16. పదునారవ అధ్యాయము

ఇంద్ర వరుణాదుల సంవాదము.

బృహస్పతి రువాచ
త్వమగ్నే సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాట్।
త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్॥ 1
బృహస్పతి ఇలా స్తుతించాడు. హవ్యవాహనా! నీవు దేవతలందరికీ ముఖం. అన్ని ప్రాణుల లోపల రహస్యంగా నీవు సాక్షివలె ఉండి సంచరిస్తూ ఉంటావు. (1)
త్వామాహురేకం కవయః త్వామాహుస్త్రివిధం పునః।
త్వయా త్యక్తం జగచ్చేదం సద్యోనశ్యేద్ధుతాశన॥ 2
కవులు నిన్ను ఒక్కడిగానూ చెపుతారు. మూడు రూపాలు కల(త్రేతాగ్నులు) వానిగానూ చెపుతారు. నీవు దూరమయితే ఈ లోకమంత వెంటనే నశించిపోతుంది. (2)
వి॥ త్రేతాగ్నులు = గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహవనీయం.
కృత్వా తుభ్యం నమో నిప్రాః స్వకర్మవిజితాం గతిమ్।
గచ్ఛంతి సహపత్నీభిః సుతౌ రపి చ శాశ్వతీమ్॥ 3
ధర్మపత్నితోను, పుత్రులతోనూ కలిసి విప్రులు నీకు నమస్కరించి, తాము చేసిన సత్కర్మల వలన శాశ్వతమయిన పదం పొందుతున్నారు. (3)
త్వమేవాగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః।
యజంతి సత్రైస్త్వామేవ యజ్ఞైశ్చ పరమాధ్వరే॥ 4
అగ్నీ! నీవు హవ్యం మోసుకువెడతావు. నీవే మళ్లీ ఉత్తమ హోమద్రవ్యానివి. నిన్నే సత్రాలలో పూజిస్తారు. పరమమైన అధ్వరంలో యజ్ఞములతో పూజిస్తారు. (4)
సృష్ట్వా లోకాంస్త్రీనిమాన్ హవ్యవాహ
ప్రాప్తే కాలే పచసి పునః సమిద్ధః।
త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః
త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా॥ 5
హవ్యవాహనుడా! నీవే ఈ మూడు లోకాలనూ సృష్టించి సమయం వస్తే పక్వం చేస్తావు. సర్వలోకాలూ నీ నుండి పుడతాయి. మళ్లీ వాటికి స్థితి కారణము నీవే. (5)
త్వామగ్నే జలదానాహుః విద్యుతశ్చ మనీషిణః।
దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః॥ 6
నీవే నీటినిచ్చే మేఘమని అంటారు. ధీమంతులు నిన్నే విద్యుత్తువనీ అంటారు. నీ నుండి మంటలు వెలువడి సర్వప్రాణులను దహించి వేస్తాయి. (6)
త్వయ్యాసో నిహితాః సర్వాః త్వయొ సర్వమిదం జగత్।
న తేఽస్త్వవిదితం కించిత్ త్రిషు లోకేషు పావక॥ 7
నీ యందే జలం ఉంది. లోకమంతా నీ యందే ఉంది. మూడు లోకాల్లోనూ నీకు తెలియనిది లేదు. (7)
స్వయోనిం భజతే సర్వః విశస్వాపోఽవిశంకితః।
అహం త్వం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రైః సనాతనైః॥ 8
భూతములన్నీ జన్మస్థానాన్ని పొందుతాయి. అందుచేత శంకించకుండా నీటిలో ప్రవేశించు. నేను సనాతనమైన బ్రాహ్మమంత్రాలతో నిన్ను వృద్ధిపరుస్తాను. (8)
ఏవం స్తుతో హవ్యవాట్ స భగవాన్ కవిరుత్తమః।
బృహస్పతి మథోవాచ ప్రీతిమాన్ వాక్యముత్తమమ్॥
దర్శయిష్యామి తే శక్రం సత్యమేతత్ బ్రవీమి తే॥ 9
ఉత్తమ కవి అయిన అగ్నిభగవానుడు ఈ ప్రశంస విని సంతుష్టుడై బృహస్పతితో ఇలా అన్నాడు. నేను నిజం చెపుతున్నాను. నీకు ఇంద్రుని చూపిస్తాను. (9)
శల్య ఉవాచ
ప్రవిశ్యాపస్తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః।
ఆససాద సరస్తచ్చ గూఢో యత్ర శతక్రతుః॥ 10
శల్యుడు అన్నాడు. అపుడు అగ్ని నీటిలో ప్రవేశించి ఇంద్రుడెక్కడ ఉన్నాడా అని సముద్రాలూ, సరస్సులు, గుంటలూ కూడా వెదికాడు. (10)
అథ తత్రాపి పద్మాని విచిన్వన్ భరతర్షభ।
అపశ్యత్ స తు దేవేంద్రం బిసమధ్యగతం తదా॥ 11
రాజా! అందులోని పద్మాలు కూడా వెదికాడు. అందులో ఒక తామరతూడులో దేవేంద్రుని చూశాడు. (11)
ఆగత్య చ తతస్తూర్ణం తమాచష్ట బృహస్పతేః।
అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం ప్రభుమ్॥ 12
అగ్ని వెంటనే వచ్చి "ఇంద్రుడు ఒక తామర తూడులో సూక్ష్మ శరీరంతో ఉన్నాడు" అని బృహస్పతికి చెప్పాడు. (12)
గత్వా దేవర్షిగంధర్వైః సహితోఽథ బృహస్పతిః।
పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనమ్॥ 13
బృహస్పతి దేవతలతో, ఋషులతో, గంధర్వులతో కలసి వెళ్లి ప్రశంసనీయమైన పూర్వకృత్యాలతో దేవేంద్రుని సంతృప్తి పరచాడు. (13)
మహాసురో హతః శక్ర నముచిర్దారుణస్త్వయా।
శంబరశ్చ బలశ్చైవ తథోభౌ ఘోరవిక్రమౌ॥ 14
మహేంద్రా! మహాసురుడయిన నముచిని నీవు సంహరించావు. ఘోర పరాక్రములయిన శంబరుని, బలుని సంహరించావు. (14)
శతక్రతో వివర్ధస్వ సర్వాన్ శత్రూన్ నిషూదయ।
ఉత్తిష్ఠ శక్ర సంపశ్య దేవర్షీంశ్చ సమాగతాన్॥ 15
ఇక ముందు కూడ సర్వశత్రువులనూ సంహరించు. లేచి వృద్ధి పొందు. ఇంద్రా! నీకడకు వచ్చిన దేవతలనూ, ఋషులనూ చూడు. (15)
మహేంద్ర దానవాన్ హత్వా లోకా స్త్రాతాః త్వయా విభో।
అపాం ఫేనం సమాసాద్య విష్ణుతేజోఽతిబృంహితమ్।
త్వయా వృత్రో హతః పూర్వం దేవరాజ జగత్పతే॥ 16
మహేంద్రా! పూర్వం నీవు దానవులను వధించి లోకాలను రక్షించావు. దేవేంద్రా! నీటి నురుగులో ప్రవేశించి విష్ణుతేజంతో వృద్ధి పొంది వృత్రుని సంహరించావు. (16)
త్వం సర్వభూతేషు శరణ్య ఈడ్యః
త్వయా సమం విద్యతే నేహ భూతమ్।
త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర
త్వం దేవానాం మహిమానం చకర్థ॥ 17
అన్నిప్రాణులకూ నీవు శరణ్యుడవు. స్తుతింపదగిన వాడవు. నీవంఇ భూతం మరొకటి లేదు. పంచభూతాలనూ నీవే నిలుపుతున్నావు. నీవు దేవతలకు మహిమను చేకూరుస్తావు. (17)
పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుహి।
ఏవం సంస్తూయమానశ్చ సోఽవర్ధత శనైః శనైః॥ 18
మహేంద్రా! బలం పొందు. లోకాలన్నిటినీ రక్షించు, బృహస్పతి యొక్క ఈ ప్రశంస వింటూ ఇంద్రుడు మెల్ల మెల్లగా వృద్ధి పొందాడు. (18)
స్వం చైవ వపురాస్థాయ బభూవ స బలాన్వితః।
అబ్రవీచ్చ గురుం దేవః బృహస్పతి మవస్థితమ్॥ 19
తన పూర్వరూపంతో బలవంతుడై, ఇంద్రుడు ఎదుట ఉన్న గురుదేవుడు అయిన బృహస్పతితో ఇలా అన్నాడు. (19)
కింకార్య మవశిష్టం వః హతస్త్వాష్ట్రో మహాసురః।
వృత్రశ్చ సుమహాకాయః యో వై లోకా ననాశయత్॥ 20
మహాసురుడయిన త్వాష్ట్రుడు చనిపోయాడు. మహాకాయుడై లోకాలను నశింపజేసిన వృత్రుడు హతుడయ్యాడు. ఇంక మనం ఏంచెయ్యాలి? (20)
బృహస్పతి రువాచ
మానుషో నహుషో రాజా దేవర్షిగణతేజసా।
దేవరాజ్యమనుప్రాప్తం సర్వాన్నో బాధతే భృశమ్॥ 21
బృహస్పతి ఇలా చెప్పాడు. మానవుడైన నహుషుడనే రాజు దేవ, ఋషి గణాల తేజస్సుతో నీ తరువాత దేవరాజ్యం పొందాడు. అతడు మమ్మందరినీ బాగా బాధిస్తున్నాడు. (21)
ఇంద్ర ఉవాచ
కథం చ నహుషో రాజ్యం దేవానాం ప్రాప దుర్లభమ్।
తపసా కేన వా యుక్తః కిం వీర్యో వా బృహస్పతే॥ 22
ఇంద్రుడిలా అడిగాడు. దుర్లభమైన దేవరాజ్యాన్ని నహుషుడు ఎలా పొందాడు? అతని తపస్సు ఎంతటిది? శక్తి ఎంతటిది? (22)
బృహస్పతిరువాచ
దేవా భీతాః శక్రమకామయంత
త్వయా త్యక్తం మహదైంద్రం పదం తత్।
తదా దేవాః పితరోఽధర్షయశ్చ
గంధర్వముఖ్యాశ్చ సమేత్య సర్వే॥ 23
బృహస్పతి ఇలా అన్నాడు. మహేంద్ర పదవిని నీవు విడిచి వెళ్ళాక దేవతలు భయపడి ఇంద్రుని కోరుకొన్నారు. అపుడు దేవతలు, పితృదేవతలు, మహర్షులు, గంధర్వులు, అంతా కలసి... (23)
గత్వాఽబ్రువ న్నహుషం తత్ర శక్ర
త్వం నో రాజా భవ భువనస్య గోప్తా।
తానబ్రవీ న్నహుషో నాస్మి శక్తః
ఆప్యాయధ్వం తపసా తేజసా మామ్॥ 24
వెళ్లి నహుషునితో 'శక్రా! నీవు మాకు రాజువు అయి, లోకాలను రక్షించు' అన్నారు. వారితో నహుషుడు 'నాకు అంత శక్తి లేదు. తపస్సుతోను, తేజస్సుతోను నాకు పుష్టి కలిగించండి' అన్నాడు. (24)
ఏవముక్తైర్వర్థితశ్చాపి దేవైః
రాజాభవన్నహుషో ఘోరవీర్యః।
త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షీన్
కృత్వా వాహాన్ యాతి లోకాన్ దురాత్మా॥ 25
అపుడు దేవతలంతా వానిని వృద్ధిపరచారు. ఘోర శక్తిగల నహుషుడు రాజయ్యాడు. అలా ఆ దురాత్ముడు త్రైలోక్య రాజ్యం పొంది మహర్షులను వాహకులుగా (మోసేవారు) చేసికొని లోకాల్లో తిరుగుతున్నాడు. (25)
తేజోహరం దృష్టివిషం సుఘోరం
మా త్వం పశ్యేర్నహుషం వై కదాచిత్।
దేవాశ్చ సర్వే నహుషం భృశార్తాః
న పశ్యంతే గూఢరూపాశ్చరంతః॥ 26
ఘోరమైన, విషంలాంటి అతని చూపు ఎదుటివారి తేజస్సును లాగి వేస్తుంది. అతనిని నీ వెన్నడూ చూడకు. దేవతలంతా మిక్కిలి దుఃఖితులై అతని కంటపడకుండా రహస్యంగా మెలగుతున్నారు. (26)
ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే
బృహస్పతౌ లోకపాలః కుబేరః।
వైవస్వతశ్చైవ యమః పురాణః
దేవశ్చ సోమో వరుణశ్చాజగామ॥ 27
బృహస్పతి ఇలా చెపుతూ ఉండగానే లోకపాలకు డయిన కుబేరుడు, యముడు, పురాణదేవుడయిన చంద్రుడు, వరుణుడు అక్కడకు వచ్చారు. (27)
తే వై సమాగమ్య మహేంద్రమూచుః
దిష్ట్వా త్వాష్ట్రో నిహతశ్చైవ వృత్రః।
దిష్ట్వా చ త్వాం కుశలినమక్షతం చ
పశ్యామో వై విహతారిం చ శక్ర॥ 28
వారు వచ్చి శక్రా! అదృష్టవశాత్తు త్వాష్ట్రుడు, వృత్రుడు కూడ చనిపోయారు. మా భాగ్యవశాన క్షేమంగా గాయపడ కుండానే శత్రుమర్దనుడవైన నిన్ను చూశాము. (28)
స తాన్ యథావచ్చ హి లోకపాలాన్
సమేత్య వై ప్రీతమనా మహేంద్రః।
ఉవాచ చైవాన్ ప్రతిభాష్య శక్రః
సంచోదయిష్యన్నహుషస్యాంతరేణ॥ 29
ఇంద్రుడపుడు ప్రీతితో వారిని కలిసి పలుకరించి, నహుషునితో భేదం కల్పిస్తూ ఇలా అన్నాడు. (29)
రాజా దేవానాం నహుషో ఘోరరూపః
తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః।
తే చాబ్రువన్ నహుషో ఘోరరూపః
దృష్టీ విషస్తస్య బిభీమ ఈశ॥ 30
ఆ నహుషుడు భయంకర రూపుడు, అక్కడ నాకు మీరు సహాయం చేయాలి అన్నాడు. అపుడు వారు "ప్రభూ! ఆ నహుషుడు ఘోర రూపం కలవాడు. వానిది విషదృష్టి. అందుచే వానిని మేము భయపడుతున్నాము.' (30)
త్వం చేద్రాజానం నహుషం పరాజయేః
తతో వయం భాగమర్హామ శక్ర।
ఇంద్రోఽబ్రవీద్భవతు భవానపాంపతిః
యమః కుబేరశ్చ మయాభిషేకమ్॥ 31
సంప్రాప్ను వంత్యద్య సహైవ దైవతైః
రిపుం జయామ తం నహుషం ఘోరదృష్టిమ్।
తతశ్శక్రం జ్వలనోప్యాహ భాగం
ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే।
తమాహ శక్రో భవితాగ్నే తవాపి
చేంద్రాగ్న్యోర్వై భాగ ఏకో మహాక్రతౌ॥ 32
నహుషుని నీవు ఓడించ గోరితే అందులో మాకూ భాగం ఇయ్యి, అన్నారు. అపుడు ఇంద్రుడు "అలాగే నీవూ యముడూ, కుబేరుడూ అభిషేకం పొందుతారు. దేవతలతో కలిసి ఇపుడే ఘోరదృష్టి కల నహుషుని గెలుద్దాం" అన్నారు. అపుడు అగ్ని కూడా ఇంద్రునితో "నాకు భాగం ఇయ్యి నేనూ నీకు సాయం చేస్తాను" అన్నాడు. ఇంద్రుడు "అగ్నీ! నీకూ భాగం ఉంది. మహాయజ్ఞంలో ఇంద్రాగ్నులకు ఒకటే భాగం కదా!" అన్నాడు. (31,32)
శల్య ఉవాచ
ఏవం సంచింత్య భగవాన్ మహేంద్రః పాకశాసనః।
కుబేరం సర్వయక్షాణాం ధనానాం చ ప్రభుం తథా॥ 33
శల్యుడు చెపుతున్నాడు. ఇలా ఆలోచించి మహేంద్రుడు యక్షులందరికీ, సంపదలన్నిటికీ కుబేరుని ప్రభువుగా చేశాడు. (33)
వైవస్వతం పితౄణాం చ వరుణం చాప్యపాం తథా।
ఆధిపత్యం దదౌ శక్రః సంచింత్య వరదస్తథా॥ 34
అలాగే యముని పితృదేవతలకు రాజును చేశాడు. జలములకు వరుణుని అధిపతిగా చేశాడు. (34)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగ పర్వణి ఇంద్ర్వారుణాది సంవాదే షోడశోఓఽధ్యాయః॥ 16 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున ఇంద్రవరుణాదుల సంవాదమను పదునారవ అధ్యాయము. (16)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకముతో కలిపి 34 1/2 శ్లోకములు)