్నారు. బృహస్పతీ! ఎలా చేస్తే బాగుంటుందో నీవే మాకు సలహా చెప్పు. (24)
బృహస్పతిరువాచ
నహుషం యాచతాం దేవీ కించిత్ కాలాంతరం శుభా।
ఇంద్రాణీహితమేతద్ధి తథాస్మాకం భవిష్యతి॥ 25
బృహస్పతి ఇలా అన్నాడు.
దేవతలారా! శుభలక్షణసంపన్న అయిన శచీదేవి నహుషుని కొంతకాలం గడువు అడగాలి. దానితో ఆమెకూ మనకూ కూడా మేలు జరుగుతుంది. (25)
బహువిఘ్నః సురాః కాలః కాలః కాలం నయిష్యతి।
గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వరసంశ్రయాత్॥ 26
సురలారా! కాలం అనేక విఘ్నాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు నహుషుడు మీరిచ్చిన వరప్రభావంతో బలవంతుడు, గర్వితుడు అయి ఉన్నాడు. కాలుడే కాలాన్ని నడిపిస్తాడు. (26)
శల్య ఉవాచ
తతస్తేన తథోక్తే తు ప్రీతా దేవాస్తథాబ్రువన్।
బ్రహ్మన్ సాధ్విదముక్తం తే హితం సర్వదివౌకసామ్॥ 27
శల్యుడు ఇలా అన్నాడు.
ధర్మరాజా! బృహస్పతి ఇలా పలికేసరికి సంతోషించిన దేవతలు ఇలా అన్నారు. బ్రహ్మన్! నీవు పలికింది బాగుంది. ఇది దేవతలందరికీ మేలు చేస్తుంది. (27)
ఏవమేతద్ ద్విజశ్రేష్ఠ దేవీ చేయం ప్రసాద్యతామ్।
తతః సమస్తా ఇంద్రాణీం దేవాశ్చాగ్నిపురోగమాః॥
ఊచుర్వచనమవ్యగ్రాః లోకానాం హితకామ్యయా॥ 28
'ద్విజశ్రేష్ఠా! ఈ మాటలతో శచీదేవిని కూడా ఒప్పించండి అన్నారు. తరువాత దేవతలందరు అగ్నిని ముందు పెట్టుకొని శచీదేవి వద్దకు వెళ్లి లోకహితంకోసం శాంతియుతంగా ఇలా పలికారు. (28)
దేవా ఊచుః
త్వయా జగదియం సర్వం ధృతం స్థావరజంగమమ్।
ఏకపత్న్యసి సత్వా చ గచ్ఛస్వ నహుషం ప్రతి॥ 29
క్షిప్రం త్వామభికామశ్చ వినశిష్యతి పాపకృత్।
నహుషో దేవి శక్రశ్చ సురైశ్వర్యమవాప్స్యతి॥ 30
దేవతలు పలికారు.
దేవి! ఈ సమస్తచరాచరజగత్తుకు నీవే ఆధారం. నీవు పతివ్రతవు. సత్యపరాయణవు. నీవు నహుషుని వద్దకు వెళ్లు. నిన్ను కోరుతున్న ఆ పాపాత్ముడు త్వరలోనే నశిస్తాడు. దేవీ! ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు. (29,30)
ఏవం వినిశ్చయం కృత్వా ఇంద్రాణీ కార్యసిద్ధయే।
అభ్యగచ్ఛత సవ్రీడా నహుషం ఘోరదర్శనమ్॥ 31
కార్యసిద్ధికోసం ఇలా నిశ్చయించుకొని శచీదేవి సిగ్గుపడుతూ, క్రూరంగా చూస్తున్న నహుషుని వద్దకు వెళ్లింది. (31)
దృష్ట్వా తాం నహుషశ్చాపి వయోరూపసమన్వితామ్।
సమహృష్యత దుష్టాత్మా కామోపహతచేతసః॥ 32
అందమైన రూపంతో, వయస్సుతో అలరారుతున్న శచీదేవిని చూచి కామంతో వివేకం చచ్చి దుష్టాత్ముడైన నహుషుడు సంతోషించాడు. (32)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్రాణీ కాలావధియాచనే ద్వాదశోఽధ్యాయః॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వము అను ఉపపర్వమున ఇంద్రాణీ కాలావధియాచనమను పన్నెండవ అధ్యాయము. (12)