15. పదునైదవ అధ్యాయము

నహుషుడు ఋషులను బోయీలుగా చేయుట - బృహస్పతి అగ్నిదేవుల సంవాదము.

శల్య ఉవాచ
ఏవముక్తః స భగవాన్ శచ్యా తాం పునరబ్రవీత్।
విక్రమస్య న కాలోఽయం నహుషో బలవత్తరః॥ 1
శల్యుడు ఇలా అన్నాడు. యుధిష్ఠిరా! శచీదేవి చెప్పింది విని ఇంద్రుడు ఆమెతో ఇలా అన్నాడు. 'దేవీ! ఇది పరాక్రమానికి తగిన సమయం కాదు. ఇపుడు నహుషుడు నాకంటె బలవంతుడు. (1)
వివర్ధితశ్చ ఋషిభిః హవ్యకవ్యైశ్చ భావిని।
నీతిమత్ర విధాస్యామి దేవి తాం కర్తుమర్హసి॥ 2
భావినీ! హవ్యకవ్యాలతో ఋషులు అతనిని బలవంతుణ్ణి చేశారు. దేవీ! నేను ఇప్పుడు ఒక రాజనీతిని ప్రయోగిస్తాను. దానిని నీవే చేయగలవు. (2)
గుహ్యం చైతత్ త్వయా కార్యం నాఖ్యాతవ్యం శుభే క్వచిత్।
గత్వా నహుషమేకాంతే బ్రవీహి చ సుమధ్యమే॥ 3
ఋషియానేన దివ్యేన మాముపైహి జగత్పతే।
ఏవం తవ వశే ప్రీతా భవిష్యామీతి తం వద॥ 4
సుమంగళీ! ఇది రహస్యం నీవే చెయ్యాలి. ఎక్కడా చెప్పగూడదు. సుమధ్యమా! నహుషుని వద్దకు వెళ్లి ఏకాంతంగా ఇలా చెప్పు. 'జగత్పతీ! ఋషులు మోసే దివ్యమైన వాహనంపై నా దగ్గరకు వస్తే నేను సంతోషంగా నీ దానిని అవుతాను.' అని చెప్పు. (3,4)
ఇత్యుక్తా దేవరాజేన పత్నీ సా కమలేక్షణా।
ఏవమస్త్విత్యథోక్త్వా తు జగామ నహుషం ప్రతి॥ 5
దేవేంద్రుని ఆదేశాన్ని ఆ కమలాక్షి విని, అలాగేనని నహుషుని దగ్గరకు వెళ్లింది. (5)
నహుషస్తాం తతో దృష్ట్వా సస్మితో వాక్యమబ్రవీత్।
స్వాగతం తే వరారోహే కిం కరోమి శుచిస్మితే॥ 6
నహుషుడు శచీదేవిని చూచి చిరునవ్వుతో 'సుందరీ! నీకు స్వాగతం. శుచిస్మితా! నీకోసం ఏం చెయ్యమంటావు?' అన్నాడు. (6)
భక్తం మాం భజ కల్యాణి కిమిచ్ఛసి మనస్విని।
తవ కల్యాణి యత్ కార్యం తత్ కరిష్యే సుమధ్యమే॥ 7
కల్యాణీ! నేను నీ భక్తుణ్ణి. నన్ను నీవాణ్ణి చేసుకో. మనస్వినీ! నీకు ఏం కావాలి? సుమధ్యమా! నీవు ఏం చేయమంటే అది చేస్తాను. (7)
న చ వ్రీడా త్వయా కార్యా సుశ్రోణి మయి విశ్వసేః।
సత్యేన వై శపే దేవి కరిష్యే వచనం తవ॥ 8
సుశ్రోణీ! నీవు నా దగ్గర సిగ్గుపడనక్కరలేదు. నన్ను నమ్ము. నిజం చెపుతున్నాను. నీవు ఏది చెపితే అది చేస్తాను. (8)
ఇంద్రాణ్యువాచ
యో మే కృతస్త్వయా కాలః తమాకాంక్షే జగత్పతే।
తతస్త్వమేవ భర్తా మే భవిష్యసి సురాధిప॥ 9
ఇంద్రాణి పలికింది. జగత్పతీ! నీవు నేను చెప్పినట్లు చేస్తే నేను ఇచ్చిన మాట పూర్తి చేస్తాను. సురేశ్వరా! అప్పుడు నీవు నా భర్తవు అవుతావు. (9)
కార్యంమ్ చ హృది మే యత్ తద్ దేవరాజావధారయ।
వక్ష్యామి యది మే రాజన్ ప్రియమేతత్ కరిష్యసి॥ 10
వాక్యం ప్రణయసంయుక్తం తతః స్యాం వశగా తవ।
దేవరాజా! నా హృదయంలో ఉన్న మాట చెపుతాను విను. నాకు ఇష్టమైన ఆ పని నీవు చేస్తే నేను నీ దానిని అవుతాను. (10 1/2)
ఇంద్రస్య వాజినో వాహా హస్తినోఽథ రథాస్తథా॥ 11
ఇచ్ఛామ్యహమథాపూర్వం వాహనం తే సురాధిప।
యన్న విష్ణోర్న రుద్రస్య వాసురాణాం న రక్షసామ్॥ 12
సురాధిపా! ఇప్పటివరకు ఇంద్రునికి గుఱ్ఱాలు, ఏనుగులు, రథాలు వాహనాలుగా ఉన్నాయి. హరిహరులకు, దేవతలకు, రాక్షసులకు ఎవరికీ లేని కొత్త వాహనం నీకు ఉండాలని నా కోరిక. (11,12)
వహంతు త్వాం మహాభాగాః ఋషయః సంగతా విభో।
సర్వే శిబికయా రాజన్ ఏతద్ధి మమ రోచతే॥ 13
ప్రభూ! మహాత్ములైన సప్తఋషులు అందరూ కలిసి నీవు కూర్చున్న పల్లకీ మొయ్యాలి. ఇదీ నా కోరిక. (13)
నాసురేషు న దేవేషు తుల్యో భవితుమర్హసి।
సర్వేషాం తేజ ఆదత్సే స్వేన వీర్యేణ దర్శనాత్।
న తే ప్రముఖతః స్థాతుం కశ్చిచ్ఛక్నోతి వీర్యవాన్॥ 14
నీవు నీ పరాక్రమంతో, కంటిచూపుతోనే ఎవరి తేజస్సునైనా పొందుతావు. దేవతలలో, రాక్షసులలో నీతో సమానమైన వాడు లేడు. నీ ఎదుట నిలబడగల వీరుడు ఎవ్వడూ లేడు. (14)
శల్య ఉవాచ
ఏవముక్తస్తు నహుషః ప్రాహృష్యత తదా కిల।
ఉవాచ వచనం చాపి సురేంద్రస్తామనిందితామ్॥ 15
శల్యుడు పలికాడు. ధర్మరాజా! ఇంద్రాణి మాటలకు నహుషుడు చాలా సంతోషించాడు. ప్రసన్నుడైనాడు. ఆ సాధ్వితో ఇలా అన్నాడు. (15)
నహుష ఉవాచ
అపూర్వం వాహనమిదం త్వయోక్తం వరవర్ణిని।
దృఢం మే రుచితం దేవి త్వద్వశోఽస్మి వరాననే॥ 16
నహుషుడు పలికాడు. సౌందర్యవతీ! నీవు చెప్పిన వాహనం ఇంతకుముమ్దు లేనిది. సరిక్రొత్తది. దేవీ! నీ కోరిక నాకు నచ్చింది. నేను నీకు వశమయ్యాను. (16)
నహ్యల్పవీర్యో భవతి యో వాహాన్ కురుతే మునీన్।
అహం తపస్వీ బలవాన్ భూతభవ్యభవత్ప్రభుః॥ 17
అల్పశక్తిగలవాడు ఋషులను వాహకులుగా చేసుకో లేడు. నేను తపస్విని, బలవంతుణ్ణి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రభువును. (17)
మయి క్రుద్ధే జగన్న స్యాత్ మయి సర్వం ప్రతిష్ఠితమ్।
దేవదానవగంధర్వాః కిన్నరోరగరాక్షసాః॥ 18
న మే క్రుద్ధస్య పర్యాప్తాః సర్వే లోకాః శుచిస్మితే।
చక్షుషా యం ప్రపశ్యామి తస్య తేజో హరామ్యహమ్॥ 19
నేను కోపిస్తే జగత్తు లేకుండా పోతుంది. అంతా నాపైనే ఆధారపడి ఉంది. మొలక నవ్వులదానా! కోపించిన నన్ను దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, సర్పాలు, దానవులు, పధ్నాలుగు లోకాలు ఏమీ చేయలేవు. కంటితో చూస్తే చాలు ఎదుటివారి తేజస్సును నేను లాగేస్తాను. (18,19)
తస్మాత్ తే వచనం దేవి కరిష్యామి న సంశయః।
సప్తర్షయో మాం వక్ష్యంతి సర్వే బ్రహ్మర్షయస్తథా।
పశ్య మాహాత్మ్యయోగం మే బుద్ధిం చ వరవర్ణిని॥ 20
దేవీ! నిస్సంశయంగా నీవు చెప్పిన ప్రకారం చేస్తాను. సప్తర్షులే కాదు బ్రహ్మర్షులు కూడా నన్ను మోస్తారు. వరవర్ణినీ! నా గొప్పతనాన్నీ, ఐశ్వర్యాన్నీ చూడు. (20)
శల్య ఉవాచ
ఏవముక్త్వా తు తాం దేవీం విసృజ్య చ వరాననామ్।
విమానే యోజయిత్వా చ ఋషీన్ నియమమాస్థితాన్॥ 21
అబ్రహ్మణ్యో బలోపేతః మత్తో మదబలేన చ।
కామవృత్తః స దుష్టాత్మా వాహయామాస తానృషీన్॥ 22
శల్యుడు పలికాడు.
రాజా! సుందరముఖి అయిన శచీదేవితో నహుషుడు ఇలా పలికి ఆమెను పంపాడు. బ్రాహ్మణద్వేషి, బలవంతుడు, మదోన్మత్తుడు, కాముకుడు, దుష్టాత్ముడు అయిన నహుషుడు యమనియమాలతో తపోదీక్షలో ఉన్న ఋషులను పిలిచి అవమానకరంగా తన పల్లకికి వాహకులుగా నియమించారు. (21,22)
నహుషేణ విసృష్టా చ బృహస్పతిమథాబ్రవీత్।
సమయోఽల్పావశేషో మే నహుషేణేహ యః కృతః॥ 23
ఇంద్రాణి నహుషుని దగ్గరనుండి బృహస్పతి వద్దకు వెళ్లి ఇలా పలికింది. దేవగురూ! నహుషునితో నేను కుదుర్చుకొన్న ఒప్పందంలో కొద్ది సమయం మాత్రమే మిగిలింది. (23)
శక్రం మృగయ శీఘ్రం త్వం భక్తాయాః కురు మే దయామ్।
బాఢమిత్యేవ భగవాన్ బృహస్పతిరువాచ తామ్॥ 24
'నీవు త్వరగా ఇంద్రుణ్ణి వెదకాలి. నీ భక్తురాలివైన నాపై దయ చూపించు' అన్నది. అప్పుడు బృహస్పతి ఆమెతో 'అలాగే' అన్నాడు. (24)
న భేతవ్యం త్వయా దేవి నహుషాద్ దుష్టచేతసః।
న హ్యేష స్థాస్యతి చిరం గత ఏష నరాధమః॥ 25
శచీదేవీ! దుష్టాత్ముడైన నహుషునికి నీవు భయపడనవసరం లేదు. ఆ నరాధముడు ఎక్కువకాలం ఉండడు. పోయాడు అనుకో. (25)
అధర్మజ్ఞో మహర్షీణాం వాహనాచ్చ తతః శుభే।
ఇష్టిం చాహం కరిష్యామి వినాశాయాస్య దుర్మతేః॥ 26
శక్రం చాధిగమిష్యామి మా భైస్త్వం భద్రమస్తు తే।
అమ్మా! ధర్మం తెలియని ఈ పాపాత్ముడు మహర్షులను వాహకులుగా కోరి త్వరలోనే పతనం కాబోతున్నాడు. ఆ దుర్మార్గుని నాశనం కోసం నేను కూడా యజ్ఞం చేస్తాను. ఇంద్రుని జాడ కూడా తెలుసుకుంటాను. భయపడకు. నీకు శుభం జరుగుతుంది. (26 1/2)
తతః ప్రజ్వాల్య విధివత్ జుహావ పరమం హవిః॥ 27
బృహస్పతిర్మహాతేజాః దేవరాజోపలబ్ధయే।
హుత్వాగ్నిం సోఽబ్రవీద్ రాజన్ శక్రమన్విష్యతామితి॥ 28
రాజా! తరువాత మహాతేజస్వి అయిన బృహస్పతి ఇంద్రుని జాడ తెలుసుకోవటానికి యథావిధిగా అగ్నిహోత్రం వేల్చి హవిస్సులు ఇచ్చి ఇంద్రుని వెతుక్కొని రమ్మని అగ్నిదేవుని ప్రార్థించాడు. (27,28)
తస్మాచ్చ భగవాన్ దేవః స్వయమేఅ హుతాశనః।
స్త్రీవేషమద్భుతం కృత్వా తత్రైవాంతరధీయత॥ 29
ఆ యజ్ఞకుండం నుండి అగ్నిదేవుడు అద్భుతమైన స్త్రీవేషంతో ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడు. (29)
సదిశః ప్రదిశశ్చైవ పర్వతాని వనాని చ।
పృథివీం చాంతరిక్షం చ విచింత్యాథ మనోగతిః।
నిమేషాంతరమాత్రేణ బృహస్పతిముపాగమత్॥ 30
అగ్నిదేవుడు మనోవేగంతో దిక్కులు, మూలలు, పర్వతాలు, అడవులు, భూమి, ఆకాశం మొత్తం వెదికి రెప్పపాటు కాలంలో తిరిగివచ్చి బృహస్పతిని చేరుకొన్నాడు. (30)
అగ్నిరువాచ
బృహస్పతే న పశ్యామి దేవరాజమిహ క్వచిత్।
ఆపః శేషాః సదా చాపః ప్రవేష్టుం నోత్సహామ్యహమ్॥ 31
అగ్ని పలికాడు. బృహస్పతీ! నాకు దేవేంద్రుడు ఎక్కడా కనపడలేదు. నీటిలో మాత్రం వెదకలేదు. ఎప్పుడైనా నేను నీటిలో ప్రవేశించే సాహసం చెయ్యలేను. (31)
న మే తత్ర గతిర్బ్రహ్మన్ కిమన్యత్ కరవాణి తే।
తమబ్రవీద్ దేవగురుః అపో విశ మహాద్యుతే॥ 32
"దేవగురూ! నేను నీటిలో ప్రవేశించలేను. నీ కోసం ఇంకేం చేయమంటావు?' అన్నాడు. అప్పుడు బృహస్పతి 'తేజోమూర్తి! నీటిలో ప్రవేశించు' అని అగ్నితో అన్నాడు. (32)
అగ్నిరువాచ
నాపః ప్రవేష్టుం శక్ష్యామి క్షయో మేఽత్ర భవిష్యతి।
శరణం త్వాం ప్రపన్నోఽస్మి స్వస్తి తేఽస్తు మహాద్యుతే॥ 33
అగ్ని పలికాడు.
నేను నీటిలో ప్రవేశించలేను. నీటిలో నేను క్షీణించిపోతాను. మహాతేజస్వీ! బృహస్పతీ! నిన్ను శరణు వేడుతున్నాను. నీకు శుభమగు గాక! (33)
అద్భ్యోఽగ్నిర్బ్రహ్మతః క్షాత్రమ్ అశ్మనో లోహముత్థితమ్।
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి॥ 34
నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుని నుండి క్షత్రియుడు, రాతి నుండి లోహం పుట్టాయి. కనుక ఇతరత్ర అంతటా ఉండే వానిశక్తి పుట్టినచోట చల్లారుతుంది. (34)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి బృహస్పత్యగ్ని సంవాదే పంచదశోఽధ్యాయః॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున బృహస్పతి అగ్ని సంవాదము అను పదునైదవ అధ్యాయము. (15)